మెయిన్ ఫీచర్

అసలు సిసలు నాయకురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె జనాలకు ఏదో చెబుతోంది.. మార్గదర్శకురాలిగా..
ఆమె బడిలో పిల్లలకు
బోధిస్తోంది..
ఉపాధ్యాయురాలిగా..
ఆమె మైదానంలో పిల్లలతో
ఆసనాలు వేయిస్తోంది..
యోగా శిక్షకురాలిగా..
ఆమె వీధిలో చీపురుతో
ఊడుస్తోంది.. సేవకురాలిగా..
ఆమె వీధి కుళాయి దగ్గర బుడతడికి స్నానం చేయింస్తోంది..
ఓ మాతృమూర్తిగా..
ఆమె సమావేశంలో జనాలందరి మధ్యా మాట్లాడుతోంది..
ఓ సర్పంచ్‌గా..
ఆమె ఒక్కటే.. బాధ్యతలు ఎన్నో..

ఆమే రీతూ జైస్వాల్..

ఆమె పేరు రీతూ జైస్వాల్.. బీహార్లోని వైశాలి పట్టణంలో రీతుది వ్యాపార కుటుంబం. ఆమె అక్కడే పుట్టి, పెరిగింది. ఆమెకు ఓ తమ్ముడు, అన్న ఉన్నారు. రీతూకి చిన్నప్పటి నుంచీ ఇతరులకు సహాయం చేయడమంటే చాలా ఇష్టం. స్కూలు విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచే తోటి అమ్మాయిలతో కలిసి ఓ సోషల్ సర్వీస్ గ్రూపును మొదలుపెట్టింది రీతూ. ఈ గ్రూపు పేదవాళ్లకు తోచిన సాయం చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు.. బజారులో రీతూ కొంతమంది మహిళలను చూసింది. వారిని చూడగానే చలించిపోయింది. ఎందుకంటే వారు కట్టుకున్న చీర, జాకెట్ చిరిగింది. ఆ చిరుగుల నుంచి వారు తమ శరీరం బయటకు కనిపించకుండా ఉండేందుకు వాళ్లు చేస్తున్న ప్రయత్నం, అనుభవిస్తున్న అవమానం చూసి కదిలిపోయింది రీతూ.. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లింది. రీతూ తన అమ్మ చీరలు, జాకెట్లను మూట కట్టింది. వాటిని వారి దగ్గరకు తీసుకెళ్లి పంచి పెట్టింది. అప్పుడు వారు ఆనందంగా ఆమెను ఆశీర్వదించడం, ఆమెను ప్రేమగా చూడటం.. ఇవన్నీ ఆమెకు ఎంతో తృప్తిగా, ఆనందంగా అనిపించిదట. అయితే ఈ విషయం ఆమె ఇంట్లో చెప్పలేదు. నీ చీరలు పంచిపెట్టానని కనీసం తల్లికి కూడా చెప్పలేదు. చివరకు తన చీరలు కనిపించకపోవడంతో ఆమే రీతూని అడిగిందట. అప్పుడు రీతూ తనేం చేసిందో చెప్పిందట. సహజంగానైతే.. ఆ పని చేసినందుకు తల్లి కోప్పడాలి, తిట్టాలి. కానీ ఆమె రీతూని ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుందట.. అలా రీతూ సేవాకార్యక్రమాలకు చిన్నప్పటి నుంచే కుటుంబం నుంచి నైతిక మద్దతు లభించింది. స్కూలు విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచే రీతూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొనేది. ప్రత్యేకించి, అత్యంత పేదరికంలో మగ్గుతున్న మహిళలను చూసినప్పుడు ఆమె మనసు విలవిల్లాడేది. వెంటనే తనకు తోచిన సాయం చేసేది. చిన్నప్పటి నుంచీ రీతూకి స్వతంత్ర భావాలు ఎక్కువ. ఒకరిపై ఆధారపడటం ఆమెకు ఇష్టముండేది కాదు. అలాగే ఆమెకు నాయకత్వ లక్షణాలు అధికం. పిరికితనం, భయం అంటే ఏమిటో ఆమెకు తెలిసేది కాదు.. అందుకే తన సేవా కార్యక్రమాలు కళాశాలకు చేరుకున్నా మానుకోలేదు. కొనసాగించింది. డిగ్రీ, ఎకనామిక్స్‌లో పీజీ పూర్తిచేసింది. ఇప్పుడు పెళ్లి, పిల్లల తరువాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పెళ్లి
