మెయిన్ ఫీచర్

ఓటు ఒక ఆయుధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో మహిళా సాధికారత సాధించే ప్రయాణంలో, రాజకీయంగా ఎన్నికలలో పాల్గొనటానికి ఓటు వేసే హక్కు పొందటం మహిళకు ఒక ఆయుధమైంది. పోరాటాలతో విశ్వవ్యాప్తంగా మహిళలు ఓటు హక్కు పోరాడి సాధించుకోవటం నాడు తప్పలేదు. సఫ్రేజెట్టి అంటే, మహిళలకు ఓటు హక్కు కోసం ఉద్యమించిన ఆమెకు, పర్యాయ నామంగా గుర్తింపు వచ్చింది. బ్రిటన్ దేశపు ఆధిపత్యంలోని కాలనీ, న్యూజిలాండ్‌లో స్వయంపాలనా వ్యవస్థ వుండటంతో 1893లో ప్రపంచంలో ప్రప్రథమంగా వయోజన మహిళ ఓటు హక్కు పొందింది. 19వ శతాబ్ద మధ్యకాలంలో యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ దేశాలలో మహిళలు ఎన్నికలలో ఓటు, పోటీ చేసే హక్కుల కోసం ఉద్యమాలు చేశారు. 1867లో బ్రిటీష్ పార్లమెంటులో ‘జాన్ స్టార్ మిల్’ పురుషులతో సమానంగా స్ర్తిలకు ఓటుహక్కు సంక్రమింపజేయాలనే చట్టసవరణ ప్రతిపాదనను పార్లమెంటులో 193 ఓట్లు వ్యతిరేకంగా, కేవలం 73 ఓట్లు అనుకూలం కావటంతో ఓటమి పాలైంది. 1897లో బ్రిటన్‌లో ‘మిల్లిసెంట్ ఫాసెట్ట్’ నాయకత్వంలో సప్రాజిస్ట్‌లు, ఎన్.యు.డబ్ల్యు.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో, శాంతియుత పోరాటం కొనసాగించారు. ‘నేషనల్ యూనియన్ ఆఫ్ ఉమెన్స్ సఫ్రేజ్’ సొసైటీలు, కేవలం మధ్యతరగతి మహిళలకు పరిమితమై మితవాద ధోరణులతో వుండటం కారణంగా ‘ఎమ్మిలైన్ పాన్‌ఖురస్ట్’, సఫ్రాజెట్టీలుగా తీవ్రవాద పోరాటం, ‘మాటలు కాదు చేతలు’ నినాదంతో ఓటుహక్కు ఉద్యమాలు 1903లో చేపట్టారు. 1914 యుద్ధ కాలంలో యుఎస్‌లోని అధికారంలో వున్న డెమోక్రటిక్ పార్టీపై ఒత్తిడి తెచ్చారు. రెండేళ్ళ తరువాత నేషనల్ ఉమెన్స్ పార్టీ ఏర్పడి వైట్‌హౌస్ ఎదుట నిరసనోద్యమాలు ఆరంభించింది. 1818లో బ్రిటీష్ పార్లమెంటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టం 30ఏళ్ళ పైబడి ఆస్తి ప్రాతిపదికన చట్ట ప్రకారం సభ్యులుగా మహిళలకు అవకాశం కల్పించింది. 1920నాటికి యుఎస్, 19న సవరణ ప్రకారం పౌరులందరికీ ఓటు హక్కు లభించి డెన్మార్క్, జర్మనీ, కెనడాలలోకూడా మహిళలు ఓటు హక్కు పొందారు.
1928లో యుకె పార్లమెంటు, 1944 ఫ్రాన్స్ మహిళలకు ఓటు హక్కు లభింపజేశాయి. 1950లో బ్రిటీష్ పాలన నుంచి స్వతంత్రం పొందిన భారతదేశం, ఆఫ్రికా వలస దేశాలు యూనివర్సల్ సఫ్రాజ్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మహిళలకు పురుషులతో సమానంగా ఓటుహక్కు లభించింది. ప్రపంచ మహిళా, ఓటు హక్కు వినియోగించుకోవటంతో ఆగలేదు. 1924-26లలో డెన్మార్క్ విద్యామంత్రిణిగా నినాబాంగ్‌తో ఆరంభమైన అధికార సాధికారత అత్యున్నత అధికార పీఠాలు కైవశం చేసుకోవటం దిశలో సాగిపోతోంది. 1960లో శ్రీలంకలో సిరిమావో బండారు నాయకే ప్రపంచ ప్రప్రథమ ప్రధానిగా, 1974లో అర్జెంటైనా దేశపు ఇజాబెల్ పెరాన్ ప్రథమ దేశాధ్యక్షురాలిగా, ఇండియా ప్రియతమ ప్రధాని ఇందిరాగాంధీ 1966లో, ఐస్‌లాండ్ ప్రథమ దేశాధ్యక్షురాలిగా విజ్డీస్ ఫిన్‌బొగాడొట్టిర్ 16 ఏళ్ళు కీర్తి పతాకాలు ఎగురవేశారు. ఎన్నో దేశాలలో ఎందరో మహిళా రాజకీయవేత్తలు అత్యున్నత పదవీ శిఖరాలు అధిరోహిస్తున్నారు. 2016 ఎన్నికలలో హిల్లిరీ రొధామ్ క్లింటన్‌ను విజయం వరించివుంటే ఆమె అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందేవారు. 1872లోనే యుఎస్ ప్రెసిడెంట్ ఎన్నిక రణరంగంలో విక్టోరియా వుడ్‌హల్ పోటీ చేయడం విశేషాంశం.
