మెయన్ ఫీచర్

ఇండియా ఫర్ సేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్వాల్ భారత రక్షణ రంగంలో ఒక ఉన్నతోద్యోగి. ఇటీవల అతడు దేశద్రోహ నేరం కింద పట్టుబడ్డాడు. ఇదెలా జరిగిందంటే ఒక హనీట్రాప్ ఉదంతంతో తీగె లాగితే డొంక కదిలింది. ఎవరినుండైనా రహస్యాలు సేకరించడానికి శత్రువర్గాలు స్ర్తిలను ప్రయోగిస్తారు- దీనికే హనీట్రాప్ అని పేరు. ఇది చాణక్యుని కాలంనుండి అమలులో ఉన్న రాజకీయ తంత్రమే. పండిత జవహర్‌లాల్ నెహ్రూ యుగంలో ఈ కథలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. బ్రిటన్‌లో ప్రొఫ్యూమో మీద క్రిస్టన్ కీలర్‌ను ప్రయోగించారు. ఫలితంగా ఆ మంత్రివర్గం పడిపోయింది. స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు క్రైస్తవ వర్గాలు స్వామి మీదికి ఒక వేశ్యను పంపిన కథ అందరికీ తెలిసిందే!!
ఇంతకీ అగర్వాల్ ఏం చేశాడు? భారతదేశపు అమ్ముల పొదిలో బ్రహ్మాస్ అనే మిస్సైల్‌లో ఉంది. దాని నిర్మాణ విజ్ఞానాన్ని ఇతడు శత్రుదేశాలకు చేరవేశాడు అంటే చైనా-పాకిస్తానీయులు భారతదేశం మీద హనీట్రాప్‌ను ప్రయోగించిన విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. ఇలా పరిశీలిస్తే ఎవరెవరు ఎలా లొంగిపోయారో, ఏయే రహస్యాలు విదేశాలకు చేరవేస్తున్నారో ‘రా’ పరిశోధింపవలసి ఉంది. ఇందులో మరో కోణం ఉంది. అగర్వాల్ సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందినవాడు అంటే గూఢచారులు విదేశీ ఏజెంట్లు ముస్లిం వర్గాలకు చెందినవారు అనే భ్రమనుండి బయటపడటానికి ఈ అగర్వాల్ ఇతివృత్తం తోడ్పడుతుంది.
***
రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్ పుతిన్ ఇండియాకు వచ్చి ఆధికారికంగా ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్టోబరు మొదటివారంలో ఆయన చేసిన పర్యటన విజయవంతమయింది. భారత రక్షణ రంగానికి రష్యానుండి ఇతోధిక సహాయం అందుతున్నది. ఇది అమెరికా చైనా పాకిస్తాన్‌లకు ఇష్టంలేని అంశం. ఐనా ఎవరి రక్షణ అవసరాలు వారివి. ఇండియా ఇరాన్‌తో తెగతెంపులు చేసుకోవాలనే అమెరికా ఆంక్షలను భారత ప్రభుత్వం తిరస్కరించి, ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకుంటున్నది.
ఇదిలా ఉండగా సంచలనాలకు పర్యాయపదంగా ఉండే సుబ్రహ్మణ్యస్వామి వ్లాడిమిర్ పుతిన్‌ను ఒక కోరిక కోరారు. ఇండియాలో లోగడ యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు శ్రీమతి సోనియాగాంధీ రెండుసార్లు రష్యా పర్యటన చేశారు. అప్పుడు ఆమె రష్యన్ గూఢచారి సంస్థ కెజిబితో రహస్య సంభాషణలు జరిపారు. ఇప్పుడు రష్యా ఇండియాతో చాలా సన్నిహితంగా ఉన్నది. కాబట్టి లోగడ సోనియాగాంధీ చేసిన పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని సుబ్రహ్మణ్యస్వామి 12-10-2018నాడు బహిరంగంగా విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంలో మరి రెండు అంశాలు గుర్తుచేసుకోవాలి. ఢోక్లాం ప్రాంతాన్ని చైనావారు ఆక్రమించుకుంటున్నప్పుడు రాహుల్‌గాంధీ చైనా రాయబార కార్యాలయంలో జరిపిన రహస్య మంతనాలేమిటి? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కరాచీ వెళ్లి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మీ సహాయం అవసరం-అని బహిరంగంగా ఐఎస్‌ఐ నాయకునితో మాట్లాడిన విషయం పాకిస్తాన్ దునియా టి.వి. ఛానల్ టెలీకాస్ట్ చేసింది. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంమీద కోపంతో ప్రతిపక్ష నాయకులు ఇలాంటి దుర్మార్గాలకు దిగటం క్షంతవ్యమేనా?? ఇది దేశద్రోహం కిందికి రాదా??
