మెయిన్ ఫీచర్

అతివకు అవకాశం.. జాతి వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగద్రష్ట వివేకానందుని155వ జయంతి సందర్భంగా

అధిక సంఖ్యాకులైన బడుగు, బలహీన జనులను దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేయడమే ఈ దేశ పతనానికి ముఖ్య కారణం. అత్యంత నిరుపేదలుగా మిగిలిపోయిన ఈ దేశ శ్రమజీవుల హృదయాలనుంచి స్రవించే రక్తంతో పెరిగి, విద్యాబుద్ధులు గడించి, తదనంతరం వారి బాగోగులను పట్టించుకోని ప్రతి ఒక్కరూ దేశద్రోహులే2అని తొట్టతొలిగా సామాజిక పరివర్తనకు నాంది పలికిన హిందూ ధార్మిక నాయకుడు స్వామి వివేకానంద.

దేశంలోని కోట్లాది అన్నార్తుల కనీస అవసరాలు తీర్చడమే ప్రథమ కర్తవ్యం కావాలని గుర్తుచేసిన సాహసి, మానవతామూర్తి స్వామి వివేకానందుడు. దానికి సరైన మార్గం శిక్షణతో కూడిన విద్య ప్రధానమైనదని స్ర్తిలు కూడా విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో నేర్పి, సమాజంలో సమానావకాశాలను పొందినప్పుడే జాతి సంపూర్ణంగా వికసిస్తుందని ఆకాంక్షించిన క్రాంతదర్శి. ‘లెండి మేల్కొనండి! గమ్యం చేరేవరకూ విశ్రమించకండి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైన మనసుతో లక్ష్యాన్ని చేధించండి’2అంటూ యువతకు ఉద్బోధించి ‘నాయకుడివి కాదలచుకుంటే ముందు సేవకుడిగా మారు’2అని సగర్వంగా ప్రకటించిన ధీరోదాత్తుడు స్వామి వివేకానందుడు.
1863 జనవరి 12న కలకత్తాలో భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తులకు జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ దత్తు. అందరూ నరేన్ అని పిలిచేవారు. నరేన్ బాల్యంనుంచే ఆటపాటలు, అల్లరితోపాటు ధ్యానంలో మునిగిపోతుండేవాడు. తల్లి భువనేశ్వరి ద్వారా రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను ఔపాసన పట్టారు. చిన్నవయసులోనే వివిధ మతాల సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై కొంతకాలం బ్రహ్మసమాజం ప్రభావంతో గడిపాడు. సంస్కృతం, బెంగాలీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవడంతోపాటు ఈత, కర్రసాము, కుస్తీలు, మల్లయుద్ధం, వ్యాయామం వంటి ఇతర వ్యాపకాలలోనూ నిష్ణాతుడయ్యాడు. చిన్న వయసులోనే వాక్చాతుర్యంలో దిట్టగా నిలిచాడు.
భగవాన్ రామకృష్ణ పరమహంస సన్నిధిలో తన ప్రశ్నలకు సమాధానం లభించడంతో, ఆంతరంగిక సంఘర్షణ తొలగి ప్రశాంతత చేకూరి శిష్యునిగా మారిపోయాడు. శ్రీరామకృష్ణుని శిక్షణలో నరేంద్రుడు నిర్వికల్ప సమాధి స్థితితో సహా అనేకమైన మహోన్నత ఆధ్యాత్మిక అనుభూతులను పొందాడు.
గురుదేవులు రామకృష్ణ పరమహంస మరణానంతరం సన్యాసం స్వీకరించిన నరేంద్రుడు వివేకానందుడైనాడు. గతంలో శ్రీరామకృష్ణులువారు చెప్పిన అమృతవాక్కులు 3జీవారాధనయే శివారాధనని మార్గదర్శకంగా తీసికొని, భారతదేశ స్థితిగతులను ఆకళింపు చేసుకోవడానికి హిమాలయాలనుంచి కన్యాకుమారి వరకూ పర్యటించారు. కన్యాకుమారి సముద్రగర్భంలోగల శ్రీపాద శిలపై ఆశీనులై మూడురోజులపాటు ఎడతెగని ధ్యానంలో లీనమయ్యారు. అక్కడే ఆయన భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకున్నారు. రామకృష్ణ పరమహంస శిష్యునిగా గడించిన సేవానుభూతులే రామకృష్ణమిషన్ సేవాకేంద్రాన్ని స్థాపించడానికి పునాదిగా మారాయి.
