మెయన్ ఫీచర్

‘డిజిటల్ నిరంకుశత్వం’తో స్వేచ్ఛకు సంకెళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ‘నకిలీ వార్తలు’ అనే మాట ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల వరకూ అంతా ఈ పదాన్ని యథేచ్చగా వాడుతున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారంపై ఆంక్షలు విధించడానికి, అసమ్మతిని అణచి వేయడానికి ఈ పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రపంచంలో ‘ఇంటర్నెట్ స్వేచ్ఛ’ వరుసగా ఎనిమిదో సంవత్సరం తిరోగమనంలో పడుతున్నట్లు ‘ఫ్రీడమ్ హౌస్’ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ‘‘నెట్ పై ఫ్రీడం’-2019’ వెల్లడిస్తున్నది. ఈ నివేదిక ప్రకారం జూన్, 2017 నుండి 65 దేశాలలో ఇంటర్నెట్ స్వేచ్ఛ సన్నగిల్లుతున్నట్లు స్పష్టమవుతోంది. అత్యధికంగా ఈ తిరోగమనం ఈజిప్ట్, శ్రీలంకలలో నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో కంబోడియా, కెన్యా, నైజీరియా, ఫిలిప్పీన్స్, వెనిజులా ఉన్నాయి. అమెరికాలో సహితం ‘నెట్ తటస్టత’కు హామీగా ఉన్న నిబంధనలను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ మార్చివేయడం, ఫిసా సవరణ చట్టానికి కాంగ్రెస్ తిరిగి అనుమతి ఇవ్వడంతో ఇంటర్నెట్ స్వేచ్ఛ సన్నగిల్లుతున్నట్లు చెప్పవచ్చు.
‘‘తమ సరిహద్దుల లోపల, బయట నిఘాను, సమాచారాన్ని నియంత్రించే పద్ధతులను చైనా ఎగుమతి చేస్తుండగా డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు సంఘర్షణకు గురవుతున్నాయి’’ -అని ఫ్రీడమ్ హౌస్ అధ్యక్షుడు మైఖేల్ జే అబ్రవిట్జ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ పక్రియ ఇంటర్నెట్‌కు ప్రమాదకారిగా మారడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తృతంగా ప్రజా స్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లింప చేస్తున్నట్లు స్పష్టం చేసారు. ప్రపంచ వ్యాప్తంగా నెట్ స్వాతంత్రం కోల్పోతూ ఉండడంతో, ఆ ప్రభావంతో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నర్ధకరంగా మారుతున్నది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, తప్పుడు ప్రచారాలకు ఆన్‌లైన్ లను వేదికలుగా మార్చుకొంటూ ఉండడంతో ప్రజాభిప్రాయం విషతుల్యంగా మారుతున్నది. ఇష్టానుసారంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉండటం వల్లన ‘గోప్యత’ అనే పదానికి అర్థం లేకుండా పోతున్నది. విస్తృతంగా చైనాను సెన్సార్‌షిప్ విషయంలో అనేక దేశాలు అనుసరిస్తూ ఉండడంతో డిజిటల్ నిరంకుశత్వానికి, ఆటోమేటిక్ నిఘా వ్యవస్థలకు దారితీస్తున్నాయి.
కేంబ్రిడ్జ్ అనలిటికల్ కుంభకోణంలో ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుగర్‌బర్గ్‌ను రెండు సార్లు అమెరికా కాంగ్రెస్ విచారించడం తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం 8.7 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్ అందించిన్నట్లు ఈ సందర్భంగా వెల్లడైనది. వ్యక్తిగత సమాచారాన్ని ఏ విధంగా రాజకీయ ప్రయో జనాల కోసం ఉపయోగించు కొనే ప్రయత్నం జరు గుతున్నదో ఈ అంశం వెల్లడి చేస్తున్నది. రష్యాలోని హాకర్లు అమెరికా ఓటరు జాబితాల లక్ష్యంగా పని చేయడంతో 2016 ఎన్నికలు ఏ మాత్రం నిష్పాక్షపాతంగా జరిగాయో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటి నుండి భ ద్రతా పరమైన పరిశోధకులు- 19.8 కోట్లమంది అమెరికా ప్రజల, 9.3 కోట్ల మంది మెక్సికో వాసుల, 5.5 కోట్ల మంది ఫ్లిపినో ప్రజల, 5 కోట్ల మంది టర్కీ ఓటర్ల సమాచారంపై ప్రభావం చూపిన్నట్లు కనుగొన్నారు.
