మెయన్ ఫీచర్

‘నకిలీ వార్తల’ నయా ఉగ్రవాదం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి విలయాలు, ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మించిపోతున్న మరో పెనుముప్పు నేడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టెక్నాలజీకి మరో వికృత రూపం నకిలీ వార్తలు. క్షణంలో కోటానుకోట్ల నకిలీ వార్తలు పుడుతూ మరుక్షణంలో విశ్వమంతటా చుట్టేస్తున్నాయి. వాటిని విన్న వారు తీవ్ర ఉద్వేగానికి గురికావడమో, ఆవేశకావేశాలకు లోనుకావడమో జరుగుతోంది. నకిలీ వార్తల పుణ్యమాని కొన్ని చోట్ల మూకదాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. వాటి ఫలితం కొన్ని తరాలపై పడుతోంది.
నిరంతరం ఏదో ఒకటి తెలుసుకోవాలనుకునే ఉ త్సాహం, ఆతృత ఉన్నవారు, ఉద్వేగానికి గురయ్యేవారు నకిలీ వార్తల ముప్పుకు విలవిలలాడుతున్నారు. సామాజిక మాధ్యమాలే వేదికగా పుడుతున్న ఈ నకిలీ వార్తల నియంత్రణకు నిర్దేశిత సమగ్ర చట్టాలు రూపుదిద్దుకోకపోవడం- వాటి సృష్టికర్తలకు వరంగా మారింది. మన దేశంలో వార్తాపత్రికలు, వాటి నిర్వహణ, అనుసరించాల్సిన విధి విధానాలు, పాత్రికేయులకు సామాజిక బాధ్యతలతో పాటు చట్టపరమైన విధిని, పరిధిని నిర్దేశించే పరువునష్టం నివారణ చట్టాలు, భారత శిక్షాస్మృతి, పౌరశిక్షా స్మృతి వంటివి ఉండనే ఉన్నాయి. ఇవన్నీ వార్తల్లో వస్తున్న ఇబ్బందులు, సమస్యలను, పరువు నష్టం కలుగకుండా పరిష్కరించకగలుగుతున్నా, వాటిని ఎవరు పుట్టించారో, ఎక్కడ పుట్టించారో తెలియకుండానే తోకలేని పిట్టలా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నందున సమగ్ర చట్టాలు రావల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఎదగాలని భావిస్తున్న వారు తమ ప్రత్యర్థి పార్టీలకు దెబ్బతగిలేలా నకిలీ వార్తలు పుట్టిస్తున్నారని తాజా సర్వేల్లో తేలింది. ఆ వార్తలు సంచలనం సృష్టించడంతో, వాటి మాయజాలానికి ప్రభావితమై మరిన్ని తప్పుడు వార్తలను వారు పుట్టిస్తున్నారని అర్థమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు సహా దేశంలో పలు పార్టీలు సొంతంగా ఐటీ విభాగాలను ఏర్పాటు చేసుకుని ఎదుటివారిపై ఎపుడూ నిందారోపణలు చేసే క్రమంలో నకిలీ వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరికొంత మంది ప్రముఖ ప్రచురణ సంస్థల పేర్లను లేదా లోగోలను వినియోగించుకోవడం, ఇంకొందరు వాటికి దగ్గరగా ఉన్న పేర్లను అర్థమై, అర్థం కాని రీతిలో వినియోగించుకుని నకిలీ వార్తలకు సాధికారతను కట్టబెడుతున్నారు. బీబీసీ అనే పదాన్ని ‘బీసీసీ’ అని రాయడం లేదా సీఎన్‌ఎన్ అనే అక్షరాలను ‘సీఎన్‌ఎస్’ అని రాయడం ద్వారా తొందరపాటులో ఆయా సంస్థలే