మెయిన్ ఫీచర్

సంక్రాంతి ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారు సంస్కృతీ ప్రియులు. సంప్రదాయబద్ధులు. ఆచార వ్యవహార పరాయణులు. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలలో పండుగలు ఒక భాగం. తెలుగువారికి ముక్కోటి దేవతలు ఉన్నట్లే, అందుకు తగినట్లుగానే పండుగలు కూడా ఉన్నాయి. చైత్ర వైశాఖాది ద్వాదశ మాస పర్యంతం, పాడ్యమి మొదలగు ముప్పది తిథులకు సంవత్సరం మొత్తంమీద ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. ఎన్ని పండగులు వచ్చినా శ్రమను లెక్కచేయకుండా, ఖర్చుకు వెనుకాడకుండా తెలుగువారు ప్రతీ పండుగను ఇనుమడించిన ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇల్లు అలికి ముగ్గులు పెట్టి ఇంటిని, పూజామందిరాలను ఆయా పండుగలకు పూజలకు అనుగుణంగా అలంకరించి ఆయా పూజలను, పండుగలను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
అయితే, పండుగలను జరుపుకోవడమనే సంప్రదాయం తరతరాలుగా, యుగయుగాలుగా నాటి నుండి నేటివరకు అప్రతిహతంగా, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో మారుతున్న కాల మాన పరిస్థితుల దృష్ట్యా క్రమేపీ ఆ సంప్రదాయం సన్నగిల్లుతూ వస్తోన్నట్లుగా కనిపిస్తోంది.
ఉదాహరణకు తెలుగువారు పెద్ద పండుగగా పిలుచుకునే ‘సంక్రాంతి’ పండుగనే తీసికొంటే- గతంలో సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందే హడావుడిమొదలయ్యేది. ధనుర్మాసం ప్రారంభమైన నాటినుండి అంటే నెల పట్టిన నాటినుండి తెలుగువారి లోగిళ్ళలో ఇంతులు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిముందు కలాపి జల్లి రంగు రంగుల రంగవల్లికలు తీర్చిదిద్దటం మొదలుపెట్టేవారు. మరోవైపు కాళ్ళకు గజ్జెలు, ఒక చేత చిఱతలు, మరొకచేత వీణ, కంఠహారాలు, నుదుట తిరునామం, తలపై భిక్షాపాత్రతో సంప్రదాయ పంచెకట్టుతో ‘హరిలో రంగ హరీ’, ‘శ్రీమద్రామాయణ గోవిందో హరి’ అంటూ హరి కీర్తనలు పాడుతూ అపర నారదునిలా హరిదాసు గ్రామంలో వీధి వీధికీ తిరుగుతూ గడప గడపన భిక్ష స్వీకరిస్తూ ప్రతీ గ్రామాన్ని వైకుంఠథామంగా మార్చేసేవాడు. దారికిరువైపులా బంతి, చామంతి పూలు స్వాగత కుసుమాంజలి సమర్పిస్తున్నట్లు తలలూపుతుంటే, తెలిమంచుతెరలను చీల్చుకుంటూ వస్తోన్న హరిదాసు రూపం కానవచ్చేది. ఆపై హరిదాసు గొంతు శ్రావ్యసుభగమై, కావ్య తరంగమై గుడి గోపురాన చిరుగంటలు గణ గణధ్వనులతో గోమాత దరిజేరే లేగదూడ మెడలోని చిరుమువ్వుల సవ్వడితో సమ్మిళితమై చిరుగాలి అలలపై తేలుతూ వచ్చి నిద్దుర మంచుతెరలను చీల్చుకుంటూ కర్ణ్భేరి ప్రహరీ దాటి గుండె గదులలో దూరి మానస తంత్రులను మీటి మేలుకొలుపు పాడేది.
సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే గ్రీటింగ్‌కార్డుల కోసం యువతీ యువకుల ఆరాటం మొదలయ్యేది. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా బాపు గీతలు, రమణ రాతలతో కూడిన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు గ్రీటింగ్ కార్డుల ఎంపిక హడావుడి మొదలయ్యేది. ఒకవైపు నూనూగు మీసాల న్నూ యవ్వనుల ఆటల పోటీలు, మరోవైపు రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి కనె్నపడతుల గొబ్బెమ్మల ముచ్చట్లు, పంట వసూళ్ళ హడావులో అటు రైతులు, అరిసెలు, పోకుండలు, సున్నుండలు, జంతికలు, చక్కిలాల వంటి సంక్రాంతి పిండి వంటల తయారీలో ఇటు గృహిణులు తలమునకలై ఉండేవారు. ఆపై బాల బాలికలకు భోగిపళ్ళు పోయడం, పెద్ద పండగ -అనగా సంక్రాంతి రోజున పెద్దలను స్మరించుకోవడం, బొమ్మల కొలువుల ఏర్పాటు, విందు భోజనాలు, కొత్త అల్లుళ్ళ అలకలు- పెద్ద పండగ పేరు సార్థమయ్యేంత హడావుడి. పండగ చివరి రెండు రోజులు -కనుమ, ముక్కనుమ రోజులలో పాడి పంటలలో తమకు చేదోడువాదోడుగా వున్న పశు సంతతి పట్ల కృతజ్ఞతగా రైతులు పశువులను, కొట్టాలను, ముఖ్యంగా ఎడ్లబండ్లను అందంగా అలంకరించేవారు. ఈమధ్యలో ‘డూడూ బసవన్న’, ‘అయ్యగారికీ దండం పెట్టు’ అంటూ గంగిరెడ్ల వాళ్ళు, ‘అంబ పలుకు జగదాంబ పలుకు’ అంటూ బుడబుక్కలవాళ్ళు, జంగమదేవరలు, పిట్టలదొదూర వంటి పగటివేషగాళ్ళు ఊరంతా సందడి చేసేవారు. సంక్రాంతి ప్రత్యేక వ్యాసాలతో కవితలు, కథనాలు, చిత్రాలతో పత్రికల ప్రత్యేక సంచికలు కళకళలాడిపోయేవి.