***
కొంతకాలం క్రితం ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎవరి రాజకీయ స్వేచ్ఛ వారిది అని అప్పుడు గద్దర్ వ్యాఖ్యానించారు. 12-10-2014నాడు స్వయంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ ప్రజాగాయకుడు అర్బన్ మావోయిస్టు సానుభూతి పరుడని అందరికీ తెలుసు. ఈయనకు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మీద పీకలవరకూ కోపం ఉంది. అందుకని టిఆర్‌ఎస్‌ను ఓడించటంకోసం గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అందరికీ తెలిసిపోయింది. జంగిల్ నక్సలైట్లకు జిగ్నెశ్‌మెమానీ వంటి (అహమ్మదాబాద్) ఉగ్రవాదుల ద్వారా ఆయుధాలు అందుతున్నాయి. గ్రెనేడ్లు రాకెట్ లాంఛెర్లు కొనుక్కొనే నిమిత్తం కాంగ్రెస్ పార్టీ జిగ్నేశ్ వంటివారికి ఫండింగ్ చేస్తున్నదని ఆరోపణలున్నాయి. ఈ విషయాలు భీం-కోరెగాం కేసులో దొరికిన రహస్య లేఖలు రైనా విల్సన్ లాప్‌టాప్‌ల ద్వారా బహిర్గతమైనాయి. ఇలా ఎందుకు జరిగిందో రాహుల్‌గాంధీ భారత ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంది. భారతదేశ రాజ్యాధికారాన్ని ఎన్నికలను ప్రత్యక్షంగా చైనా-పాకిస్తాన్‌లు శాసిస్తున్నాయని అర్థం అవుతున్నది.
***
మాజీ కాంగ్రెసు మంత్రి దామోదర రాజనరసింహ సతీమణి శ్రీమతి పద్మినీరెడ్డి బిజెపిలో చేరారు. ఇది పరిపూర్ణానందస్వామి ప్రేరణతో జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ సంఘటనతో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడింది. పార్టీలోని కీలక నేత సతీమణి బిజెపిలోకి వెళ్లితే ఇక పార్టీ విజయావకాశాలు క్రమశిక్షణ ఏం కావాలి? అందుకని ఆమె మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి సాయంత్రానికల్లా తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరేటట్లు చేశారు. ‘‘నా భర్తకు మనస్తాపం కలుగకూడదు. ఆయన రాజకీయ జీవితం ఇబ్బందులలో పడకూడదు అని తిరిగి కాంగ్రెస్‌లో చేరాను’ అని పద్మినీరెడ్డి ఒక ప్రకటన అక్టోబర్ 2వ వారంలో విడుదల చేశారు. దీనినిబట్టి ఆమె నరేంద్రమోదీ ఆదర్శాలకూ కార్యాచరణకూ ఆమోదం తెలిపిందని అర్థమవుతూ ఉంది. బహుశా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఇలాంటివారు చాలా పెద్దసంఖ్యలో బిజెపిలో మళ్లీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి- మంచిదే కదా!!
***
చత్తీస్‌గఢ్‌లో భూపేష్ భాగల్ అనే ఓ పెద్దాయన ఉన్నాడు. ఇతడు కొన్ని అశ్లీల దృశ్యాలతో కూడిన సి.డిలు (బ్లూఫిలిమ్స్) నిర్మించి భారీ వ్యాపారం చేశాడు. ఇందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఇలాంటి వాళ్లు దేశంలో అక్కడక్కడ పట్టుపడుతూనే ఉన్నారు. ఐతే ఇందులో మరొక ప్రధానాంశం ఉంది. ఈయన చత్తీస్‌గఢ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు. ఎన్నికలలో విజయం సాధిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దీనినిబట్టి ఈ ప్రజాస్వామ్య యుగంలో భారత రాజకీయాలు ఎంత భ్రష్టుపట్టాయో స్పష్టంగా తెలుస్తున్నది కదా! కార్పొరేట్ వ్యాపార దృక్పథం విద్యావైద్య రంగాలలోవలె రాజకీయాలలో కూడా ప్రవేశించిన దాని పరిణామమే ఇది!
