ఎడిట్ పేజీ

చట్టం అండతో ‘ఆమె’ సబలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక మహిళలు తమ కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకోలేని అనేక ఇబ్బందులను ఇపుడు ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని సైతం పురుషాధిక్య సమాజం సహించలేకపోతోంది. అణచివేతకు గురైన స్ర్తిలు- గతంలో తమకు ఎదురైన చేదు ఘటనలను నేడు బహిర్గతం చేస్తుంటే.. ‘అప్పుడు ఎందుకు చెప్పుకోలేద’ని సమాజం నిలదీస్తోంది. ఆనాడు ఫేస్‌బుక్ లేదు, ట్విట్టర్ లేదు, చెప్పుకున్నా వినేవాడే లేడు, ఒక వేళ విన్నా ఎదుటివారు లేవనెత్తే అనుమానాలకు సమాధానం చెప్పుకుని పోరాడే ఆత్మస్థైర్యం కూడా లేదు. ప్రతి కుటుంబంలో భార్య తన భర్తకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని ఎన్నో మానసిక సమస్యలను తన సన్నిహితులతో పంచుకుంటుంది. ఆ సమస్యలను విన్న మహిళ లేదా పురుషుడే నేరస్థుడిగా మారితే బాధితుల పరిస్థితి ఏమిటి? ‘్ఫర్యాదు చేద్దామని మహిళ వెళితే వేధించిన ఎస్.ఐ’ అనే వార్తలు మనం ఎన్ని చదవలేదు. అడ్డంకులను అధిగమించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, తాను ఎలా దగా పడుతున్నదీ చెప్పుకునేందుకు మహిళ చేసే ప్రయత్నాన్ని ఈ సమాజం ఇంకా స్వీకరించలేకపోతోంది.
మహిళను ఒక పనిముట్టుగా చూసే సమాజం మారనంత కాలం ఆమెకు గౌరవం దక్కుతుందని భావించలేం. సాహిత్యంలో, మతగ్రంథాల్లో మహిళలపై చిన్నచూపు, వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో స్ర్తిని ఒక ఆటబొమ్మగా చూపుతూ పురుషాధిక్యత పెచ్చుమీరినందున బాధిత మహిళలు సాంఘిక న్యాయం కోసం పోరాడాల్సి వస్తోంది. అయితే, పురాణాల్లో మనం స్ర్తిని ఒక ‘శక్తి’గా చూస్తాం. అంతులేని సహనాన్ని స్ర్తిలు ప్రదర్శిస్తారు. ఆ సహనమే వారికి శాపంగా మారుతోంది. తనను తాను సంస్కరించుకుంటూ, ఇంటినీ, పిల్లల్ని, కుటుంబ సభ్యులను మార్చుకుంటూ ఇరుగు పొరుగువారితో సమభావం ప్రదర్శిస్తూ అందర్నీ ఒక తాటిపై నడిపే శక్తి స్ర్తిలకు ఉంది. అయితే, వారు కుంగుబాటుకు లోనవడం, ఆత్మన్యూనతను ప్రదర్శించడం- సవాలక్ష సమస్యలకు కారణంగా మారుతున్నాయి.
నైపుణ్యం చూసి సినిమాల్లో అవకాశం ఇవ్వమని, సమర్థతకు ఉపాధి చూపమని మహిళ అడిగితే చాలు- ‘మాకు ఏం ప్రయోజనం? ఏమిటి ప్రతిఫలం??’ అని అడిగే పురుష పుంగవుల కబంధ హస్తాల నుండి రక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. ఆ చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు బయటపడుతున్నారే తప్ప వేధింపులను మాత్రం ఆపడం లేదు. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 8 చట్టాలతో పాటు దాదాపు మరో 50 చట్టాలు దేశంలో అమలులో ఉన్నాయి. ఏ అంశంపై ఏ చట్టం తమకు అక్కరకు వస్తుందనే అవగాహన లేకపోవడమే స్ర్తిలకు శాపంగా మారింది. వీటికి తోడు భారతీయ శిక్షాస్మృతి, నేర విచారణ ప్రక్రియా స్మృతి ఉండనే ఉన్నాయి. వీటన్నింటికీ రాజ్యాంగ రక్షణ కూడా కల్పించారు.