రీతూ వివాహం ఐఏఎస్ ఆఫీసర్ అయిన అరుణ్ కుమార్‌తో జరిగింది. ఆయనది 1995 సివిల్స్ బ్యాచ్. రీతూ సేవా దృక్పథమంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే పెళ్లి తరువాత కూడా రీతూని సేవా కార్యక్రమాలు చేయమంటూ ప్రోత్సహించాడు. ఆమెలోని నాయకత్వ లక్షణాలు, సేవాకార్యక్రమాలంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ‘నీలోని ఈ గుణాలను ఇతరుల్లోనూ తీర్చిదిద్దు’ అని ఆమెకు ఎప్పుడూ చెప్పేవాడట రీతూ భర్త అరుణ్. రీతూ ఇద్దరు పిల్లలు.. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత రీతూ తన అత్తామామల పూర్వీకులు నివసించిన గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అది బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని సోన్‌బార్షాబ్లాక్‌లోని సింఘ్‌వాహిని గ్రామం. అక్కడికి అడుగుపెట్టిన వెంటనే ఆమె మనసు అల్లకల్లోలంగా మారింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కనీస అభివృద్ధి జరగని పల్లెలు ఇన్ని ఉన్నాయా? అని ఆశ్చర్యపోయింది. ఆవేదన చెందింది. ఎందుకంటే ఆ పల్లెకు విద్యుత్ సౌకర్యం లేదు. రోడ్లు లేవు. పారిశుద్ధ్యం లేదు. తాగునీరు లేదు. బహిరంగ మల, మూత్ర విసర్జన.. స్కూలు ఉన్నా.. టీచర్ లేదు. ఇలా ఎన్నో.. ఆ పల్లెను, అక్కడి మనుషులను చూసి రీతూ జాలిపడింది. అక్కడ ఏదో చేయాలన్న తపన ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. ఏవేవో ఆలోచనలు.. ఆ పల్లెను బాగుచేయాలి.. చేయాలి.. అని నిరంతరం అనుకుంటూ ఉండేది. అక్కడి నుండి వచ్చేసినా ఆ పల్లెను ఆమె మరిచిపోలేకపోయింది. అందుకే వీలు దొరికినప్పుడల్లా ఆ పల్లెకు వెళుతుండేది. భర్త ఢిల్లీలో ఉన్నతమైన సర్వీసులో ఉన్నాడు. నివాసం ఢిల్లీలోని విలాసవంతమైన భవంతిలో.. చింతలేని జీవితం.. అయినా ఆమె మనసు నిలకడగా లేదు. ఆ ఊరి గురించే ఆలోచనలు.. ఢిల్లీ నుంచి సింఘ్వాహిని గ్రామానికి రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. ఇక ఇలా కాదు అనుకుని భర్తకు విషయం చెప్పింది. అతను ఆమెకు మద్దతు తెలిపాడు. విచిత్రంగా పిల్లలు కూడా ఆమెను గ్రామాభివృద్ధికి పాటుపడమని చెప్పారు. తాము హాస్టల్లో ఉండి చదువుకుంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఇక రీతూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అలా మొదలైంది..
