మెయిన్ ఫీచర్

ధైర్యం ఎప్పుడూ సత్యం పక్కనే ఉంటుంది( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అనేక శాస్ర్తియ ఆధారాలతో కనుక్కున్న వాస్తవాన్ని కూడా కాదని పోప్ ఎందుకు గెలీలియోను అలా బలవంతపెట్టాడు? దీనిపై మీ అభిప్రాయమేమిటి?’’అని నేను ప్రముఖ క్రైస్తవ ధర్మప్రచారకుడైన స్టేన్లీ జోన్స్‌ను మాటల సందర్భంలో అడిగినప్పుడు ఆయన ‘‘అలా మార్చకపోతే అనేక చిక్కులు వస్తాయి. ఎందుకంటే, బైబిల్ దేవుడిచ్చిన అతి పవిత్ర గ్రంథం. అందులో ఒక విషయం తప్పుఅయితే, తక్కిన విషయాలు తప్పు కావని ధైర్యంగా ఎలా చెప్పగలం? కాబట్టి, బైబిల్‌లో ఉన్న విషయాలను ఏమాత్రం మార్చలేము, తీసెయ్యలేము. అలాగే దానికి ఏ విషయాన్ని జోడించలేము.
కానీ, గడచిన మూడు శతాబ్దాలలో బైబిల్‌కు వ్యతిరేకంగా ఉన్న అనేక విషయాలను మనిషి తెలుసుకున్నాడు. నిజానికి, చైతన్యపరంగా మీరు ఎదిగినట్లుగానే, రెండు వేలు లేదా ఐదువేల సంవత్సరాల క్రితం రాసిన వాటిని కాలానుగుణమైన మార్పులతో నిరంతరం అభివృద్ధిచేస్తూ నూతన సంచికలను ఉత్పత్తిచేయవలసిన అవసరం ఉందని మీరు తప్పక తెలుసుకుంటారు. ఎందుకంటే, ధైర్యం ఎప్పుడూ సత్యం పక్కనే ఉంటుంది. కానీ, అంత పని చెయ్యగల ధైర్యం ఏ మతానికి లేదు. క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు, యూదులు, బౌద్ధులు, జైనులు- ఇలా అన్ని మతాల మనుషులు ఒకేలా ఉన్నారు. ఎందుకంటే, ఎవరి మనస్తత్వాలలోనూ ఎలాంటి మార్పులేదు. గుర్తుంచుకోండి: గతం, భవిష్యత్తుల నుంచి స్వేచ్ఛ పొందిన మనిషి మాత్రమే పరిపూర్ణ స్వేచ్ఛాపరుడు.
తమ తండ్రి మరణించబోతున్నాడన్న విషయం తెలిసిన వెంటనే అత్యధిక ధనవంతులైన అతని నలుగురు కొడుకులు తండ్రిని చూసేందుకు వచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ వృద్ధుడు మరణించే సమయం సమీపిస్తోంది. కానీ, దాని గురించి ఏమాత్రం పట్టించుకోని ఆయన కొడుకులు ‘‘తండ్రి చనిపోయిన తరువాత ఆయన శవాన్ని శ్మశానానికి ఎలా తీసుకెళ్ళాలి?’’ అని చర్చించుకుంటున్నారు.
‘‘నాన్నకు ‘రోల్స్ రాయిస్’ కారులో తిరగాలని ఉండేది. కానీ, ఎంత డబ్బున్నా ఆయన ఆ కోరిక తీర్చుకోలేదు. మనదగ్గర కూడా చాలా డబ్బుంది. కాబట్టి, కనీసం ఇప్పుడైనా ఆయనను కొత్త ‘రోల్స్‌రాయిస్’ కారులో శ్మశానానికి తీసుకువెళ్ళి తీరని ఆయన కోరికను తీరుద్దాం’’ అన్నాడు ఆ నలుగురిలో ఒకడు.
‘‘శ్మశానానికి ఎందులో తీసుకెళ్తున్నామో చనిపోయిన నాన్నకు తెలియదు. కాబట్టి, అందుకోసం కొత్త ‘రోల్స్ రాయిస్’ కారు కొనడం డబ్బు వృథాచెయ్యడమే అవుతుంది. కనీసం దానిని అద్దెకు తీసుకురావడం కూడా దండగే. నన్నడిగితే ఆయన శవాన్ని ఒక అద్దె ట్రక్కులో తీసుకువెళ్తే చాలు. నువ్వు చిన్నవాడివి. డబ్బు విలువ నీకు తెలియదు’’ అన్నాడు రెండవ కొడుకు.
‘‘నీకు తెలివి లేదు. అద్దె ట్రక్కుకూడా దండగే. శవాన్ని బయటపెడితే చాలు. పురపాలక పారిశుధ్య కార్మికులు పొద్దున్న చెత్తతోపాటు నాన్న శవాన్ని కూడా చెత్త లారీలో ఉచితంగా తీసుకుపోతారు. శవానికి- రోల్స్‌రాయిస్’కారు, అద్దె ట్రక్కు, చెత్తలారీ- ఏ వాహనమైనా ఒకటే’’ అన్నాడు మూడవ కొడుకు.
అన్నీ విన్న ఆ వృద్ధుడు ‘‘నా చెప్పులెక్కడ?’’ అన్నాడు కొడుకులతో.
‘‘అవి ఇప్పుడెందుకు?’’ అన్నారు కొడుకులు ఆయనతో.
‘‘నేను చనిపోయేందుకు ఇంకా కొంచెం సమయముంది. ఈలోగా నేను నడుచుకుంటూ శ్మశానానికిపోతాను. అది పైసా ఖర్చులేని పని. మీరందరూ మరీ పిసినారులు’’ అన్నాడు ఆ వృద్ధుడు.
అందరికీ డబ్బు, పరువు, ప్రతిష్టలు ఉండవచ్చు. అవన్నీ ఎవరికివారు వేసుకున్న బంగారు సంకెళ్ళే. కానీ, సంకెళ్ళు ఎంత బంగారంతో చేసినవే అయినా అవి కూడా బంధించే గొలుసులే. గమనిస్తే, మానవజాతి గతమంతా మరింత మెరుగైన సంకెళ్ళ తయారీకే అంకితమైనట్లనిపిస్తుంది.
స్వేచ్ఛ మీ వ్యక్తిగత వ్యవహారం. అంతేకాదు, అది పూర్తిగా ఆత్మగతమైనది. మీరు మీ గతానికి సంబంధించిన చెత్తను, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఆశలు, ఆశయాలను త్యజించిన మరుక్షణం ఎగిరే పక్షికి ఆకాశం సొంతమైనట్లు పూర్తిస్వేచ్ఛ మీ సొంతమవుతుంది. బహుశా, ఆకాశం కూడా మీకు హద్దుకాదు.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్