మెయన్ ఫీచర్

ఆర్థిక ఇబ్బందులలో పొదుపే తారకమంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి అనుభవ పూర్వకంగా తెలియడంతో నేడు చాలామంది పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ధనాన్ని సరైన ఇంధనంగా మార్చుకుని చక్కటి ప్రణాళికతో ముందుకెళితే ఎలాంటి సమస్యలు వుండవు. సమాజంలో పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వారు, సంపన్నులు అనే వర్గాలన్నీ ఆర్థిక అంతరాల నేపథ్యంలో ఏర్పడినవే. ఆర్థిక వ్యవస్థకు అసలైన కందెన ‘ధనం’ అని వేరే చెప్పవలసిన పనిలేదు. డబ్బును పోగుచేయాలంటే ఎవరైనా మొదట పొదుపుగురించి ఆలోచించాలి. పొదుపు ద్వారానే అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం వుంది. ఆడంబరాలకు పోయి విచ్చలవిడిగా ధనం ఖర్చుపెడితే ఒక్కొక్కసారి పరిస్థితులు కోలుకోలేని విధంగా మారి, జీవితాలు ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం వుంది.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చాలా ప్రాంతాల్లో ఏర్పడిన కరువు ప్రభావంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడడంతో అప్పటి ప్రధాని నెహ్రూ చాలాచోట్ల అంబలి కేంద్రాలను (గంజి కేంద్రాలను) ఏర్పాటు చేయించారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ ప్రధానిగా వున్నప్పుడు పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయి, ఆహార ధాన్యాల కొరత ఏర్పడడంతో ‘జై జవాన్-జై కిసాన్’అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. అప్పుడు చాలామంది రాత్రిపూట భోజనం మానేసి చపాతీలు మాత్రమే తిన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు జరగడంతో నేడు ఆహార ధాన్యాలకు గతంలో మాదిరి కొరతలేదు. అలాగే, నేడు చాలామందికి డబ్బు సంపాదించడం తేలికైన పనిగా మారింది. ఇదే సందర్భంలో డబ్బును విచ్చలవిడిగా విందులకు, వినోదాలకు, విలాసాలకు ఖర్చుపెట్టడం ఆనవాయితీగా మారింది.
ఒకప్పుడు భూతల స్వర్గం లాంటి అమెరికా 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమైంది. నేటికీ అమెరికాలో సరైన విధంగా పరిస్థితులు చక్కబడలేదు. అందుకే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మన ఉద్యోగాలు, మన నియామకాలు, మన నిధులు’ అనే నినాదంతో- ఇతర దేశాలనుంచి వచ్చి స్థిరపడిన వారిపై సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. మూడేళ్ల క్రితం గ్రీసు రాజ్యం పూర్తిగా దివాలా తీసింది. ఇటీవల మన దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులు అనేక బాధలు పడ్డారు. 21వ శతాబ్దంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా పేదరికం జనాభా సరాసరిన 30% వుండగా భారతదేశంలో పేదరికం 40% వరకు వున్నది.
ముఖ్యంగా పేదవర్గాలను ఆడంబరాలకు దూరంగా వుంచి, పొదుపుపాటించేలా వారిని చైతన్యవంతులను చేయడానికి ప్రధాని మోదీ ఆ మధ్య వివాహ ఖర్చుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో గత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ 5 లక్షల రూపాయల ఖర్చుతోనే పెళ్లిళ్లు చేయాలని ఓ చట్టం తీసుకొచ్చారు. ఇటీవల కేరళలో భీకర తుపాను కారణంగా ఆ రాష్ట్ర ప్రజలు కొన్ని రోజుల పాటు గుక్కెడు మంచినీళ్లు, పిడికెడు భోజనం దొరక్క అవస్థ పడ్డారు. దేశ ప్రజలు తుపాను బాధితులకు సంఘీభావం తెలుపుతూ ఎవరికి తోచినరీతిలో విరాళాలు పంపించారు. రెండు వారాల క్రితం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుపాను వల్ల అక్కడి ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. దాతలు, ప్రభుత్వం అందించే సాయం కోసం వీరు ఎదురు చూస్తున్నారు. తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు- ముందు జాగ్రత్త చర్యగా ఎంతో కొంత పొదుపు చేసుకొని, తమ ఆస్తులకు బీమా చేయించి వుంటే- విపత్కర సమయంలో బాధితులకు ఉపశమనంగా ఉంటుంది.
1981లో బంగ్లాదేశ్‌లో ఒక నిరుపేద మహిళ పండ్ల వ్యాపారం చేస్తూ రోజుకు 10 రూపాయల లాభం ఆర్జించేది. ఒక వ్యిక్తి పొదుపుపై స్ఫూర్తి కలిగించడంతో- ఆమె రోజూ మరో రూపాయి కూడా అదనంగా దాచిపెట్టేది. అలా యాభై రోజులకు పోగైన డబ్బుతో- ఆమె అరువు పద్ధతిలోకాకుండా నేరుగా డబ్బు ఇచ్చి పండ్లు కొనుక్కొని వ్యాపారం చేయడంతో రోజుకు ఇరవై రూపాయలు లాభం వచ్చేది. ఆమె బాటలో మరికొంతమంది మహిళలు పొదుపుమార్గం పట్టి అనూహ్యంగా ప్రగతి సాధించారు. వారు మన దేశంలోని మహిళా సమాఖ్యలకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చారు. పాలకులు ఎవరువచ్చినా మహిళా సమాఖ్యల సహకారం తీసుకోవడం ఆనవాయితీగా మారింది. మహిళా సమాఖ్యల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటైంది. ఈ తరహాలో యువజన సంఘాలు, రైతు సంఘాలు, ఇతరులు కూడా పొదుపుమార్గాన్ని పాటించి జీవితాలను చక్కబెట్టుకొనే స్థాయికి ఎదగాలి.
*
(నేడు అంతర్జాతీయ పొదుపు దినోత్సవం)

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212