మెయిన్ ఫీచర్

వర్తమాన సాహిత్య పయనం ఎటువైపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం మారుతుంది. శాస్ర్తియ విజ్ఞానం వికసిస్తూంది. మనిషిని ఊపిరి పీల్చుకోనీయనంతగా నవనాగరికత అనేకానేక రూపాల్లో వెంటాడుతుంది. సామాజిక విలువలు ఆర్థిక రాబడి మీద వస్తు వినియోగంమీద కేంద్రీకృతమై ప్రపంచమంతా ఏకీకృత భావనతో సాగిపోతున్నాయి. శ్రమదోపిడీకి గురవుతూనే వుంది. దోపిడీ విధానాలు సరికొత్త కోణాల్లో తమ రూపాల్ని మార్చుకుంటున్నాయి. ఏ విధమైన మినహాయింపులు లేకుండానే సరికొత్త పరిజ్ఞానంతో దోపిడీ కొనసాగుతూనే వుంది. బడుగు బలహీనవర్గ దేశాల మీద అగ్ర దేశాల ఆధిపత్యం పారిశ్రామికీకరణ ముసుగులో ఆర్థిక పెట్టుబడుల ఎరతో కొనసాగుతూనే ఉంది. దోపిడీతనాన్ని దొరతనంగా మార్చడంలో అగ్ర రాజ్యాలు కల్పించిన ప్రపంచీకరణ సరళీకరణ విధానాలు తేనె మీద ఈగ వాలి ఇరుక్కుపోయే విధంగా అభివృద్ధిచెందుతున్న దేశాలను ఆకర్షించడంలో అద్వితీయంగా పనిచేశాయి. అగ్ర దేశాల వలస ఆధిపత్యాలు, సన్నగిల్లాక వ్యాపారపు ఆధిపత్యపు ముసుగులో దోపిడి రూపం మారింది. పెత్తందారీ దోపిడి స్వభావాన్ని అట్టడుగువర్గాల్లోకి చేర్చడంలో, వారి భావజాలంతో మమేకం కావడంలో అగ్ర దేశాలు కృతకృత్యులయ్యాయి. సామ్రాజ్యవాదుల అభీష్టం విశ్వవ్యాప్తంగా అల్లుకుపోతూనే వుంది.
భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాన్ని పరిశీలించినట్లయితే మన దేశంలో వెల్లివిరుస్తున్న జ్ఞాన విప్లవం ఎంతవరకు సమాజాన్ని దోపిడీనుండి ఆదుకొంటుంది? మానవ సంబంధాలు దేనితో ముడివడి వున్నాయి? పాలకుల వాగ్దానాలకు ఆచరణకు గల సంబంధం ఎంత శాతం నిజాయితీతో నిష్ఠగా ముడివడి సాగుతుంది? దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుందా? ఆర్థిక రాబడితో అభివృద్ధి చెందుతుందా? అనే అంశాల మీద సాహితీవేత్తలు లోతైన అవగాహనతో నీతి నిజాయితీగా పరిశీలించి అవగాహనించుకుంటూ వారి ఆలోచనలను అక్షరాల్లో నింపుతున్నారా? అత్యాధునిక టెక్నాలజీ వెనుక దాగివున్న సామ్రాజ్యవాదుల, పెట్టుబడి వర్గాల, దోపిడీ తత్త్వాన్ని పసిగట్టగల్గి సమాజానికి అందించడంలో ఎంతవరకు సాహితీవేత్తలు తోడ్పాటు యివ్వగలుగుతున్నారు? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాల్సివుంది. వ్యాపార దృక్పథంతోపాటు దేశ ప్రజలకు ప్రయోజనకరమైన అనేక సదుపాయాలు కల్పించడంలో విజయవంతమై ఆధునిక సాంకేతిక నిపుణత తోడ్పడింది అనడంలో ఎట్టి సందేహమూ లేదు. కాకపోతే సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని సామ్రాజ్యవాదులు జనాన్ని వస్తువ్యసనాల్లోకి దిగజార్చటం, అర్హతలేని ఆర్థిక వ్యామోహాల్లోకి సామాన్యుణ్ణి నెట్టివేయడం, అపరిమితంగా భోగవిలాసాలను పెంచివేయడం, అల్పాదాయ వర్గాల్ని చులకనగా చూడడం నేడు పరిపాటైపోతుంది. ఆర్థిక బలహీనుల వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కాలరాయడం, పనిచేసే యంత్రాలుగా వారిని మార్చివేయడం దోపిడీదారుల నైజంగా మారింది.
