మెయన్ ఫీచర్

‘తీర్పు’ తర్వాత రాజుకున్న ‘రాఫెల్ రగడ’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాం టి అనుమానాలు లేవని సుప్రీం కోర్టు తేల్చి చెప్పినా, ఈ వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. సరికొత్త అనుమానాలకు ఈ అంశం తెరతీసింది. సుప్రీం కోర్టుకు సమర్పించిన పత్రాల్లో సత్యదూరమైన సమచారాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఆ వివరాల ఆధారంగానే కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వం అసలు నిజాలను బహిర్గతం చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. న్యాయవాదులు మనోహర్ లాల్ శర్మ, వినీత్ దాండ, ప్రశాంత్ భూషణ్‌లతో పాటు కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్‌లు దాఖలు చేసిన పిటీషన్లపై (225/2018, 298/2018, 297/2018, 1205/2018) సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసఫ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కేసును తేల్చేసింది.
రాఫెల్ ఒప్పందాలపై ‘కాగ్’ నివేదికే లేదని, దానిని పార్లమెంటుకు సమర్పించలేదని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా దానిని పరిశీలించలేదని, ప్రజల ముందుకు ఆ నివేదిక రాలేదని కాంగ్రెస్ సహా మిగిలిన పక్షాలు వాదిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో పేరా-25ను పరిశీలించినట్టయితే- ‘కాగ్’ నివేదికపై ఆధారపడినట్టు కనిపిస్తోందని పార్లమెంటు సభ్యుడు యోగంద్ర యాదవ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఎలాంటి ‘కాగ్’ నివేదికనూ పిఏసీకి సమర్పించలేదని, పీఎసీ ఏ వివరాలనూ పార్లమెంటు ముందుంచలేదని, అలాంటి నివేదిక ఏదీ ప్రజల ముందుకు తీసుకురాలేదన్నది వీరి వాదన. రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందా? లేదా? అన్న అంశాల కంటే తాజా అంశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్కడితో విడిచిపెట్టని విపక్షాలు తాజాగా రాఫెల్‌పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని పేర్కొంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను జారీచేశాయి. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ వివాదంతో దద్దరిల్లిపోవడం ఖాయమనేది నిర్వివాదాంశం.
దేశ సరిహద్దుల్లో కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలను దృష్టిలో ఉంచుకుని వైమానిక పహారాను బాగా పెంచాలంటే కనీసం దేశంలో 42 స్క్వాడ్రన్లు అవసరం. కాని దేశంలో ప్రస్తుతం 31 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్‌లో కనీసం 14 నుండి 16 ఫైటర్ విమానాలు అందుబాటులో ఉండాలి. అపుడే పశ్చిమ దిక్కున, ఉత్తరాదిన సరిహద్దులను పటిష్టం చేయగలుగుతాం. ఇదో కచ్చితమైన వాస్తవం. దేశ సరిహద్దులను పటిష్టం చేసే పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడితే చేయగలిగింది ఏముంది? కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందా? లేక రాఫెల్ విమానాల కొనుగోలు వెనుక భాజపా మతలబు ఏమైనా ఉందా? అనేది తేలాలంటే మరికొంత కాలం పట్టడం తథ్యం. ప్రస్తుతానికి మాత్రం రాజకీయ వివాదం రాజుకుని మహాజ్వాలగా రూపాంతరం చెందుతోంది. యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ఆలోచన 2001 జూన్‌లోనే వచ్చింది. 126 యుద్ధ విమానాలను కొనాలన్నది ఆ ఆలోచన సారాంశం. పారదర్శకంగా రక్షణరంగ అవసరాలను తీర్చడానికి ఒక విధానాన్ని డీపీపీ పేరుతో 2002లో మొట్టమొదటిసారి రూపొందించారు. యుద్ధ విమానాలు ఏ అవసరాలను తీర్చాలి? వాటి సాంకేతిక సామర్ధ్యాలు ఎలా ఉండాలి? అనే వ్యూహపత్రాన్ని 2006 జూన్‌లో రూపొందించారు. ఈ ప్రతిపాదనలను డీఏసీ 2007 జూన్ 29వ తేదీన ఆమోదించింది. 126 మధ్యతరహా బహుళ ప్రయోజనాల పోరాట యుద్ధ విమానాలను (ఎంఎంఆర్‌సీఎ) కొనుగోలు చేసేందుకు మార్గం సుగమం అయింది. అందులో 18 విమానాలను నేరుగా కొనుగోలు చేస్తే మిగిలిన 108 యుద్ధ విమానాలను రూపొందించే బాధ్యతను భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్‌ఏఎల్‌కు అప్పగించాలని భావించారు. ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత 11 ఏళ్లలో వాటిని ఆయా సంస్థలు అందజేయాల్సి ఉంటుంది.
2007 ఆగస్టులో బిడ్డింగ్ పిలిచారు. దానికి స్పందనగా ఆరు సంస్థలు ముందుకు వచ్చాయి. సాంకేతిక పరీక్షలను, క్షేత్రస్థాయి మూల్యాంకనం పూర్తిచేయడానికి మరో ఐదేళ్లు పట్టింది. ఈ పరీక్షలు అన్నీ 2011లో ముగించారు. అనంతరం వాటి నుండి ‘దసాల్ట్ ఏవియేషన్ సంస్థ’ను ఎల్-1గా గుర్తించారు. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక- యూపీఏ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం మార్చేసి కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చారు. యుద్ధవిమానాల కొనుగోలు ప్రతిపాదనను విరమించుకోవాలని కొత్త ప్రభుత్వం భావించింది. అయితే 2015 ఏప్రిల్ 10న జరిగిన ఇండో- ఫ్రెంచ్ సంయుక్త ప్రకటనలో 36 రాఫెల్ జెట్స్‌ను కొనుగోలు చేయనున్నట్టు పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే 2015 జూన్‌లో 126 ఎంఎంఆర్‌సీఏల కొనుగోలును విరమించుకుంటున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వంలో యుద్ధ విమానాల కాంట్రాక్టు రూ. 526 కోట్లకు సంబంధించింది కాగా, తాజాగా రాఫెల్ కొనుగోలుకు 1600 కోట్ల రూపాయిలను వెచ్చించడం అనుమానాలకు తావిస్తే అసలు ఈ సామర్ధ్యం హెచ్‌ఏఎల్‌కు లేదని రక్షణ శాఖ నివేదిక ఇవ్వడం మరో అనుమానానికి తావిచ్చింది.
