మెయిన్ ఫీచర్

ఆ మార్పుతో మహిళలకు సాంత్వన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-ఎ 1983 సంవత్సరాల నుండి అమలులోకి వచ్చింది. స్ర్తిలపై జరిగేటటువంటి వరకట్న హింస నుండి వారి రక్షణ కొరకు మరియు ఎవరైతే భార్యను హింసిస్తారో, భర్త లేదా భర్త బంధువులు ఎవరైనా కావచ్చు, వారిని శిక్షించుటకై ఉద్దేశింపబడినటువంటిది ఈ చట్టం. దీని ప్రకారంగా నేరం నిరూపణ అయినట్లైతే 3 సంవత్సరాల జైలుశిక్ష మరియు జరిమానా విధించే అధికారం న్యాయస్థానాలకుంది.
ఇదిలా వుండగా, రాజేష్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులోభారత అత్యున్నత న్యాయస్థానం 27-7-2017 నాడు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ కేసు పూర్వాపరాలు చూసినట్లయితే, రాజేష్ శర్మ వివాహం 28-11-2012 నాడు జరిగింది. భర్త మరియు అతని కుటుంబ సభ్యులు తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వరకట్నంతో సంతృప్తి చెందక తనను హింసించటం మొదలుపెట్టారని పోలీసువారికి అతని భార్య ఫిర్యాదు చేయటం, ఆ ఫిర్యాదుతో దిగువ కోర్టు మొదటగా భర్తను మాత్రమే నిందితుడుగా చేర్చటం, తదుపరి ఆమె అత్తమామలను కూడా నిందితులుగా చేర్చాలని సెషన్ కోర్టు ముందు రివిజన్ వేయటం జరిగింది. సెషన్ కోర్టు ఆ దరఖాస్తును అంగీకరించింది. దానిపై నిందితులు హైకోర్టుకు అప్పీలు చేయటం మరియు హైకోర్టు దిగువ కోర్టుల ఉత్తర్వులను ఆమోదించటం జరిగింది. సంతృప్తి చెందని నిందితులు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ముందు అప్పీలు వేసారు. వాదనలు విన్న తర్వాత ఇరువురు గౌరవ న్యాయమూర్తుల బెంచీ కొన్ని ఆదేశాలు ఇస్తూ 27-7-2017 నాడు తీర్పు ఇవ్వటం జరిగింది.
ఈ తీర్పులోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమనగా జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) లెక్కల ప్రకారం భర్త యొక్క బంధువులపై పెట్టినటువంటి చాలా కేసులు అబద్ధపు కేసులని, శిక్షకు గురికాబడినటువంటి బంధువుల శాతం చాలా తక్కువని, భార్య లేదా ఆమె బంధువులు సెక్షన్ 498-ఎను దుర్వినియోగపరుస్తున్నారని, మరియు వ్యక్తిగత కక్షలకు ఉపయోగించుకుంటున్నారని భావిస్తూ దేశంలో వున్నటువంటి ప్రతి జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఒకటిగాని, లేదా అంతకుమించి కుటుంబ సంక్షేమ కమిటీలను జిల్లా కేంద్రంలో ఏర్పరచాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుండాలని, వారు పారా లీగల్ వలంటీర్లు లేదా సామాజిక సేవకులు లేదా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు లేదా పదవిలో వున్నటువంటి ఉద్యోగుల భార్యలను సభ్యులుగా నియమించాలని ఆదేశం. పోలీసువారి ముందుగాని, లేదా మేజిస్ట్రేటు ముందుగాని సెక్షన్ 498-ఎ ఫిర్యాదు వచ్చినట్లయితే దానిని వారు పైన పేర్కొన్న జిల్లా కమిటీకి పంపించాలి. ఆ కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఫిర్యాదుకు సంబంధించిన ఇరువర్గాల వారిని విచారించి, తమ నివేదికను నెల రోజుల లోపుగా పంపించాలి. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన వ్యక్తులు కమిటీ ముందు రాజీకి ఒప్పుకోనట్లయితే, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సంబంధిత పోలీసు లేదా మేజిస్ట్రేటు తదుపరి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇరువర్గాలవారు కమిటీ ముందు రాజీకి ఒప్పుకునట్లయితే, కమిటీ నివేదిక ప్రకారం జిల్లా జడ్జి లేదా జిల్లా జడ్జిచే నియమించబడిన అధీకృత న్యాయాధికారికి కేసును మూసివేసే అధికారం రాజేష్ శర్మ కేసు కట్టబెట్టింది.