నవభారత నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు వివేకానందుడి మనసులో మెదులుతున్న సమయంలోనే 1893న చికాగోలో జరుగుతున్న 3విశ్వమత మహాసభలు2 జరగనున్నాయన్న వార్త వివేకానందుడిని ఉత్తేజితుణ్ణి చేసింది. మిత్రులు, సన్నిహితుల ప్రోత్సాహంతో భారతీయతలో దాగిన విశిష్టతను, సనాతన హిందూధర్మ మూలసూత్రాలను ప్రపంచానికి చాటడానికి చికాగో ‘సర్వమత సమ్మేళనాన్ని’2చక్కని వేదికగా భావించిన వివేకానందుడు అమెరికాకు ప్రయాణమయ్యారు.
1893 సెప్టెంబర్ 11న చికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలో పాల్గొని, అమెరికా సోదరసోదరీమణులారా!2అని సంబోధిస్తూ వివేకానందుడు సాగించిన మహోపన్యాసం వివిధ దేశాలనుంచి వచ్చిన శ్రోతలను సమ్మోహనంతో పరవశులనుగావించింది. ఆ మహాసభలలో వివేకానందుడు విశ్వగురువుగా, 3‘ఈశ్వర ప్రేరేపిత మహావక్త’గా కీర్తిపొంది, విశ్వవిఖ్యాతి నొందారు. అప్పటివరకు హిందూ మతంపై పాశ్చాత్యులలో పేరుకుపోయిన అపోహలు పటాపంచలు కావడం ప్రారంభమైందనుటలో అతిశయోక్తి కాదు.
ఇంగ్లండు, స్విట్జర్లాండు మొదలైన పాశ్చాత్య దేశాలతోపాటు శ్రీలంక వంటి దేశాల్లోనూ పర్యటించి, అన్ని మతాలకూ మూలమైన వేదాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మూడు సంవత్సరాలు పర్యటించిన అనంతరం 1897లో భారతదేశానికి తిరిగి వచ్చారు. తదనంతర కాలంలో దేశవ్యాప్తంగా తన ప్రసంగాలతో మూఢాచారాలను, జాతి బలహీనతలను, పాశ్చాత్య వ్యామోహాన్ని, కుల దురభిమానాలను బలంగా విమర్శించారు. భారత జాతికి పునాది మతమే అయినప్పటికీ, దాని సారాంశం ఆధ్యాత్మిక ఏకత్వమని ప్రబోధించారు. ఆ లక్ష్యసాధనకే రామకృష్ణ సేవాసంఘాన్ని స్థాపించారు. 1898లో కలకత్తాలోని బేలూరులో రామకృష్ణమఠం నిర్మాణానికి పూనుకున్నారు. రామకృష్ణ మిషన్‌లు నాటినుంచి నేటివరకూ వివిధ ఆధ్యాత్మిక, విద్యా, సేవా కార్యక్రమాలను నలుమూలలా విజయవంతంగా నిర్వహిస్తుండటం గమనార్హం.
ఇంగ్లాండులో స్వామి వివేకానందుని బోధనలకు ముగ్ధురాలైన మార్గరెట్ శిష్యురాలిగా భారతదేశానికి వచ్చి ‘సిస్టర్ నివేదిత’గా మారింది. రామకృష్ణ పరమహంస పేర ప్రారంభించిన మఠాలు, మిషన్ కార్యకలాపాలు, పర్యవేక్షణలు, శిక్షణలతో నిరంతరం శ్రమలో లీనంకావడంతో వివేకానందుడి ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. 1902 జూలై 3న బేలూరులో వివేకానందుడు పరమపదించారు.
అభాగ్యులు, అన్నార్తుల కష్టాలను రూపుమాపి సుసంపన్నమైన, సుదృఢమైన భారత జాతి నిర్మాణానికి యువత పట్టువీడని దీక్షతో కొనసాగించాలన్న వివేకానందుని సందేశం నేటి విద్యార్థులు, యువతకు, యువతరం నేతలకు స్ఫూర్తి కావాలి. ‘పేదలకోసం ఎవరి హృదయం తపిస్తుందో, వారినే నేను మహాత్ములు’గా భావిస్తాను అన్న వివేకుని లోకోక్తిగా సదా నిలిచిపోవాలి. వారు ప్రాతఃస్మరణీయులు.