పై విషయాలను పరిగణనలోకి తీసుకొని యోచించినట్లయితే శాస్ర్తియ జ్ఞానం, సాంకేతిక విజ్ఞానం, డిజిటల్ విప్లవం పెట్టుబడిదారీ దోపిడీవర్గాలను ఆర్థికోన్నతులుగా పెంచుతున్నాయి. అట్టడుగు శ్రామిక వర్గాన్ని అధఃపాతాళానికి నెట్టివేస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందే అవకాశం స్వేదజీవులకు లేకుండాపోతుంది. ఇట్టి పరిస్థితులను అర్థం చేసుకోకుండా, మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోవడాన్ని అవగాహనించుకోకుండా, రక్తపాతం, విప్లవం, పోరాటం ఈ కాలానికి తగినవి కావని సాహితీవేత్తలు తీర్మానం చేయడం ఎంతవరకు సమంజసమో ఓసారి ఆలోచించాలి. పోరాటాలకు, విప్లవాలకు కాలం చెల్లిందనుకోవడం పొరపాటు. శ్రమజీవుల స్వేదానికి తగిన విలువలేనప్పుడు ఆకలి మనిషిని ప్రశ్నించేట్లు చేస్తుంది. ప్రశ్నకు తగిన జవాబు రాని పక్షంలో ప్రతిఘటన మొదలవుతుంది. ప్రతిఘటనను నిర్మూలించడానికి పెత్తందారీ విత్తాన్ని హెచ్చించి ‘లా అండ్ ఆర్డరును’ తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. తిరిగి దోపిడీని అధికం చేస్తాడు. ప్రతిఘటన కాస్తా తిరుగుబాటవుతుంది. తిరుగుబాటు వీగిపోతుంటే విప్లవాత్మకమైన వర్గపోరాటం మొదలవుతుంది. అది మిలిటెంట్స్ పోరాటం కావచ్చు, గెరిల్లా పోరాటం కావచ్చు, నగ్జల్‌బరీ లాంటి మరే ప్రాంతపు పోరాటమైనా కావచ్చు లేక లోకల్ తిరుగుబాటు కావచ్చు. ఈ పరిస్థితుల్లో రక్తం చిందడం అనివార్యం. ఆ స్థితికి ప్రతిఘటనలు రాకుండా, కార్మిక కర్షక ఉద్యమాలు విప్లవాత్మకంగా చెలరేగకుండా సామరస్య ధోరణిలో సర్దుబాటుచేయడం సమస్యలు పరిష్కరించడం పాలకుల పని, ప్రభుత్వం పని. ఏ సమస్యనైనా మొగ్గలో తుంచకుండా తమ పదవులకోసం, తమ ఆదాయంకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకుంటూ ఆకలి కేకల్ని, దోపిడీలను, దౌర్జన్యాలను పట్టిపట్టనట్టు తెలియనట్టు, మిన్నకుంటూ పాలకులు ఇంద్రజాలికులై తిరుగుతూ తీరా విప్లవం చెలరేగాక ప్రభుత్వ రక్షణదళాల్ని న్యాయపోరాటదారుల మీదకు ఉసిగొల్పడం ఎంతవరకు సమంజసం? ఈ పరిస్థితులను సాహితీవేత్తలు సక్రమంగా అర్థంచేసుకొని న్యాయంవైపు నిలబడాల్సి వుంది.