పై తీర్పు ప్రకారం రాజీకాని కేసులలో భర్త యొక్క బంధువులు వ్యక్తిగతంగా హాజరుకాకుండా సంబందిత దిగువ కోర్టు మినహాయింపునివ్వాలి. అదేవిధంగా నిందితులను కమిటీ నివేదిక వచ్చేవరకు అరెస్టు చేయరాదు. కమిటీ సభ్యులకు కేసు విషయంలో న్యాయస్థానాలు సమన్లు ఇవ్వరాదు.
రాజేశ్ శర్మ కేసులోని ఉత్తర్వుల ప్రకారం జిల్లా జడ్జిలు ఒకటి లేదా అంతకుమించి కమిటీలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేయటం మరియు సంబంధిత పోలీసు మరియు మేజిస్ట్రేటు సెక్షన్ 498-ఎకు సంబంధించినటువంటి ఫిర్యాదులను నమోదు చేయకుండా కమిటీలకు జిల్లా జడ్జి ద్వారా పంపించటం మరియు తీర్పు ఆదేశాలను అమలు చేయటం జరుగుతుంది. అయితే ఈ ఉత్తర్వులను మహిళా సంఘాలు, స్ర్తివాదులు, మరియు కొన్ని ప్రభుత్వేతర సంస్థలు వ్యతిరేస్తూ, సెక్షన్ 498-ఎ చట్టము ఈ విధమైన ఉత్తర్వుల వలన నిర్వీర్యము అయిందని, స్ర్తిల హక్కులపై తీర్పు ప్రభావితం చూపుతుందని వాదన లేవదీశారు. బాధిత మహిళ తనకున్నటువంటి అన్ని మార్గాలు మూసుకున్నతర్వాత మాత్రమే పోలీసు స్టేషన్ లేదా మేజిస్ట్రేటు కోర్టులో తప్పని పరిస్థితుల్లో భర్త మరియు భర్త బంధువులపై కేసు వేస్తుంది ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత కూడా బాధిత మహిళ చాలా కేసుల్లో పోలీసు వారిని రాజీ చేయమని మాత్రమే కోరుతుంది. దాదాపు అన్ని పోలీసు స్టేషన్లలో భార్యాభర్తల కౌన్సిలింగు కేంద్రాలున్నాయని, కౌన్సిలింగు చేసిన తర్వాత మాత్రమే పోలీసువారు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని, మేధావుల మరియు స్ర్తివాదుల వాదన. అంతేకాకుండా జిల్లా జడ్జిచే నియమింపబడినటువంటి సభ్యులకు ఏవిధమైనటువంటి జవాబుదారీతనం లేకపోవటం మరియు ఆ కమిటీ సభ్యులు ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరించటం ఏ మాత్రం భావ్యం కాదని వారి అభిప్రాయం.
ఈ తీర్పువలన సెక్షన్ 498ఎ నిర్వీర్యం అయిందని, విలువ లేకుండా పోయిందని, స్ర్తిల హక్కులను ఈ తీర్పు కాలరాస్తుందని, కేసులు కమిటీ ముందు రాజీ కానట్లయితే వాటిని తిరిగి సంబంధిత పోలీసు, లేదా మేజిస్ట్రేటుకు పంపించే విధానంవల్ల ఆ అనవసర కాలయాపన జరుగుతుందని అభిప్రాయం. కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు అరెస్టు చేయరాదనే ఉత్తర్వులవలన బాధిత మహిళకు అన్యాయం జరగటమే కాకుండా కేసులో న్యాయం కూడా ఆలస్యమవుతుందని, నిందితులు ఎరవేసే ఆశ లేదా లంచాలకు కమిటీ సభ్యులు ప్రభావితులయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వేతర సంస్థల సర్వేలు మరియు విశే్లషణలు సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకోలేదని, తమ హక్కుల రక్షణకై పోరాడే మహిళలపై తీర్పు అసంతృప్తులుగా ముద్రవేసిందని, మహిళలు భర్తల ఆదేశాలను శిరసావహించాలని అన్నట్లుగా తీర్పు వుందని, అంతర్గతంగా పురుషాధిక్యతను తెలియజేస్తుందని మరియు వరకట్న దురాచారాన్ని అంతమొందించే చర్యలు సూచించకపోగా, పురుషులకు అనుకూలంగా మరియు స్ర్తిలకు వ్యతిరేకంగా ఈ తీర్పు వుందని దేశంలోని మేధావుల్లో ఒక చర్చ జరిగింది. అంతేకాకుండా, సెక్షన్ 498ఎ కేసులో భార్యాభర్తలు మరియు భర్త బంధువులు సెక్షన్ 482 క్రిమినల్ చట్టం ప్రకారంగా రాజీ నిర్ణయించే అధికారం కేవలం హైకోర్టుకు మాత్రమే కల్పించబడిందని కానీ ఈ తీర్పు జిల్లా జడ్జి లేదా అధీకృత అధికారికి రాజీపడిన కేసులను మూసివేస్తూ అధికారం కల్పించడం క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకమనే భావించడం జరిగింది.
