Others

సమష్టిగా ఆలోచించు.. సాహసంతో సాధించు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రపంచ హిందూ కాంగ్రెస్’ మూడవ సమ్మేళనం 2022లో థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్‌లో జరగనుంది. ఈ సంస్థ తొలి సదస్సు నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సదస్సు అమెరికాలోని చికాగో నగరంలో 2018 సెప్టెంబర్ 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ‘సమష్టిగా ఆలోచించు, సాహసోపేతంగా లక్ష్యాన్ని సాధించు’ అనే ఆశయంతో ఈ సదస్సు జరిగింది. స్వాతంత్య్రం రాక ముందు, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో హిందూ సదస్సులు లేదా సమ్మేళనాలు జరిగిన దాఖలాలు లేవు.ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో హిందువులు ఉన్నారు. కాని హిందువులకు మాతృస్థానం అఖండ భారత్, నేపాల్ దేశాలే.
1947లో దేశ విభజన తర్వాత హిందువులు 85 శాతం పైగా ఉన్న దేశం భారత్ ఒక్కటే. నేపాల్ హిందూదేశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందువులు తమ జీవన విధానంలో, సామాజిక వ్యవస్థలో ఉన్న అసమానతలను గుర్తించి, వాటిని సరిచేసుకుని ఇప్పుడిప్పుడే సంఘటితమయ్యేందుకు రకరకాల వేదికలు పనిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు ‘ప్రపంచ హిందూ కాంగ్రెస్’ అనే వేదిక ఏర్పాటైంది. ఈ సదస్సును చికాగోలో నిర్వహించేందుకు చారిత్రక కారణముంది. ఈ నగరంలో 125 సంవత్సరాల క్రితం జరిగిన ప్రపంచ మత మహాసభల్లో స్వామి వివేకానంద పాల్గొని తొలిసారిగా హిందూ ధార్మిక జీవన విధానం, విశిష్టతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఈ ప్రసంగం స్ఫూర్తిగా గత ఏడాది సెప్టెంబర్‌లో హిందూ కాంగ్రెస్ సభలను లాంబార్డ్ యార్క్ టౌన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు 60 దేశాల నుంచి మూడువేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. 220 మంది వక్తలు ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విద్య, రాజకీయాలు, సామాజిక రంగం, మీడియా, మతం, ఆధ్యాత్మికత, హిందువులను సంఘటితం చేయ డం అనే పలు అంశాలపై చర్చ జరిగింది.
హిందువుల ప్రాచీన చరిత్ర, నాగరికత, జీవన విధానం, అప్పటి పాలన తీరు, శాసనాలు, చరిత్ర గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువ. అపోహలు ఎక్కువ. ప్రాచీన హిందూ నాగరికత నుంచి నేటి వరకు చరిత్రను డాక్యుమెంటేషన్ చేసే ప్రక్రియపై ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మిగతా మతాల మాదిరిగా హైందవ జాతిని సంఘటితం చేసే లక్ష్యంతో ఈ సదస్సునుప్రారంభిస్తున్నట్లు వరల్డ్ హిందూ కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధిపతి మోహన్ భగవత్ మాట్లాడుతూ- ‘సింహం ఒంటరిగా సంచరిస్తే అడవి కుక్కలు దాడి చేసి చంపేస్తాయి. అందుకే సంఘటితంగా హైందవ జాతి కదలాలి. గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచంలో ఆధిపత్యం, యుద్ధకాంక్ష, పొరుగుదేశాలను ఆక్రమించుకోవాలన్న దుర్బుద్ధి లేని హైందవజాతి ఆర్థికంగా సమగ్రాభివృద్ధికి పాటుపడే లక్ష్యంతో ముందుకు నడవాలి..’ అన్నారు. హిందూ ధర్మం ప్రాచీనమైనది, ఆధునికత తర్వాత మంచి దశ కలిగి ఉన్నదన్నారు. వ్యక్తులు, వర్గంలా కాకుండా, యావత్తు హిందూ సమాజం ఒక్కటే అనే భావనతో పనిచేస్తే హిందువులు రాణించడం తథ్యమన్నారు. కలిసి పనిచేయాలన్న చైతన్యం, సంకల్పం ఉండాలన్నారు. హిందువులు ఎప్పుడూ సంఘటితంగా కదలరు. వీరందరూ ఏకతాటిపైకి తీసుకురావడం పెద్ద సవాలు అని ఆయన అన్నారు.