జ్ఞానం ఉన్నంతమాత్రాన రక్తపాతం ఆగదు. జ్ఞానాన్ని పాలకులు గాని, పాలితులు గాని సరైన మార్గంలో వినియోగిస్తే మనిషిని మనిషి దోచుకోవడం మానుకుంటే అక్రమార్జనకు అర్రులు చాచకుండా వుంటే, స్వార్థచింతనతో సమాజాన్ని బలిపీఠం ఎక్కించకుండా ఉంటే, రక్తపాతం అవసరం లేదు. సాయుధ పోరాటాలు అవసరం లేదు. ఏ సమస్యనైనా మాటలతో పరిష్కరించుకోవచ్చు. దోపిడీ వర్గాల్ని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నప్పుడు, కడుపుకాలే జనం తిరగబడతారు. అక్రమార్కుల ఆట కట్టించేందుకు చట్టాన్ని అతిక్రమిస్తారు. పాలకులపై తిరగబడతారు. అప్పుడే రక్తపాతం అనివార్యమయ్యేది. ఆచరణ లేని శాంతి కాముక సూత్రాల్ని ఎన్నైనా వల్లించవచ్చు. కాని ప్రయోజనముండదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, అధునాతన సౌకర్యాల్ని, మనిషి తనాన్ని యేమార్చే భోగలాలస విధానాల్ని, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి దోహదపడే కొన్ని అంశాలను మినహాయిస్తే మిగిలిన ఆధునికత, నవ నాగరికత మనిషిని ‘మర’గా మారుస్తున్నాయి. ప్రతి మనిషిలో లోన మనిషి అదృశ్యమైపోతున్నాడు. కృత్రిమత్వమే మనిషిలో వికృతమైంది. ఇట్టి పరిస్థితుల్లో సహేతుకమైన మనిషిలో తెగింపు కలుగుతుంది. సామూహిక అన్యాయాలు సంఘటితపడి శ్రమజీవుల స్వేదాన్ని బొక్కుతుంటే స్వేదం చిందించే శ్రమజీవులు సంఘటితపడి పోరాడి నెత్తురు చిందిస్తారు. దోపిడిని కాలరాయడానికి కంకణబద్ధులవుతారు. దీన్ని హింసావాదం కిందనో, రాజద్రోహం కిందనో పరిగణిస్తూ ప్రభుత్వ రక్షణదళాన్ని అడ్డుపెట్టుకొని పాలక వర్గాలు అమానుషంగా ఆకలి కేకలను అణచివేయాలనుకోవడం, హింసావాదాన్ని ప్రోత్సహించడమే అవుతుంది.
చారిత్రక అసంభవాల్ని పరిగణనలోకి తీసుకుంటే ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడే ప్రతిఘటన ఉంటుంది. ఉద్యమాలు తలెత్తుతాయి. హింసకు ప్రతిఘటనే సమాధానవౌతుంటుంది. అందుకే ప్రజాప్రభుత్వాలు ఇకనైనా మేల్కొనాలి. సామ్రాజ్యవాద కుట్రలను, కుయుక్తులను, అణచివేత ధోరణులను దోపిడీతనాన్ని నిలువరించే ప్రజాస్వామ్యం వర్ధిల్లే పాలక వర్గాలు తెరపైకి రావాలి. నిజజీవితాలను తేల్చుకునే మేధావులు సలహాలు సంప్రదింపులు పాలకవర్గాలు పరిగణనలోకి తీసుకోవాలి. అమలుకు ఆచరణకు నడుముకట్టాలి. ఈ విధంగా రక్తపాతం అరికట్టబడుతుంది. సామాజిక విధ్వంసాలు చతికిలబడతాయి. చైతన్యవంతమైన శ్రామిక విప్లవం ద్వారానే వస్తు ఉత్పత్తిపెరుగుతుంది. పెట్టుబడిదారివర్గాల చేతుల్లో చిక్కివున్న మార్కెటును ప్రజాహితాన్నికోరే పాలకవర్గాల చేతుల్లోకి రావాలి. అప్పుడే మార్కెటు మాయ అంతమవుతుంది.
