ఎడిట్ పేజీ

విలక్షణ తీర్పులు.. విస్తృత చర్చలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి ఇరకాటం కలిగించే అంశమే. అలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గత ఏడాది కాలంలో సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులు దేశవ్యాప్తంగా సంచలనాలను రేకెత్తించడమేగాక, వివిధ వేదికలపై చర్చనీయాంశాలుగా మారాయి. చివరికి సీబీఐ డైరెక్టర్ తొలగింపు అంశంపై తీర్పు కూడా మరింత కాక రేపింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించడం , ఆధార్ చట్టంలో సెక్షన్ -57ను తొలగించడం, సెక్షన్ -377 సెక్షన్‌ను తొలగించి ‘ఎల్‌జీబీటీక్యూ’ల హక్కులను కాపాడటం , సెక్షన్ 497ను కొట్టివేసి సహజీవనం నేరం కాదని తేల్చి చెప్పడం, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను కొనసాగించడం సరికాదని పేర్కొనడం, రామజన్మభూమి కేసులో పిటిషన్లను కొట్టివేయడం, భీమా కోరెగాన్ కేసులో అరెస్టులపై ‘స్టే’ ఉత్తర్వులు జారీ చేసి పౌరహక్కుల నేతలకు రక్షణగా నిలవడం, రాజకీయ నాయకుల నేరచరిత్రపై కఠినంగా వ్యవహరించాలని సూచించడం, త్రిపుల్ తలాక్, హదియా- సఫియన్ జోహాన్‌ల వివాహాన్ని చట్టబద్ధం చేయడం, వ్యక్తిగత గోప్యతను హక్కుగా నిర్ధారించడం వంటి తీర్పులు దేశంలో కొత్త చరిత్రకు నాందీ ప్రస్తావన చేశాయనే చెప్పాలి.
సుప్రీం తీర్పులపై చర్చ ఆగిపోలేదు, మరికొంత కాలం గడిచిన తర్వాత అవి మరింత చర్చనీయాంశాలే అవుతాయనడం నిస్సందేహం. సరిహద్దులు లేని ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని పరిమితమైన రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి సర్వోన్నత న్యాయస్థానం ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే తీర్పులు ఇస్తున్నాయనేది నిపుణుల వాదన. సమాజం గతిశీలకంగా వేగంగా ముందుకు సాగుతున్నపుడు సంస్కృతి కట్టుబాట్ల పరిధిలోనే సుప్రీం కోర్టు ఆధునిక సమాజంవైపు అడుగులు వేసేందుకు మార్గాన్ని సుగమం చేస్తోందన్నది సుస్పష్టం. ఒక వ్యక్తికి నచ్చనంత మాత్రాన సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను తప్పుపట్టలేం. తాజాగా సీబీఐపై వచ్చిన తీర్పును మాత్రం జాతి స్వాగతిస్తోంది. ఒక తీర్పును కాదని, మరో తీర్పును స్వాగతించే మనస్తత్వం ప్రజలకు ఉన్నా, సుప్రీం కోర్టు మాత్రం ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది.
కేంద్రానికి చుక్కెదురు...
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు అధికారాలు లేకుండా చేసి, ఆయనను సెలవుపై కేంద్రం సాగనంపడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఆయనను అలా సెలవుపై పంపడం కుదరదని, వెంటనే ఆయనకు బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రధాని అధ్యక్షతన ఉన్న అత్యున్నత ఎంపిక కమిటీ వారంలో నిర్ణయం తీసుకోవాలని కూడా పేర్కొంది. ఈ సమయంలో అలోక్ వర్మ విధానపరమైన ప్రధాన నిర్ణయాలు తీసుకోవద్దని కూడా సూచించింది. అలాగే, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు నియామకాన్ని కూడా సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాలు చేస్తూ అలోక్ దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ కేసులో కేంద్రం వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తూర్పారపట్టింది. ఈ వ్యవహారంలో సీవీసీ, కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. అలోక్‌వర్మపై చర్యలు తీసుకోవడానికి ముందు కేంద్రం సెలక్ట్ కమిటీని సంప్రదించి ఉండాల్సిందనే భావనను న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సెలవులో ఉండటంతో తీర్పును మరో న్యాయమూర్తి జస్టిస్ కౌల్ చదివి వినిపించారు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మ పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుంది. ఆ తర్వాత ఎలాగూ కొత్త డైరెక్టర్‌ను నియమించాల్సిందే. కానీ, చట్ట ప్రకారమేనంటూ ప్రభుత్వం వ్యవహరించిన తీరును సాంకేతికంగా సుప్రీం తప్పుపట్టింది.
భారతీయులకు బాసటగా..
