మెయన్ ఫీచర్

తాజా విజయాలతో రాహుల్ దూకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతాపార్టీ పాలనలో ఉన్న మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభు త్వాలను ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో ఒక విధమైన నూతన ఆత్మ విశ్వాసం కని పిస్తున్నది. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాలలో కేవలం ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే కాంగ్రెస్ చెప్పుకోదగిన విజయం సాధించింది. అక్కడ మాత్రమే భాజపా తీవ్ర పరాభవానికి గురైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగిన పూర్తి ఆధిక్యతను భాజపా పొం దలేక పోయింది. ఇక తెలంగాణలో ఎన్నో ఆశలు పెంచుకున్నా, తెలుగు దేశంతో చేతులు కలిపినా కాంగ్రెస్‌కు ప్రయోజనం లేకపోయింది. 2014లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో కన్నా ఇప్పుడు సీట్లు తక్కువగా వచ్చాయి. మిజోరంలో పదేళ్ల కాంగ్రెస్ పాలనకు తెరపడింది. అయినప్పటికీ, కాంగ్రెస్ వ్యవ హారాలపై రాహుల్ పర్యవేక్షణ ప్రారంభమైన తర్వాత- ఒకేసారి మూడు రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం చెప్పుకోదగిన పరిణామమే.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాదాపు ఒంటరిగా పోటీ చేసింది. ప్రజా కూటమి పేరుతో బద్ధ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు పేరొందిన తెలుగుదేశంతో చేతులు కలిపినా తెలంగాణలో ఫలితం దక్కలేదు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలలో తాను కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లింపవలసి వస్తుందంటూ ఒక వంక బీఎస్పీ అధినేత్రి మాయావతి బెదిరిస్తూ వచ్చారు. అటువంటి సమయంలో ఒంటరిగా ప్రభుత్వాలను ఏర్పా టు చేయగలగడం రాహుల్ నాయకత్వం స్థిరపడినదని చెప్పడానికి సంకేతం అని భావించాలి.
ఇదివరలో ఎక్కడ కాంగ్రెస్‌కు ఓటమి ఎదురైనా రాహుల్ నాయకత్వానికి పనికిరారని, ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి రావాలని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట కొంతమంది యువకులు ప్రద ర్శనలు చేస్తూ ఉండేవారు. కొందరు సీనియర్ నేతలు సహితం అందుకు వంత పాడుతూ ఉండేవారు. కానీ, ఈ పర్యాయం ఎవ్వరూ అటువంటి మాటలు అనకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రియాంకా గాంధీ గతంలో కన్నా ఇప్పుడు కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల అభ్యర్థులను నిర్ణయించడంలో తల్లి సోనియా గాంధీతో కలసి ఆమె నిర్ణయాత్మక పాత్ర వహించారు. రెండు, మూడు రోజులపాటు వారిని ప్రతిఘటించి, చివరకు వారి మాటలకు రాహుల్ తల వంచవలసి వచ్చింది. గతంలో వలే ఏకపక్షంగా యువనేతలను పార్టీపై రుద్దే ప్రయత్నం రాహుల్ చేయ కుండా పార్టీలో ఒక విధంగా ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
అయదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల తర్వాత రాహుల్ స్వరంలో కూడా మార్పు వస్తున్నది. రాఫెల్ ఒప్పందంపై గతంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీపై దాడి చేసిన రాహుల్, గతంలో కన్నా ఇప్పుడు మరింత దృఢంగా లోక్‌సభలో దాడి చేయడం గమనార్హం. భాజపా వ్యతిరేక పార్టీలతో పొత్తులు ఏర్పాటు చేసుకొనే విషయంలోనూ సమర్ధవంతంగా వ్యవహ రిస్తున్నారు. బీజేపీ వ్యతిరేకతను ఓట్లుగా మార్చు కోవాలంటే ఆ పార్టీని ఎవరు ఓడిస్తారన్నది ప్రధానంగా ప్రజలు చూస్తారనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తున్నది. ఇందుకు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. అక్కడ మాజీ సీఎం అజిత్ జోగితో మాయావతి చేతులు కలిపిన తర్వాత వారిద్దరూ కాంగ్రెస్ ఓట్లకు గండి కొడతారని, దాంతో భాజపా ఆ రాష్ట్రంలో సునాయానంగా గెలుస్తుందని అందరూ అంచనాలు వేశారు. అయితే ఆశ్చర్యకరంగా వారిద్దరూ కాంగ్రెస్ ఓట్లను కాకుండా భాజపా ఓట్లను చీల్చారు. భాజపాను ఓడించాలని చూసేవారిని సహితం ఆ పార్టీతో సమానంగా ప్రజలు జతకట్టే ప్రమాదం నున్నట్లు వెల్లడైనది. అందుకనే ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలలో మినహా దేశం అంతా దాదాపుగా ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేస్తుందనే సంకేతాన్ని రాహుల్ ఇస్తున్నారు.
