మెయన్ ఫీచర్

పేటెంట్ చట్టాలపై అవగాహన ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాలను తలదన్ని వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న భారత్- అంతర్జాతీయ మార్కెట్ వ్యూహాలకు అనుగుణంగా తక్షణ స్పందనలో జాప్యం కారణంగా తీవ్ర మార్కెట్ ఒడిదుడుకులను, అంతర్జాతీయ విపణి వేదికపై ప్రతికూలతను ఎదుర్కొంటోంది. మన దేశంలో సృజనాత్మకత, వినూత్న శక్తులు అపారంగా ఉన్నా, అందరికీ మెరుగైన ప్రకాశవంతమైన భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఆసన్నమైంది.
నాణ్యతలో విశ్వవ్యాప్త ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉత్పత్తులను అందించగలిగే సామర్ధ్యాలను అందుకున్న భారత్- మార్కెట్ ఎత్తుగడల్లో కీలకమైన మేధో సంపత్తి హక్కుల రంగంలో శాస్ర్తియమైన వ్యూహరచనలో వెనుకంజలో ఉంది. ఫలితంగా తరతరాలుగా భారత్ సొంతమైన అనేక హక్కులను విదేశాలు తేలికగా చేజిక్కించుకుంటున్నాయి. ప్రధానంగా వ్యవసాయం, ఉద్యానవన రంగంతో పాటు ఔషధ రంగం, హస్తకళలు విషయంలో భారత్ పట్టుకోల్పోతోంది. లాభం చేకూర్చే సరికొత్త ఆలోచనలను ఇతరులు తస్కరించే వీలుందనుకున్నపుడు పేటెంట్ల కోసం వెళ్లాల్సిందే. ఆ ఒక్క పనీ భారతీయులు చేయలేకపోతున్నారనేది నిర్వివాదాంశం. భారత్‌లోనే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోదు, ప్రధానంగా అమెరికాలోని యూఎస్ పీటీఓతో పాటు ఏ దేశంలో మార్కెట్ ఎక్కువ ఉంటుందో ఆ దేశంలో పేటెంట్‌ను కూడా పొందాల్సి ఉంటుంది. భారత్ ఇపుడిపుడే కొన్ని దేశాలతో మేధో సంపత్తి హక్కులపై ఒడంబడికలను కుదుర్చుకుంటోంది. ఆయా దేశాల్లో మన పేటెంట్లు చెల్లుబాటు అవుతాయి, కొన్ని దేశాలు అసలు ‘ట్రిప్స్’లో సభ్యత్వమే పొందకపోవడం వల్ల మన పేటెంట్ హక్కులు అక్కడ చెల్లుబాటు అయ్యే అవకాశమే లేదు. కనుక ప్రతి దేశంలో ఉన్న నిబంధనలను సమగ్రంగా అర్థం చేసుకోవల్సి ఉంటుంది.
1793లోనే అమెరికా చట్టసభల సభ్యుడు థామస్ జఫర్‌సన్ పేటెంట్ చట్టాన్ని రూపొందించారు. మనం దాదాపు 150 ఏళ్ల తర్వాత మేల్కొన్నాం. భారత్‌లో కాపీరైట్ చట్టం తొలుత 1957లో వచ్చింది. 1958లో కాపీరైట్ బోర్డు ఏర్పాటైంది. 1967లో నిర్వహించిన వైపో అవగాహన ఒప్పందం, 1986 బెర్న్ సదస్సు, 1986 నాటి ట్రిప్స్ అగ్రిమెంట్ దృష్టిలో ఉంచుకుని పెటేంట్ చట్టంలో 1983, 1984, 1991, 1993, 1994, 2012లో చట్టంలో అనేక మార్పులు జరిగాయి. 2013లో కాపీరైట్‌పై సమగ్ర నిబంధనలు వచ్చాయి. ఇండియన్ పేటెంట్, డిజైన్ యాక్టును 1911లో తీసుకువచ్చారు. 1957లో జస్టిస్ రాజగోపాల్ అయ్యంగార్ నేతృత్వంలోని ఒక కమిటీ పేటెంట్ అంశంపై సమగ్ర అధ్యయనం చేసింది. 1970లో పేటెంట్ చట్టం వాడుకలోకి వచ్చింది. 2005లో పేటెంట్ చట్టాన్ని సవరించారు. అంతకంటే ముందు 2003లో ట్రేడ్ మార్కు చట్టం అందుబాటులోకి వచ్చింది. 2000లో డిజైన్ చట్టం, 2001లో ప్లాంట్ వెరైటీ చట్టం, 2002లో బయో డైవర్సిటీ చట్టం, పారిస్ కనె్వన్షన్ తర్వాత 1999లో ట్రేడ్ మార్క్సు చట్టం వచ్చింది దానిని 2003లో సవరించారు. ఉత్పత్తి రంగంపైనే దృష్టి సారించిన సంస్థలు తరచూ మారుతూ వస్తున్న చట్టపరమైన ఈ నిబంధనలు గమనించకపోవడం, అంతర్జాతీయ విపణిలో చోటు చేసుకుంటున్న సరికొత్త ఒడంబడికలు, నియమాలపై అవగాహన పెంచుకోకపోవడంతో ఈ నష్టం తీవ్రంగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో సామన్యులకు తెలియకుండానే వేల కోట్ల రూపాయల అప్పుల ఊ బిలో కూరుకుపోయి కనుమరుగవుతున్నాయి.
