మెయన్ ఫీచర్

మరో అయోధ్య క్షేత్రంగా శబరిమలను మారుస్తున్నారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను, శతాబ్దాల నాటి సంప్రదాయాలను, భారతీయ సమాజంలో నెలకొన్న వైవిధ్యాన్ని అర్థం చేసుకోకుండా శబరిమల క్షేత్రం గురించి సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ఈ మధ్యనే అసాధారణమైన వరద తాకిడితో అల్లకల్లోలంగా మారిన కేరళలో అసామాన్యమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించలేదని అసంతృప్తి ఒక వంక వ్యక్తం అవుతూ ఉండగా మరోవంక ఈ అంశంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి పరిస్థితులను మరింతగా విషమింప చేయడానికి దారితీస్తుంది. సరిగ్గా 28 ఏళ్ళ క్రితం అయోధ్యలో ఏమి జరిగిందో ఇప్పుడు శబరిమల వద్ద కూడా అదే జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
1990 అక్టోబర్ 30 నుండి నవంబర్ 2 వరకు నాడు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అనేకమంది రామభక్తులపై దారుణంగా అణచివేత చర్యలు చేపట్టింది. అనేకమంది రామభక్తులను నిర్దాక్షిణ్యంగా చంపివేసి, గోనె సంచులలో మూట కట్టి, ప్రక్కనే ఉన్న పవిత్రమైన సరయు నదిలో నిర్దాక్షిణ్యంగా పారవేసారు. నిరాయుధులైన, ప్రశాంతంగా ఉన్న రామ భక్తులపై నాడు జరిగిన పైశాచిక అణచివేతను మరో జలియన్‌వాలాబాగ్ గా పేర్కొనవచ్చు.
నేడు ములాయం సింగ్ యాదవ్ అడుగు జాడలలో పునరాయి విజయన్ ప్రభుత్వం అదేవిధంగా శబరిమల వద్ద వ్యవహరిస్తుందా అనే అనుమానాలు కలుగు తున్నాయి. కులాలు, వర్గాలు, భాషలతో సంబంధం లేకుండా మొత్తం హిందువులను ఏకత్రాటిపై నడుపుతున్న హిందువుల ఇష్ట దైవమైన స్వామి అయ్యప్ప భక్తుల విషయంలో చరిత్ర పునరావృతం అవుతుందా? ఆందోళన కలిగించే అంశం.
సుప్రీం కోర్ట్ తీర్పు తర్వాత మొదటిసారిగా దేవాలయం తెరచినప్పటి నుండి వేలాది మంది భక్తులు వచ్చి నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సున్నితత్వం ప్రదర్శించకుండా బలప్రయోగం ద్వారా వారి అసమ్మతిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నది. ఆ దేవాలయంలోని పూజారులు, వంశపారంపర్య ధర్మకర్తలు, దేవాలయానికి సంబంధించిన ఇతరులు అందరూ ఈ విషయంలో తొందర పడవద్దని వారిస్తున్నా ప్రభుత్వం వినిపించు కోవడం లేదు.
అక్కడున్న స్వామి నైష్ఠిక బ్రహ్మచారి కావడంతో తొలి నుండి కొన్ని వయస్సుల మహిళలను అనుమతించడంలో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం కన్నా ధర్మాధికారులు, దేవాలయానికి సంబంధించిన వారితో తగు సమాలోచనలు జరిపి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయకుండా ఏమైనా సరే సుప్రీం కోర్ట్ తీర్పు అమలు పరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టడం విస్మయం కలిగిస్తున్నది. ఇదే ప్రభుత్వం రెండేళ్ల క్రితం - జులై, 2016లో మహిళల ప్రవేశంపై ఆంక్షలను సమర్ధిస్తూ సుప్రీం కోర్ట్ లో అదనపు అఫిడవిట్ ను సమర్పించింది. కానీ నాలుగు నెలలు తిరిగేకల్లా మాట మార్చి మహిళలు అందరికీ ప్రవేశం కల్పిస్తామంటూ నివేదిక సమర్పించింది.
అర్ధాంతరంగా ప్రభుత్వ వైఖరిలో వచ్చిన ఈ మార్పునకు రాజకీయ అంశాలు కారణం కాదా ? ఇప్పటి వరకు ఆ విధంగా ఆంక్షలను పెట్టడాన్ని మహిళల పట్ల వివక్షతగా ఎవ్వరూ చూడటం లేదు. ప్రపంచంలోనే నేడు అతి పురాతనమైన హిందూ ధర్మం విశిష్టమైన ఆచారాలు నెలకొన్నాయి. మారే మతంలో లేని విధంగా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నది. స్ర్తీలను శక్తి స్వరూపంగా ఆరాధిస్తున్నది. కేరళలోనే అట్టుకల్ భగవతే పొంగలి అని ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఈ ఉత్సవాలలో మగవారిని అనుమతించరు.
