ఎడిట్ పేజీ

పరిశుభ్ర పర్యావరణంతో మానవ సాధికారత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ పురస్కారంతో నన్ను మంగళవారం సత్కరించింది. ఈ గౌరవాన్ని అందుకుని నేను పులకాంకితుడనయ్యాను. ఇది ఒక వ్యక్తికి దక్కిన గౌరవంగా కాక.. ప్రకృతిమాతతో సామరస్య పూర్వక జీవన విధానాన్ని సర్వదా బోధించే భారతీయ సంస్కృతికి, విలువలకు లభించిన గుర్తింపుగా పరిగణిస్తున్నాను. వాతావరణ మార్పుల నుంచి మానవాళికి ఉపశమనం దిశగా భారతదేశం పోషిస్తున్న చురుకైన పాత్రకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెజ్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం కార్యనిర్వాహక సంచాలకుడు ఎరిక్ సొహైమ్‌ల గుర్తింపు, ప్రశంసలు దక్కడం భారతీయులందరికీ గర్వకారణం.
మానవాళికి ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రకృతితో సామరస్య పూర్వక సాహచర్యం కొనసాగించే సమాజాలు సర్వతోముఖ వికాసంతో, సౌభాగ్యంతో పరిఢవిల్లుతాయి. ఇవాళ మానవ సమాజం ఒక ప్రధాన కూడలిలో నిలిచి ఉంది. మన అవసరాలు, అత్యాశ మధ్య అసమతౌల్యం అత్యంత తీవ్ర పర్యావరణ సంక్షోభానికి దారితీసింది. మనం ఈ వాస్తవంతో ఏకీభవించి, మన పనేదో మనం చూసుకుంటూ ముందుకు వెళ్లగలగాలి లేదా ఈ అసమతౌల్యాన్ని సరిదిద్దే కార్యాచరణకు ఉపక్రమించాలి. ఒక సమాజంగా మనం సానుకూల మార్పు ఎలా తీసుకురాగలమన్న దాన్ని మూడు అంశాలు నిర్ధారిస్తాయి.
ఈ అంశాలలో మొదటిది- అంతఃకరణ శుద్ధి. ఇందుకోసం మన ఉజ్వల గత చరిత్రకన్నా దృష్టిసారించగల ప్రదేశం మరొకటి లేదు. ప్రకృతిని గౌరవించడమన్నది భారత సంప్రదాయాలలో అత్యంత కీలకమైనది. మన అథర్వవేదంలోని పృథ్వీ సూక్తం- ప్రకృతి, పర్యావరణం గురించి మనకు అసమాన జ్ఞానాన్ని ప్రసాదించింది.
పంచభూతాలైన పృథ్వి (్భమి), వాయువు (గాలి), జలం (నీరు), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం).. వాటి సమన్వయంపైన మన జీవన వ్యవస్థలు ఏ విధంగా ఆధారపడి ఉన్నదీ మన పూర్వికులు వివరించారు. ప్రకృతిలో భాగమైన ఈ పంచభూతాలే దైవత్వానికి నిదర్శనాలు.
‘జాతిపిత’ మహాత్మా గాంధీ కూడా పర్యావరణం గురించి విస్తృతంగా రాశారు. ప్రకృతి వనరులకు మనం.. అంటే ప్రస్తుత తరం ధర్మకర్తలుగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన ప్రబోధించారు. రానున్న తరాలకు ‘పరిశుభ్ర భూగోళం’ వారసత్వంగా సంక్రమించేలా చూసే బాధ్యతను ఈ ధర్మకర్తృత్వం మనపై ఉంచుతుంది. ప్రపంచానికి వనరుల కొరత రాకుండా చూడాలంటే అవసరాలకు అనుగుణంగా వినియోగం అవశ్యమని ఆయన పిలుపునిచ్చారు. ఆ విధంగా సామరస్య పూర్వక, అవసరానుగుణ వినియోగంతో కూడిన జీవనశైలి మన విలువల్లో ఒక భాగం. అటువంటి సుసంపన్న సంప్రదాయానికి పతాకధారులం మనమేనన్న వాస్తవాన్ని మనం గుర్తిస్తే, సహజంగానే అది మన చర్యలపై సానుకూల ప్రభావం చూపుతుంది.
ఇక రెండో అంశం- ప్రజాచైతన్యం. పర్యావరణ సంబంధ ప్రశ్నలపై మనం వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి.. రాయాలి.. చర్చించాలి.. సంభాషించాలి.. ఇతరులకు వివరించాలి. అదే సమయంలో పర్యావరణ సంబంధిత అంశాలపై పరిశోధనలను, ఆవిష్కరణలను ప్రోత్సహించడం కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో మన దేశంలోని 130 కోట్ల మంది భారతీయులూ చురుకుదనం గలవారేనని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఆమేరకు వారంతా పరిశుభ్రత, పచ్చదనం నిండిన పర్యావరణం దిశగా సాగే కృషిలో ముందువరుసలో ఉన్నారని గర్వంగా చెబుతున్నాను.
