మెయన్ ఫీచర్

జాతి శ్రేయోధనానికి రాజకీయ దహనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం అనే దేహానికి ‘బ్యాంకింగ్ వ్యవస్థ- ద్రవ్య చలామణి’ అనే యుగళం రక్తప్రసరణ ప్రక్రియ లాంటి ప్రధాన లక్షణం. బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమత కోల్పోతే ఆ దుర్లక్షణం బ్లడ్ క్యాన్సర్‌లా దేశాన్ని కుప్పకూల్చేస్తుంది. రక్తప్రసరణ క్రియలో గుండె ఎంత ప్రధానమైనదో దేశానికి రిజర్వ్ బ్యాంక్ అంత ప్రధానమైనది.
దేశంలోని బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకు లోబడే పనిచేయాలి. దాని ఆదేశాలు ఎంత సమగ్ర అధికార బలంతో కూడినవంటే ప్రభుత్వపు బ్యాంకులే కాకుండా, రిజిస్టరైన ఏ ప్రైవేట్ బ్యాంకు కూడా రిజర్వు బ్యాంకు చెప్పిన (నిశ్చయించిన) కనీస- గరిష్ఠపు వడ్డీ రేట్ల పరిమితిలోనే ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాలి. ఇక ఋణ ప్రదానాల విషయానికొస్తే- రిజర్వ్ బ్యాంక్ రాజ్యాంగబద్ధ స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ- తన ఇష్టం వచ్చినట్టు వ్యక్తులకైనా, వాణిజ్య, పారిశ్రామిక యాజమాన్యాలకైనా అడిగిన వారికి అడిగినంతగా, ‘అడిగినట్టుగా’ (అడ్డగోలుగా) ఋణాలు మంజూరు చేయటానికి నియమ నిబంధనలు అనుమతించవు. రిజర్వు బ్యాంకు కార్యనిర్వహణ విధులు, ఋణాల మంజూరు మొదలైన అంశాలన్నీ కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల అజమాయిషీలో, సలహా సంప్రదింపులు, సమీక్షా సంఘ సభ్యుల మెజారిటీ నిర్ణయాలు మొదలైన వాటి ప్రకారమే అమలవుతాయి. అమలు కావాలి కూడా.
రిజర్వు బ్యాంకుకు సంబంధించిన వార్షిక నివేదికలను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. అలాంటి నివేదికలను కొన్నింటిని పరిశీలించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నిశితమైన వ్యాఖ్యలు చేశారు. రిజర్వు బ్యాంకు, ఇతర ప్రభుత్వ బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకులు, రిజిస్టర్డ్ బ్యాంక్‌లు ఒక ఆచరణ సూత్రబద్ధ, నియంత్రణా పద్ధతికి తిలోదకాలిచ్చి, వేల కోట్లలో చాలామంది వాణిజ్య, పారిశ్రామికపు సొంతదారులకు ఋణాలిచ్చి, జాతీయ ఆర్థిక సౌష్ఠవాన్ని చాలా బలహీనపరచారని ఇటీవల ప్రకటించారు.
అలా బలహీనపడ్డ బ్యాంకింగ్ వ్యవస్థకు జీవస్థానాల లాంటి బ్యాంకులు పునరుజ్జీవనం పొందాలన్నా, కనీస బలస్థాయికి రావాలన్నా వాటికి మూలధనాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే గ్రాంటుల రూపంలో ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల ప్రతిపాదితపు జాతీయ బడ్జెట్ మొత్తం కకావికలం అయిపోతోంది. అప్పుడు తిరిగి ఆ బడ్జెట్‌ను, ఆర్థిక స్థోమతను సక్రమ స్థాయికి చేర్చటానికి కేంద్రం ప్రత్యక్షపు పన్నులను, పరోక్షపు పన్నులను పెంచాల్సి వస్తోంది, పెంచుతోంది. దాని ప్రభావం, భారం మళ్ళీ తిరిగి ప్రజల మీదే పడుతున్నాయి. అయినా ప్రజలు ఏదో ఒకసారి కష్టమో, నష్టమో, నిష్ఠురమో అనుకొని పన్నుల పెంపునకు అలవాటుపడతారు, పడుతున్నారు.
మూలధనపు పెంపునకు, వెసులుబాటుకు అలవాటుపడి చాలా బ్యాంకులు మళ్ళీ లెక్కా-డొక్కా RULE AND RHYME , ప్రభుత్వము- ప్రజలు- ఆర్థిక భారము- ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఋణ ప్రదానాలు అతిగా చేసేస్తున్నాయి. కాకపోతే ఒకసారి కొన్ని బ్యాంకులు ఆ పనిచేస్తే మరో ఆర్థిక ప్రణాళిక కాలంలో వేరే కొన్ని బ్యాంకులు అదే ఘోర అనౌచితికి పాల్పడుతున్నాయి. ఈ రకమైన ప్రజాధన దుర్వినియోగానికి సర్వోన్నత స్థానంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ యాజమాన్య లోపాలు, నిర్భీతి, స్వీయ క్రమశిక్షణా రాహిత్యం, మొహమాటాలే కారణాలు. ఇందుకు మూల కారణాలు రాజకీయ నాయకుల ప్రమేయం, స్వార్థం, ఓట్ల రాజకీయాలు మాత్రమే అనేది బహిరంగ రహస్యం.