వాస్తవానికి యుద్ధ విమానాలను తయారు చేస్తున్న దేశీయ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే సామర్ధ్యంతో ఉందని ఆ సంస్థ మాజీ చైర్మన్- ఎండీ సువర్ణ రాజు ఇటీవల ప్రకటించారు. ఫ్రెంచి సంస్థ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే రాఫెల్ యుద్ధ విమానాల తయారీ పెద్ద విషయం ఏమీ కాదని కూడా ఆయన చెప్పారు. కేంద్రం రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లను ఎందుకు బహిర్గతపరచడం లేదనేది మరో మిలియన్ డాలర్ల ప్రశ్న. దానికి ‘రక్షణ వ్యవహారాల్లో గోప్యత పాటించాల’న్న రంగు పూయడంతో అనుమానాలు పెనుభూతంగా మారుతున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎయిర్ ఫోర్సులో కీలక భూమిక పోషిస్తున్న 25 టన్నుల సుఖోయ్ యుద్ధ విమానాలు తయారుచేస్తుండగా, రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేయలేదా? అనే అనుమానం తలెత్తుతోంది. దసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఉత్పత్తి చేసిన మిరాజ్ యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ గత 20 ఏళ్లుగా నిర్వహణ చేస్తూనే వస్తోంది. అలాగే ఎప్పటికపుడు ఏరోనాటిక్స్ సంస్థ సైతం ఆధునిక సాఫ్ట్‌వేర్- కంప్యూటర్ వ్యవస్థను అందిపుచ్చుకుందనేది వాస్తవం. ఇన్ని అనుమానాల వెనుక ఉన్న మరో కీలక అంశం రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడం. ఒక దశలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హూలండ్ రాఫెల్ యుద్ధ విమానాలను ప్రస్తావిస్తూ ఆ కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తర్వాత ఆయనే ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ ఒప్పందం వెనుక అందరికీ అర్థం కాని మరో అనుమానం- ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హూలండ్ భాగస్వామి జూలీ గయట్ నిర్మించిన ఒక సినిమా ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నపుడు ఆ సినిమాకు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్థిక సాయం చేయడం. అంటే ఎక్కడో ఏదో ‘లింకు’ కనిపిస్తోంది. రాఫెల్ కొనుగోళ్లకు, ఈ సినిమాకు సంబంధం ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అలాంటిదేమీ లేదని తర్వాత హూలెంట్ చెప్పారు. అది వేరే విషయం.
ఇన్ని అనుమానాలు మధ్య రాఫెల్ విమానాల కొనుగోలులో ఎలాంటి అనుమానాలు సుప్రీం కోర్టుకు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ -32లో నిర్దేశించిన పరిధి ప్రకారం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని కూడా సుప్రీం తేల్చిచెప్పింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు నిర్ణాయక ప్రక్రియలో అనుమానించదగ్గ అంశాలు ఏమీ లేవని మోదీ సర్కార్‌కు న్యాయస్థానం ‘క్లీన్‌చిట్’ ఇచ్చిన అంశాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ఎలా తప్పించుకుంటుందనేది వారి ప్రశ్న. ధరల విషయంలో బెంచ్ మార్కును ఎందుకు విస్మరించింది? 126 యుద్ధవిమానాల సంఖ్య తర్వాత 36గా ఎలా మారింది? ఫ్రెంచి ప్రభుత్వ హామీని ఎందుకు విస్మరించారు? ధరల నిర్ణయంపై విచారించకుండా అధికారిక వాదనకే సుప్రీం కోర్టు ఎలా పరిమితం అయింది? ఫ్రెంచి మాజీ అధ్యక్షుడు హూలెండ్ చేసిన పలు వివాదాస్పద ప్రకటనలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. హూలెండ్ భాగస్వామి సినిమా తీసిన మాట వాస్తవమేనా? దానికి రిలయన్స్ సంస్థ ఆర్థిక సాయం చేసిందా? అయితే దానికీ, రాఫెల్ ఒప్పందానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలను ఎందుకు పరిశీలించలేదు? హెచ్‌ఏఎల్ వాదనలను ఎందుకు విస్మరించారు? ఒప్పంద ప్రక్రియను ఎపుడు పూర్తి చేశారు? ఏ నిబంధనల కింద పూర్తి చేశారు? ‘కాగ్’ నివేదిక, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదికలు, ప్రజల ముందుకు రాఫెల్ నివేదిక వంటి అంశాలను సుప్రీం కోర్టు అంత తేలిగ్గా ఎందుకు తీసుకుంది? ఈ ప్రశ్నలకు బదులిచ్చేది ఎవరు? అంటే వివాదం తీర్పు తర్వాత మరింత ముదిరిందన్న మాట. ఈ వివాదం ఇకముందు ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందో వేచి చూడాల్సిందే...

చిత్రాలు.. జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసఫ్‌

-బీవీ ప్రసాద్ 98499 98090