మెయిన్ ఫీచర్

దివ్వెల పండుగ దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి భగవద్గీతకు అన్నగారన్నారు శ్రీ కంచి మహాస్వామివారు. ఉపదేశ గ్రంథాలలో భగవద్గీతకు ఎట్టి ఖ్యాతి ఉందో పండుగలలో దీపావళికి అంతటి ఖ్యాతి ఉందన్నారు. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పండుగ ప్రాధాన్యం ఉండగా ‘దీపావళి’ మాత్రం అన్ని ప్రాంతాలవారు సంతోషంగా జరుపుకుంటారు.
దీపావళి అంటే దీపానాం ఆవళి- అనగా దీపముల వరుస. ఆశ్వజయు అమావాస్య దీపావళిగా, కౌముదీ ఉత్సవమని, దీపాలికయని వ్యవహరిస్తారు.
దీపావళి మహాశివరాత్రివలె రాత్రి చేసే పండుగ. అలానే సంవత్సరంలో అమావాస్యా నాడు పర్వదినాలుగా భావించేవి రెండే రెండు. అవి మహాలయ అమావాస్య, దీపావళి అమావాస్య. దీపావళిలోని ప్రత్యేకతలివి. మరొక విశేషమేమంటే దీపావళి పశ్చిమోత్తర ప్రాంతాలలో ఐదు రోజులు, తమిళనాడులో ఒక్కరోజు, మిగిలిన ప్రాంతాలలో మూడు రోజులు పండుగగా జరుపుకుంటారు.
ఐదు రోజులు పండుగ చేసుకునేవారికి ఆశ్వయుజ బహుళ త్రయోదశి ‘్ధనత్రయోదశి’, నరక చతుర్దశి, దీపావళి, కార్తీకశుద్ధ పాడ్యమి ‘బలిపాడ్యమి’, ‘ప్రీతి విదియ’-ఇవి వరుసగా వచ్చే పర్వదినాలు.
ధనత్రయోదశి సంధ్య సమయంలో నూనెతో దీపాన్ని వెలిగించి ఇంటి ముంగిట ఉంచుతారు. దీనిని ‘యమదీపం’ అంటారు. అపమృత్యు నివారణార్థం పెట్టే దీపం ఇది. ఈ రోజున వ్యాపారస్థులు (గుజరాతీయులు) ధనలక్ష్మిని పూజించిన వార్షిక పద్దులకు క్రొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. బంధు మిత్రులకు కానుకలివ్వడంతోపాటు విందు చేస్తారు.
రెండవ రోజు నరకచతుర్దశి. వరాహమూర్తి (శ్రీహరి వరాహావతారంలో)కి, భూదేవికి జన్మించిన నరకుడు ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా చేసుకుని పాలిస్తూ వరగర్వంతో ముల్లోకాలను భయభ్రాంతులకు పాల్జేయడం కాకుండా ఎందరో స్ర్తిలకు తాను జయించిన రాజ్యాలనుండి తెచ్చి చెరలో బంధించాడు. నరకుని దాష్టీకానికి దేవమాత అదితి కర్ణకుండలాలను దోచుకోవడం ఓ మచ్చుతునక. భూదేవియే ద్వాపరంలో సత్యభామగా అవతరించింది. శ్రీకృష్ణుని అర్థాంగి అయింది. కుమారుని దుశ్చర్యలను సహించలేక నరకుని సంహరించి లోకంలో శాంతిని నెలకొల్పమని కృష్ణుని అర్థించింది. సతి మాటను కాదనక శ్రీకృష్ణుడు నరకుని సంహరించాడు. ఆ రోజు చతుర్దశి. ప్రదోష సమయం. నరకుని మరణంతో లోకాలన్నీ ఆనందంతో నిండాయి. నరకుడు బంధించిన స్ర్తిలందరికి చెరనుండి విముక్తి కలిగించాడు. వారి ప్రార్థనపై భార్యలుగా స్వీకరించి షోడశ స్ర్తిసహస్యుడిగా పేరు పొందేడు.