సతీ నివారణ చట్టం -1987, క్రిమినల్ సవరణ చట్టం -1983, వరకట్న నిరోధక చట్టం -1961, మహిళల అక్రమ రవాణా చట్టం -1956, మహిళల అసభ్య చిత్రీకరణ నిరోధక చట్టం -1986, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం -2013, గృహహింస నిరోధక చట్టం -2005, నిర్భయ చట్టం -2013 వంటివి అతివలకు రక్షణగా నిలుస్తున్నాయి. పకడ్బందీ నిబంధనలతో ఈ చట్టాలు అమలులో ఉన్నా సరైన చైతన్యం లేక మహిళలు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఫిర్యాదు చేద్దామన్నా ఎవరికి చేయాలో, ఎక్కడ చేయాలో, చేస్తే ఏం అవుతుందో తెలియని దుస్థితిలో ఉంటున్నారు. సామాన్య మహిళలే కాదు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం వౌనమే పరిష్కారంగా భావిస్తున్నారు. ఈ బలహీనతను గుర్తిస్తున్న పురుష సమాజం వారిని మరింత వేధింపులకు గురిచేస్తోంది. కాంట్రాక్టు కార్మికుల నియంత్రణ చట్టం -1976, ఎంప్లారుూస్ ఇన్స్యూరెన్స్ చట్టం 1948, సమాన వేతన చట్టం 1978, ఫ్యాక్టరీల చట్టం -1948, మెటర్నటీ ప్రయోజన చట్టం -1961, సవరణ చట్టం 1996, ప్లాంటేషన్ కార్మికుల చట్టం -1951లో కూడా స్ర్తిల వేతనాలు, ఆరోగ్యం, పని పంపిణీ, ఆర్థిక సాయం, బీమా, తదితర అంశాలపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇక వివాహ చట్టాలు, విడాకుల చట్టాలు, ఆనంద్ మేరేజెస్ యాక్టు 1909, ఆర్య సమాజంలో చేసుకునే పెళ్లిళ్లకు గుర్తింపునిస్తూ చేసిన 1937 చట్టం, జనన- మరణ రికార్డుల చట్టం 1886, బెంగళూరు మేరెజెస్ యాక్టు 1936, మార్పిడి చెల్లుబాటు రద్దు చట్టం 1939, విదేశీయుల వివాహ చట్టం -1969, హిందు వివాహ చట్టం -1955, క్రైస్తవ వివాహ చట్టం 1872, భారతీయ విడాకుల చట్టం 1969, వివాహ చట్ట సవరణ -2001, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ చట్టం 1986, పార్శీ వివాహాలు, విడాకుల చట్టం 1936, బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, ప్రత్యేక వివాహాల చట్టం 1954 ఉండనే ఉన్నాయి. కుటుంబ పోషణకు ప్రత్యేక చట్టాలు, బలవంతపు గర్భస్రావాన్ని నిరోధించే చట్టాలు, ఆస్తి పంపిణీ, వారసత్వపు హక్కులను వివరించే చట్టాలు, బాలల హక్కులు పరిక్షణ చట్టాలు ఎన్నో ఉన్నాయి.
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా స్ర్తి- పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తోంది. పౌరుల పట్ల వివక్ష ముఖ్యంగా లింగ వివక్షను ఎపుడో నిషేధించారు. స్ర్తిల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్ర్తిలకు అనుకూలంగా విచక్షణ పాటించవచ్చునని ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. స్ర్తిల పట్ల అన్ని విధాలా వివక్ష నిర్మూలనకు అంతర్జాతీయ ఒప్పందం 1981 సెప్టెంబర్ 3 నుండి అమలులోకి వచ్చింది. లింగపరంగా వ్యత్యాసాన్ని,వెలిని, ఆంక్షలను స్ర్తిల పట్ల వివక్ష వంటి అంశాలను ఈ ఒప్పందం ద్వారా నిషేధించారు. తరువాతి కాలంలో పౌష్టికాహారం , స్వతంత్రంగా జీవించే స్ర్తిలు, నిస్సహాయ స్ర్తిలు, నెట్టివేయబడిన వర్గాలు, స్ర్తిలపై హింస మొదలైన అంశాలు కూడా ఈ ఒప్పందంలో చేర్చారు.