వెంటనే ఆమె బీహార్‌లోని సింఘ్వాహిని గ్రామానికి వెళ్లిపోయింది. స్కూలు నుంచి పని మొదలుపెట్టాలనుకుంది. ఆ ఊరిలో బడి ఉంది. టీచర్లు లేరు కాబట్టి ముందుగా అక్కడ కనీసం ఒక్క టీచరునైనా ఏర్పాటుచేయాలి. ఇందుకోసం అక్కడి విద్యాశాఖాధికారికి చెప్పడం, వారు స్పందించడం, ఆ మారుమూలగ్రామానికి టీచరు రావడానికి సమయం పడుతుందనుకుంది. వెంటనే ఆ ఊరిలో చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారేమో అని ఆరా తీసింది. అక్కడ ఒకే ఒక అమ్మాయి ఉందట. ఆమె బీ ఎడ్ పూర్తిచేసి, బొకారో అనే ఊర్లో టీచర్‌గా పనిచేస్తోందట. వెంటనే ఆమెను కలిసింది రీతు. సింఘ్వాహిని గ్రామంలోని బడి మానేసిన పిల్లలకు బడిలో పాఠాలు చెబితే.. తనకు వస్తున్న వేతనానికన్నా ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పింది. దాంతో ఆ టీచర్ అంగీకరించిందట. అలా ఆ ఊర్లోని ఇరవై ఐదు మంది స్కూలు మానేసిన అమ్మాయిలకు చదువు చెప్పించసాగింది రీతు. ఈ ఊరి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి పనె్నండు మంది అమ్మాయిలు మెట్రిక్కులేషన్ పాసయ్యారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బడి లేదని, ఆ పల్లెల్లోని 360 పిల్లలను జమ చేసి ఐదు అక్షర కేంద్రాలను ఏర్పాటు చేసింది రీతు. అక్కడ ఉత్సాహవంతులైన, సేవా దృక్పథమున్న కొంతమంది టీచర్లను నియమించింది. రీతూ కూడా ఆ స్కూల్స్‌లో పాఠాలు చెప్పేది.
మొదటి అడుగు సక్సెస్ అవడంతో మరో అడుగు వేసింది. ఈసారి అక్కడి అపారిశుద్ధ్యం అంటే బహిరంగ మలమూత్ర విసర్జన, గృహహింస, ఆడపిల్లల భ్రూణహత్యలు, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టింది. అపరిశుభ్రతకు, అనారోగ్యానికి కారణమవుతోన్న బహిరంగ మలమూత్ర విసర్జనను వెంటనే పరిష్కరించాలనుకుంది. వెంటనే జిల్లా ఉన్నతాధికారులను కలిసింది. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించమని కోరింది. ఫలితంగా ఆ పంచాయితీకి రెండువేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ముందు కొద్దిమంది మాత్రమే ముందుకొచ్చారు. దాంతో రీతూ మరో అడుగు ముందుకేసి ఆ ఊర్లోని కొందరు స్ర్తి, పురుషులతో ‘సోషల్ ఆర్మీ’ని తయారుచేసింది. మరుసటిరోజు నుంచి రీతు, ఆమె తయారుచేసిన ఆర్మీ కలిసి ప్రతిరోజూ ఉదయం ఐదింటికల్లా ఊరు శివారుకు చేరుకునేది. బహిర్భూమికి వచ్చేవారిని వెనక్కి పంపించడమే వీరి పని. అలా బహిరంగ మల విసర్జన చేయకుండా కొన్నాళ్లపాటు కాపలా కాయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ మరుగుదొడ్లను కట్టుకున్నారు. అలా ఆ పెద్ద సమస్య పరిష్కారమైంది. 2016 అక్టోబర్ నెల్లో సింఘ్వాహిని పంచాయితీని ఓడీ ఎఫ్ అంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ - బహిరంగ మలమూత్ర విసర్జితంగా ప్రభుత్వం ప్రకటించింది.