ఎం.జె.అక్బర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు. ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉన్నారు. ఇటీవల తనుశ్రీ అనే బాలీవుడ్ సినీ తారకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులో ఈయన ఇరుక్కున్నాడు. ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ మధ్య తెలుగులో శ్రీరెడ్డి అనే నటి చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌ను గందరగోళంలో పడేసింది. ఇక్కడ గమనింపవలసిన అంశం ఏమంటే ఒక వ్యక్తి తన నిజ జీవితంలో కొన్ని బలహీనతలకు లొంగవచ్చు. అది బాధాకరం. కాని కళారంగంలోను రాజకీయ రంగంలోను ఉన్న వ్యక్తుల మీద సమాజంలోని అందరి కళ్లూపడుతాయి. కాబట్టి లైమ్‌లైట్‌లో ఉన్న కవులు కళాకారులు నటులు పాత్రికేయులు, రాజకీయ నాయకులు, అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుందని ఈ ఉదంతాలు తెలియజేస్తున్నాయి.
***
రాజస్థాన్ నుండి అందిన తాజా సమాచారం ప్రకారం అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన సచీన్‌పైలట్ అనే యువకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేశ్‌పైలట్ కుమారుడు. బిజెపి ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధరా రాజే ప్రభుత్వంపై ప్రజలలో ఇంతటి అసంతృప్తి ఎందుకు ఏర్పడిందో పార్టీ అధినేతలు లోతుగా విశే్లషించుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. ఇక తెలంగాణాలో కొన్ని సీట్లు గెలిచినా వీరు ఎవరితోనూ జతకట్టే అవకాశం లేదు. 119 సీట్లకు తెలంగాణాలో పోటీ చేయడం భవిష్యత్తులో పార్టీ విస్తరణకు దోహదం చేయవచ్చు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పీఠం ఉత్తమకుమార్‌రెడ్డి లేదా కె.టి.ఆర్.ల మధ్యనే పోటీ ఉంది.
***
కుందుర్తి ఆంజనేయులు ప్రముఖ వామపక్ష భావాలుగల కవిశ్రేష్టుడు. ఒకసారి ఆయనతో మాట్లాడుతుంటే నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘మమ్మల్ని వేరే ఎవరో ఓడించనక్కరలేదు. మావాళ్లే మమ్మల్ని ఓడిస్తారు’’ ఇవ్వాళ కుందుర్తి లేడు. కాని ఆయన మాటలు ఇవ్వాళ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
1962లో చైనా భారత్‌పై ఏకపక్షంగా యుద్ధం ప్రకటించినప్పుడు కమ్యూనిస్టు పార్టీ నిలువునా చీలిపోయింది. అప్పుడు విజయవాడలో సిపిఐ సిపియం కార్యకర్తల గుడిసెలు పరస్పరం తగలబెట్టుకోవటం నాకు బాగా గుర్తుంది. ఇవ్వాళ (అక్టోబర్ 2018) సిపియం నాయకుడు తమ్మినేని వీరభద్రంపై సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి తెలంగాణాలో నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకని? ఇద్దరూ చెరొక కూటమిలో చేరారు. సిపిఐ కాంగ్రెసు తెలుగుదేశం ఒకటి అయినారు. నిజానికి టిఆర్‌ఎస్ దొరల పార్టీ అయినప్పుడు కాంగ్రెసు కాదా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. మరి వారిలో, ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి ఎలా జతకట్టారు? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.
ప్రొఫెసర్ కోదండరాం ఉప ముఖ్యమంత్రి పదవిని, ముప్పది సీట్లను ఆశిస్తున్నట్లు హైదరాబాద్‌లో ప్రచారం జరుగుతున్నది. ఇందులో నిజం ఎంత?? ఈయన అర్బన్ మావోయిస్టుల సానుభూతిపరుడు. అలాంటి వారితో కాంగ్రెస్‌కు తెలుగుదేశానికి ఎన్నికల పొత్తు ఏమిటి?? అని బిజెపి వర్గాలు ఆక్షేపిస్తున్నాయి.
తెలంగాణాలో మహాకూటమి రోజురోజుకూ బలపడటం టిఆర్‌ఎస్ శ్రేణులలో ఆందోళన కలిగిస్తున్నది. ‘బట్టే బాజీ, దోతే బాజీ, లుచ్చాలు, పిశాచాలు, గడ్డపోళ్ళు’ వంటి తిట్ల దండకాలు ఎన్నికల సభల్లో పఠించటం దేనికి సంకేతం??

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్