ఎడిట్ పేజీ

సమర సింహం.. షా నవాజ్ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బోస్ వ్యక్తిత్వం, ఉపన్యాసాలు
నన్ను సమ్మోహింపజేశాయ...
మొట్టమొదటి సారిగా-
నాకు నా జీవితంలో...
ఒక భారతీయుని ఉద్బోధల వలన
భారతావని అద్భుత రూపం
నా కళ్ల ముందు కదలాడిందం’టూ...
నేతాజీ సుభాస్‌చంద్ర బోస్ ప్రతిపలుకూ తనకు ఆణిముత్యమని తన జీవితాన్ని దేశసేవకి అంకితం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్. ఈయన అసువులు బాసిన డిసెంబర్ 9న నివాళు లర్పించుకుంటూ... ఈ మహోన్నతుడి సేవలను మనం జ్ఞప్తికి తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
షా నవాజ్ ఖాన్ రెండవ ప్రపంచయుద్ధకాలంలో భారత జాతీయ సైన్యంలో ఒక అధికారిగా పనిచేసిన గొప్ప రాజకీయవేత్త. 1942లో సిం గపూర్‌లో ఓటమి తర్వాత భారతసైన్యంలో కెప్టెన్ స్థాయికి ఎదిగిన ఖాన్ ను జపాన్ సైన్యం బంధించింది. సింగపూర్ జైలులో యుద్ధఖైదీగా ఉన్నప్పుడు ‘‘దేశవిముక్తి కోసం ప్రజలందరూ భారత జాతీయసైన్యంలో చేరవలసిందిగా’’ సుభాస్‌చంద్ర బోస్ ఉపాన్యాసాలతో ఇచ్చిన పిలుపునకు ఖాన్ ఎంతగానో ప్రభావితులయ్యారు.
బోస్ దేశభక్తి ఉపన్యాసాలకు ఉత్తేజితుడైన ఖాన్ 1943లో భారత జాతీయ సైన్యంలో చేరారు. బోస్ స్థాపించిన అర్జి-హుకుమత్-ఎ-అజాద్ హింద్ (ఐఎన్‌ఎ) వర్గంలో చేరారు. తర్వాత బోస్ ఐఎన్‌ఎలో చురుకైనవారిని ఒక సమూహంగా ఏర్పాటుచేసి దానిద్వారా భారతదేశమంతటా పోరాటాలు సాగించాలని నిర్ణయించుకున్నారు. జపాన్ అధీనంలో ఉన్న కోహిమా, ఇంఫాల్ ప్రాంతాలను స్వాధీనపరచుకునేందుకు కొంత ఐఎన్‌ఎ సైన్యాన్ని ఉత్తర-తూర్పు ప్రాంతాలకు తరలించగా, ఖాన్ అధిపత్యం వహించి ముందుండి నడిపించారు. 1944లో మొదటి విభాగం కమాండర్‌గా షా నవాజ్ నియమితులయ్యారు.
ఇటువంటి పరిస్థితులలో ఢిల్లీలో ఉన్న ఎర్రకోట దగ్గర ప్రజాపోరాట న్యాయస్థానంలో ఖాన్, జనరల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గుర్భక్ష్సింగ్ థిల్లాన్ సహా ముగ్గురిపై నేరారోపణ జరిగింది. వీరు నేరారోపణలను ఎదు ర్కొనేందుకు సర్ తేజ్పూల్ సప్రూ, జవహర్లాల్ నెహ్రూ, అసఫ్ ఆలీ, భూలాభాయ్ దేశాయ్, కైలాస్నాథ్ కట్జు యింకా చాలామంది వాదించారు. వీరు ముగ్గురూ బ్రిటీషు వారి వేతనం పొందుతూ పనిచేసే సైనికులు కారని, ఒక చట్టబద్ధమైన ప్రభుత్వ అధీకృత సైనికులుగా గుర్తింపబడాలని, వారు దేశ సార్వభౌమత్వానికి - స్వాతంత్య్రానికి పోరాడుతున్న సైనికులన్నారు. ఖాన్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది కానీ ఆ శిక్షను భారతీయ సైన్యంలోని క మాండర్-ఇన్-్ఛఫ్ తగ్గించి, అతన్ని పదవీభ్రష్టుడిని గావించాడు.