భారతీయులందరికీ బాసటగా నిలిచేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమే అని చెప్పాలి. భారతీయుల గోప్యతను రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కాపాడాల్సిందేనని పేర్కొంది. 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎంపీ శర్మ -ఖరక్ సింగ్ కేసులో స్పష్టంగా తీర్పు ఇచ్చింది. వ్యక్తి స్వేచ్ఛకూ, స్వాతంత్య్రానికి భంగం కలగని రీతిలో గోప్యతను కాపాడాల్సిందేనని నిర్వచించింది. మరో సంచలన నిర్ణయంలో ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదని, ఇందుకు సంబంధించి ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కూడా కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ నారీమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. జస్టిస్ జోసఫ్ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణకుమార్ సింగ్ వెర్సస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో శాసనసభను కాదని ఆర్డినెన్స్ జారీ చేయడం సరికాదని, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.
మైనర్ భార్యతో శృంగారాన్ని అత్యాచారంగానే పరిగణించాల్సిందేనని మరో సంచలన తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చింది. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న భార్యతో శృంగారం సైతం అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ తీర్పును వ్యక్తిగత స్వేచ్ఛ ఉల్లంఘనగా హక్కుల సంఘాల నాయకులు పరిగణించినా, వాస్తవానికి ఇది బాల్య వివాహాలను అడ్డుకునేందుకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. సెక్షన్ 198(6) ఐపీసీలో నిబంధనలను ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రస్తావించింది. మైనర్ అంటే 15 ఏళ్లలోపు బాలికలు కాదని, 18 లోపువారంతా మైనర్లేనని ఈ తరహా కేసులకు ఇదే వర్తిస్తుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. కులం, మతం ప్రాతిపదికగా ఓట్లు కోరడం, తదనుగుణంగా భేటీలు, సమావేశాలు ఏర్పాటు చేయడం నేరం కింద పరిగణించాలని ఆనాటి న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(3)ను ప్రస్తావించిన రాజ్యాంగ ధర్మాసనం ఇలాంటి నేతలపై కేసులు పెట్టాల్సిందేనని సూచించింది.
‘నిర్భయ’ కేసుకు సంబంధించి ఇచ్చిన 430 పేజీల సుదీర్ఘ తీర్పులో- ‘ఇంతటి తీవ్రమైన కేసుల్లో నిందితులను క్షమించలేమ’ని స్పష్టం చేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌లు నిందితులకు మరణశిక్షను ఖరారు చేశారు. ఇంకో తీర్పులో సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదులుగా గుర్తించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో సుప్రీం కోర్టు న్యాయవాదులకు సంబంధించి పెను వివాదం పరిష్కారమైంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఇచ్చింది. జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మార్గదర్శకాలను ఇచ్చింది.
సెక్షన్ -498 ఏను దుర్వినియోగం చేయడాన్ని కూడా సుప్రీం కోర్టు సహించలేదు. పొరుగువారికి ఇబ్బంది లేనంత కాలం సహజీవనం తప్పుకాదని తేల్చి చెప్పింది. అన్నింటికీ ‘ఆధార్’ను కోరడం సరికాదని, ‘ఆధార్’ను దుర్వినియోగం చేసే వారిపై కఠినమైన జరిమానా విధించాలని కూడా కేంద్రానికి సూచించింది. కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు మినహా మిగిలిన వాటికి ఆధార్‌ను నిర్బంధం చేయవద్దని పేర్కొంది. అయితే అంతకుముందు ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి సెక్షన్ 139ఏఏ అమలులో మాత్రం ‘ఆధార్’ను కోరడం తప్పులేదని కోర్టు సూచించింది. ఐటీ రిటర్నులను ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పేమీ కాదని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అంధులకు- వారి కదలికలకు అనుగుణంగా బహరింగ ప్రదేశాల్లో అనువైన వాతావరణాన్ని కల్పించాలని మరో పిటిషన్‌లో సూచించింది. బెయిల్ పిటిషన్లను తొదరంగా పరిష్కరించడం ద్వారా వ్యక్తుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూడాలని, చెక్ బౌన్స్ కేసుల్లో బాధితులకు సరిపడా చెల్లింపులు జరిగినపుడు ఆ కేసులను మూసివేయాలని కూడా పేర్కొంది. మహిళలకు తమ ప్రేమకు, తిరస్కారానికి ఉన్న స్వేచ్ఛను ఎవరూ ప్రశ్నించజాలరని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ ఏం ఖాన్‌విల్కర్, జస్టిస్ ఎం మోహన్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఇంకో కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, డాక్టర్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్వేచ్ఛగా వ్యక్తం చేసే అభిప్రాయాలను చట్టం పేరుతో అడ్డుకోవడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని పేర్కొంది. ‘సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు’ పేరుతో ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలన్న పిటీషన్‌ను తిరస్కరిస్తూ డివిజన్ బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. వీటిన్నింటి నేపథ్యం వ్యక్తి స్వేచ్ఛను కాపాడటం, మరింత విశాల దృక్పథాన్ని అలవరచుకోవడం తమ మార్గంగా సుప్రీం కోర్టు చెప్పకనే చెప్పింది.

-బీవీ ప్రసాద్ 98499 98090