మెయన్ ఫీచర్

‘మందిర్-మసీదు’కు మళ్లీ విశ్రాంతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలో ‘మందిర్-మసీదు’ వివాదంపై కేసును వచ్చే జనవరిలో లేదా ఆ తర్వాత విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 29 నుంచి అయోధ్య కేసును సుప్రీం విచారిస్తుందన్నారు. అయితే, నెల రోజుల వ్యవధిలోనే ‘సీన్’ మా రింది. కొత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రం ‘ఇది అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాద’ని తేల్చేశారు. సుప్రీం నుంచి ఈ తాజా నిర్ణయం వెలువడడానికి ముందు- పార్టీ నేతల నోళ్లకు తాళం వేయడంలో బీజేపీ విఫలమైంది. తమకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చేస్తున్నట్టుగా విహెచ్‌పీ, బీజేపీ ఉత్తరాది నేతలు ప్రకటనలతో హోరెత్తించారు. బయట జరిగే పరిణామాలను సైతం కోర్టు గమనిస్తుందన్న విషయాన్ని మరచి బీజేపీ నేతలు హడావుడి చేయడం విమర్శలపాలైంది.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్య కేసుపై వివాదాస్పద ప్రకటనలు చేశారు. సుప్రీం తాజా నిర్ణయం మేరకు వచ్చే జనవరి తర్వాతే కేసు విచారణ ప్రారంభమవుతుంది. తీర్పు ఎప్పుడు ఇవ్వడమనేది కోర్టు నిర్ణయం బట్టి ఉంటుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల కంటే ముందు కేసు విచారణ ప్రారంభమవుతుందా? వెంటనే తీర్పు వస్తుందా? అంటే ఎవరూ జవాబు చెప్పలేరు. న్యాయవ్యవస్థ స్వతంత్రమైంది గనుక దానిని ప్రభావితం చేసేలా వీహెచ్‌పీ గానీ, బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ గానీ ఎటువంటి ప్రకటనలు చేయరాదు. గతంలో అనుకున్నట్టు అక్టోబర్ 29న విచారణ ప్రారంభమై ఉంటే, తీర్పు ప్రభావం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనం నుంచి గట్టెక్కవచ్చని హిందుత్వవాదులు భావించారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఒక కీలక ప్రకటన చేశారు. 2014 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మతపరమైన సున్నితమైన అంశాలపై పదేళ్ల పాటు మారటోరియం ఉండాలని, వీటిపై ఉద్యమాలు, చర్చలు, వాగ్వాదాలు, ఆందోళనలు వద్దని తేల్చిచెప్పారు. 1991లో రామమందిర ఉద్యమ సమయంలో మోదీ బీజేపీలో ఉన్నా, ఆ ఆందోళనలో ఆయన ఎప్పుడూ పాల్గొనలేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కూడా మోదీ మందిరం గురించి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఇపుడు కేసు విచారణను సుప్రీం వాయిదా వేయడంతో- రామమందిరం నిర్మాణానికి కేంద్రం ఆర్డినెన్స్ తేవాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇందుకోసం పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని వీహెచ్‌పీ, ఆరెస్సెస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ కోరుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో ‘అయోధ్య’ అంశం కేవలం రచ్చబండ చర్చలకే పరిమితం. ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు,కేరళలలో ఇది భావోద్వేగాలతో కూడినది కాదు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రామమందిరం నిర్మాణం కోసం బలమైన ఉద్యమాలు జరిగాయి. ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే, తూర్పు, పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో రామమందిర నిర్మాణం అక్కడి జనజీవన స్రవంతిలో భాగం. దీనికి చరిత్ర కారులు పేర్కొంటున్న కారణాలు కూడా సహేతకమే.