ప్రదోష సమయంలో నరకుని వధ జరిగింది కనుక ‘విధుందయం’లో అభ్యంగనస్నానం చేయాలని శాస్తవ్రచనం. కాని, ఉదయం చేయడం ఆచారంగా వస్తున్నది. ‘ప్రాతఃస్నానంతు యః కుర్యాత్ యమలోకం న వశ్యతి’ అను శాస్తవ్రచనం- అంటే, ఉదయం స్నానం చేసినవాడు యమలోకాన్ని దర్శించడు-ఆ ప్రకారం నరక చతుర్దశి ఉదయమే అభ్యంగ స్నానం చేయాలి.
తమిళనాడులో ఆ విధంగా నరకచతుర్దశి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
నరకాయ ప్రదాతవ్యో దీపాన్ సంపూజ్య దేవతాః
చతుర్దశ్శంతు యే దీపాన్ నరకాయుదదింత చ
తేషాం పితృగణాః సర్వే నరకా త్స్యర్గ మాప్నుయుః
నరకాధిపతి యముడు. కనుక నరక చతుర్దశినాడు యముని ప్రీతికై పూజాదులను నిర్వహించి, సంధ్యా సమయంలో దీపాలను వెలిగించాలని, అలా చేస్తే పితృదేవతలు నరకం నుండి విముక్తులై స్వర్గానికి వెళతారు. అంతేకాక, ఆనాడు వేకువన తలంటుకోవడంలో ‘తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళ్యా చతుర్దశమ్’ అను వచనాన్ననుసరించి తైలంలో లక్ష్మి, జలంలో గంగామాత ఉంటారట. తెలుగులోగిళ్లలో కూడా నరకచతుర్దశిని భోగిగా పాటిస్తారు. ఆనాడు యమునికి తర్పణాలనిచ్చి, మధ్యాహ్న భోజనంలో మినుములతో చేసిన పదార్థాలను భుజించి ప్రదోష సమయంలో ఇంటి ముంగిట ప్రదిమలలో దీపాలను వెలిగిస్తారు.
మరుసటి రోజు ఐదు పండుగలలో మధ్యనున్నదీ, ముఖ్యమైనదీ దీపావళి. ముందు రోజువలె వేకువనే అభ్యంగనస్నానం, కొత్త బట్టలు కట్టుకుని ఇష్టదేవతలను పూజించడం విధానంగా చెప్పబడింది. ఈ రోజున పితృయజ్ఞం నిర్వహించడం శ్రేయోదాయకమని శాస్త్ర వచనం. గృహిణి రోజంతా ఉపవశించి ప్రదోష సమయంలో పూజామందిరం వద్ద అలికి ముగ్గులుపెట్టి, లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ముందు ప్రమిదలలో దీపాలను వెలిగించి, షోడశోపచారాలతో పూజించి, దీపాలను లక్ష్మీదేవికి ధారపోయాలి. పిల్లలచే దుబ్బులు లక్ష్మీదేవి ముందు కొట్టించి, వాటిని పెద్దలు బయట దక్షిణ దిక్కువైపు తిరిగి ఆకాశం వైపు చూపాలి. ఆ దివిటీలు పితరులకు స్వర్గమార్గాన్ని చూపిస్తాయి. ఆపై అందరు కాళ్ళు కడుక్కుని లక్ష్మీదేవిని ప్రార్థించి, ప్రసాదంగా తీపి పదార్థాన్ని ఆరగించాలి. వెలిగించిన దీపాలను ఇంటిముంగిట వరుసలుగా పేర్చాలి. తులసికోట, బావి, అన్ని గుమ్మాలకు ఇరువైపులా ప్రదిమలను ఉంచాలి.