అవగాహన పెంచుకున్న అభివృద్ధి చెందిన దేశాలు మిగిలిన దేశాల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక ఉత్పత్తి మార్కెట్‌లోకి రాకముందే అమెరికా వంటి అగ్రదేశాలు హక్కులను కొట్టేస్తున్నాయి. ప్రశ్నించేలోగానే మన మేధో సంపత్తి వారి చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఈ క్రమంలోనే భారత్‌లో సైతం సంస్థాగత యంత్రాంగం ఏర్పాటైంది. ప్రపంచంలో అత్యుత్తమ పద్ధతులను భారతదేశ పరిస్థితులకు తగ్గట్టు అనసరించేలా ఒక దార్శనిక పత్రాన్ని కూడా కేంద్రం రూపొందించింది. నూతన సృజనలకు అనువైన వాతావరణాన్ని ఏర్పరచడంలో ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన - అభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విశిష్ట పరిశోధనా కేంద్రాలు, బహుళజాతి కార్పొరేట్ సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు ఉమ్మడి సహకారం అందిస్తున్నాయి. మేధో సంపత్తి హక్కుల రక్షణకు సువ్యవస్థితమైన ‘ట్రిప్స్’కు తులతూగే శాసనబద్ధమైన, పాలనాపరమైన, న్యాయపరమైన నియమ నిబంధనలను భారత్ రూపొందించుకోవడమేగాక, అంతర్జాతీయంగా అనివార్యమైన విధులను నిర్వహిస్తూనే ఐపీఆర్‌ల వికాసానికి కృషి చేస్తోంది. ఐపీ సంబంధిత శాసనాలకు, సమన్వయానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వరకూ అంతా బాగానే ఉన్నా, దాని పనితీరును, దేశవ్యాప్త చైతన్యాన్ని పెంచేందుకు పర్యవేక్షణ, సమీక్షలో జరుగుతున్న లోపం కారణంగా భారత్ అనుకున్న ఫలితాలను సాధించలేకపోతోంది.
దీనికి తాజా ఉదాహరణ పేటెంట్స్, డిజైన్లు, ట్రేడ్ మార్కులు, జాగ్రఫికల్ ఇండికేటర్స్ కంట్రోలర్ జనరల్ విడుదల చేసిన వార్షిక నివేదికే. 2016-17లో అమెరికాకు చెందిన చిప్ ఉత్పత్తిదారులు క్వాల్‌కామ్ సంస్థ 1840 పేటెంట్ దరఖాస్తులను చేసింది. అదే మిగిలిన సంస్థలు అన్నీ కలిపి 781 దరఖాస్తులు చేశాయి. భారత్‌లో 44,444 పేటెంట్ దరఖాస్తులు రాగా, అందులో 29 శాతం మాత్రమే భారతీయలు దాఖలు చేసినవి. 71 శాతం విదేశీయులు దాఖలు చేసినవే. అమెరికా నుండి 8981 దరఖాస్తులు రాగా, జపాన్ నుండి 3399 వచ్చాయి. భారత్‌లో అతిపెద్ద పరిశోధనా సంస్థలు ఆరున్నాయి. వాటి నండి వచ్చిన దరఖాస్తులు కేవలం 781 మాత్రమే. శామ్‌సంగ్ సంస్థ 706 దరఖాస్తులు చేయగా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్స్‌పై 1840 దరఖాస్తులు పంపింది. పేటెంట్ల సంగతి వినగానే అతి పెద్ద సంస్థలు ఆయా ఉత్పత్తులపై ఎలాంటి హక్కులు లేకుండా ముందుగానే కొంత మంది మేధావులు వాటిని అడ్డుకుంటున్నారు. ఆ ఉచ్చులో భారత్ కూడా పడుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు దశాబ్దల తరబడి చేసిన పరిశోధనల ఫలితాలు మార్కెట్‌లోకి తెచ్చే దశలో ఉన్నా, వాటిని మాత్రం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. ప్రైవేటు రంగంలో ఉన్న బహుళజాతి సంస్థల మార్కెట్‌ను కాపాడేందుకు, మెహర్బానీ కోసమే కేంద్ర సంస్థలకు అనుమతి జారీ చేయకుండా అడ్డుకుంటున్నాయి.