ఇదిలా వుండగా, న్యాయధర్ అనే మహారాష్టల్రోని అహ్మద్‌నగర్ జిల్లా మహిళా న్యాయవాదుల స్వచ్ఛంద సంస్థ, రాజేష్ శర్మ కేసులోని తీర్పును పునఃపరిశీలించవలసిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించటం జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం 14-9-2018 నాడు తీర్పు వెలువరించింది. చట్టాలను చేసే అధికారం న్యాయస్థానాలకు లేదని, కేవలం చట్టాలకు భాష్యం చెప్పటమే తమ విధి అని, కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయటమనే ఉత్తర్వులు న్యాయపరిధిలోనివి కావని, క్రిమినల్ చట్టాలు లేదా మరే ఇతర చట్టాలలో కూడా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు కల్పించబడలేదని, కమిటీ రిపోర్టు ఇవ్వాలనటం, అంతదాకా అరెస్టు చేయరాదనే ఉత్తర్వులు సమ్మతించదగినవి కావని పేర్కొనటం జరిగింది. రాజీ కాబడిన కేసులు, కమిటీ నివేదిక అందిన పిదప జిల్లా జడ్జి మూసివేయాలనే ఉత్తర్వులు సరియైనవి కావని, అటువంటి కేసులను మూసివేసే అధికారం కేవలం సంబంధిత హైకోర్టుకు మాత్రమే సెక్షన్ 482 క్రిమినల్ లా ప్రకారం వుంటుందని తీర్పు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు పూర్వపు ఉత్తర్వులని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఈ పునఃపరిశీలన ఉత్తర్వుల ప్రకారం కుటుంబ సంక్షేమ కమిటీల ఏర్పాటు, వాటికి సెక్షన్ 498ఎ ఫిర్యాదులు పంపించటం తదుపరి కమిటీ నివేదిక ఇవ్వటం, కమిటీ ముందు రాజీపడిన కేసులను జిల్లా జడ్జి మూసివేయటం అనే ఉత్తర్వులు చెల్లుబాటు కావు. నిందితులయొక్క బంధువులు వ్యక్తిగతంగా హాజరుకాకుండా సంబంధిత కోర్టు మినహాయింపునివ్వాలనే పూర్వపు ఉత్తర్వులనుకూడా త్రోసిపుచ్చటం జరిగింది. ప్రత్యక్ష హాజరు మినహాయింపు కొరకు సెక్షన్ 205 మరియు 317 క్రిమినల్ లా ప్రకారం నిందితులకు దరఖాస్తు పెట్టుకొనే అవకాశం కల్పించబడింది కాబట్టి, పూర్వపు ఉత్తర్వులను సవరించటం జరిగింది. అరెస్టుకు సంబంధించినటువంటి పూర్వపు ఉత్తర్వును కూడా సవరిస్తూ సెక్షన్ 41-ఎ క్రిమినల్ లా ప్రకారం మరియు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్‌ఆఫ్ బీహార్ మరియు జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను పోలీసువారు ఖచ్చితంగా అమలుపర్చాలని ఫిర్యాదు అందిన వెంటనే లేదా ప్రథమ సమాచార నివేదిక రూపొందగానే అరెస్టు చేయటం తగదని, తీర్పు ఇవ్వటం జరిగింది. పునఃపరిశీలన తీర్పు బాధిత మహిళలకు వారి కుటుంబ సభ్యులకు ఊరటనిస్తుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కమిటీ అనేసరికి బాధిత మహిళలు గ్రామాలనుండి జిల్లా కేంద్రానికి ప్రయాణం చేయటం, కమిటీ ముందు వారి వాదన వినిపించటం, నివేదిక సమర్పించటానికి, కమిటీకి నెల రోజుల గడువు వుండటం, అప్పటిదాకా నిందితులను అరెస్టు చేయకపోవటం, దానివలన కేసుల పరిశోధన ఆగిపోవటం, బాధిత మహిళకు సత్వర న్యాయం జరకపోవటమనే విషయాలకు కళ్లెం వేసినట్లు అవుతుంది. త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పువలన బాధిత మహిళలకు సాంత్వన చేకూరటమే కాకుండా సెక్షన్ 498-ఎ ఉద్దేశం మరియు లక్ష్యానికి ఎటువంటి ఆటంకం వుండబోదు. తీర్పు మరియు చట్టం అనేది శాశ్వతం కాదు, కాలానుగుణంగా చట్టాలలో మరియు తీర్పులలో మార్పులు రావటం అభిలషణీయం.

- తడకమళ్ళ మురళీధర్ 98485 45970