‘నెట్ పై ఫ్రీడం’ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న 87 శాతం మంది ప్రజలకు సంబంధించి 65 దేశాలలో అధ్యయనం చేసారు. 70 మందికి పైగా విశే్లషకులు సహకరించారు. జూన్, 2017 నుండి మే, 2018 వరకు జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకున్నారు. 26 దేశాలలో పరిస్థితులు దిగజారగా, 19 దేశాలలో మాత్రం కొంత మెరుగుదల ఉన్నట్లు కనుగొన్నారు. లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తూ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలలో ‘మీటూ’ ఉద్యమం సంచలనం కలిగించినా, ఈజిప్ట్‌లో వేర్వేరు సంఘ టనలలో తమ దేశంలో జరుగుతున్న అటువంటి సంఘటనలను నిరసిస్తూ వీడియో కథనాలను ఫేస్‌బుక్ లో చేర్చినందుకు ఇద్దరు మహిళలు అరెస్ట్ కావడం గమనార్హం. ప్రజా భద్రతకు హాని కలిగించే విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలను వారిపై చేసారు. వారిలో- లెబనాన్ నుండి పర్యటనకు వచ్చిన మహిళకు ఎనిమిదేళ్ళ జైలు శిక్ష విధించారు. దేశంలో 500 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడం ద్వారా అసమ్మతిని అణచివేసే ప్రయత్నం చేసారు. వాటిలో ప్రముఖ మానవ హక్కుల సంస్థలు, స్వతంత్ర మీడియా సంస్థల వెబ్ సైట్‌లు కుడా ఉన్నాయి.
శ్రీలంకలో గత మార్చిలో ఇద్దరి మృతికి దారి తీసిన మత ఘర్షణల సమయంలో రెండు రోజుల పాటు సోషల్ మీడియా వేదికలను మూసివేశారు. డిజిటల్ వేదికలపై వదంతులు, తప్పుడు సమాచారం, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలే లక్ష్యంగా వ్యాప్తిచేసే ప్రయత్నం జరిగింది. ఇంటర్నెట్ స్వేచ్ఛ దిగజారిన దాదాపు సగం దేశాలలో ఎన్నికలకు సంబంధించి జరగడం గమనార్హం. 12 దేశాలలో ఎన్నికల సందర్భంగా తప్పుడు సంచారం వ్యాప్తి, సెన్సార్షిప్, సాంకేతికపరమైన దాడులు లేదా ప్రభుత్వ విమర్శకుల అరెస్ట్‌లు జరిగాయి. గత మేలో అద్యక్ష ఎన్నికలు జరిగిన వెనిజులాలో నికోలస్ మదురో నిరంకుశ పాలనను బలోపేతం చేసే విధంగా చాలా అస్పష్టంగా పేర్కొన్న ‘‘విద్వేషాన్ని’’ ఆన్ లైన్ లో వ్యాప్తి చేస్తే కఠినమైన జైలు శిక్ష అనే నిబంధనలు పొందుపరుస్తూ చట్టం తీసుకు వచ్చారు.
సామాజిక సహాయం అందించడానికి ప్రవేశ పెట్టిన ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డు ‘‘్ఫదర్ ల్యాండ్ కార్డు’’ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఓటర్లపై నిఘాకు, వారిపై వత్తిడి తేవడానికి ఉపయోగించారనే అనుమానాలు చెలరేగాయి. 2018 జూలైలో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందుగా కంబోడియాలో ఆన్‌లైన్ ప్రసంగాలు చేసిన వారికి జైలు శిక్షలు విధించడం, అరెస్ట్‌లు విస్తృతంగా జరిగాయి. అసమ్మతిని అణచడం కోసం రాజరికాన్ని అవ మానించడం కుడా నిషేధం అని చేర్చారు. మరోవంక ముఖ్యంగా సోషల్ మీడియా వివిధ ప్రజా సమూహాల మధ్య విద్వేషం, వ్యతిరేకత పెంపొదింప చేసేందుకు దుర్వినియోగం అవుతోంది. గత సంవత్సర కాలంలో బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, మయాన్మార్‌లలో తప్పుడు వదంతుల వ్యాప్తికి, విద్వేష పూర్వక ప్రచారానికి ఆన్‌లైన్ సాధనాలను ఉపయోగించుకొంటూ ఉండడంతో పలుచోట్ల హింసాయుత సంఘటనలు జరిగాయ. ఆ సంఘటనలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వాలు ఇంటర్నెనెట్ స్వేచ్చపై ఆంక్షలు విధించడానికి అవకాశం ఏర్పడుతున్నది.
