మెయన్ ఫీచర్

వెలుగు చాటిన తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్రాసు హైకోర్టులో సోమవారం వెలువడిన తీర్పుతో-ప్రాచీన విశిష్ట భాషలు (క్లాసికల్ లాంగ్వేజెస్)గా కేంద్ర ప్రభుత్వం పలువిడతలుగా గుర్తింపు ఇచ్చిన తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒడిసా భాషలన్నింటి పరువు నిలబడింది. పరువు అని ఎందుకు అంటున్నానంటే-ప్రజాభాషలన్నిటినీ విశిష్టమైనవిగా, సమానమైనవిగా గుర్తించాలనే శాస్ర్తియ సూత్రాన్ని విస్మరించి, రాజకీయ వత్తిడులకు తలొగ్గి 2004, అక్టోబర్ 12న భారత సర్కారులోని గృహమంత్రాలయం వారిచ్చిన ప్రకటన భాషా రాజకీయాల తుట్టెను కదపడంతోనే ఈ గొడవ మొదలైంది. ద్రావిడ మూలాల నుంచి కాలక్రమంలో విడివడి స్వతంత్ర భాషలుగా నిలదొక్కుకున్న వాటిలో మొదటిదైన తెలుగు భాషీయులకు, సోదర భాష అయిన కన్నడ ప్రజలకూ అవమాన భారాన్ని కలిగించిన ఆ ప్రకటన తర్వాత వారి మొరలను ఆలకించకుండానే 2005 నవంబరు 25న మరొక నోటిఫికేషన్ ద్వారా సంస్కృతాన్ని కూడ క్లాసికల్ లాంగ్వేజ్‌గా ప్రభుత్వం ప్రకటించింది. పుండుమీద కారం అద్దినట్లు భావించిన తెలుగు, కన్నడ ఉద్యమకారులు పెద్ద యెత్తున ఉద్యమాన్ని సాగించారు.
తెలుగుకు సంబంధించినంతవరకు తెలుగు భాషోద్యమ సభ్యులు 2006, ఫిబ్రవరి 21న హైదరాబాదులో చేసిన నిరాహార దీక్షా కార్యక్రమంలో ఉద్యమం ఒక మలుపు తిరిగింది. ఆ మర్నాడు శాసనసభలో నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తెలుగుకు క్లాసికల్ భాషా ప్రతిపత్తి కోరుతూ ప్రయివేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చివరకు ప్రభుత్వం అధికార తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఏకగ్రీవంగా సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసింది. అక్కడినుంచి మరి రెండున్నరేళ్ల ఉద్యమం అనేక రకాలుగా ప్రభుత్వంపై వత్తిళ్లను పెంచింది. చివరకు 2008, అక్టోబర్ 31న కేంద్రం నుండి తెలుగుకూ, కన్నడానికి కూడా క్లాసికల్ ప్రతిపత్తినిస్తూ ప్రకటన వెలువడింది,.
ఈ ప్రకటనలు రావడంతోనే కడుపు మండిన తమిళ సోదరులు కొందరు గాంధీ అనే ఒక న్యాయవాది చేత మద్రాసు హైకోర్టులో దావా వేశారు. తెలుగుకూ, కన్నడానికి ఈ హోదా ఇవ్వడానికి అర్హత లేదని వాళ్ల వాదన. ఆ వ్యాజ్యం సుమారు 8 ఏళ్లు గడిచి, ఇప్పటికి తీర్పు వెలువడింది. తీర్పు సారాంశమేమంటే తమిళానికి క్లాసికల్ హోదా ఇచ్చిన కమిటీయే తక్కిన భాషలకూ ఇచ్చిందనీ, కనుక ఇందులో తాము చెప్పేదేమీ లేదు గనుక, మీ గొడవంతా ఆ కమిటీతోనే తేల్చుకోమని దావాను కోర్టు కొట్టేసింది. ఈ ఎనిమిదేళ్ల వ్యవధిలో చాలా కథ నడిచిపోయింది. మాకూ హోదా ఇవ్వాల్సిందేనని ముందు మలయాళం వారు తర్వాత ఒడిసావారు ప్రభుత్వాన్ని నిలదీశారు. వారికీ ఆహోదాను ఇచ్చేసింది ప్రభుత్వం.