అధికారికంగా వాటిని ప్రసారం చేశాయన్న అపోహకు లోను కావడం జరుగుతోంది. కొనే్నళ్ల క్రితం నెహ్రూకు సంబంధించిన ఫొటోను వాడుకలోకి తెచ్చారు. క్లబ్ డ్యాన్సర్లతో నెహ్రూ ఉన్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తుంది. వాస్తవానికి అదో సినిమా సన్నివేశంలోని ఫొటో, దానిపై నెహ్రూను ‘మార్ఫింగ్’ చేసి వాడుకలోకి తెచ్చారు. నెహ్రూ వారసులు సైతం ఇదంతా నిజమేనా? అనే భ్రాంతికి లోనయ్యే విధంగా దానిని రూపొందించారు. మరో ఫొటోలో పోప్ జాన్‌పాల్-2 తలపై కనీకనిపించని రీతిలో అశ్లీల ఫొటోను కలిపారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెల్‌ఫోన్‌లో ఓ నగ్నమహిళను తదేకంగా వీక్షిస్తున్నట్లు ఫొటోలో ‘మార్ఫింగ్’ చేశారు. తాను అలాంటిదేమీ చూడలేదని రాహుల్ ఖండించేలోగానే ఆ ఫొటో ఖండాంతరాలు దాటిపోయింది. అలాగే, సర్దార్ పటేల్ విగ్రహం వద్ద యాచకులు ఉన్నట్టు, రొహింగ్యాల కుటుంబంలో బాలికలు శరణార్థులుగా ప్రాథేయపడుతున్నట్టు ఫొటోలు వ్యాప్తిలోకి వచ్చాయి.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో నకిలీ వార్తల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫస్టు డ్రాఫ్ట్, స్టోరీ ఫుల్, ఆల్ట్ న్యూస్, బూమ్ లైవ్, ఫేక్ట్ చెక్కర్, డాటా లీడ్స్ వంటి సంస్థలు నకిలీల అంతు తేల్చే పనిలో పడ్డాయి. దేశంలో వైరల్ అవుతున్న అనేక వార్తల అసలు కథలను ఆ సంస్థలు గుర్తించి వాస్తవాలను వెల్లడిస్తుంటే- నివ్వెరపోవడం అందరి వంతు అవుతోంది. ఎపుడో జరిగిన ఘటనలను కొద్ది క్షణాల క్రితం జరిగినట్టు చెప్పడం లేదా సంబంధం లేని వేరే అంశాలకు ముడివేస్తూ ఫొటోలను జతచేయడం లేదా ఫొటోలను మార్ఫింగ్ చేయడం, సాంకేతిక సాయంతో కొత్తవాటిని సరిపోలేలా ఫొటోలను సృష్టించడం ద్వారా- నకిలీ వార్తలను చూసిన వారు తక్షణం స్పందించాలన్నదే వాటి సృష్టికర్తల లక్ష్యం. ఓ అమ్మాయి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆమెకు బి ప్లస్ రక్తం కావాలని ఒక ఫోన్‌లో మెసేజ్ వస్తుంది. అందరికీ ఒకే మెసేజ్ కాకుండా దానిని ఆయా పట్టణాల పేర్లను జోడించి పంపిస్తారు. నిజానికి రక్తదానం చేయడానికి సిద్ధంగా లేనివారు కూడా ఆ మెసేజ్‌ను తమకు అందుబాటులో ఉన్న గ్రూపులకు పంపిస్తారు. ఆ మెసేజ్ కింద ఉన్న ‘లింక్’ను మనం ‘క్లిక్’ చేయగానే మన ఫోన్‌లోకి ట్రోజాన్లు ప్రవేశించి ఫోన్‌ను సాంకేతికంగా ధ్వంసం చేయడం లేదా మన డేటాను క్షణాల్లో చౌర్యం చేయడం వారి ఉద్దేశం. అది తెలుసుకునేలోగానే మనం నష్టపోతాం. ‘ప్రజలకు ప్రధాని మోదీ కానుక’ అంటూ మరో మెసేజ్ వస్తుంది. విమాన ప్రయాణానికి టిక్కెట్ ఫ్రీగా అంటూ కొన్ని లింక్‌లను ‘క్లిక్’ చేయమని మెసేజ్‌లు పంపుతారు.