పార్లమెంటులోని లోక్‌సభ, రాజ్యసభలను ఉమ్మడిగా సమావేశ పరచి, అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మందిర నిర్మాణానికి అప్పగించాలని శాసనం చేయాల్సి ఉంటుంది. కాని ఇది సాధ్యమా? అనే విషయాన్ని పరిశీలించాలి. రాజ్యాంగంలోని 108వ అధికరణ కింద లోక్‌సభ, రాజ్యసభలను సమావేశపరిచే అధికారం రాష్టప్రతికి ఉంటుంది. కాని రాజ్యాంగ సవరణ బిల్లు, ద్రవ్యబిల్లు తప్ప మిగిలిన అంశాలపై బిల్లుల ఆమోదానికి జాయింట్ పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు. ఉభయ సభల్లో సభ్యుల సంఖ్య 790. రెండు సభలను సమావేశపరిస్తే, ఎన్డీఏ పార్టీల మద్దతుతో అయోధ్య అంశానికి ‘శుభం’ కార్డు వేయవచ్చును.
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని కేంద్రం 1991లో తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ స్ధలానికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేసి, ఆ తర్వాత స్థలాన్ని రామమందిర నిర్మాణ సంస్థకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి. ఉభయ సభల్లో బిల్లు సాధారణ మెజార్టీతో ఆమోదింవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడుసార్లు మాత్రమే జాయింట్ పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి మూడు బిల్లులను ఆమోదించారు. 1961లో వరకట్నం నిషేధ బిల్లు ఆమోదానికి ఉభయ సభలను సమావేశపరిచారు. 1978లో జనతాపార్టీ హయాంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో బ్యాంకింగ్ సర్వీసు కమిషన్ రద్దుబిల్లును ఉభయ సభల సమావేశంలో ఆమోదించారు. 2002లో ప్రధాని వాజపేయి హయాంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఆమోదింపచేసేందుకు జాయింట్ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2008లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేసేందుకు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినా ఆ ప్రయత్నం ఫలించలేదు.
జాయింట్ పార్లమెంటు సమావేశం ఏర్పాటుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒక సభ ఒక బిల్లును ఆమోదించి, మరో సభకు పంపుతుంది. కాని రెండో సభ ఆ బిల్లును తిరస్కరించవచ్చు. లేదా ఆ బిల్లులోని సవరణలతో ఏకీభవించకపోవచ్చు. ఆరు నెలల పాటు ఈ బిల్లు ఆ సభలో పెండింగ్‌లో ఉంటుంది. ఆ సమయంలో రాష్టప్రతి కేంద్రమంత్రిమండలి సిఫార్సుపై జాయింట్ పార్లమెంటు సమావేశాన్ని నోటిఫై చేస్తారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్, డిసెంబర్‌లో జరుగుతాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అనుకుంటే ముందుగా లోక్‌సభలో అయోధ్య భూమి అంశంపై బిల్లు పెడితే ఆమోదం పొందుతుంది. రాజ్యసభకు పంపితే అక్కడ ఆమోదం లభిస్తుందా? అన్నది అనుమానమే. రాజ్యసభకు బిల్లును పంపినట్లే పంపి, ఆ తర్వాత వెంటనే సంయుక్త పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. లోక్‌సభలో ఆమోదం లభించలేదు. అలాగే ఎన్డీఏ పక్షం తలచుకుంటే అయోధ్యపై బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభిస్తుంది. రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటుంది. ఈ లోగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికల తర్వాత తమకు అధికారం వస్తే, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందకపోతే, జాయింట్ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్న వ్యూహంతో బీజేపీ ఉండవచ్చు. యూపీలో బీజేపీ సర్కార్ 2022 వరకు అధికారంలో ఉంటుంది. లోక్‌సభలో బిల్లును ఆమోదించడం ద్వారా హిందుత్వ వాదులను శాంతిపచేయవచ్చనేదీ బీజేపీ వ్యూహం కావచ్చు.