అసలు ఈ క్లాసికల్ భాషా రాజకీయం ఎం దుకు, ఎక్కడ, ఎలా మొదలైందో నాలుగు మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం తప్పుకాదు. 2004లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో డిఎంకె పార్టీ తమిళానికి ఈ ప్రాచీన విశిష్ట హోదాను సంపాదిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. తమిళభాష పట్ల దాని ప్రాచీనత పట్ల, విశిష్టత పట్ల వారికి ఉన్న పట్టుదల ఆదరణ తెలిసిందే. రాయిపుట్టి, మన్నుపుట్టకముందే పుట్టిన శ్రేష్టమైన తొలి భాష తమిళం అని ద్రావిడ భాషావాదులు ప్రచారంలో పెట్టిన నమ్మకాన్ని సాక్షాత్తు ఒక జి.ఒ.లో తమిళనాడు ప్రభుత్వం ఉటంకించిందంటే చాలామంది ఆశ్చర్యచకితులు కావచ్చు.
2006లో తమిళాన్ని నిర్బంధ బోధనాంశం చేస్తూ తమిళనాడు వెలువరించిన జి.ఒ. ఈ ఉటంకింపుతోనే మొదలవుతుంది. అందువల్లనే 2004లో కేంద్రంలో ఏర్పడిన యుపిఎ ప్రభుత్వంలో భాగంగా చేరిన డిఎంకె, యుపిఎ నుంచి రాబట్టిన కనీస కార్యక్రమంలో కూడా తమిళ క్లాసికల్ ప్రతిపత్తినిస్తామనే హామీని రాబట్టిందనే వాస్తవాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని అది రాజకీయంగా ద్రవిడ పార్టీల మధ్య పోటీలో ఇది ఒక ముఖ్యాంశం. దానికనుగుణంగానే డిఎంకె మంత్రులు ప్రత్యేకించి ప్రభుత్వం చేత క్లాసికల్ లాంగ్వేజెస్ అనే ఒక వర్గీకరణను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొని, ముందుగా తమిళానికిచ్చి, ఆ తరువాత సంస్కృతానికున్న ప్రతిష్టను కాపాడుకోవడానికి దానికీ ప్రతిపత్తినిచ్చారు. ద్రావిడ వాదులు దాన్ని కూడా అంగీకరించలేరు కాని, వ్యూహాత్మకంగా మిన్నకుండి, ఆ తర్వాత తెలుగుకు, కన్నడానికి, క్లాసికల్ హోదానివ్వగానే రెచ్చిపోయి హైకోర్టులో వ్యాజ్యానికి దిగారు. సరే. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ (సమైక్య) ప్రభుత్వం తరపున ఎబికె ప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు మద్రాసు హైకోర్టులో తెలుగు తరపున సమాధానాన్ని సమర్పించారు. ఆ తర్వాత కొన్ని వాయిదాల కాలక్షేపం అయ్యేనాటికి రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు జరిగిపోయింది. ఉభయ రాష్ట్రాల తరపున సంయుక్తంగా ఒక న్యాయవాది వాదించారు. మద్రాసుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు తూమాటి సంజీవరావు కూడా ఈ వ్యాజ్యంలో తెలుగు తరపున జోక్యం చేసుకొని ఏకవ్యక్తి సైన్యంగా పనిచేశారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చివరిదశలో తగినంతగా శ్రద్ధ వహించలేదనేది నిజం. కొంతలోకొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటె తెలంగాణ ప్రభుత్వమే క్రియాశీలకంగా వ్యవహరించిందని చెప్పుకుంటే అది అబద్ధం కాదు. మొత్తం మీద ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టు-గండం గడిచింది పిండం బయటపడిం ది! ఇందుకు మన రెండు ప్రభుత్వాల్లో ఎవరూ ఎదోకష్టపడిపోయినట్లు, విజయం సాధించనట్లు ఆనందపడిపోనక్కరలేదు.
