మెయిన్ ఫీచర్

అహం వీడితే అంతా సమానమే ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరురోజులలో ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు చివరిగా తన చెవులకు చెవుడు వచ్చేలా చేసుకున్నాడు. ఆరోజునుంచి ఆయన ఏదీ వినలేదు. అలాగే ఆయన గురించి ఇంతవరకు మనకు ఏదీ తెలియలేదు. ఈ విషయాలు ఏ పవిత్ర గ్రంథాలలోనూ ఉండవు. ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవంతో స్వయంగా అనే్వషించి తెలుసుకున్న విషయాలు. అందుకే వాటిని ప్రామాణికంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి, దేవుడికి చెవుడని తెలిసి కూడా ప్రతిరోజూ ఉదయం ఏ గుడికో, చర్చికో, మసీదుకో వెళ్ళి చక్కగా ప్రార్థించి, మీ కోరికల చిట్టా తెలపడం బాగానే ఉంటుంది. కానీ, మీ అంతరంగం ఏమాత్రం మారదు. అందుకే మీరు ఎప్పటిలాగే దీనాతిదీనంగా, పరమ ఛండాలంగా, చాలా అసహ్యంగా ఉంటారు. కానీ, రోజూ మీ ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది. అదొక చక్కని ఏర్పాటు.
రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతంలో పరమసత్యాన్ని చాలా చక్కగా చెప్పారు. ‘‘మీకు నిజంగా దేవుడు కావాలా? మీకు నిజంగా సత్యం, నిశ్శబ్దం కావాలా?’’అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకుంటే మీరు సిగ్గుపడతారు. ఎందుకంటే, వాటిని మీరు కోరట్లేదని మీకు కచ్చితంగా తెలుస్తుంది.
మీరు ధ్యానం చేస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. ఎందుకంటే, ఎన్నో సంవత్సరాలుగా మీరు ధ్యానంచేస్తున్నా జరిగింది ఏమీలేదు. కాబట్టి, ధ్యానం చేసేందుకు మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఏదైనా జరిగితేనే సమస్య. మీ జీవితంలో ఏదైనా ఎదగడం ప్రారంభిస్తే అది మీ చుట్టూ ఉన్న అందరి హృదయాలలో ఎదుగుతున్నట్లు కాదు. మీరు ఎవరికీ తెలియని అపరిచితులు. గుంపు ఎప్పుడూ అపరిచితులను, పరాయి వ్యక్తులను క్షమించకపోగా, వారిని నాశనం చేస్తుంది. తమ మనశ్శాంతికోసం గుంపు అలా చెయ్యక తప్పదు.
జీసస్ లాంటి వ్యక్తి మిమ్మల్ని వీడని పీడ. ఎందుకంటే, ‘‘మీరుకూడా నాలాగే నిజాయితీగా, చక్కని కృపాకటాక్ష వీక్షణాలతో ఉన్నతమైన వ్యక్తిగా ఉండొచ్చు’’అని ఆయన మీకు ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాడు. అది మీలో ఆత్మన్యూనతాభావాన్ని కలిగించి మిమ్మల్ని బాధిస్తుంది. అలా బాధపడడం ఎవరికీ ఇష్టముండదు కదా! అందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి మీరు చాలా ఉన్నతమైన వ్యక్తిగా మారడం. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే, అది అతి ప్రమాదకరమైన బహుదూరపు బాట. ఆ బాటలో మీరు ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ ఉన్నతమైన వ్యక్తిని చంపేస్తే సరిపోతుంది. అదే సులభమైన పని. అప్పుడు ఎవరూ ఎవరికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలా గుంపులోని వారందరూ సమానమైపోతారు. పైగా, అందరూ ఎవరి తీరులో వారు అసూయాపరులు, దురాశాపరులైన దొంగలు, మోసగాళ్ళు, నేరస్థులే. అంతేకాదు, వారందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకే పడవలో ప్రయాణించేవారే. కాబట్టి, దేవుడు, సత్యం, ధ్యానాల గురించి ఎవరూ ఎలాంటి గందరగోళం సృష్టించరు.
సమున్నత చైతన్యాన్ని చేరుకున్న మహోన్నత వ్యక్తులైన జరతూష్ట్ర, సోక్రటీస్, బుద్ధుడు లాంటివారు లేకపోతేనే ఆ అల్పులందరూ హాయిగా ఉంటారు. అందుకే వారు ‘‘ఒంటెలు ఎడారిలోనే జీవిస్తాయి తప్ప, ఎప్పుడూ కొండల దగ్గరకు వెళ్ళవు’’అంటారు. ఎందుకంటే, అవి ఎడారిలో నడిచే కొండలైతే, కొండల ముందు అవి నడిచే చీమల్లా ఉంటాయి. అది వారిని బాధించే వ్యవహారం. కాబట్టి, కొండలను మర్చిపోవడమే సులభమైన పని. అందుకే వారు ‘‘ఆ కొండలన్నీ పురాణాల కల్పనలని, ఎడారే అసలైన వాస్తవమని’’అంటారు. కాబట్టి, మీరు మీ అహంతో ఆనందిస్తూ, ఎడారిలో హాయిగా బతికేస్తూ ఉంటారు. అంతేకాదు, మీ ప్రార్థనలు ఏమాత్రం ఫలించకపోయినా ఆ చెవిటి దేవుడి ముందు మోకరిల్లి ‘‘నా అహాన్ని నిర్మూలించి, నాకు వినయాన్ని ప్రసాదించు దేవుడా’’అంటూ ప్రార్థనలు చేస్తూ మీరు ఆనందిస్తారు. కాబట్టి, మీరు ఏమాత్రం భయపడకుండా ఎలాంటి ప్రార్థనైనా చెయ్యవచ్చు. ఎందుకంటే, మీరు ఎప్పటిలాగే ఉంటారు తప్ప, ఏమాత్రం మారరు. అందువల్ల ఘనకార్యాలకోసం ప్రార్థన చెయ్యడం మీకు ఎప్పుడూ సంతృప్తి కలిగిస్తూనే ఉంటుంది. అందుకే ఎవరూ అసలైన ధార్మికులుగా మారకుండా ఏ క్రైస్తవులుగానో, హిందువులుగానో, మహమ్మదీయులుగానో మారతారు. అదంతా ఎవరూ అసలైన ధార్మికులు కాకుండా ఉండేందుకు పన్నిన పన్నాగమే.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.