మెయిన్ ఫీచర్

శారీరక బలానికి యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైనందిన జీవితంలో శారీరక బలాన్ని ఉపయోగించాల్సి రావడం, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం సర్వసాధారణం. యోగా శారీరక బలాన్ని పెంచడానికి, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుంది. ఆత్మస్థైర్యానికి శరీరాకృతి, అంతర్గత శక్తి చేసే సహాయం అంతా ఇంతా కాదు. ఈ రెండు విషయాలు దైనందిక జీవనంలో ప్రతి అంశంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. శారీరక బలం లేని వ్యక్తి అనేక ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా నరాల అస్థిరత, నరాల బలహీనత, బలహీన రోగనిరోధక వ్యవస్థ, డీ హైడ్రేషన్, రక్తపోటు వంటి వాటితో పాటు హార్మోనుల అసమతుల్యం వంటి దారుణమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి శారీరక అసాధారణ స్థితులను, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదురవుతున్నాయని అనిపించినప్పుడు జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా ఆహార ప్రణాళిక, వ్యాయామం తప్పనిసరి. బలహీనతను నివారించడానికి, మానసికంగా, శారీరికంగా నూతనోత్తేజం పెంచుకోవడానికి యోగాభ్యాసం సహజమైన, ఆచరణాత్మకమైన మార్గంగా ఉంటుంది. ఇది శరీరంలోని భౌతిక, మానసిక స్థితిగతులను క్రమబద్ధీకరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రోజులో కనీసం అరగంట నుండి గంట సమయం యోగాసనాలకు కేటాయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలరని నిపుణుల అభిప్రాయం. యోగాలో కొన్ని ఆధ్యాత్మిక ధోరణి కలిగినవి కూడా ఉన్నాయి. ఇది క్రమంగా శరీరంలోని విస్తృత శ్రేణి కండరాలను, కీళ్ళను బలపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మానసిక స్థితిగతులను చక్కదిద్దేక్రమంలో యోగా ఎంతగానో సహాయపడుతుంది. శారీరక, మానసిక బలానికి అత్యంత దోహదం చేసే ఉత్తమమైన ఆసనాలు ఉన్నాయి. ఇవి దృఢమైన శరీరాకృతిని అందించడమే కాదు, మానసిక బలాన్ని కూడా అందిస్తాయి. మరి ఆ యోగాసనాలేంటో చూద్దామా..!
పాదహస్తాసన
ఈ యోగాసనం శరీర, ఉదర కండరాలను బలపరుస్తుంది. అంతేకాదు కడుపు చుట్టూ ఉన్న కొవ్వును అంటే బెల్లీ ఫాట్‌ను కూడా తగ్గిస్తుంది. ఈ వ్యాయామం చేసేముందు నిటారుగా నిలబడాలి. తరువాత ఊపిరి పీలుస్తూ చేతుల్ని నెమ్మదిగా పైకి ఎత్తాలి. తరువాత కిందికి వంగుతూ ఊపిరి వదలాలి. ఈ క్రమంలో నుదురును మోకాలలి వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అలాగే చేతులు నేలను తాకేలా లేదా కనీసం కాలి బొటనువేలును తాకడానికైనా ప్రయత్నించాలి. లేదా చీలమండను పట్టుకోవడానికైనా ప్రయత్నించవచ్చు. ఇలా కొన్ని సెకండ్ల పాటు ఉండి తిరిగి యథాస్థితికి చేరుకోవాలి.
భుజంగాసనం
వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి, వెనె్నముక దృఢంగా మారడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేయాలనుకుంటే ముందుగా బోర్లా పడుకుని పొత్తికడుపును, గడ్డాన్ని నేలకు ఆనించాలి. తరువాత అరచేతులను నేలపై ఉంచి నెమ్మదిగా పైకి లేవాలి. అంటే బరువంతా పొట్టపై ఉంచి తలను చేతుల ఆధారంగా పైకి లేపాలి. ఈ సమయంలో కాలి బొటనవేళ్ళు నేలకు ఆని ఉండాలి. మొదట ముప్ఫై సెకన్లు ఇలా ఉండాలి. తరువాత నెమ్మదిగా అంటే రోజుకు పది సెకన్ల సమయాన్ని పెంచుకుంటూ మూడు నిముషాల పాటు ఇదే స్థానంలో ఉండి యథాస్థితికి రావలసి ఉంటుంది. ఇలా పలుమార్లు చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి.
శలభాసన
ఈ ఆసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. ఉదరాన్ని, గడ్డాన్ని నేలకు ఆనించాలి. తరువాత చేతులను, భుజాలకు సమాంతరంగా ఉంచాలి. తర్వాత నెమ్మదిగా రెండు కాళ్ళను పిరుదుల మీదుగా పైకి లేపాలి. కాళ్ళు లేపిన తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండాలి. వీలైతే తలను కూడా లేపి కేవలం ఉదరం నేలకు ఆనించి తల, కాళ్ళు లేపగలగాలి. ఫలితంగా పిరుదుల్లోని కొవ్వు తగ్గిపోయి కటిప్రాంతం ఉత్తమంగా బలపడుతుంది.
గజాసనం
కటి కండరాలు, వెనె్నముక, ఉదర కండరాలను బలపరచడానికి గజాసనాన్ని మించింది లేదు. ఈ ఆసనంలో ముందుగా నిటారుగా నిలబడాలి. తరువాత అరచేతులను జోడించాలి. జోడించిన అరచేతులను పైకెత్తాలి. ఈ సమయంలో ఊపిరిని తీసుకోవాలి. తరువాత జోడించిన అరచేతులను నెమ్మదిగా వంగి మోకాళ్ల మధ్యకు తీసుకురావాలి. ఈ క్రమంలో ఊపిరిని వదలాలి. ఈ యోగాభ్యాసాన్ని ఐదుసార్లనుంచి మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ రోజుకు ఇరవైసార్లు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
డాల్ఫిన్ ఆసనం
చేతులను బలపరచడానికి ఈ ఆసనం ఉత్తమంగా పనిచేస్తుంది. ముందుగా నిటారుగా నిలబడాలి. తరువాత కాళ్ళను కొద్దిగా ఎడం చేసి నెమ్మదిగా ముందుకు వంగాలి. రెండు మోచేతులను నేలకు ఆనించాలి. ఇది చూడటానికి తిరగబడిన ‘వి’లా కనిపిస్తుంది. ఆసనం ప్రారంభించేముందు ఊపిరిని పీల్చుకుని తిరిగి యథాస్థానానికి వచ్చే క్రమంలో నెమ్మదిగా ఊపిరిని వదలాల్సి ఉంటుంది. ఈ ఆసనంలో తల నేలకు దగ్గరగా వస్తుంది కానీ తలను నేలకు తాకించకూడదు. మరో విషయం ఏమిటంటే విలోమ ‘వి’ భంగిమకు తిరిగి వెళ్లే క్రమంలో ఊపిరిని తీసుకుంటూ ఉండాలి. ఈ ప్రక్రియను మొదట ఐదుసార్లుగా మొదలుపెట్టి.. క్రమంగా పెంచుకుంటూ.. సుమారు పదిహేను సార్ల వరకు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.