ఇలాంటి ‘సందేశాల’ వల్ల నష్టపోయేది వాటిని అందుకున్న వ్యక్తులే, కాని కొన్ని మేసేజ్‌ల వల్ల మొత్తం సమాజం, ఊళ్లకు ఊళ్లు నష్టపోయే పెనుముప్పు ఏర్పడుతోంది. ‘్ఫలానా తప్పుడు పనిని ఫలానా మతం వారే చేశారు.. రుజువు ఇదిగో..’ అంటూ వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. వాటిని చూసిన మరో మతం వారు ఆగ్రహానికి గురికావడం, వాటి ఫలితాలు దారుణంగా ఉండటం మనకు అనుభవమే. వెంటిలేటర్‌పై ఉన్న రోగి ఆరోగ్యం క్షణక్షణానికి దిగజారిన చందంగా పత్రికల విశ్వసనీయతను ఘోరంగా దెబ్బతీసే ఈ నకిలీ వార్తల ఉగ్రవాదం మానవ సమాజాన్ని అమానవీయంగా మారుస్తోంది.
టెక్నాలజీ ఎంత వేగంగా ఆధునికీకరణ వైపు పరుగులు తీస్తోందో, అందుకు భిన్నమైన దిశలో నకిలీ వార్తల వ్యవహారం ముంచుకొస్తోంది. దీనిని గుర్తించిన అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలు, ఎన్‌జీవోలు వాటి కట్టడికి ప్రయత్నిస్తున్నా సునామీ మాదిరి ముంచుకొస్తున్న తప్పుడు వార్తల వరదను చిన్న చిన్న ఆనకట్టలు ఆపగలవా? బీబీసీ సంస్థ ఇప్పటికే నకిలీ వార్తలను అరికట్టే మార్గాలు, పరిష్కారాలను అనే్వషిస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్ కూడా ప్రత్యేక విభాగాలను తెరిచాయి. ‘గూగుల్’ వినూత్న రీతిలో నకిలీ వార్తలను అరికట్టేందుకు దేశంలో అన్ని భాషల్లోని 8వేల మంది పాత్రికేయులకు శిక్షణ ఇచ్చేందుకు నడుం బిగించింది. గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ పేరిట ఒక విభాగాన్ని ప్రారంభించింది. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నకిలీ వార్తలపై వర్కుషాప్‌లను నిర్వహించింది. మరిన్ని ప్రాంతీయ భాషల్లో వీటిని నిర్వహించబోతోంది. భారత ప్రభుత్వం కూడా త్వరలో ఐటీ చట్టాన్ని అమలు చేయబోతోంది. అందులో సామాజిక మాధ్యమాలకు ముకుతాడు వేసే ఎన్నో నిబంధనలను తీసుకువస్తోంది.
ఆమధ్య కేరళ వరదల నెపంతో అనేక ఫొటోలు సా మాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటి పూర్వపరాలను తెలుసుకుంటే అసలు భారత్‌కు సంబంధం లేని ఏదో ఆఫ్రికా దేశాల్లోని ఫొటోలను కూడా ‘నెట్’లోకి తెచ్చారు. కిడ్నాపర్లు తిరుగుతున్నారనే నకిలీ వార్తల ప్రభావం ఎంతగా పడిందంటే- కిడ్నాపర్ అని అనుమానించి కర్నాటక బీదర్ ప్రాంతంలో తెలంగాణకు చెందిన ఒక ఇంజనీరును చంపేశారు. రంజాన్ సందర్భంగా ప్రతి షాప్‌కూ వెళ్లి డబ్బును యాచించే ఒక ట్రాన్స్ జండర్‌ను హైదరాబాద్‌లో చంపేశారు. బాధ్యతారాహిత్యమైన ‘సందేశాలు’ విస్తరించకుండా నిరోధించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాలకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరో పక్క వాట్సాప్, ఫేస్‌బుక్, లింక్‌డిన్ తదితర సంస్థలు అనుమానిత నకిలీ వార్తలను ప్రచారం లోకి తెస్తున్న ఖాతాలను రద్దు చేశాయి. ఆ సంస్థలు నకిలీ వార్తల ప్రసారాన్ని నిరోధించేందుకు నిపుణులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయి. తప్పుడు వార్తలను గుర్తించడం, వాటిని నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి, అనుమానిత అంశాలను గుర్తించిన వెంటనే వాటిని అదుపు చేసే సాంకేతిక సమాచార పరిజ్ఞానం అందుబాటులోకి రావాలి. వీటిని వ్యాప్తి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. అందుకు వీలుగా పటిష్టమైన చట్టాలు రావడమే గాక, ఆ విషయాన్ని అందరికీ అర్థమైన రీతిలో ప్రచారం చేయాలి.

-బీవీ ప్రసాద్ 98499 98090