తమిళ్ మొదటి నెల కూవాగంలో పౌర్ణమి రోజున విజ్హుపురం జిల్లాలోని చిన్న గ్రామం కూవాగంలో లింగ ప్రాతిపదికగా ప్రత్యేక ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఆ విధంగా ఆడ, మగ వార్లకు ప్రత్యేక ఉత్సవాలు, సంబరాలు దేశం అంతటా వివిధ ప్రాంతా లలో కొనసాగుతున్నాయి. అవేమీ సామాజిక వివక్షతకు గాని, లింగ సమానత్వాన్ని తిరస్కరించడం గాని కావు. కొన్ని ప్రత్యేక కారణాలతో, పరిస్థితులలో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాలు. వాటి మూలాల లోతునకు పోయి కారణాలు గ్రహించాలి.
శబరిమలలో ఇటువంటి సున్నితమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆడ, మగ అంశాలనే పరిగణనలోకి తీసుకొని, వారి మధ్య లింగ సమానత్వం కల్పించటమే ప్రధాన అంశంగా భావించినట్లు కనిపిస్తున్నది. ఒక విధంగా దైవ ఆరాధన వ్యక్తిగతమైన అంశం. దేవాలయాలు లేదా ప్రార్థనా స్థలాలు వివిధ మతాలకు చెందిన ప్రజలలో, వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను అమలు చేస్తూ ఉంటారు. ఆయా ఆచారాలు ఆచరణలోకి రావడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉంటూ ఉంటాయి.
రాజ్యాంగం గాని, చట్టబద్ధ పాలన గాని పౌరుల వ్యక్తిగత, లౌకిక పరమైన, సామాజిక పరమైన స్వేచ్ఛ, హక్కులు, గౌరవం, సమానత వంటి అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఈ అంశాలలో వారి హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి. పైగా దైవారాధన ప్రభుత్వ పరిధిలోకి గాని, కోర్టుల పరిధిలోకి గాని వచ్చే అంశం కాదు. అయితే వారి పట్ల వ్యక్తిగతంగా దాడులు జరిగినా, ఇతరత్రా వివక్షతకు గురిచేసినా జోక్యం చేసుకోవచ్చు. కానీ 1800 వందల సంవత్సరాలుగా జరుగుతున్న పూజా పద్ధతులను హడావుడిగా చెల్లవని చెప్పడం ఉన్నత న్యాయస్థానం తన పరిధిని అతిక్రమించిందా అనే అనుమానం కలుగుతుంది.
ఈ పద్ధతి వల్లన సామాజిక అన్యాయం జరుగుతుందని ఉన్నత న్యాయస్థానం భావిస్తే ధర్మాచార్యులు, ఇతర సంబంధితులను పరిస్థితులను సమీక్షించి, సహేతుకమైన నిర్ణయం తీసుకోమని సూచించవచ్చు. ఈ విషయంలో నిర్దుష్టమైన మార్గదర్శకాలను రూపొందించవచ్చు. తీర్పు రాగానే కేరళ ప్రభుత్వం చూపిన అత్యుత్సాహం సహితం అవాంఛనీయం అని చెప్పవచ్చు. ఒక విధంగా అసహనంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నది.
సుప్రీం కోర్ట్ తీర్పు రాగానే ఈ తీర్పును పునస్సమీక్షించమని దావా వేస్తామని ట్రావంకోర్ దేవస్థానము ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఏ పద్మకుమార్ ప్రకటన ఇచ్చారు. ఆయన సిపిఎం మాజీ ఎమ్యెల్యే కావడం గమనార్హం. అయితే ముఖ్యమంత్రి విజయన్ ఆయనను మందలించి మాట మార్చేటట్లు చేసినట్లు తెలుస్తున్నది. దైవం మీద నమ్మకం లేని ఒక రాజకీయ పార్టీ నేతను ఇటువంటి ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం ట్రస్టీ బోర్డు చైర్మన్‌గా నియమించడం ద్వారా రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకొనే ప్రయత్నం అక్కడ అధికార పక్షం చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నది.
అయోధ్య విషయంలో సహితం రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతా యుతంగా వ్యవహరించి, భక్తుల మనోభావాలను, ఆవేదనలను పరిగణనలోకి తీసుకొని తగు పరిష్కారం కోసం కృషి చేయక పోవడం వల్లనే మసీదు ఆకారంలో ఉన్న నిర్మాణాన్ని కూల్చేవేసే దిశగా పరిస్థితులు విషమించాయని మరచిపోలేము. 50వ దశకం నుండి కోర్టులలో వివాదం నడుస్తూ ఉంటే దశాబ్దాలు గడచినా ఆ కేసు ముందుకు నడవక పోవడం ప్రజలలో అసహనానికి దారి తీయదా ? వివాదాన్ని సుప్రీంకోర్టుకు నివేదించి, దాని తీర్పునకు కట్టుబడి ఉందామని పివి నరసింహారావు ప్రభుత్వం కృషి కారణంగా హిందూ, ముస్లిం పెద్దలు ఒక అవగాహనకు వచ్చారు.