ఇక సంక్రాంతి సంబరాలలో చివరగా చెప్పుకుంటున్నప్పటికీ అత్యంత ముఖ్యమైనది కోడిపందేలు. అలనాటి పలనాటి వీర చరిత్రకు తార్కాణంగా బ్రహ్మనాయుడు, నాగమ్మల పౌరుషానికి ప్రతిరూపాలుగా కోడిపందేలు జరుగుతాయి.
సంక్రాంతి నెల రోజుల సందడి అంతా సంక్రాంతి పండుగ చివరి రోజున ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి సంక్రాంతి లక్ష్మికి వీడ్కోలు పలకడంతోను, అలాగే ‘‘అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల’ దాగిన వారిని సైతం తన హరినామ సంకీర్తనామృతంలో ఓలలాడించిన హరిదాసును దక్షిణ తాంబూలాదులతో సత్కరించి సాగనంపడంతోను పరిసమాప్తమయ్యేది.
అయితే ఈ సంక్రాంతి వైభవమంతా ఈనాటి టెలివిజన్, స్మార్ట్ఫోన్‌ల పుణ్యమా అని కనుమరుగైపోతోంది. తెల్లవారు జామున నిద్రలేచి ముగ్గులు వేసేవారు లేక ఇంటివాకిళ్లు వెలవెలపోతున్నాయి. నేడు సంక్రాంతి ముగ్గులు ఇంటి వాకిళ్ళల్లో కాకుండా ‘ముగ్గుల పోటీ’ ప్రాంగణాల్లో మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఇంటి ముంగిట భోగిమంటలు నాలుగు రోడ్ల కూడలిలోకి చేరిపోయి కట్టెల పొయ్యిల్లా మారిపోయాయి. హరిదాసు, గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు వంటి కళాకారులు సరైన ఆదరణ లేక బక్కచిక్కిపోయారు. ట్విట్టర్ శుభాకాంక్షలు, ఫేస్‌బుక్ పోస్టింగులు, వాట్సప్ మెస్సేజ్‌ల ఉరవడిలో గ్రీటింగ్ కార్డుల ప్రాభవం కోల్పోయాయి.
శారీరక శ్రమకు వెరసి ఇంటిలో అరిసెలు, పోకుండలు వంటి సంక్రాంతి పిండివంటల తయారీ కొండెక్కి అంగట్లో కొనితెచ్చుకోవడం లేకుంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ బుక్ చెయ్యడం వ్యవహారమైపోయింది. ఆవుపేడ, భోగి పిడకలు సైతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారంటే ఈనాటి సంక్రాంతి పండుగ పరిస్థితి ఏమిటో అర్థం చేసికోవచ్చు.
పత్రికలు సైతం ఏవో ఒకటి రెండు కవితలో, వ్యాసాలో ప్రచురించి మమ అనిపించేస్తున్నాయి. టెలివిజన్ ఛానల్స్‌వారు ఆదిలో సంక్రాంతి సంబరాలు పతిబింబించే కార్యక్రమాలు ప్రసారం చేసినప్పటికీ, ప్రజలు టెలివిజన్‌కు అడిక్ట్ అయిపోయారని, టిఆర్‌పి రేటింగ్‌లు పెరిగాయని గమనించి రాను రాను కార్యక్రమాల తీరుతెన్నులు మార్చేసి సంక్రాంతి సినిమాల తాజా విశేషాలతోను, సినిమా తారల ఇంటర్వ్యూలతోను కార్యక్రమాలను నింపేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంబరాల ఆనవాళ్ళు, ఆచారాలు ఒకటొకటిగా కనుమరుగవుతున్నప్పటికీ, నాటికి నేటికి నిలిచివున్న ఆచారం మాత్రం ఒకటి ఉంది. అదే కోడిపందేలు. ఈ కోడిపందాలు సంక్రాంతి ప్రాభవాన్ని దశదిశలా వ్యాపింపజేసి సంక్రాంతికి పేరుప్రఖ్యాతులు తెచ్చాయి. ఎంతగా అంటే సంక్రాంతి అంటే కోడిపందేలు, కోడిపందేలు అంటే సంక్రాంతి అన్నంతగా! నిజం చెప్పాలంటే నేడు తెలుగునాట క్రికెట్ పోటీలకంటే కోడిపందేలకే ఎక్కువ ఆదరణ వున్నదనటంలో అతిశయోక్తిలేదు.
సంక్రాంతి యొక్క గత వైభవాన్ని, ప్రాభవాన్ని ఏళ్ళ తరబడి ప్రత్యక్షంగా చూసినవారికి కళావిహీనమైన నేటి సంక్రాంతిని చూస్తుంటే ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?’ అని బరువెక్కిన గుండెలు, బోసిపోయిన లోగిళ్ళు ప్రశ్నిస్తున్నట్లుంటాయి.
ఈమధ్య నోస్టాల్జియా ఒక ఫ్యాషనైపోయిందని కొందరు విమర్శిస్తే విమర్శించవచ్చుగాక, వాస్తవ చిత్రమైతే ఇలాగే ఉంది. ‘‘సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా అదే తమాషా’’ అన్న కవివాక్కుకు అపప్రథ తెచ్చేలా!

- అశ్వని 99892 48635