విచారణ తర్వాత ఖాన్ తాను గాంధీ అనుసరించిన అహింసామార్గంలో నడవాలని అనుకున్నట్లు తన అభిప్రాయాన్ని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1952లో మొదటి లోక్‌సభకు మీరట్ నుండి పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఖాన్ పార్లమెంటులో అనేక ఉన్నత పదవులను అ లంకరించారు. 1952-1956 వరకు పార్లమెంట్ సెక్రటరీగా, రైల్వే, రవాణాశాఖ డిప్యూటీ మంత్రిగా 11 సంవత్సరాలు సేవలందించారు. 1957- 1964 వరకు రెండవసారి కూడా ఈ అవకాశం చేజిక్కించుకున్నారు. 1965లో ఆహార, వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. 1966లో కార్మిక, ఉపాధికల్పన, పున రావాసన శాఖల మంత్రిగా సేవలను అందించారు. 1971-1973 వరకు స్టీల్, ఖనిజాలు, పెట్రోలియం, రసాయనాలు, పారిశ్రామిక మంత్రిగా బాధ్య తలు నిర్వహించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. 1975-1977లో వ్య వసాయం, నీటిపారుదలశాఖ మంత్రిగా వ్యవహరించి రైతులకు చేదో డువాదోడుగా ఉన్నారు. జాతీయ విత్తన సంస్థ చైర్మన్‌గా, భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) ఛైర్మన్‌గా చేసి ఆ సంస్థల అభివృద్ధికి కారకులయ్యారు. ఇంత గొప్ప కార్యదక్షత కలిగిన ఖాన్ ఆ తర్వాత తెరమరుగవడం విచారకరం.
షా నవాజ్ ఖాన్ నాలుగుసార్లు 1951, 1957, 1962, 1971లలో మీరట్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1965 యుద్ధసమయంలో ఖాన్ కుమారుడు మహమూద్ పాకిస్తాన్‌లో సైన్యాధికారిగా పనిచేసేవారు. ఆ సమయంలో ప్రతిపక్షం వారు ఖాన్‌ను ప్రభుత్వ విధుల నుంచి తొలగించాలని గొడవచేశారు. ఖాన్ భారత జాతీయసైన్యంలో నిజాయితీగా, నిస్వార్థంతో దేశానికి చేసిన సేవల కారణంగా అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న లాల్‌బహదూర్ శాస్ర్తి ప్రతిపక్షాల వాదాన్ని తిరస్కరించారు.
ఖాన్ రాజకీయభావాలు లెప్టిస్ట్ సిద్ధాంతాలు. భూపంపిణీని సమర్థిస్తూ, పేదలకు భూమి పంపిణీ చేయాలని ఆయన ఆకాంక్షించేవారు. కానీ, అతని మతపరమైన భావనలను ప్రజలు సమర్థించకపోవటం వల్ల 1967 ఎన్నికల్లో జనసంఘ్ చేతిలో ఓటమి చవిచూశారు. 1969లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ పక్షంలో చేరారు. 1971 ఎన్నికల ఇందిరమ్మ ఇచ్చిన నినాదం ‘‘గరీబీ హఠావో’’- ఖాన్‌ను మళ్ళీ మీరట్ లోక్‌సభ స్థానం నుంచి గెలిపించింది. 1977లో జనతాపార్టీ అతని ఓటమికి కారణమైంది. ఆ ఓటమితో అతను పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ సేవాదళ్‌లో ముఖ్యపాత్ర వహించి చనిపోయేవరకూ అందులోనే కొనసాగారు.