అయితే రాజకీయ వత్తిడులు కారణంగా ఆ తర్వాత ముస్లిం పెద్దలు ఈ ఒప్పందం నుండి వెనుకడుగు వేశారు. దానితో కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకడుగు వేసింది. దాని పర్యవసానమే అయోధ్యలో 1991 డిసెంబర్ 6న జరిగిన దృష్టాంతం అని మరచిపోలేము. రాజకీయ కారణాలను ధార్మిక అంశాల విషయంలో మిళితం చేసే ప్రయత్నాలు దేశ సమగ్రతకు, ప్రజల మధ్య సానుకూల సంబంధాలకు తీవ్ర హాని కలిగిస్తున్నట్లు గ్రహించాలి.
ఇప్పుడు శబరిమలలో ఆర్ ఎస్ ఎస్, బిజెపిలు కుట్ర పన్నుతున్నట్లు ముఖ్యమంత్రి విజయన్ ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు రాగానే ఈ సంస్థలు ఏవీ కూడా ప్రతికూలంగా స్పందించలేదు. కాంగ్రెస్ వంటి పార్టీలు అయితే స్వాగతించాయి. అయితే అయ్యప్ప భక్తులలో, ముఖ్యంగా కేరళలోని మహిళలలో తీవ్రమైన వ్యతిరేకంగా, ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఎటువంటి ఇంగిత జ్ఞానం ఉన్నవారైనా వారికి అండగా ఉండటం మినహా మరో మార్గం ఉండదు గదా.
అయోధ్యలో సహితం రామమందిరం కోసం పదేళ్ల పాటు ఉధృత స్థాయిలో ఉద్యమాలు దేశ వ్యాప్తంగా జరిగాయి. బిజెపి చాల ఆలస్యంగా ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో మద్దతుగా రథయాత్ర చేపట్టడం ద్వారా ఎల్ కె అద్వానీ తనను ఒక ప్రజా నాయకుడిగా మలచు కోవడం కోసం, ఒక విధంగా ప్రజల మద్దతు గల రాజకీయ నాయకుడిగా ఎదగడం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఆయన రథయాత్ర జరపడం వల్ల ఉద్యమం ఉధృతం కాలేదని గమనించాలి.
ఏ రాజకీయ పార్టీ అయినా, రాజకీయ నాయకుడైనా ప్రజల మనోభావాలు గ్రహించి, వాటిని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేయడం నేడు జరుగుతున్నది. కానీ ప్రజలను తాము అనుకున్న మార్గంలో నడిపించే ప్రయత్నం చేసే వారే నిజమైన నాయకుడు. అటువంటి నాయకులు దురదృష్టవశాత్తు భారత రాజకీయాలలో ఇప్పుడెవ్వరు లేరని చెప్పవచ్చు. ఎటువంటి పథకాలు ప్రకటిస్తే ఏయే వర్గాల ప్రజలు తమ పట్ల ఆకర్షితులు అవుతారో అంటూ ప్రజల మెప్పు పొందటం కోసం దగ్గరి దారులు చూస్తున్నారు.
ఆ విధంగా ప్రజలను నడిపించి, దేశంలో విప్లవాత్మక మార్పునకు దారిచేసిన చివరి నేత లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సామాజిక ఉద్యమాలు చెలరేగడం, వాటికి మద్దతు తెలపడం ద్వారా తమ రాజకీయ పరిధిని విస్తృత పరచుకొనే ప్రయత్నాలు జరపడం మాత్రమే జరుగుతున్నది.
అంటరానితనం, సతీ సహగమనం వంటి సామాజిక దురాచారాలు మతం పేరుతో మన దేశంలో విదేశీ పాలకుల కాలంలో ప్రవేశించి చాలా కాలం కొనసాగాయి. అటువంటి అంశాలతో శబరిమల అంశాన్ని కలిపి న్యాయమూర్తులు ఒకే విధంగా చూసారా అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా ప్రజల మనోభావాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకో వలసిందే. సామాజిక దురాచారాలతో వీటిని కలిపి చూడటం సంకుచిత ధోరణి మాత్రమే కాగలదు.
న్యాయస్థానాలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత వాటిని తిరిగి మరోసారి పరిశీలించమని కోరే హక్కు ప్రజలకు ఉంటుంది. అప్పటికీ ప్రతికూలంగా తీర్పు వచ్చే ప్రభుత్వం జోక్యం చేసుకొని చట్టం ద్వారా మార్పులు తీసుకు రావచ్చు. ఇదంతా రాజ్యాంగబద్దమే అవుతుంది. ఆ మాత్రం ఇంగిత జ్జ్ఞానం లేకుండా అవసరమైన సైన్యాన్ని కూడా దించి సుప్రీం కోర్టు తీర్పు అమలు పరుస్తాం అంటూ కొందరు నేతలు మాట్లాడుతూ ఉండటం విచారకరం. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంలో కోర్టు తీర్పును ప్రభుత్వం చట్టం ద్వారా తారుమారు చేయలేదా?

-చలసాని నరేంద్ర