ప్రపంచ హిందూ కాంగ్రెస్ చైర్మన్ ఎస్‌పీ కొఠారీ మాట్లాడుతూ చైతన్యం, ప్రగతి, సంస్కరణ అనే నినాదంతో ‘ప్రపంచ హిందూ కాంగ్రెస్’ ప్రజలను సంఘటితం చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు చెప్పారు. హిందువుల్లో సంస్కరణలు రావాలని, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించాలని, అప్పుడే హిందూ ధర్మం వైభవోవేతంగా వర్థిల్లుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశానికి హాజరు కాకపోయినా, మంచి ఉత్తేజ భరితమైన సందేశం ఇచ్చారు. ఆలోచనాపరులు, పండితులు, మేధావులు, వివిధ రంగాల్లో సుప్రసిద్ధులు ఒక వేదికపైకి రావడాన్ని స్వాగతించారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనది హిందూమతం. మానవాళి సముద్ధరణకు పాటుపడిన మతం. అనేక సమస్యల పరిష్కారానికి హైందవ ధార్మిక, ఆధ్యాత్మిక జీవన విధానం తోవ చూపిస్తుందన్నారు.
ఆగ్నేయాసియా దేశాలకు ముఖ ద్వారమైన థాయిలాండ్‌లో మూడవ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సభలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయానికి బలమైన కారణముంది. మయన్మార్, కంబోడియా, థాయిలాండ్,కొరియా తదితరదేశాల్లో ఒకప్పుడు హిందూ ప్రాచీన చరిత్ర, నాగరికత విశిష్టత ఉన్నాయి. భారతదేశంతో ఉమ్మడి చరిత్ర, సంస్కృతిని ఈదేశాలు పంచుకుంటున్నాయి. హిందువులపైన ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను ఎండగట్టాలని, సామాజిక మీడియాను వేదికగా తీసుకుని ప్రజల్లో చైతన్యం పెంచాలని సదస్సులో తీర్మానించారు. హిందూ యువతలో ఐక్యతను పెంచేందుకు, అందుకు ఉన్న అవరోధాలను తొలగించేందుకు, ‘నేను హిందువును’ అనే భావనను బలంగా చాటేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేయాలని ప్రపంచ హిందూ కాంగ్రెస్ రాజకీయ సదస్సు తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేతిలో బందీలైన దేవాలయాలకు విముక్తి కల్పించాలని తీర్మానించారు.
‘హిందువుల్లో క్రియాశీలతను పెంచి, దేవాలయాల యాజమాన్యాన్ని హిందువులకే అప్పగించే విధంగా వత్తిడి తేవాలి. అన్ని దేశాల్లో విస్తరించి ఉన్న హిందువులకు ధార్మిక జీవన విధానం విశిష్టతను తెలియచేసేందుకు కృషి చేయాలి. పారిశ్రామిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. మతపరమైన విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలి. హిందూ పండితుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానం కల్పించాలి..’అని తీర్మానించారు.సంస్కృత భాష వ్యాకరణంలో నాలుగు వేల రూల్స్ ఉన్నాయి. వీటిని సంస్కృత పండితుడు పాణిని రూపొందించారు. ఇవి కంప్యూటర్ సైన్స్‌కు ఉపయొగపడుతున్నాయ. కాని ఇంత ఘన చరిత్ర ఉన్నా, హిందువులు తమగురించి తాము గొప్పగా చెప్పుకోలేని స్థితిలో ఉండేందుకు దారితీసిన కారణాలపై ఆత్మావలోకనం చేసుకోవాలని వక్తలు ప్రొఫెసర్ సుభాష్ కాక్ చెప్పారు. ఆయన హిందువుల గత వైభవం, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, మంచి భవిష్యత్తు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.6 ట్రిలియన్ డాలర్లు ఉంది. 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మణిపాల్ గ్లోబల్ బోర్డు చైర్‌పర్సన్ పాయ్ చెప్పారు. చైనా, అమెరికా తర్వాత మూడవ స్థానంలో ఉన్న భారత్ ముఖ్యంగా ఆహారం, అందరికీ వసతి, విద్యుత్, మంచినీరు, ఆరోగ్యం వంటి రంగాల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టిని సారించాలన్నారు. ప్రాచీన స్మృతిని ఎలా అర్థం చేసుకోవాలనే అంశం, ప్రచారంలో ఉన్న అపార్థాలపై తమిళనాడుకు చెందిన చరిత్రాకారుడు, పురావస్తుశాస్తవ్రేత్త నాగస్వామి విశదీకరించారు.