ప్రజాస్వామ్య దేశాలు ఒక వంక ఆన్‌లైన్ సమాచారం ద్వారా ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు ఘర్షణలకు లోనవుతూ ఉంటే- చైనాలో పాలకులు తమ అధికారాన్ని స్వదేశంలో, విదేశాల్లో విస్తరింప చేసుకోవడం కోసం డిజిటల్ మీడియాను ఉపయోగించు కొంటున్నారు. ప్రపంచంలో ఇంటర్నెట్ స్వేచ్చను దారుణంగా దుర్వినియోగం చేస్తున్న దేశాలలో చైనా అగ్రస్థానంలో ఉన్నది. ఆన్‌లైన్ సెన్సార్షిప్, నిఘా పద్ధతులపై డజన్ దేశాలకు చెందిన మీడియా అధికారులకు రెండు, మూడు వారాల పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. చైనా నిఘా సేవలను ఉపయోగించుకొని, మానవ హక్కులను దారుణంగా అణచి వేయడంతో పాటు స్థానిక సంస్థలను కుడా అణచివేతకు గురిచేస్తున్న పలు దేశాల ప్రభుత్వాలకు చైనా కంపెనీలు ముఖాన్ని బట్టి గుర్తించగల సదుపాయంతో పాటు సమాచారాన్ని విశే్లషించగల అత్యాధునిక టెలి కమ్యూనికేషన్ పరికరాలను సరఫరా చేస్తున్నాయి. సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకొని, తమ పౌరులను నియంత్రించడం కోసం పలు ప్రభుత్వాలు డిజిటల్ నిరంకుశ విధానాలను పాటిస్తున్నాయ. దీంతో మానవ స్వేచ్ఛకు సాధనంగా భావిస్తున్న ఇంటర్నెట్ ప్రతికూల ప్రయోజనాలకు దోహదపడుతున్నది.
పలు దేశాల ప్రభుత్వాలు ఈ విషయంలో చైనా పద్ధతులను అనుసరించడానికి నకిలీ వార్హలు వ్యాప్తి అవుతున్నాయనే ఆరోపణలు చేస్తూ నిరంకుశ పద్దతులకు పాల్పడుతున్నాయి. ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలు సోషల్ మీడియా ఉపయోగించే వారికి కుడా వర్తింపచేస్తూ, నకిలీ వార్తలను కట్టడి చేయడం పేరుతో అసమ్మతి వ్యక్తం చేసేవారిని జైలుకు పంపడం కోసం మీడియా చట్టాలకు సవరణలు తీసుకు వచ్చాయి. విదేశీ సోషల్ మీడియా, సమాచార సేవలను బ్లాక్ చేసే ప్రయత్నం చేశాయి. తమ దేశంలోని కంపెనీలు పౌరుల సమాచారాన్ని నమోదు చేసి, భద్రతా దళాలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చైనా, రష్యా వంటి నిరంకుశ దేశాలు వత్తిడి చేస్తున్నాయి. మొత్తం మీద ప్రపంచంలో ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటే పెరుగుతున్న డిజిటల్ నిరంకు శత్వాన్ని కట్టడి చేసి ఇంటర్నెట్ స్వేచ్చను కాపాడటం అత్యవసరం. ఎటువంటి రహస్య పర్యవేక్షణ, ఆంక్షలు లేకుండా తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను ఎంపిక చేసుకొనేలా ప్రజలకు సాధికారికత కల్పించేలా సాంకేతికత దోహదపడాలి. డిజిటల్ కాలంలో ప్రజా స్వామ్యం మనుగడ సాగించాలంటే సాంకేతిక కంపెనీలు, ప్రభుత్వాలు, పౌర సమాజం ఉమ్మడిగా కృషి చేయడం ద్వారా సోషల్ మీడియాను దుర్వినియోగ పరచడం, తప్పుడు సమాచారం సేకరించడం వంటి సమస్యల అంతానికి నిజమైన పరిష్కారాలను అనే్వషించాలి. డిజిటల్ నిరంకుశత్వాన్ని తొలగించడానికి ఇంటర్నెట్‌కు స్వేచ్ఛ తప్పనిసరి. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థల ఆరోగ్యం దానిపైనే ఆధారపడి ఉంటుంది.
*

-చలసాని నరేంద్ర