ఎడిట్ పేజీ

‘మందిర’ నిర్మాణానికి దారులెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా ‘మం దిర్- మసీదు’ వివాదం ఏనాటికైనా కొలిక్కి వస్తుందని అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, అత్యున్నత న్యాయస్థానంలో ‘అయోధ్య రామ జన్మభూమి కేసు’ దశాబ్దాల తరబడి అపరిష్కృతంగానే ఉంది. జస్టిస్ దీపక్ మిశ్రా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే తుది తీర్పు వస్తుందని ఎదురు చూసిన హిందూ సమాజం- ఇపుడు మరి కొనే్నళ్లు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 అక్టోబర్ 29 నుండి ‘అయోధ్య కేసు’పై నిరంతర వాదనలు జరుగుతాయని ప్రకటించి దీపక్ మిశ్రా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 2019 జనవరి మొదటి వారంలో ‘అయోధ్య’పై విచారణకు తేదీని ప్రకటిస్తామని వాయిదావేసి, ఈ కేసులో తీర్పుకు తొందరేమీ లేదని, దానికంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నిర్ణయం పట్ల హిందూమత సంస్థలు సహజంగానే అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
సుప్రీం కోర్టు అక్టోబర్ 29న చెప్పిన భాష్యానికి యావత్ హిందువులు ఆవేదనను ఆవేశంగా మార్చుకోవలసి వస్తుంది. విచారణను వాయిదా వేయడం పట్ల ‘శివసేన’ పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ‘ఆర్డినెన్స్’ తేవాలని, అందుకు తమ మద్దతుంటుందని ప్రకటించడమే గాక ‘శివసేన’ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, షియా వక్ఫ్‌బోర్డు నేతలు కూడా ఆర్డినెన్స్ తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 29 నుంచి కేసు విచారణ ప్రారంభమవుతుందని తొలుత ప్రకటించినప్పటికీ, చివరికి మాట తప్పడంతో సుప్రీం కోర్టు పట్ల మెజారిటీ ప్రజల్లో గౌరవం తగ్గుతోంది. ఇరువర్గాల వాదనలను వినేందుకు నిరంతరాయంగా కేసు విచారణ జరుగుతుందని ప్రకటించిన సుప్రీం కోర్టు జనవరి వరకూ వాయిదా వేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పురాణ పురుషుడు శ్రీరాముడు హిందువులకు ఆత్మ. రామజన్మభూమిలో భవ్యమైన రామమందిర నిర్మాణం హిందువులకూ రాముడి ప్రతీక. తమ మతానికి ప్రతీక అయిన రాముడి గుడిపై గల కళంకాన్ని 1992 డిసెంబర్ 6న హిందువులు తొలగించుకున్నారు. అదే ఐక్యతతో ఆలయ నిర్మాణానికి హిందూ సమాజం దారులు వేసుకొనగలదన్న విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తించాల్సి ఉంది. కేసు విచారణకు సత్వర చర్యలు చేపట్టి వాస్తవాలను పరిశీలించి తుది తీర్పును వెలువరించి, హిందువుల మనోభావాలను గౌరవించాలి.
కాగా, ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలిపై సుప్రీం కోర్టులోని న్యాయమూర్తులే ఆ మధ్య నిరసన గళం వినిపించిన సంగతి తెలిసిందే. తమకు కీలక కేసులు ఇవ్వడం లేదని, పక్షపాత బుద్ధితో మిశ్రా వ్యవహరించారని, తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తెలిపినా తమను గౌరవించలేదని కొందరు న్యాయమూర్తులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు జస్టిస్ చలమేశ్వర్, మరో ఇద్దరు న్యాయమూర్తులు దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి- దీపక్ మిశ్రా పనితీరుపై అసహనం ప్రకటించిన సంగతి తెలిసిందే. విలేఖరుల సాక్షిగా ఈ న్యాయమూర్తులు వారి గోడును వెళ్లబోసుకోవడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. తమకు అన్యాయం జరుగుతోందని దీపక్ మిశ్రాపై వీరు నిందారోపణలు చేయడం న్యాయవ్యవస్థలోనే ఓ సంచలనం. ఈ ఆరోపణల నేపథ్యంలో చీఫ్ జస్టిస్ మిశ్రాపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు రంగం సిద్ధం చేశాయి.
అంటే- న్యాయమూర్తుల వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే విలువైనవి, కానీ- కోట్లాది మంది హిందువుల మనోభావాలు, ఐదువందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్యమాలు, దశాబ్దాలుగా న్యాయస్థానాలలో కొనసాగుతున్న రామజన్మభూమి వివాదంపై తీర్పుకు తొందరలేదా? కేసుల విచారణలో అంతులేని తాత్సారం జరగడం పట్ల నేడు దేశ ప్రజలు యావత్తూ న్యాయస్థానాల తీరుపై అసంతృప్తితో ఉన్నారన్నది కాదనలేని కఠోర వాస్తవం. అక్టోబర్ 29 నుండి అయోధ్య కేసుపై నిరంతర విచారణ చేపట్టాలని దీపక్ మిశ్రా తీసుకున్న నిర్ణయం రంజన్ గొగోయ్‌కి రుచించలేదా? లేకుంటే రామజన్మభూమి వివాదంపై విచారణ జరిపిస్తే పురావస్తుశాఖ ద్వారా సేకరించిన ఆధారాల మేరకు రామజన్మభూమి హిందువులేదని తీర్పు చెప్పవలసి వస్తుందని ఆయనకు మనసొప్పలేదా?
సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. చీఫ్ జస్టిస్‌లు మారుతూనే ఉంటారు. ఉన్నత న్యాయస్థానం పట్ల గౌరవ భావం ప్రకటిస్తూ, తీర్పుల కోసం చట్టసభలు ఎంతకాలం ఎదురుచూడాలి? హిందువులు ఎన్ని వందల సంవత్సరాలు సహనం వహిస్తారు? ప్రతిపక్షాల వారు- ‘అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో తేదీని ప్రకటించాల’ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. కానీ తమ మద్దతును ఇస్తామని మాత్రం వారు కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు హామీ ఇవ్వరు? రాజకీయ నాటకం ఆడటంలో ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు విధానాలకు పాల్పడుతుంటారు. మోసపూరితమైన మాటలకు ప్రజలు సహనం కోల్పోతే 1992 డిసెంబర్ 6 నాటి పరిణామాలు పునరావృతం కాకుండా న్యాయస్థానాలు అడ్డుకుంటాయా? ప్రభుత్వాలు అడ్డుకుంటాయా? ప్రజలను కాపాడవలసిన ఈ రెండు వ్యవస్థలూ మారణ హోమం సృష్టిస్తాయా? కోట్లాది హిందువులు తమ మనోభావాలను మార్చుకొని, కసాయివాని చేతికి దొరికిన గొర్రెల మాదిరిగా మూగబోయి ఉండాలా? న్యాయాధీశులు, రాజకీయ నాయకులు హిందువుల మనోభావాలతో గత డెబ్బయి సంవత్సరాలుగా ఆటాడుకుంటున్నారు. అన్ని వ్యవస్థలలో పనిచేస్తున్న హిందువులంతా తమ జాతికి మూల విరాట్ అయిన శ్రీరాముని భవ్య మందిరం అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మాణం కావాలని కోరుకుంటున్నారు.
రామమందిర నిర్మాణానికి కావలసిన హంగులన్నీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నవి. కాగా, హిందువుల సంకల్ప బలం సిద్ధించే సూచికలు కానవస్తున్నవి. సాధుసంతులు రాజకీయాలలోనికి ప్రవేశిస్తున్నారు. కులగోత్రాలు తెలియని పెద్దమనుషులు సైతం తమ వ్యక్తిగత వివరాలను ప్రకటించుకొంటున్నారు. ఏనాడూ గుడికి వెళ్ళని బుద్ధిజీవులు ఇపుడు దేవాలయాల చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహిస్తున్నారు. కొందరైతే తాము శివభక్తులమని ఘనంగా చెప్పుకొంటున్నారు. కానీ- రామమందిర నిర్మాణానికి మద్దతు ఇస్తామని చెప్పడానికి మాత్రం వీరు సంశయిస్తున్నారు. హిందుత్వం మీద ఇష్టం ఉన్నా లేకున్నా హిందుత్వం విశిష్ఠతను అంగీకరించక తప్పడం లేదు. ప్రపంచంలో 152 క్రైస్తవ దేశాలు, 56 ఇస్లాం దేశాలు, ఒక యూదు దేశం, 12 బౌద్ధ దేశాలున్నాయి. హిందూ దేశం అని చెప్పుకోవడానికి ఒక్క దేశం లేకపోయినప్పటికీ- హిందువుల పక్షపాతి అంటూ స్వదేశీయులే మన ప్రధానమంత్రి నరేంద్ర మో దీపై అపవాదు వేశారు. మోదీని మిగతా ప్రపంచమంతా ఆప్తమిత్రుడిగా భావించడాన్ని భారతీయులు గుర్తిస్తున్నారు. మోదీని విభేదించేవారు సైతం ఈ నిజాన్ని అంగీకరించక తప్పదు.
వివిధ మతాలకు నిలయమైన భారతదేశంలో మతాల మధ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా- అయోధ్య రామజన్మభూమి లాంటి వివాదాలను సత్వరమే పరిష్కరించేలా కొత్త చట్టాలు తేవాల్సిన సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని ఒకప్పటి మసీదు ప్రాంగణంలో గాని, నిర్మాణం అంతర్భాగంలోగాని ఇతర మతాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉండి, ఇది మసీదు కాదు.. అక్రమ నిర్మాణమని ఏ వ్యక్తి గాని, స్వచ్ఛంద సంస్థ గాని న్యాయస్థానం మెట్లెక్కితే- ఈ కేసును పురావస్తుశాఖకు అప్పజెప్పి నిజానిజాల నిగ్గు తేల్చాలి. ఇతర మతాల ఆనవాళ్లు ఉంటే- ఆ వివాదస్పద నిర్మాణాన్ని తొలగించి, ఆ ప్రాంగణాన్ని వాస్తవమైన మతం వారికి అప్పగించాలి. ఇదే నియమాన్ని హిందూ దేవాలయం, చర్చి, జైన మందిరం, బౌద్ధాలయం మొదలైనవాటికి కూడా వర్తింపచేసే విధంగా చట్టం తేవాలన్నదే భారత ప్రజల ఆకాంక్ష. ఇలాంటి చట్టం వల్ల మత సామరస్యం పరిఢవిల్లుతుంది. అన్ని మతాల వారూ ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో కలసి మెలసి ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నపుడే వసుధైక కుటుంబంగా భారత్ వర్థిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దిశగా సాగుతున్న విజ్ఞుల ఆలోచనలను పాలకులు, చట్టసభలు, న్యాయస్థానాలను గౌరవించాలి.

-బలుసా జగతయ్య 90004 43379