ఈ దుర్మార్గం గుఱించి ఏ రాజకీయ పక్షమూ మాట్లాడదు. ఏ పార్టీ కూడా ఇంత భయంకర, ప్రమాదకర, జాతీయ ఆర్థికతా వినాశకర, భావి జాతీయ సంక్షోభకారక అంశం గుఱించి పెదవి విప్పదు. కనీసం విచారమో, భయమో వ్యక్తం చేయదు. దానికి కారణం ఇలాంటి వాటిని ప్రస్తావిస్తూ ప్రజల్లో ఉపన్యాసాలిస్తే ఏ రాజకీయ నాయకుడికీ తన వైయక్తిక రాజకీయ రంగ ప్రయోజనం (పొలిటికల్ మైలేజ్) ఏ మాత్రం పెరగదు. మరో వైపేమో సగటు మానవుడికి ఈ నిదాన విష ప్రభావ వ్యాపిత (SLOW POISON) గుఱించి తెలియదు.
బ్యాంకులను ముంచేసిన విజయ్ మాల్యాలు, లలిత్ మోడీలు మొదలైనవాళ్ళ విషయం, ప్రస్తావన ఎప్పుడో, ఏడాదికోమాటో అన్నట్టు వచ్చినప్పుడో ప్రధాని మోదీని తిట్టేసి, జనాన్ని ఎగదోసి తమ శాడిజంను కొందరు సంతృప్తిపరచుకుంటారు. ఈ కుటిల, వంచక (హిపోక్రటిక్) రాజకీయులకు కావలసింది కేవలం ఆవేశ, ఉద్రేకాదులను రెచ్చగొట్టే వార్తల గుఱించి అతిగా ప్రసంగించటం, నిష్కారణంగా ప్రధాని మోదీ మీద నిందలు, అభాండాలు మోపటం, ఇదంతా ప్రజా సంక్షేమం కోసం అనే రంగు తమకు తాము పులుముకోవటమూను.
ఎక్కడో ఒక మారుమూల ఊళ్ళో మెజారిటీ ప్రజల నమ్మకాలను, మనోభావాలను కించపరుస్తూ, గాయపరుస్తూ- అదే మెజారిటీ మతస్థుడో, ఒక మైనారిటీ మతస్థుడో ప్రవర్తిస్తే, అతనికి గుణపాఠం చెప్పిన ఒక మెజారిటీ మతస్థుడిని రాక్షసుడు అనటం, ఘోరాతి ఘోరంగా అతి నీచంగా కామప్రవృత్తి చూపించిన వ్యక్తి యొక్క అన్యాయ ప్రవర్తనను క్షమించాలని ఆందోళన చేయటం, దేశభక్తులు, రక్షకులు అయిన జవాన్లను, ప్రజా ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా చంపేయటం, కోట్ల విలువ చేసే ప్రజాసౌకర్యాల వ్యవస్థలను తగలబెట్టటం మొదలైన వాటిని చేసిన వారిని పౌర హక్కుల న్యాయం అనే గొడుగు కింద వదిలేయాలనటం- ఇట్లాంటివి పొలిటికల్ మైలేజ్ కోసం, గంపగుత్త ఓట్లకోసం అదే పనిగా చాలామంది కుత్సిత భావాల నాయకులు చెప్పేదేనా- ‘ప్రజాసంక్షేమం’ అన్నమాటకు అర్థం? వాళ్ళకు ప్రజార్థిక వ్యవస్థారోగ్యంతో పనిలేదు. ఉదాత్త మనస్తత్వంతో పనిలేదు. మేధోమథనం అక్కరలేదు. ‘రూపాయి’ అంటే ఏమిటో తెలియదు. ‘మనీ’ అంటే అవగాహన లేదు.
"MONEY IS WHAT IT DOES" (డబ్బు అంటే ఏమిటి అంటే- అది ఏమి ఒనగూరుస్తుందో అదే)’’ అంటుంది ఆర్థిక శాస్త్రం. ధనం వస్తువుగా మారుతుంది. ఆ వస్తువును సక్రమంగా ఉపయోగిస్తే అదే తిరిగి ధనాన్ని సమకూర్చిపెడుతుంది. ఇలా ‘్ధనము-వస్తువు’ పరస్పర సృష్టి కారకాలు, పరస్పర మారకాలు, వస్తువు-సేవలు (మెటీరియల్ అండ్ సర్విసెస్) అనే రెంటినీ తెచ్చేదీ, ఇచ్చేదీ, తిరిగి వాటిగా మార్చేదీ పైకమే. అది రిజర్వ్ బ్యాంక్ చేసే తప్పుల వల్ల, రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల దేశంలో దుర్వినియోగం కావటమే కాకుండా విదేశాలకు వెళ్లిపోతోంది. దారుణంగా జాతి నష్టపోతోంది.
ప్రాణం లాంటి ఈ విషయాన్ని పట్టించుకోకుండా అప్రధాన విషయాలను ప్రధాన విషయాలుగా మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్న కుటిల నాయకుల విషయంలో ప్రజ జాగృతం కాకపోతే ఆ తరువాత ప్రాప్తించే జాతీయ విపత్తుకు అందరమూ బలైపోతాం. తస్మాత్ జాగ్రత్త..!

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290