మెయిన్ ఫీచర్

ఆత్మీయ బంధం.. అనురాగ గంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేస్తమంటే.. విజయానికి వెనకుండి నడిపించేవాడు. పరాజయంలో ప్రక్కనే ఉండి, భుజం తట్టి ధైర్యం చెప్పేవాడు. ప్రాణానికి ప్రాణం అడ్డువేసే యోధుడు. సమస్యల సుడిగుండాలనుంచి తప్పించి, చేయందుకుని ముందుకు నడిపించే నాయకుడు స్నేహితుడు.

‘‘స్నేహం ఓ మధురమైన బంధం
కుల మతాలకతీతమైన సంబంధం
రక్తసంబంధాన్ని మించిన అనురాగ గంధం.. ఆత్మీయ బంధం..’’
స్నేహమంటే సహకార సౌరభాన్ని అందించే కుసుమం. రుగ్మతలు రూపుమాపి, ఉత్సాహాన్ని పంచే ఔషధం. నేస్తమంటే నీడ నిచ్చే పందిరి. అది ఒంటరితనాన్ని దూరం చేసే మమతల లోగిలి.
మిత్రునికన్నా విలువైనదీ, శక్తివంతమైనది సృష్టిలో ఏదీ లేదు. నిను వెన్నంటి నడిచే నీడలాంటివారు స్నేహితుడు. ‘‘నిన్ను నువ్వు రక్షించుకోవడానికి కావలసింది కంచె కాదు కవచంలాంటి స్నేహితుడు’’ అను సామెత అక్షరాలా నిజం.
పుడుతూనే బంధువులున్నట్లు, ఎవరికీ స్నేహితులు ఉండరు. పెరిగేకొద్దీ అభిరుచులు, అలవాట్లు బట్టి మిత్రులు ఏర్పడతారు. ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాల్సిన బంధం స్నేహబంధం. నిన్ను కంటిపాపలా కాపాడే రక్షకుడు స్నేహితుడు. నిశిలోనూ నీకు తడుగా నడిచి వెలుగు చాటి నీకు చూపించే కిరణమే స్నేహితుడు. జీవనయానంలో తోడై నిను సక్రమ మార్గాన నడిపించే నాయకుడే స్నేహితుడు. అతడు నిన్ను గమ్యాన్ని చేర్చే వాహకుడు.
స్నేహమంటే రెండు దేహాలలో ఉన్న ఒకే ఆత్మ. స్నేహం మొదట మర్రి విత్తనంలా చిన్నగా మొదలై పెరిగి పెద్దదై వటవృక్షంలా విస్తరిస్తుంది. అయితే మిత్రులను ఎంపిక చేసుకోవడంలోనే మన విజ్ఞత కనబడుతుంది. మంచి మిత్రులు దీపం లాంటివాడు. వెలుగును పంచుతాడు. ఒక మంచి పుస్తకం లాంటివాడు. ఎన్నో మంచి విషయాలు తెలియజేస్తాడు. అతడు ఆరోగ్యం వంటివాడు. ఆనందాలు పంచుతాడు.
చెడ్డ పనుల నుంచి వారించడం, మంచి పనులు చేయడానికి తోడ్పడడం, రహస్యాన్ని దాచడం, సద్గుణాలను ప్రోత్సహించడం, ఆపత్కాలంలో విడువకుండా ఉండడం, లేమి కల్గినపుడు సహాయం చేయడం అనేవి మంచి మిత్రునికి ఉండవలసిన లక్షణాలని భర్తృహరి చెబుతాడు.
స్నేహితుల దినోత్సవం మొట్టమొదటగా 1935లో అమెరికాలో ప్రారంభించడం వెనుక, దాగిన గాథ వింటే స్నేహితులకు కంట తడిపెట్టిస్తుంది.
రాజాజ్ఞ ధిక్కరించినందుకు ఉరిశిక్ష పడిన ఓ యువకుడు కడసారిగా తన గ్రామం వెళ్ళి, తల్లిదండ్రులను చూచి వచ్చేందుకు రాజుని అనుమతి కోరగా, అతను తిరిగి వచ్చేవరకూ, అతని స్థానంలో ఎవరినైనా బందీగా ఉంచి, ఆ యువకుణ్ణి వెళ్లమంటాడు రాజు. ఆ యువకుని మిత్రుడు అందుకు అంగీకరిస్తాడు. అయితే, యువకుడు గనక సూర్యోదయానికి ముందు రాకపోతే అతని స్థానంలో ఉన్నవారిని ఉరితీస్తానంటాడు రాజు. దానికీ ఆ యువకుని మిత్రుడు అంగీకరించడంతో యువకుడ్ని రాజు విడుదల చేసాడు. అయితే యువకుడు గ్రామం వెళ్లి, తిరుగు ప్రయాణంలో బందిపోటులు అడ్డగించడంతో సమయానికి రాలేక పాపం తన మిత్రుని కోల్పోతాడు. మిత్రుడు తనవల్లే మరణించాడన్న వేదనతో తన తలను ఖండించుకుని మరణిస్తాడు ఆ యువకుడు. ఆ అపూర్వ స్నేహితుల గుర్తుగా మనం నేడు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం.
గంగాజలంలా స్నేహం పవిత్రమైనది. స్నేహబంధం జీవితాంతం, తరగకుండా చెరగకుండా ఉండాలంటే అసూయ, ద్వేషాలు చెరిపేయాలి. మిత్రుడు ఏ స్థితిలో వున్నా ఆదరాభిమానాలు పంచాలి. ఆప్యాయత కల్గి వుండాలి. కృష్ణ-కుచేలుర స్నేహం ఏనాటికీ చెరగనిది. అన్నీ కొత్తగా ఉన్నపుడే బాగుంటాయి. కానీ స్నేహం మాత్రం పాతబడినకొద్దీ బాగుంటుంది.
కళ్ళలో కన్నీరుగా.. మనసులో భావనగా.. ఊపిరిలో శ్వాసగా.. మారి జీవించి వున్నంతవరకూ విడిచిపెట్టనివాడే నిజమైన స్నేహితుడు.
నేస్తమంటే ఆపదల్లో అవసరమై ఆదుకునేవాడు. కష్టాల్లో కన్నీరు తుడిచి ఓదార్చేవాడు. బాధల్లో చేయందించి సాయం చేసేవాడు. కలకాలం పెదవులపై చిరునవ్వు పూయించేవాడు. మంచి మిత్రుడు గ్రంథాలయం వంటివాడు. మనసులో పుట్టి మట్టిలో కలిసేంతవరకూ ఉండేదే స్నేహబంధం.
అలల ప్రయాణం తీరంవరకే
స్నేహం ప్రయాణం మరణం వరకూ...

-చెళ్ళపిళ్ళ శ్యామల