అక్కడి ప్రజలను మరింత చైతన్యపరిచేందుకు తరచుగా సమావేశాలను నిర్వహించింది రీతు. ఈ సమావేశాల్లో విషయాలను దృశ్యరూపంగా అంటే ఫొటోలు, వీడియోలతో ప్రొజెక్టర్ల ద్వారా చూపిస్తూ వివరించింది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకుగాను కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆ పంచాయితీ పరిధిలోనే ఉన్న చిన్న ఊరు ఉంది. ఆ ఊర్లో అప్పటివరకూ విద్యుత్ లేదు. వెంటనే విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి ఆ ఊరికి విద్యుత్‌ను రప్పించింది. తరువాత రోడ్లపై దృష్టి పెట్టింది. ఈసారి ఆమె ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడలేదు. అవి వచ్చినప్పుడు వస్తాయి. వాటికోసం ఎన్ని రోజులు ఎదురుచూడాలి? అనుకుని తన సొంత డబ్బుతో రోడ్లను మరమ్మతు చేయించడం మొదలుపెట్టింది. పని మొదలయ్యాక గ్రామస్తులు కొందరు ముందుకొచ్చారు. ఎవరికి తోచినంత వారు చందాగా ఇచ్చారు. అలా కొంత నిధి పోగయింది. అలా దాదాపు ఊరందరూ శ్రమదానం చేసి పక్కా రోడ్లను వేశారు. సమిష్టిగా శ్రమిస్తే.. ఎలాంటి సత్ఫలితాలొస్తాయో గ్రామస్తులందరూ గ్రహించారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తరువాత రీతు పంచాయితీలో ఉన్న రేషన్ కార్డులను సేకరించింది. ఒక్కో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? వారందరికీ వాస్తవానికి ఎంత రేషన్ అవసరమవుతుంది? కోటా ఎంత వస్తోంది? ఇప్పుడు ఇస్తున్నదెంత? ఇలా అన్ని వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ద్వారా తేలిందేమిటంటే.. వాస్తవానికి రావాల్సిన కోటాకన్నా కూడా ఎక్కువ సరుకులను డీలర్, బీడీఓతో కలిసి తెప్పిస్తున్నారని, మిగిలిన సరుకులను బయట అమ్ముకుంటారని తెలిసింది. వెంటనే రీతూ వివరాలన్నింటితో సంబంధిత ఉన్నతాధికారికి నివేదిక ఇచ్చి, అక్కడ జరుగుతున్న అవినీతిని పూసగుచ్చినట్లు వివరించింది. తరువాత వారిని ఆ పనుల నుంచి తొలగించారు. బీడీ ఓ నుంచి బెదిరింపులు వచ్చాయి కానీ ఆమె వాటిని లెక్కచేయలేదు. తరువాత ఆ పంచాయితీలోని కొందరు భూస్వాములనుంచి కూడా రీతూ బెదిరింపులు ఎదురయ్యాయి. కానీ ఆమె వాటిని లెక్కచేయలేదు. మొక్కవోని దీక్షతో తన పనిని తాను చేసుకుంటూ వెళ్లింది.
సర్పంచ్‌గా..
గ్రామస్తుల కోరిక మేరకు ఆమె ఎన్నికల్లో పోటీచేయాల్సి వచ్చింది. మొదట రీతూ ఒప్పుకోలేదు. కానీ గ్రామస్తులు పట్టువీడకపోవడంతో తప్పనిసరై ఎన్నికల్లో నిలబడింది. భారీ మెజారిటీతో గెలిచింది. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాచరణకు దిగింది. అత్యంత వెనుకబడిన పంచాయితీని అభివృద్ధి పథాన మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని ప్రభుత్వేతర సంస్థలను సంప్రదించింది. పంచాయితీ పురోగతిని చూసిన తరువాత సాయపడేందుకు చేయూతనిచ్చేందుకు ఆ సంస్థలు ముందుకొచ్చాయి. ఉపాధి శిక్షణ ప్రారంభించాయి. అతి కొద్దికాలంలోనే ఎందరో మహిళలు టైలర్లుగా, పురుషులు ఫోన్ మెకానిక్‌లుగా తయారయ్యారు. వీరిలో కొందరు పంచాయితీలో, ఇంకొందరు చుట్టుపక్కల గ్రామాల్లో షాపులు పెట్టుకున్నారు. ఇలా వారికి స్వయం ఉపాధి మార్గం దొరికింది. పంటల సాగులో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ టీం వచ్చి స్థానిక రైతులతో కలిసి పనిచేసింది. సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించింది. అంతేకాదు వరదలు వచ్చినప్పుడు రీతూ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, సహాయక చర్యలు చేపట్టడం వంటి అనేకపనులతో రేయింబవళ్లు శ్రమించింది. అలా రీతూ కృషిని ప్రజలు గుర్తించారు. 2016లో ‘ఉచ్ఛ్ శిక్షిత్ ఆదర్శ్ యువ సర్పంచ్’ అవార్డు కూడా వచ్చింది రీతూకు. బీహార్ రాష్ట్రంలో ఈ అవార్డు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి రీతూనే..
ఇలా రీతూ నాయకత్వమంటే హోదాకాదని, నాయకత్వమంటే.. మార్పుదిశగా నిరంతరాయంగా సాగే నిబద్ధ ప్రయత్నమని చాటిచెప్పింది. రీతూ ఇప్పటి రాజకీయ నాయకులందరికీ మార్గదర్శే..

-మహి