భారత్‌లో ఒక పేటెంట్ దరఖాస్తు వివిధ దశలు దాటి హక్కుగా జారీ కావడానికి నాలుగేళ్లు పడుతోంది. ఈ నాలుగేళ్లలో లోతైన సాంకేతిక అంశాల్లో ఏ మాత్రం లోపాలు ఉన్నా వాటిని విదేశీయులు ఎగరేసుకుపోవడం ఖాయం. అందుకే ఉత్పత్తి పూర్తి రూపంలోకి రాకముందే అంటే ఆలోచన దశలోనే దానిని పేటెంట్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి చేతికి అందే సమయానికి పేటెంట్ హక్కులు కూడా వచ్చేస్తాయి. రెన్యూవల్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ హక్కులు మరొకరు పొందే వీలుంది, వీటన్నింటినీ గుర్తించి భారతీయ పరిశోధనా సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మార్కెట్‌కు తీవ్రమైన నష్టం వాటిల్లడమేగాక, ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో పేటెంట్లకు విదేశీ కంపెనీలు ఎగబడుతున్నాయంటే దేశీయ సంస్థల ఉత్సాహం, ఔత్సాహికత ఏ తీరుగా ఉందో చెప్పకనే అర్థవుతోంది.
భారతదేశంలో చురుకైన , ఎప్పటికపుడు స్పందించే సమతుల్యమైన మేధోసంపత్తి హక్కుల వ్యవస్థను నెలకోల్పాలి. దాని ద్వారా సృజనను నవకల్పనను ప్రోత్సహించాలి, ఔత్సాహిక పారిశ్రామికులను వెన్నుతట్టాలి. సామాజిక ఆర్థిక , సాంస్కృతిక వికాసాన్ని పెంచి పోషించాలి. విజ్ఞాన పరంగా కీలక ప్రాముఖ్యం ఉన్న ఇతర రంగాలతో పాటే ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణల పరిధిని విస్తృతం చేయడంపై శ్రద్ధ కనబరచాలి. ఐపీఆర్‌ల వల్ల ఒనగూడే ఆర్థిక, సాంస్కృతిక ,సాంఘిక ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఐపీఆర్‌ల సృష్టి మేధో సంపత్తి హక్కులను సృష్టించుకోవడాన్ని ప్రోత్సహించాలి. చట్టం, చట్ట సంబంధమైన స్వరూపాల నిర్మాణం- శక్తివంతమైన సమర్ధవంతమైన మేధో సంపత్తి హక్కు చట్టాల రూపకల్పన , యాజమాన్య హక్కుల ప్రయోజనాలు, విశాల ప్రజాహితానికి మధ్య సమతూకమైన చట్టాలను రూపొందించుకోవాలి. పరిపాలనా నిర్వహణ విషయానికి వస్తే ఐపీఆర్ పాలన సేవా ప్రధానమైనదిగా ఉండాలి, తద్వారా వాటి విలువను రాబట్టగలగాలి. మేధో సంపత్తి రంగంలో బోధన, శిక్షణ, పరిశోధన ఇంకా నైపుణ్యాల వికాసానికి అనువైన మానవ వనరులను, సంస్థలను బలోపేతం చేయడం విస్తృత పరచడం ముఖ్యం.
అందరి ప్రయోజనాల కోసం మేధో సంపత్తి అండదండలతో సృజనాత్మకత, నవకల్పనలకు ప్రేరేపణ కలిగించడం, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలు, కళలు, సంస్కృతి, సంప్రదాయ విజ్ఞానం, జీవ వైవిధ్య వనరులు పురోగతికి మేధో సంపత్తి దోహదం చేయడం, అభివృద్ధి విజ్ఞానం ప్రధాన చోదక శక్తిగా నిలవడం, సముపార్జించిన జ్ఞానాన్ని పంపిణీ చేయడం - వీటన్నింటికీ నిలయంగా భారత్‌ను రూపొందించడం తక్షణ కర్తవ్యం.

-- బీవీ ప్రసాద్ 98499 98090