ప్రపంచ హిందూ కాంగ్రెస్ సభలను చూస్తుంటే మినీ కుంభమేళాను దర్శించినట్లుగా ఉందని మీడియా సంస్థ లు పేర్కొన్నాయి. భారత ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. హిందూ ధర్మంలో మహిళలకు ఇచ్చిన గౌరవ ప్రదమైన స్థానాన్ని ఆయన వివరించారు. దేశంలో నదుల పేర్లన్నీ స్ర్తిల పేర్లని, భారతీయులు తమదేశాన్ని మాతృభూమిగా ప్రేమతో పిలుచుకుంటారన్నారు. భారతీయ నాగరికత, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుపై భావోద్వేగంతో వెంకయ్య ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రావర్ హాజై సెప్టెంబర్ 11వ తేదీని స్వామి వివేకానంద స్మృతి దినంగా పరిగణిస్తామని సదస్సులో ప్రకటించడం విశేషం. దివంగత మాజీ ప్రధాని వాజపేయి, నోబెల్ బహుమతి గ్రహీత వీఎస్ నైపాల్ మృతికి సంతాపసూచకంగా సదస్సులో నివాళులు అర్పించారు.
ఇతర మతాలకు సంబంధించి ప్రపంచ స్థాయి సదస్సులు ఎప్పుడూ ఏదో ఒకదేశంలో మత ప్రచారంలో భాగంగానే నిర్వహిస్తుంటారు. హిందూ ధర్మంపై అంతర్జాతీయ స్థాయిలో సదస్సులను నిర్వహించడం ఆషామాషీ కాదు. వరల్డ్ హిందూ కాంగ్రెస్ హైందవ సమాజాన్ని వెంటాడుతున్న దురాచారాలను పారద్రోలి, సనాతన, ఆధునిక వాదాల్లో మంచిని స్వీకరించి అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధంగా ముందడుగు వేయాలి. ఇతర మతాల్లో హైందవ ధర్మాన్ని అభిమానించే వారిని కూడా దగ్గరకు తీసుకోవాలి. హైందవ ధర్మం విశిష్టమైనది. కానీ, హైందవ జాతిలో అంతర్లీనంగా ఇతర వర్గాలను అణచివేత, సాచివేత లాంటి ఆలోచన విధానాలను రూపుమాపేందుకు వరల్డ్ హిందూ కాంగ్రెస్ నడుం బిగించాలి. అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని వర్గాల్లోని హైందవ ధార్మికతను ప్రచారం చేసే వ్యక్తులను భాగస్వాములను చేయాలి. హైందవ జాతికి కుల దురభిమాన వ్యవస్థ శాపంగా పరిణమించింది. ఈ కుళ్లును కడిగేందుకు హిందూ కాంగ్రెస్ సంస్కరణలపై చర్చించాలి. ‘మన తాతాలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి’ అనే తరహాలో ప్రాచీన నాగరికత, చరిత్ర, సంస్కృతిని పదే పదే తలుచుకుని మురిసిపోకుండా,చరిత్రలో దొర్లిన తప్పిదాలు పునరావృతం కాకుండా సమగ్రమైన ప్రణాళికతో, దార్శనికతతో అడుగులు వేయాలి. పరమత సహనం, ఆధ్యాత్మిక సంపద, సర్వే జనాసుఖినో భవంతు అనే భావనను ప్రచారం చేయాలి.
దిశ, దశ లేకుండా ఎటు గాలి వస్తే అటు కొట్టుకుపోతూ నిర్వీర్యమవుతున్న హైందవ జాతిని పట్టిపీడిస్తున్న సామాజిక దురాచారాలపై యుద్ధం ప్రకటిస్తూనే, సాంస్కృతిక వైభవం సాధించేందుకు ప్రపంచ హిందూ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం. కానీ, ఈ చర్చలు, తీర్మానాలు కేవలం కాగితాలకు, వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసేందుకు పరిమితమైతే ఉపయోగం లేదు. ఇదే జరిగితే ‘కార్తీకమాసంలో కులసంఘాల వన సమారాధాన’ల తరహాలో వరల్డ్ హిందూ కాంగ్రెస్ తయారవుతుంది. స్వామి వివేకానంద చెప్పినట్లు- ‘లెమ్ము, మేలుకో, చైతన్యంతో సాగిపో.. దార్శనికతతో కదులు, దురాచారాలను సమాధి చేయి, దురహంకారాన్ని వదిలేయ్..’ అనే మంచిమాటలను ఆచరించినప్పుడే హైందవ జాతి, హిందూ ధర్మం మహోత్క్రృష్ట దశకు చేరుకుంటుంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097