ఆపై పిన్నలు, పెద్దలు అంతా బాణాసంచా ఆనందంగా కాల్చాలి. అనంతరం ఇల్లంతా శుభ్రపరచి , వాకిళ్ళు తుడిచి, చెత్తాచెదారం బయటపోయాలి. అలక్ష్మిని ఇంటినుంచి బయటకు పంపినట్లు సంకేతం. అటుపిమ్మట అందరూ దీపావళి సందడిని తలుచుకుంటూ విందారగించాలి.
మరునాడు బలిపాడ్యమి వామనావతారంలో బలిచక్రవర్తికి ఇచ్చిన మాటననుసరించి, బలి భూలోకానికి వస్తారని, భూలోక వాసుల ఆనందంలో పాలు పంచుకుంటాడని ప్రతీతి. భూలోకవాసులందరినీ ఆ రోజు ఆశీర్వదించి తిరిగి తన లోకానికి వెళతాడని విశ్వాసం. బలిని ఆ రోజు పూజించేవారున్నారు.
ఉత్తరభారతంలో ప్రధానంగా బృందావనంలో గోవర్థన పూజను ఈ రోజున నిర్వహిస్తారు. గోవర్థనగిరిని ఎత్తి శ్రీకృష్ణుడు ఇంద్రుని గర్వమణిగించిన రోజు. ‘గోవిందుని’గా సార్థక నామధేయాన్ని పొందినరోజు.
ఐదు రోజుల పండుగలో చివరిది యమ ద్వితీయ ప్రాచుర్యాన్ని పొందింది. యమున తన సోదరుడైన యమధర్మరాజును తన ఇంట విందుకు పిలుస్తుంది. యముడు వచ్చి విందారగిస్తాడు. చెల్లిలి ఆతిథ్యానికి మెచ్చి వరం కోరుకోమంటాడు. ‘్భగినీ హస్త్భోజనం’గా ‘భ్రాతృద్వితీయ’గా పేరుపొందిన ఈ రోజున విధిగా సోదరులు సోదరి ఇంటికి పిలిచినా పిలవకపోయినా వెళ్లి భోజనం చేసి శక్తిమేరకు కానుకలిచ్చి ఆమెను సంతోషపెట్టాలి. అలా చేస్తే సోదరులకు అపమృత్యుభయం కాని, నరలోక దర్శనం కాని ఉండవని, సోదరుని ఆశీస్సులవల్ల సుదరి ఐదవతనం కలకాలం వర్థిల్లుతుందని శాస్త్రాలు అంటున్నాయి.
ఇలా ఐదు రోజులు దీపావళి పండుగ పరిసమాప్తమవుతుంది. దీపావళి అంటే దీపయజ్ఞం. ‘ఉద్దీపస్య జాతవేదో పఘ్నన్ నిరృతిందుమ’- ఓ అగ్నీ బాగుగా వెలుగు. నా పాపాలను పోగొట్టి వెలుగు అనే వివేకాన్ని ప్రసాదించు అని వేదం ఘోషిస్తున్నది.
‘జ్ఞానాగ్ని దగ్థ కర్మణా తమాహుః పండితం బుధాః’ అని భగవద్గీత అంటే, లలితాదేవిని ‘అజ్ఞానధ్యాంత దపికా’ అని లలితా సహస్రం కీర్తించింది. అగ్ని ఆరాధనయే దీపయజ్ఞం. ఆ దీపపు కాంతిలోనే సమస్త ప్రపంచం, అంతరిక్షంలోని గ్రహాలు ప్రకాశిస్తున్నాయి.
‘‘ఉత్తిష్టత! మా స్వప్న అగ్నిమిచ్ఛద్వం భారతా’- అంటే భారతీయులారా! మేల్కొనండి. అగ్నిని ఆరాధించండి (దీపాలను వెలిగించండి). ఆ వెలుగును అన్నివైపులా ప్రసరింపజేయండి అని వేదం హెచ్చరిస్తున్నది.
దీపావళినాడు దీపయజ్ఞం చేసి వేదమాత హెచ్చరికను పాటిద్దాం.

-ఏ.సీతారామారావు