సుస్థిర భవితతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమంలో ఈ చురుకుదనాన్ని మనం చూస్తున్నాం. దేశంలో తొలిసారిగా ప్రజానీకం ఆశీస్సులతో 8.5 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. 40 కోట్ల మంది భారతీయులకు బహిరంగ మల మూత్ర విసర్జన దుస్థితి తప్పింది. పారిశుధ్యం 39 శాతం నుంచి 95 శాతం ప్రజానీకానికి విస్తరించింది. మన ప్రకృతిపై, సహజ పరిసరాలపై దుష్ప్రభావాన్ని తగ్గించాలన్న మన లక్ష్యం దిశగా ఈ కృషి ఒక మైలురాయి. వంట చెరకుతో ఆహారం తయారీ వల్ల- గృహ వాతావరణ కాలుష్య పూరితమై శ్వాసకోశ వ్యాధులకు దారితీసే దుస్థితిని ఈ పథకం గణనీయంగా తగ్గించింది. ఈ పథకం ప్రవేశపెట్టాక ఇప్పటిదాకా 5 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. తద్వారా మహిళలకు, వారి కుటుంబాలకు మెరుగైన పరిశుభ్ర జీవనానికి హామీ లభించింది.
నదుల ప్రక్షాళనలోనూ భారత్ వేగంగా ముందుకెళ్తోంది. భారత జీవనరేఖ అయిన గంగానదీ జలాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో కలుషితమయ్యాయి. ఈ చారిత్రక తప్పిదాన్ని నేడు ‘నమామి గంగ’ పథకం సరిదిద్దుతోంది. తదనుగుణంగా మురుగునీటిని సవ్యంగా శుద్ధిచేసే ప్రక్రియకు నేడు ప్రాధాన్యం ఇస్తున్నాం. అమృత్, స్మార్ట్ సిటీస్ పేరిట చేపట్టిన కీలక కార్యక్రమాల్లో పర్యావరణ సంరక్షణతో పట్టణాభివృద్ధిని సమతౌల్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు జారీచేసిన 13కోట్లకు పైగా భూసార కార్డులు పంట సాగులో వారికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. భూసార వృద్ధితోపాటు ఉత్పాదకతను పెంచుకునేందుకు, తద్వారా భావితరాలకు ప్రయోజనం కల్పించేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతోంది.
‘నైపుణ్య భారతం’ లక్ష్యాలను కూడా మేము పర్యావరణ రంగంతో సమన్వయం చేశాం. అందులో భాగంగా పర్యావరణం, అటవీ అభివృద్ధి, వన్యమృగ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు తదితర రంగాల్లో 2021 సంవత్సరం నాటికి ప్రగతి సాధించే దిశగా దేశంలోని 70 లక్షల మంది యువత కోసం- హరితాభివృద్ధి నైపుణ్య కార్యక్రమం కింద పథకాలను ప్రారంభించాం. వీటివల్ల పర్యావరణ రంగంలో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలతోపాటు పారిశ్రామిక వ్యవస్థాపన కింద అనేక అవకాశాలు సృష్టించబడతాయి. పునరుత్పాదక ఇంధన వనరులపై మన దేశం అసమాన శ్రద్ధచూపుతోంది. గడచిన నాలుగేళ్లలో ఈ రంగం మరింత అందుబాటు, గిట్టుబాటు స్థాయికి చేరింది. ఉజాలా యోజన కింద దేశవ్యాప్తంగా దాదాపు 31కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేయబడ్డాయి. ఈ బల్బుల ధరలను తగ్గించటమేగాక వాటి వినియోగంతో విద్యుత్ బిల్లుల భారం, వాతావరణంలోకి కర్బన వాయువుల విడుదల కూడా తగ్గుముఖం పట్టాయి.
భారత్ చురుకుదనాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. 2018 మార్చిలో పలువురు దేశాధినేతలు న్యూఢిల్లీలో సమావేశమై అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటుకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. సూర్యశక్తిని అధికంగా పొందే దేశాలలో ఈ సుసంపన్న ఇంధన వనరును ఒడిసి పట్టుకునే కృషికి ఈ ‘కూటమి’ ఎంతగానో తోడ్పడగలదు. ప్రపంచం ఒకవైపు వాతావరణ మార్పుల గురించి చర్చిస్తున్న తరుణంలో వాతావరణ న్యాయం అనే నినాదం భారత్ అంతటా ప్రతిధ్వనించింది. వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా బాధపడుతున్న పేద, బలహీన దేశాల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా భారత్ దీనిపై గళమెత్తింది. ఈ భౌగోళిక జవాబుదారీతనాన్ని సుస్థిర భవిష్యత్తు దిశగా తీసుకెళ్లడం మన బాధ్యత. ప్రభుత్వ నిబంధనల కన్నా పర్యావరణ స్పృహ ఇరుసుగా పర్యావరణ తాత్వికతకు సంబంధించి ప్రపంచం నేడు సరికొత్త స్వభావం సంతరించుకోవాలి. ఈ దిశగా ఎంతో శ్రద్ధతో కృషి చేస్తున్న వ్యక్తులను, సంస్థలను అభినందిస్తున్నాను. మన సమాజంలో చారిత్రక మార్పులకు వారు వైతాళికులయ్యారు. వారి ప్రయత్నాలకు వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా అన్నివిధాలా నా మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నాను.
మానవ సాధికారతకు పునాదిరాయి వంటి
పరిశుభ్ర పర్యావరణ సృష్టికి కలసికట్టుగా
ముందడుగు వేద్దాం రండి!

(ఐక్యరాజ్యసమితి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ పురస్కారం అందుకున్న సందర్భంగా
ప్రధాని నరేంద్ర మోదీ రాసిన వ్యాసం)