ఇంట్లో ఉన్నపుడు గృహహింసకు, ఉద్యోగాలకు వెళ్తుంటే పనిప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం’ ప్రకారం కేవలం పని ప్రదేశంలోనే కాదు, పనిప్రదేశాన్ని దాటి ఎక్కడ వేధింపులు జరిగినా అది ఆ చట్టం పరిధిలోకే వస్తుంది. ఈ చట్టం రూపకల్పనకు పదేళ్లు పడితే, నిబంధనలు రూపొందించి చట్టం అమలులోకి రావడానికి మరో మూడేళ్లు పట్టింది. ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన లేక మహిళలు సకాలంలో స్పందించలేకపోతున్నారు. లైంగిక వేధింపులకు గురిచేయడం అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15లను, స్ర్తిల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం హుందాగా జీవించే హక్కు, వృత్తి, ఉద్యోగం, వాణిజ్యం లేదా వ్యాపారం ఏ పని చేపట్టినా లైంగిక వేధింపులు లేని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపైనే ఉంది. ఈ కేసుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలచింది. ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీల్లో లైంగిక వేధింపుల నిరోధక అంతర్గత కమిటీలను నియమించాలి, ప్రతి జిల్లాలో కలెక్టర్ల అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీలను నియమించాలి, ఆ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, దినసరి, తాత్కాలిక, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేసే మహిళలందరికీ ఈ చట్టం కింద రక్షణ లభిస్తోంది. ఈ చట్టం కింద వచ్చిన ఫిర్యాదులను 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి 60 రోజుల్లో తదుపరి చర్యలు తీసుకుని దానిని ప్రచురించాల్సి ఉంటుంది. ఉద్యోగినికి మూడు నెలల సెలవుతో పాటు వేధింపులకు గురిచేసే వ్యక్తిని బదిలీ చేయాలని కోరే హక్కు కూడా ఆమెకు కల్పించారు. చర్యలు తీసుకోని సంస్థలపై తొలి తప్పిదం కింద 50వేలు మళ్లీ తప్పు చేస్తే లక్ష జరిమానాతో పాటు ఆ సంస్థ లైసెన్స్‌ను రద్దు చేయడం, న్యాయపరమైన చర్యలకు కూడా అవకాశం కల్పించారు.
కాని సంప్రదాయంగా వస్తున్న సమాజంలో అనేక ఇబ్బందులు ఇంకా తొలగిపోలేదు. ఏ దేశంలో లేని వైవిధ్యమైన హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారత్‌లో ఉంది. ఆరువేల సంవత్సరాల క్రితం నుండి వస్తున్న హిందూ ధర్మం (వేదకాలం) నుండి అనేక రూపాంతరాలు చెందుతూ స్మృతులను దాటి సంప్రదాయాలు, ధర్మసూత్రాల ప్రాతిపదికగా ఒక స్వరూపాన్ని పొందింది. ఆధునిక యుగంలో సమానత్వం, న్యాయం, సామాజిక స్పృహ, పూర్వపు శాసనాలు, తీర్పులు, ఆదేశాలు, చట్టాలు ప్రాతిపదికన సమాజం నడుస్తోంది. మిగిలిన మతాలు కూడా కొన్ని విషయాల్లో మినహాయించి మిగిలిన అన్ని చట్టాలు అందరికీ వర్తించేలా రూపొందించినవే. ఉన్నత విలువలను వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి గ్రహిస్తున్నా, స్ర్తిని గౌరవించాలని అన్ని మతాల గ్రంథాలూ నూరిపోస్తున్నా లింగవివక్షను పురుషుడు ప్రదర్శిస్తూనే ఉన్నాడు. స్ర్తి - పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ సమానమనే భావనను పునరావగాహన చేసుకునే సమయం ఆసన్నమైంది. జ్ఞానంలోనూ, శారీరక సామర్ధ్యాలలోనూ, సమర్థతలోనూ ఆలోచన , వివేచన, విశే్లషణ రంగాల్లోనూ మగవారికి ఏ మాత్రం తీసిపోరని ఇప్పటికే మన చుట్టూ ఉన్న విజయవంతమైన మహిళలను చూస్తే అర్థం అవుతుంది. బ్యాంకింగ్, ఐటీ, విమానయాన రంగం, అంతరిక్ష రంగం, సైన్యంలోనూ, బహుళజాతి పారిశ్రామిక సంస్థలోనూ వారు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. చాలా సందర్భాల్లో పురుషుల విజయాలను అధిగమించి స్ర్తిలు సాధించిన మహోన్నతమైన ఆవిష్కరణలు ఆనాటి ఫ్రాన్స్ భౌతిక రసాయన శాస్తవ్రేత్త మేరీ క్యూరీ మొదలు మనం చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా పురుషులతో పోలిస్తే మహిళలే తమను తాము తక్కువగా భావించే సామాజిక ఒత్తిడిలో ఎదుగుతున్నారు. దీనికి తగిన చైతన్యం లేకపోవడమే ప్రధాన కారణం. ఆ దిశగా మరింత కృషి జరగాల్సి ఉంది.

-బీవీ ప్రసాద్ 98499 98090