మెయిన్ ఫీచర్

మీ జీవితం మీ చేతుల్లో లేదు (ఓషో బోధ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం: భరత్
*
నిజానికి, మీ ప్రస్తుత వేదనలు, ఆవేదనలు, వాటిపట్ల మీరు తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి? ఈ నిశ్శబ్దంలో మీరు పూర్తి స్వేచ్ఛగా ఉన్నారు. ఒకవేళ మీరు రోజంతా మీ ఆశలు, కోరికల గందరగోళంలో చిక్కుకుని నిరాశ, నిస్పృహలకులోనైతే ఆ రాత్రి మీకు పీడకలగా పరిణమిస్తుంది. కానీ, మీరు మీ సంపూర్ణత్వంతో ప్రతి క్షణాన్ని పూర్తిగా, సంపూర్తిగా, సమృద్ధిగా ఆస్వాదిస్తూ జీవించిన ప్రతి రాత్రి మీకు చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆ ప్రశాంత నిద్రకు ఏ కల అంతరాయం కలిగించదు. ఎందుకంటే, అణచిన కోరికలు, నెరవేరని ఆశల జీవితంనుంచే కలలువస్తాయి. ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించిన పాశ్చాత్య మనస్తత్వవేత్తలు, ప్రత్యేకించి మనస్తత్వ విశే్లషకులు మీ కలల మూలాలు తెలుసుకోకుండానే వాటి విశే్లషణలోపడ్డారు. వాటి మూలాలు మీ మెలకువలోనే ఉంటాయి. కానీ, మీరు మీ మతం, నైతికత, సభ్యత, శిష్టాచార సంప్రదాయాల సంకెళ్ళలో బంధించబడ్డారు. అందుకే మీరు హాయిగా జీవించలేరు. ఆ జీవించని క్షణాలన్నీ మీ నిద్రలోకి వస్తాయి. ఎందుకంటే, జీవించనిదేదైనా మీ అచేతనంలోకి జారుకుంటుంది.
తూర్పు దేశాల దండకారణ్యాలలో నివసించే అనాగరికులైన ఆదివాసీలను చూస్తే ‘‘సిగ్నండ్ ఫ్రాయిడ్’’ ఆశ్చర్యపోయేవాడు. నేను వారిని చూచాను. ఆశ్చర్యమేంటంటే, వారికి కలలు రావు. ఎందుకంటే, జీవన మాధుర్యం వారికి బాగా తెలుసు. సహజంగానే వారు ఉదయం చాలా తాజాగా, మరింత యువకుల్లా జీవం తొణికిసలాడుతూ ఆరోజును పూర్తిగా అనుభవించేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ, నేటి నాగరికుల పరిస్థితి అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. కలలు వారికి రాత్రే కాదు, పగలు కూడా ‘‘ఊరికే అలా కుర్చీలో కూర్చుని కళ్ళుమూసుకోగానే’’ వస్తాయి.
మీరు జీవించాలనుకుంటున్నారే కానీ, జీవించట్లేదు. ఈ చీకటి రోజులు శాశ్వతం కాదని, జీవితంలో ఏదో ఒకరోజు వెలుగు వస్తుందని మీరు ప్రతి రాత్రి అనుకుంటారు. కానీ, బానిస జీవితాలకు ఎప్పటికీ వెలుగు రాదు. కనీసం ‘వెలుగు’ఉంది అనే అవగాహన కూడా లేకుండా వారు చీకటిలో మగ్గాల్సిందే.
మీ జీవితం మీ చేతుల్లో లేదు. నిజానికి, అది జీవితమే కాదు. విప్లవం ద్వారా మీరు ముందుకెళ్ళాలి. దానికి ఏ రాజకీయాలతో, అర్థశాస్త్రాలతో సంబంధం లేదు. కానీ, దానికి మీ ఎరుకతో, మీ ఆధ్యాత్మికతతో సంబంధముంది. మీ అంతర్గత కేంద్రం వెలుగుతో నిండిపోతే, మీ బహిర్గత కాంతి కూడా ఆ వెలుగును ప్రతిబింబించడం ప్రారంభిస్తుంది.
మీ పాత అలవాట్లను మీరు మార్చుకోలేరు. అలాగే మీ పాత సహచరులు మీకు స్వేచ్ఛ లేకుండా చేసేందుకు పదే పదే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని కనిపెట్టి, వారిని మీరు శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకు మీరు ఎప్పుడూ ఎరుకతో ఉండాలి. ముఖ్యంగా నా దృష్టిలో సన్యాసమంటే అదే. అప్పుడు ఏదో ఒకరోజు అకస్మాత్తుగా మీరు ఈ అందమైన చెట్లలో, ఈ వికసించిన పూలలో, ఆ దూర తీరాలలోని తారలలో ఒక భాగమవుతారు. అవన్నీ స్వేచ్ఛగానే ఉన్నాయి.
ఒక్క మనిషికి తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా బానిసత్వంలేదు. అందులోంచి బయటపడడం కష్టం కాదు. నిజానికి, బానిసత్వం మిమ్మల్ని పట్టుకోలేదు. మీరే దానిని పట్టుకున్నారు. మీ బంధనాలే అందుకు ముఖ్య కారణం. వాటిని మీరు అంగీకరించారు. అందుకే అవి మీతో ఉన్నాయి.
మీరు పరిపూర్ణమైన ఎరుకతో ‘‘చాలాకాలం మీరు మాతో కలిసి ఉన్నారు. ఇక చాలు, విడిపోదాం’’అని వాటితో చెప్పాలి. స్వేచ్ఛ దక్కాలంటే మీకు కాస్త ఎరుక ఉండాలి. మీరు బానిసత్వంలో ఉంటున్నారంటే అర్థం మీకు ఏవో స్వార్థప్రయోజనాలు ఉన్నట్లే.
నేను ఒక విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేసేవాడిని. ఒక నెలలో చెప్పవలసిన పాఠాలన్నీ పది రోజుల్లో పూర్తిచేసేవాడిని.
ఒకరోజు నేను ‘‘పది రోజుల్లో పాఠాలు ముగిస్తున్నందుకు నాపై ఫిర్యాదులేమైనా ఉన్నాయా?’’అని విద్యార్థులను అడిగాను. ‘‘భలేవారే. మీరు మా గురువు అవడం నిజంగా మా అదృష్టం.
*
ఇంకావుంది...
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.