దివంగత భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఈ క్లాసికల్ స్టేటస్‌ను నిర్ణయించే కమిటీలో కీలక వ్యక్తుల్లో ప్రముఖుడు. ప్రభుత్వం చెప్పినట్టు ఆ కమిటీ ముందు తమిళానికి ఇచ్చేసింది, ఆ తర్వాత సంస్కృతానికి న్యాయం చేసింది అంటూ నే తక్కిన భాషలకూ తలుపులు తెరచిపెట్టేట్లు, అనుకూలతలను లభించేట్లు గానే అర్హత నిబంధనలను రూపొందించినట్లు ఆయన నాతో ఒకసారి అన్నారు. విజయవాడలో జరిగిన సభలో కూడా ఆయన నర్మగర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. ఈ కేసు వీగిపోనుందని, కమిటీదే తుది నిర్ణయమని, కోర్టు దానే్న చెప్తుందని ఆయన కనుమరుగవ్వడానికి కొన్నాళ్ల ముందు నాతో అన్నారు. ఇప్పుడదే జరిగింది. అందువల్ల ఈ మొత్తం కథలో గర్వించాల్సింది-ప్రభుత్వాలు కాదు, పేర్లు చెప్పుకోవలసి వస్తే- ముందుగా తెలుగు భాషోద్యమ సమాఖ్యతోపాటు, 2003 నుంచే ఈ అంశాన్ని బయటకు తెచ్చి చివరిదాకా తానే ఒక ఉద్యమంగా పనిచేసిన ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికనూ, అన్ని పత్రికా ప్రసార మాధ్యమాలనూ, కృష్ణాజిల్లా రచయితల సంఘంతో పాటు తక్కిన రచయితల సంఘాలను, రాష్ట్ర ప్రభుత్వం తరపున పనిగట్టుకొని కృషి చేసిన మండలి బుద్ధప్రసాద్, ఎబికె ప్రసాద్‌లను చెప్పుకోవాలి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం వారూ, ఇంకా అనేకమంది పండితులు, తెలుగుతల్లి ముద్దుబిడ్డలు చేసిన కృషి దీనివెనుక ఉంది. కోర్టు వ్యాజ్యంలో ఒక్కడే వెంటాడుతూ, మన ప్రభుత్వాల ప్రతినిధులకు కూడా సలహాదారుడై పోరాడిన తూమాటి సంజీవరావును అభినందించాలి.
కమిటీ నిర్ణయాల్నే ఖాయం చేసేశారు కనుక ఇక-ఈ నేను న్యాయరంగంలో ముం దుకు జరిగేదేమీ లేదు. తమిళ ప్రత్యేక జాతీయత అనే తీవ్రవాదానికి ఒక మెట్టుగా భాషకు, అంతర్జాతీయతను సాధించుకోవాలనే తమిళుల పట్టుదలకు ఈ తీర్పువల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. వారి పనిని వారు చేసుకుపోతూనే ఉన్నారు. వారు తమిళాన్ని ప్రాచీన విశిష్ట భాషగానే కాదు, ఒక అధునాతనమైన భాషగా కూడా రూపొందించుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష ఆధిపత్యవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొంటూ దానితో సహజీవనం చేయగలుగుతున్నారు. అక్కడ తమిళం గర్వంగా తలెత్తుకొని నిలబడుతూనే, అన్ని రంగాల్లో తన బావుటాను నిలబెట్టుకొంటూనే, ఆంగ్లానికి అవసరమైనంత చోటు ఇస్తున్నది. ఆవిధంగా అక్కడ రెండు భాషల సూత్రం స్థిరపడిపోయింది.
