మెయిన్ ఫీచర్

కావాల్సింది సృజనాత్మకత (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రొత్తవాటికోసం పాతవి కచ్చితంగా అంతరించాలి. దయచేసి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ పాతవి మీలో ఉన్నవే కానీ, లేనివి కాదు. అంటే, నేను చెప్పేది మీ లోపల ఉన్న కుళ్ళిన పాత భావాలు అంతరించాలని మాత్రమే. కానీ, మీలో లేని వాటి గురించి, పాత సామాజిక నిర్మాణం గురించి నేను మాట్లాడట్లేదు. పాత భావాలతో నిండిన మీ మానసిక స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. నూతన భావాలతో కూడుకున్న మానసిక స్థితి మీలో కలిగేందుకు ఆ పాత మానసిక స్థితి అంతరించాలి. అలా ఒక్క మనిషి మారినా, అతని ఉనికి అనేకమంది తమ జీవితాలను ఊహించలేనంత, నమ్మలేనంత అపురూపంగా మార్చుకునేందుకు ప్రేరేపిస్తుంది. అప్పుడు అనేకమంది అలా మారడం ప్రారంభిస్తారు.
కాబట్టి, పేరాశల నుంచి, పురాతన ఆదర్శవాదాల నుంచి బయటపడి, నిశ్శబ్దంగా, ధ్యాన పూర్వకంగా, ప్రేమాస్పదునిగా మారి, ఆనందంగా నాట్యం చేస్తూ జరిగే దానిని గమినించండి. త్వరలో అనేకమంది, ఆ తరువాత ఇంకా చాలామంది మీతో కలిసి నాట్యం చేస్తారు. ఇదే నేను మీకు బోధించే తిరుగుబాటు.
నేను రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకిని, కాబట్టి, వాటిపై నాకు ఎలాంటి ఆసక్తిలేదు. అవును, కొత్త వాటికోసం పాతవి నశించాలి. అది మీలో జరగాలి. అప్పుడే అక్కడ కొత్తవి పుట్టుకొస్తాయి. కొత్తవి ఎప్పుడూ అంటువ్యాధి లాంటివే. అందుకే అవి త్వరగా ఇతరులకు వ్యాపిస్తాయి.
ఆనందం ఒక అంటువ్యాధి. మీరు నవ్వడం ప్రారంభిస్తే మీతోపాటు ఇతరులుకూడా నవ్వడం ప్రారంభిస్తారు. అలాగే ఏడుపు కూడా. మనం విడిగా లేము. అందరం కలిసే ఉన్నాం. కాబట్టి, ఎవరి హృదయం ఉప్పొంగినా అది ఇతరుల హృదయాలను- ఒక్కొక్కసారి సుదూర తీరాలలో ఉన్న హృదయాలను కూడా- తాకుతుంది. ఏదో విధంగా మార్మికమైన మార్గంలో నా నవ్వు, నా ప్రేమ మిమ్మల్ని చేరింది, నా ఉనికి మీ ఉనికిని తాకింది. అందుకే అనేక ప్రయాసలుపడి చాలా దూరాలనుంచి కూడా మీరు ఇక్కడకొచ్చారు.
ప్రతి దానికి వ్యతిరేకంగా పోరాడమని నేను మీకు బోధించట్లేదు. అలా చేస్తే మీరొక అభివృద్ధి నిరోధకునిగా మారతారు. ఎందుకంటే, మీ చర్యకు ప్రతి చర్య అదే. అప్పుడు మీకు వ్యతిరేకమైన దాని ఉచ్చులో మీరు చిక్కుకుంటారు. అది మిమ్మల్ని శాసిస్తుంది- బహుశా ప్రతికూల మార్గంలో కావచ్చు. అయినా అది మిమ్మల్ని శాసిస్తుంది.
జీసస్ క్రీస్తును ఎక్కువగా వ్యతిరేకించేవాడు నీషే. అందుకే జీసస్ ప్రభావం నీషేపై అంతగా ఉందని నేనంటాను. అతను నిజంగా జీసస్ క్రీస్తులా మారేందుకు ప్రయత్నించేవాడు. పైగా, అది తన సొంత హక్కుగా భావించేవాడు. అలా అది అతనికి పీడలా తగులుకుంది. దానితో అతను ‘నూతన సువార్తలు’ సృష్టించే ప్రయత్నంచేశాడు. ఆ ప్రయత్నంలో భాగమే అతను రచించిన ‘దజ్ స్పేక్ జరతూష్ట్ర’అనే పుస్తకం. అందులో అతను ఉపయోగించిన భాష, అలంకారాలు, కవితలు కచ్చితంగా జీసస్‌ను గుర్తుచేస్తాయి. కానీ, జీసస్‌కు బద్ధవ్యతిరేకి నీషే, అందుకే జీసస్‌ను ఖండించే ఏ అవకాశాన్ని అతను ఎప్పుడూ వదులుకోలేదు. అంతగా వ్యతిరేకించడం ద్వారా అతను ఎప్పుడూ జీసస్ గురించే ఎక్కువగా ఆలోచించేవాడు. అందుకే అతనికి పిచ్చెక్కింది. చివరికి జీవిత చరమాంకంలో ఉత్తరాలపై సంతకం చేసేటప్పుడు కూడా అతను ‘యాంటీ క్రైస్ట్ ఫ్రెడరిక్ నీషే’అని రాసేవాడు. అంతగా జీసస్ క్రీస్తు అతనికి పీడలా తగులుకున్నాడు. చివరికి పిచ్చెక్కిన తరువాత కూడా జీసస్ క్రీస్తును మరచిపోలేకపోయాడు నీషే. నీషేకు జీసస్ పట్ల ఉన్న అంతులేని అసూయే అతనిని, అతని జీవితాన్ని పూర్తిగా శాసించడమేకాక, అతనికున్న అపారమైన సృజనాత్మకతను కూడా సర్వనాశనం చేసింది. అతను స్వయంగా అభివృద్ధి నిరోధకుని స్థాయికి దిగజారిపోయాడు. లేకపోతే, అతను ఎవరికీ తలవంచని తిరుగుబాటు వీరునిగా మారి ఈ ప్రపంచానికి ఎంతోకొంత నూతనత్వాన్ని తీసుకొచ్చేవాడు. కానీ, అలా కాలేకపోయాడు. ఎందుకంటే, పీడలా తగులుకున్న జీసస్‌ను అతను మరచిపోలేకపోయాడు.
నేను దేనికీ, ఎవరికీ వ్యతిరేకిని కాను. మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటానే కానీ, ‘‘దేనినుంచో స్వేచ్ఛ’’పొందాలని నేను కోరుకోను. తేడాను గమనించండి:
ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్