మొదటగా పశ్చిమ బెంగాల్ విషయంలో నెలకొన్న అస్పష్టతకు తెరతీశారు. అక్కడ మమతా బెనర్జీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు సిపిఎంతో పొత్తుకు సిద్ధపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎంతో సీట్లను సర్దుబాటు చేసుకొని అతిపెద్ద ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలబ డగలిగింది. అయితే కాంగ్రెస్‌కు ఒక్క లోక్ సభ సీటు ఇవ్వడానికి కూడా మమత ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోకుండా చేయాలని ఒక వంక మమతా బెనర్జీ, మరోవంక మాయావతి పట్టుదలగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఎట్లాగూ బిజెపి పూర్తి మెజారిటీ సీట్లు పొందలేదని, కాంగ్రెస్ కూడా కోలుకోలేని పక్షంలో బిజెపి, కాంగ్రెస్‌లలో ఎవరో ఒకరు బయట నుండి మద్దతు ఇస్తే తాము ప్రధాన మంత్రి పదవి చేపట్టవచ్చని మమత, మాయావతి కలలు కంటున్నారు. అందుకనే వారిద్దరి పట్ల బతిమాలే ధోరణి అవసరంలేదని నిర్ణయానికి రాహుల్ వచ్చిన్నట్లు కనిపిస్తున్నది.
జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీని ఢీకొనగల నేతగా గుర్తింపు పొంద గలిగితే పలు రాష్ట్రాలలో మద్దతు పొందటం సులభం కాగలదన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారు. దాంతో పశ్చిమ బెంగాల్ లో ఒంటరిగా అన్ని సీట్లకు పోటీ చేయడానికి సిద్దపడమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు సూచించారు. అక్కడ సిపిఎం బాగా బలహీన పడిందని, ఆ పార్టీతో పొత్తు వల్లన ప్రయోజనం లేదనే అభిప్రాయానికి కూడా వచ్చారు. మరోవంక వామపక్షాలు కూడా కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా తమ ఉనికిని కోల్పోతున్నామని భావిస్తున్నారు. సొంతంగానే ఎక్కువ సీట్లు గెలుపొందగలమనే విశ్వాసం ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో వెల్లడి అవుతున్నది.