2008 అక్టోబరు 31న తెలుగు కన్నడాలకు కూడా క్లాసికల్ ప్రతిపత్తినిచ్చిన తర్వాత మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ (సిఐఐఎల్)లో తెలుగుకు, కన్నడానికి విడివడిగా పరిశోధనా సంస్థలను స్థాపించి, పనిని కొనసాగించడానికి ఉత్తర్వులుచ్చేశాయి. ఇందుకు కావలసిన నిధుల విడుదల కూడా జరిగిపోయింది. ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తెలుగు’ పేర 2010నుంచీ ఒక వ్యవస్థను రూపొందించే పనీ మొదలైంది. నిజానికి అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పురందేశ్వరి మైసూరులో ఒకే రోజున తెలుగు, కన్నడ భాషల పరిశోధనా సంస్థలనూ ప్రారంభించాలని సమయ నిర్ణయం జరిపోయింది. ఇంతలో-
తెలుగువాళ్లకు చెందిన సంస్థ మైసూరులో ఎందుకుండాలి? అది తెలుగనేలపైనే ఉండాలనే డిమాండును యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముందుకు తెచ్చారు. ఆయనను పలువురు సమర్ధించారు కూడ. దానితో మైసూరులో తెలుగు పరిశోధనా సంస్థ వాయిదా పడింది. కన్నడ కార్యక్రమం మొదలై నిరాటంకంగా సాగిపోతున్నాయి. తెలుగుకోసం వచ్చే నిధులు ఎటుపోతున్నాయి? మురిగిపోతాయి కదా- అయితే తెలుగుకు ఏమీ చెయ్యలేదనకుండా మైసూరులోని సిఐఐఎల్ వారు ఏదో మొక్కుబడిగా సమావేశాలు ప్రచురణలూ చేస్తున్నారట. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? మైసూరులోనే తెలుగు పరిశోధనా సంస్థను కూడా ప్రారంభించితే బాగుండేది కదా. ఇదంతా మనకు మనమే చేసుకున్నామని కొందరు బాధపడుతున్నారు.
తెలుగుకు క్లాసికల్ హోదా ఇచ్చినా, పనులు కాకపోవడానికి హైకోర్టులో ఉన్న వ్యాజ్యం కారణం అనే ప్రచారం కొందరి బుర్రలకెక్కేసింది. అయితే నిజం ఏమిటంటే ఆ కోర్టుతీర్పునకు లోబడే ఈ హోదానిస్తున్నామని కేంద్రం ఎన్నడో కోర్టుకు స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక సహాయాన్ని అడ్డుకొనే ఆదేశాలను, కోర్టు ఇవ్వలేదు. కనుక-పరిమితమైన ప్రణాళికతో, నిధులతో కొంత పని గత అయిదేళ్లలో జరిగి వుండేది. మనకు మనం మైసూరులో పరిశోధనా సంస్థ ఏర్పాటును అడ్డుకోకుండా ఉంటే..కాదు కాదు, ఆ సంస్థను నాటి ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనో మరో చోటనో ఏర్పాటు చేసుకొని ఉంటే, ఇప్పటికే ఎంతో పని జరిగి ఉండేది.
అయితే ఇదంతా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం వారి పట్టనితనం వల్ల, చేతగాని తనం వల్ల జరిగిపోయింది. ఆ సంస్థకోసం కేవలం ఒక పెద్ద భవనం, మరికొన్ని ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంతకుమించి ఒక్కపైసా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన అవసరం లేదు. నియామకాలు, నిర్వహణ అంతా మైసూరులోని సిఐఐఎల్ వారిదే. ఇందులో ఎవ్వరికీ జోక్యంచేసుకునే వీలు లేదు.ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. రాష్ట్రం రెండు రాష్ట్రాలైంది. కొంత స్థలాన్ని, ఒక భవనాన్ని ఇందుకోసం ఇవ్వడం చేతగాని ప్రభుత్వాలు మనల్ని పరిపాలిస్తున్నాయి. దీనికి ఎవరిది బాధ్యత?

-డాక్టర్ సామల రమేష్ బాబు (తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు) సెల్: 9848016136