ఆధునిక ప్రపంచంలోని వివిధ దేశాలలో ఓటుహక్కు మహిళా సాధికారతకు తొలిమెట్టు అయింది. శాస్ర్తియ, సాంకేతిక ప్రగతి పథంలో అన్నిరంగాలలో దూసుకుపోతున్న మహిళా శక్తి పురుష ప్రపంచానికి పోటీ ధీటుగా శక్తియుక్తులు ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఆంగ్‌సన్ సూకీ, సోనియా, హసీనా వంటి నేతలు ఎందరో ప్రతిభా శక్తి యుక్తి సంపన్నతలో పురుషాధిక్యతకు ఎదురు ఈదుతున్నారు. మన దేశంలో వివిధ రాజకీయ పార్టీలలో మహిళా ప్రాతినిధ్యం, వారసత్వ అవకాశంగా కూడా వేళ్ళూనుతోంది. సర్పంచ్‌ల స్థాయినుంచి అసెంబ్లీ, పార్లమెంటు చట్టసభలలో మహిళలు అతి తక్కువ సంఖ్యలో ప్రవేశిస్తున్నారు. ముఖ్యమంత్రులుగా, స్పీకర్‌లుగా, దేశాధ్యక్షులుగా మహిళను వరించని అధికార, ప్రతిపక్ష బాధ్యతలు లేవు. నాగరిక సమాజ పాలనా, ప్రతిపక్ష స్ర్తి భాగస్వామ్యంలో 150 సంవత్సరాలు పైగా చరిత్ర వుంది.
ఇది తుపాకీ తూటా కాదు..
ప్రపంచ మహిళ సనాతన మత ఆచార సంప్రదాయాలకు తలవంచుతూనే తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొనే అస్తిత్వ విలువలు సాధించడానికి ప్రభుత్వాలు తలవంచుతోంది. రిజర్వేషన్‌లతో సంతృప్తి పడకుండా, సమానత సాధించే దిశలో భారతీయ మహిళ 108వ రా జ్యాంగ సవరణ బిల్లుగా 2008 నాటి చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ ముందు సాధించే సంకల్పంతో, 50శాతం సమానతాదిశలో అడుగులు వేస్తోంది. డ్రైవింగ్ చేసే హక్కు సాధించటానికే ఎంతో సతమతమైన సౌదీ అరేబియా మహిళ, ఓటు హక్కుతో మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలలో విజయం సాధించింది. భూటాన్‌లో ఇంటికి ఒక ఓటు, కువైట్ పార్లమెంట్‌లో పురుషాధిపత్యం ప్రస్తుతం లేవు. అయినా వివిధ దేశాల పార్లమెంటులలో ప్రవేశం ఉభయ సభలలో అమెరికా, యూరప్, ఆసియాల ప్రపంచ సగటు 20-25 శాతం మధ్య వుంది. ఏది ఏమైనా ఊయలలూపే చేతులు విశ్వాసాన్ని పాలించే స్థాయిలో సమాజాన్ని శాసిస్తున్నాయి.
మన దేశంలో, ఓటు హక్కు వినియోగించుకోవడానికి మహిళలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకొనే ప్రలోభాలు, వాగ్దానాలు వుండనే వున్నాయి. పోలింగ్ తేదీ ఒక పండుగ వాతావరణంలో వుండటానికి మహిళల ఉత్సాహమే కారణం. ఏదిఏమైనా భారత ప్రజాస్వామ్యంలో స్వతంత్ర భారతదేశం తొలినాళ్ళలోనే పురుషులతో సమానంగా మహిళలకు, అనంతరం యువజనులకు ఓటు హక్కు ప్రసాదించటం జాతి నిర్మాతలను అభినందించవలసిన అంశం.
మహిళలు సంఘటితంగా ఓటు హక్కు ఆయుధంగా సమానత, సామాజిక న్యాయం, సంక్షేమం వంటి ప్రధాన అంశాలలలో రాజకీయ పార్టీను నిలదీయాలి. ప్రస్తుత రాజకీయ పార్టీలు ఓటుకు తూట్లు పొడిచే అనైతిక ధోరణులు స్వేచ్ఛగా అడ్డు ఆపు లేకుండా అవలంభిస్తున్నాయి. మహిళా ప్రాతినిధ్యం, భాగస్వామ్యం పరిమితమై ఉంది. మేధావంతులైన మహిళల శక్తియుక్తులు తమనే మింగేస్తాయని రాజకీయ పార్టీల నాయకులు భయంతో ఆచి తూచి ఎంపికలు చేస్తున్నారు. తమ కుటుంబాల మహిళలకే ప్రాధాన్యం యిస్తూ వారసత్వ పోకడలు అనుసరిస్తున్నారు. పక్షపాతం, వివక్ష ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. తుపాకీ తూటాలు పట్టే యువ మహిళా విప్లవ చైతన్యం సంఘటితమై, ఓటు ఆయుధం అయితే పురుష ప్రపంచం కాల్మొక్కుతుంది.

-జయసూర్య సెల్- 9440664610