ఉత్తర ప్రదేశ్‌లో కూడా అటువంటి పరిస్థితులే నెల కొన్నాయి. రాహుల్ గాంధీ పట్ల అఖిలేశ్ యాదవ్ కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, మాయావతి మాత్రం మాట్లాడకుండా అతనిని కట్టడి చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాలను మాత్రమే వదిలివేసి, మిగిలిన చోట్ల తామే పోటీ చేయాలని మాయావతి భావిస్తున్నారు. ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్ సింగ్‌తో పొత్తుకు సిద్ధమై మూడు సీట్లు వదలడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలలో నిర్ణయాత్మక పాత్ర వహించగల ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కు స్థానం లేకుండా చేయడం ద్వారా ప్రధాన మంత్రి పదవి పోటీలో రాహుల్‌కు అవకాశం లేకుండా చేయాలని మాయావతి భావి స్తున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే బిజెపికి అండగా ఉంటున్న బ్రాహ్మణులు, మరికొందరు అగ్రవర్ణాల వారు కాంగ్రెస్ వైపు మారతారని, తద్వారా భాజపాను నిలువరించగలమని ఛత్తీస్‌గఢ్ లో వలే ఆలోచనలు చేస్తున్నారు. కానీ రాజకీయాలలో సాధారణ గణాంకాలు పనిచేయబోవని గ్రహించలేక పోతున్నారు. అందుకనే వౌనంగా మాయావతి, మమతలను దెబ్బకొట్టే విషయమై రాహుల్ ఆలోచనలు చేస్తున్నారు. ముందుగా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం పట్ల ఆయన దృష్టి సా రిస్తున్నారు. వీటితోపాటు పంజాబ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయవలసిందే. అన్నింటికన్నా ఆశ్చర్యకరం తెలుగుదేశంతో కొత్తగా కుదిరిన స్నేహం ముందుకు వెళ్లే అవకాశం కనబడటం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సైతం ఒంటరిగా పోటీ చేయడం పట్లనే కాంగ్రెస్ దృష్టి సారిస్తున్నది.
మహారాష్టల్రో కాంగ్రెస్‌తో పొత్తు పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎక్కువ పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే 40 సీట్లకు సంబంధించి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. మిగిలిన 8 సీట్లను చిన్న చిన్న పార్టీల కోసం ఎదురు చూస్తూ ఆపారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ లోని అసమ్మతిని ఆసరాగా చేసుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేయడం కోసం బీజేపీ, ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని ఆదుర్దాలో ఉన్న బిఎస్ యడ్యూరప్ప చేయని ప్రయత్నం లేనే లేదు. అయినా అక్కడ భాజపా ఎత్తుగడలు సాగడం లేదు. ప్రభుత్వ సుస్థిరతకు భంగం ఏర్పడటం లేదు.
రాహుల్ గాంధీ రాఫెల్ విమానాల ఒప్పందంపై మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్ప వలసిన ప్రధాన మంత్రి మోదీ, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ బదులు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆ బాధ్యత అప్పచెప్పడం ద్వారా పరోక్షంగా రాహుల్ గాంధీలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు దోహదపడ్డారని చెప్పవలసి ఉంది. రాఫెల్ ఒప్పందంపై రాహుల్ గాంధీ నిర్దిష్టంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా సమాధానం చెప్పకుండా జైట్లీ ఎదురు దాడి చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలను ఏకరువు పెట్టారు.
కాంగ్రెస్ పాలనకు తిరస్కార పూర్వకంగానే ప్రజలు మోదీకి పట్టం గట్టారు. ఇప్పుడు తిరిగి మోదీ వ్యతిరేకతతో నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని రాహుల్ గాంధీ పొందుతున్నారు. ప్రధాన మంత్రి మోదీ తొలిసారిగా ఈనెల 1వ తేదీన సవివరంగా పలు క్లిష్టమైన అంశాలపై ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆయా అంశాలపై ఆయన పార్లమెంట్‌లో గాని, చివరికి బిజెపి వేదికలపైన గాని, కనీసం మంత్రి వర్గ సమావేశంలో గాని చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ కార్యకర్తలు అమాయకంగా అడిగే ప్రశ్నలకు సహితం భయపడే పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నది ? మొత్తం బిజెపి నాయకత్వం ఆలోచించుకో వలసిన అంశం ఇది.
రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధాని కాలేక పోవచ్చు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన తప్పిదాలను ఆయన తన తలపై మోస్తూ దేశంలో మరే నేత ఎదుర్కొనని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే- తన బలహీనతలు, తన పార్టీ పొరపాట్లను గ్రహించి, నిజాయతీతో మార్పు కోసం ప్రయత్నం ఆయన చేస్తున్నారని చెప్పవచ్చు.

-చలసాని నరేంద్ర