1956లో సుభాష్‌చంద్ర బోస్ మరణంపై షా నవాజ్ ముఖ్యాధికారిగా ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో బోస్ పెద్ద సోదరుడు సురేష్‌చంద్ర బోస్ కూడా ఉన్నారు. ఆ కమిటీ 1956 ఏప్రిల్‌లో తన పనిని ప్రారంభించి నాలుగు నెలలతర్వాత ముగించింది. కమిటీ సభ్యులు తమ నివేదికలో సుభాష్‌చంద్ర బోస్ 1945, 18 ఆగస్టున తైహోలు (అప్పటి జపనీస్ తైపీ)వద్ద విమాన ప్రమాదంలో ఫార్మోసా (ప్రస్తుతం తైవాన్) అనే ప్రాంతంలో దుర్మరణం పాలయ్యారని నివేదించారు. బోస్ అస్తికలు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరచారని, వాటిని మరలా ఇండియాకు తరలించాలని వివరించారు.
ఖాన్ సహచరులైన జనరల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గుర్భక్ష్సింగ్ థిల్లాన్‌లు విడుదల తర్వాత కూడా మిగతావారిపై భారత జాతీయ సైన్యంలో విచారణలు కొనసాగుతూ వచ్చాయి. ఈ చర్యలు సైనిక తిరుగుబాటుకు కారణ మవగలవని బ్రిటీషు ఇండియన్ సైన్యం విచారణలు ఆపేయమని సిఫా ర్సు చేసింది. కానీ అప్పటి కమాండర్-ఇన్-్ఛఫ్ క్లాడ్ ఆచినె్లక్ పెడచెవిన పెట్టాడు. మిగతావారిపై విచారణ కొనసాగంచారు. దాని పర్యవసానంగా భారత జాతీయ సైన్యంలోని చాలామంది సైనికులు జాతీయవాదం వైపు మొగ్గుచూపారు. వీరి సంఖ్య బాగా పెరిగింది. 1946 లో సైనికాధికారులు, రాయల్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్లందరూ పెద్ద సంఖ్యలో సమ్మెచేశారు. రాయల్ ఇండియన్ నౌకాదళం, బొంబాయి ప్రజానీకం కూడా సమ్మెలో పాలుపంచుకుంది. ఈ చర్యలతో బ్రిటీషు గవర్నమెంటుకు కనువిప్పు కలిగింది. భారతదేశ స్వాతంత్య్రానికి సంప్రదింపులు జరపవలసిన పరిస్థితి ఏర్పడింది.
భారతీయ జాతీయ సైన్యం ప్రారంభించిన స్వాతంత్య్రపోరాటం ఫలిం చింది. ఎర్రకోట విచారణ తరవాత రెండు సంవత్సరాలకి తమ ఆశ యఫలాలను అందుకొనే తరుణం ఆసన్నమైంది. ‘బ్రిటీషు గవర్నమెంటు ఆ విధంగా ఇండియా లోపల, బయటా ఎదిరించబడి- అది చివరికి కూలి పోతుంది, భారతీయులు మళ్ళీ తమ పూర్వపు స్వాతంత్య్రాన్ని గెలుచుకుంటారు’- అని బోస్ ముందే ఊహించారు.
నిస్వార్థసేవకు అంకితమైన ముగ్గురు సైన్యాధికారులు షా నవాజ్ ఖాన్, ప్రేమ్ సెహగల్, గురుబక్ష్ థిల్లాన్., ఒక ముస్లిం, ఒక హిందూ, ఒక సిక్కు ఐక్యతగా నిలిచి దేశం కోసం పారాడారు. ఇది వారి సహోదరత్వాన్ని, దేశభక్తినీ, జాతీయవాదాన్నీ తెలుపుతోంది. ఆనాటి దేశ పౌరులకి వీరి పోరాటపటిమ స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎంతో దోహదపడింది. వీరి ఐకమత్య విశిష్టతను ప్రతి పౌరుడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ స్ఫూర్తితో నేడు మనం ముందడుగు వేస్తే- శాంతి, సమగ్రత, ఏకత్వం, సోదరభావంతో మనదేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకొనే అవకాశం ఉంటుంది.
*
(నేడు షా నవాజ్ వర్ధంతి)
*
చిత్రాలు.. షా నవాజ్..*నేతాజీతో.. షా నవాజ్ (వృత్తంలో)

-దామరాజు నాగలక్ష్మి