విశిష్టతల కలబోత భారతనారి

* మహిళల స్థితిగతులు మెరుగుపరచకపోతే ప్రపంచ సంక్షేమానికి ఆస్కారం ఉండదు. ఒంటి రెక్కమీద ఎగరడం పక్షికి అసాధ్యం కదా!
* హైందవ స్ర్తిలు ఎంతో ధర్మపరాయణులు; బహుశా ప్రపంచంలోని ఏ ఇతర స్ర్తిలకంటే కూడా వారు అధిక ధర్మపరాయణులై విరాజిల్లుతున్నారు. పరిపూర్ణ స్ర్తిత్వభావమే పరిపూర్ణ స్వాతంత్య్రం.
* తండ్రి అనుగ్రహం కంటే తల్లి అనుగ్రహం లక్ష రెట్లు విలువైనదని నా అభిప్రాయం, తల్లి ఆశీస్సులే నాకు శిరోధార్యం.
* మంచికి గాని, పవిత్రతకు గాని, పాతివ్రత్యానికి గాని, భారతీయ మహిళా ధర్మానికి సీత పెట్టింది పేరు. సీత అపకారానికి, ప్రత్యపకారానికి ఎన్నటికీ తలపడదు. సీతలా ఉండడానికి ప్రయత్నించండి.
* ఓ భారతదేశమా! నీ సతీత్వ ఆదర్శం సీత, సావిత్రి, దమయంతి అని మరువద్దు.
* మన మహిళలకు విద్య తక్కువేగాని, పవిత్రత ఎక్కువ. తన భర్తను తప్ప, తక్కిన పురుషులనందరినీ ప్రతి మహిళా తన కొడుకులుగా భావిస్తుంది. తన భార్యను తప్ప తక్కిన మహిళలనందరినీ పురుషుడు తన తల్లులుగా భావిస్తాడు.
* పురుషులకు కేంద్రాలను నెలకొల్పినట్లే, స్ర్తిలకు కూడా బోధనా కేంద్రాలు ప్రారంభించాలి. స్ర్తి జనోద్ధరణ, జనబాహుళ్య జాగృతం ముందుగా జరగాలి. అది జరిగిన తరువాత మాత్రమే భారతదేశానికి నిజమైన శ్రేయస్సు ఒనగూరుతుంది.
* స్ర్తిలను, తమ సమస్యలను తమ మార్గాలతోనే పరిష్కరించుకొనే స్థితికి తీసుకుపోవాలి. వారి తరఫున దీనిని ఎవరూ చేయగూడదు. భారతీయ మహిళ తన సమస్యలను పరిష్కరించడంలో ఏ స్ర్తిలకూ తీసిపోదు.
* ఇతర విషయాలతోపాటు మన మహిళల ధైర్యసాహసాలు సంతరించుకోవాలి. నేటి కాలంలో ఆత్మరక్షణ నేర్వడం వారికి ఎంతో ఆవశ్యకమైపోయింది. ఝాన్సీరాణి ఎటువంటి పరాక్రమవంతురాలో చూడండి.
* స్ర్తిలు అత్యున్నత సత్యాలను బోధించేవారనీ, పురుషులకు సాటిగా ఆదరణ పొందారనీ, వేదాలూ ఉపనిషత్తులూ చాటిచెబుతున్నాయి.
* స్ర్తిలకు మొదట విద్యను గరపండి. తరువాత వారికి స్వేచ్ఛను ఒసగండి. అప్పుడు తమకు ఏ సంస్కారాలు ఆవశ్యకాలో వారే మీకు తెలుపుతారు. వారి విషయాలకు మీరెవరు?
* మాతృదేవి (శారదామాత) భారతదేశంలో ఒక అద్భుతశక్తిని పునరుద్ధరించడానికి జన్మించింది. ఆమెను మూలకేంద్రంగా చేసుకునే మళ్ళీ గార్గులు, మైత్రేయిలు ఈ ప్రపంచంలో జనిస్తారు. ఆ మహిళా శక్తి అనుగ్రహం లేకుండా ఏవీ సాధింపబడవు.

-వేదుల జనార్దనరావు 9502469464