సాంకేతిక విప్లవం మాటున సామ్రాజ్యవాదుల దోపిడిని, గమనించలేక ఈమధ్య సాహిత్యరంగంలో కొన్ని శాంతికాముక, అహింసాశక్తుల్లా జ్ఞాననేత్రాన్ని నొసట వాల్చినట్లు మనోనేత్రాన్ని మూసుకొని, చేతులు ముడుచుకు కూర్చుని, భక్తిమార్గంలో భుక్తినెతుక్కుంటూ, పాలక వర్గాలు విదిల్చే ఎంగిలి మెతుకులకు సాగిలపడుతూ, సాయుధ విప్లవాన్ని కాంక్షించే వామపక్ష తీవ్రవాదులు సమాజంలో తీసుకురావాలని ఆకాంక్షించిన ‘సమూల మార్పుల్ని’ సాంకేతిక విప్లవం తీసుకువచ్చిందంటున్నారు. కాకపోతే దీన్ని దర్శించే చూపు, అంతర్నేత్రంతో అవగహనించుకునే వివేకం లేకుండా రక్తపాత విప్లవాలకు యింకా సమాయత్తమవడం పూర్తిగా అనాగరికంగా పేర్కొంటూ వ్యాసాలు రాస్తున్నారు. ‘‘విప్లవాత్మకంగా కార్యాచరణ ఉండడమంటే సమకాలీన సమాజాన్ని ఎగతాళి చేయడమే అవుతుందనే భావాన్నికూడా స్పష్టపరుస్తున్నారు. మానవ జీవితాన్ని ఓ కొత్త స్థాయకి తీసుకుపోతాయంటున్న సాంకేతిక పరిజ్ఞానమార్గాలు ఎవరి దోపిడికి సుమార్గాలుగా నిలుస్తున్నాయో ఈ మహానుభావులు గ్రహించలేరా? వామపక్ష తీవ్రవాదులు ప్రాణాలు పణంగాపెట్టే ఉద్యమంవైపు ఎందుకు దూసుకుపోతున్నారు? ప్రాణాలంటే తీపిలేకనా? జీవితంమీద ప్రేమలేకనా? అన్నీవున్న వీరు సామాజిక విధ్వంసక దోపిడిని అణచివేతను నిలువరించడానికి దేశస్పృహతో తెగించి ముందుకువస్తున్నారు. ప్రభుత్వాలు విప్లవకారుల కోర్కెల్లో వున్న సత్యాల్ని గ్రహించాలి. సమస్యలను చక్కదిద్దే దిశగా అడుగులువేయాలి. అన్నింటికి ప్రజలే సుప్రీం అని తెలిసీ ప్రజలకు ద్రోహం తలపెట్టే విధానాలను, సామాన్యజనాన్ని తప్పుత్రోవపట్టించి వారి ఆస్తులు లాక్కొని దరిద్ర నారాయణులుగా మార్చే చట్టాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. చైనా కమ్యూనిస్టుపార్టీలకున్న ‘సోయి’ భారతదేశంలోని కమ్యూనిస్టులకు లేదంటూ ఎద్దేవా చేసేది వీరే. సిద్ధాంత రహిత రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ ఏ గాలికి ఆ చాప ఎత్తుతూ అక్షరాల్లో అభ్యుదయాన్ని ఆరబోస్తూ బతుకీడవడం సోకాల్డ్ అభ్యుదయవాదులైన రచయితలకే చెల్లుతుంది. శ్రమదోపిడీ లేనిచోట రక్తపాతాలు ఉండవు. దోపిడీ విధానాలు పాలకపక్షం వైఖరిగా, దృక్పథంగా మారిపోతున్నప్పుడు రాజకీయ వ్యాపారం బరితెగించి ప్రజాస్వామ్యాన్ని నోట్లకట్టలతో వ్యాపారిస్తున్నప్పుడు తిరుగుబాటు ఏనాటికైనా తప్పదు. ఆ తిరుగుబాటును రక్తపాతంగా భావించి, శ్రీరంగ నీతులు చెప్తూ శాంతియుత అహింసా సిద్ధాంతాలను ముసుగు ధరించి బాధితుల నోరునొక్కడానికి ప్రయత్నించడం సాహిత్య కాలుష్యమే అవుతుంది. ఒకచో దేశద్రోహమూ అవుతుంది. ఏది ఏమైనా వర్తమాన సాహిత్యం ఎటు అడుగులు వేయాలో ఆలోచించాల్సిన అవసరం సాహితీవేత్తలందరిమీద ఉంటుంది.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, 9948774243