రామమందిర నిర్మాణానికి అనుసరించే మార్గాల్లో బీజేపీ వద్ద ఉన్న వ్యూహాల్లో ఇది ఒకటిగా ఉండవచ్చు. ఇక- రెండో మార్గం లోక్‌సభలో ఆమోదింపచేసుకుని, రాజ్యసభకు పంపి అక్కడ చుక్కెదురైతే, వెంటనే జనవరిలోగా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనం చేయవచ్చు. కానీ, మోదీ ఈ ప్రతిపాదనను ఆమోదించకపోవచ్చు. ఇక్కడ సుప్రీం కోర్టు 1973లో కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పును గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ కేసు సందర్భంగా- ‘రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కాని వౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదు’ అని సుప్రీం పేర్కొంది. ఈ వౌలిక స్వరూప సూత్రాల్లో సెక్యులరిజం ఒకటి అని పేర్కొంది. అయోధ్య భూమి వివాదం సివిల్ దావా మాత్రమే. కాని ఇందులో హిందూ, ముస్లిం మత సంస్థలు పార్టీలుగా ఉన్నాయి. పార్లమెంటు అయోధ్యపై శాసనం చేస్తే కోర్టులో కొందరు సవాలు చేస్తారు. నాలుగున్నర శతాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదం అనేక మలుపులు తిరిగి సుప్రీంకు చేరింది. జాయింట్ పార్లమెంటు సమావేశంలో తెచ్చే శాసనాన్ని ముస్లింలు సవాలు చేయరని అనుకుంటే వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. మెజారిటీ వర్గమైన హిందువుల మత విశ్వాసాలను గౌరవించే తత్వం ఈ కేసులో ప్రత్యర్థి పార్టీలకు, కుహనా లౌకికవాద పార్టీలకు ఉంటుందని ఎలా భావించాలి?
1986లో రాజీవ్ గాంధీ హయాంలో ఫైజాబాద్ కోర్టు రామజన్మభూమి దర్శనానికి, అక్కడ పూజలకు అనుమతించింది. 1989 ఎన్నికల కంటే ముందు రాజీవ్ ప్రభుత్వం శిలాన్యాస్ చేసేందుకు వీహెచ్‌పీకి అనుమతి ఇచ్చింది. రామాలయ నిర్మాణంలో కాంగ్రెస్‌ను కలుపుకోకుండా బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేదు. పవిత్రమైన రామజన్మభూమిని ఈ మాత్రమైనా దర్శించుకునే భాగ్యం హిందువులకు కలిగిందంటే అది రాజీవ్ గాంధీ విశాల ప్రయోజనాలతో తీసుకున్న నిర్ణయం, దృఢ సంకల్పం, తెగువే అన్న వాస్తవాన్ని ప్రస్తుత పాలకులు గుర్తుచేసుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వంతో, రకరకాల సంస్కృతులు, విశ్వాసాలతో అలరారే ఈ దేశంలో రాజ్యాంగం, కోర్టులు, దేశ చరిత్రను, ఔన్నత్యాన్ని లెక్కచేయని విచిత్రమైన మనస్తత్వాలతో కూడిన పార్టీలు అయోధ్యపై ఏకాభిప్రాయానికి రావడం దుర్లభం. అన్ని పార్టీలను కాకపోయినా, కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ ఏకాభిప్రాయంతో రామమందిర నిర్మాణానికి శాసనం తెస్తే బాగుంటుంది. లేదంటే అయోధ్య భూమిపై సుప్రీం నిర్ణయం వచ్చే వరకు వేచి చూడడం మంచిది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏకు సంపూర్ణ బలం ఉంది. యూపీ అసెంబ్లీలో మంచి మెజార్టీ ఉంది. గుడి కట్టేందుకు ఉన్న చట్టపరమైన అవరోధాలు తొలగించేందుకు ఇంతకంటే మించిన అవకాశం 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత వస్తుందా? అంటే కచ్చితంగా చెప్పలేం. అందుకే హిందుత్వ వాదులు ఏదో విధంగా అయోధ్య అంశానికి ఒక తార్కిక ముగింపు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ అవకాశాన్ని జారవిడుచుకుని, మళ్లీ ఎన్నికల్లో ఓట్లువేస్తే గుడి కడతామంటే జనం నమ్మరనేది నిజం. గుడి తలుపులు తెరిపించిన కాంగ్రెస్ పార్టీనే తమకు అధికారం ఇస్తే అందరి సమ్మతితో, ఎవరిని నొప్పించకుండా, అయోధ్య భూమిలో రామాలయం నిర్మిస్తామంటే రాజకీయ సమీకరణలు మారడం తథ్యం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097