మెయన్ ఫీచర్

నేతాజీకి జడిసి.. బ్రిటన్ దొరల పలాయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(ఈ నెల 23న సుభాష్‌చంద్ర బోస్ జయంతి)
మనమెంతో ఘనంగా ప్రచారం చేసుకొంటున్న 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం ఒక విధంగా ఘోర వైఫల్యమే. ఆ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు దారుణంగా అణచి వేశారు. ఎక్కువ కాలం ఆ పోరాటాన్ని మనం కొనసాగించలేక పోయాం. పోరాటాన్ని నిలిపి వేస్తున్నట్లు స్వయంగా గాంధీజీ ప్రకటించారు. ఇప్పట్లో ఇక స్వాతంత్య్రం వచ్చే అవకాశం లేదని నాటి నేతలు నిరాశకు గురయ్యారు. దీర్ఘకాలిక పోరాటం అవసరం అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే, ఆ తర్వాత ఐదేళ్లకే మనం స్వాతంత్య్రం సాధించడం నాటి జాతీయ నాయకులకు ఒక విధంగా ఆశ్చర్యకర పరిణామమే. రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బ తిన్న బ్రిటిష్ వారు ఇంకా ఇక్కడ ఉండలేక వెళ్లిపోయారులే... అని ఆ జాతీయ నాయకులు సరిపె ట్టుకొనే ప్రయత్నం చేశారు. అయితే క్విట్ ఇండియా ఉద్యమం వల్ల గాని, ఆ తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్వంలో జరిగిన పోరాటాల వల్ల గాని బ్రిటిష్ వారు వెళ్లలేదన్నది వాస్తవం. అందుకు నేతాజీ సుబాష్ చంద్రబోస్ మాత్రమే కారణం అని చెప్పవచ్చు. అప్పటికి ఆయన జీవించి ఉన్నారా? మరణించారా? అనే వాదనలు ఒక ప్రక్క కొనసాగుతున్నా అయన పేరే బ్రిటిష్ వారిని భయ భ్రాంతులకు గురిచేసింది. ఇంకా భారత్‌లో ఉంటె తమకు చావు తప్పదనే నిర్ణయానికి వచ్చి, ఒక విధంగా చెప్పాలంటే ఏకపక్షంగా వారు తోక ముడిచారని చెప్పక తప్పదు.
నేతాజీ ఏర్పాటు చేసిన ఆజాద్ హిందూ ఫౌజ్ ఉనికి బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పుట్టించింది. ప్రముఖ మిలిటరీ చరిత్రకారుడు జీడీ బక్షీ తన గ్రంథంలో నేతాజీ ఏర్పాటు చేసిన భారత జాతీయ సైన్యం కారణంగానే స్వాతంత్య్రం వచ్చిందని స్పష్టం చేశారు. 1947లో భార తదేశానికి స్వాతంత్య్రం ప్రకటిస్తూ బ్రిటిష్ పార్లమెంట్‌లో అప్పటి బ్రిటన్ ప్రధాన మంత్రి క్లైమెంట్ అట్లీ తెలిపిన ఆసక్తికర వివరాలను బక్షీ ఉటంకించారు. 1956లో లేబర్ పార్టీ నాయకుడిగా భారత్ దేశ పర్యటనకు వచ్చిన అట్లీ కలకత్తాలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జస్టిస్ పీబీ చక్రవర్తి వద్ద అతిథిగా రెండు రోజులు ఉన్నారు. ఆ సమయంలో కలకత్తా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చక్రవర్తి యాక్టింగ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. అట్లీతో జరిపిన సంభాషణ గురించి ‘ఏ హిస్టరీ ఆఫ్ బెంగాల్ ’ గ్రంధం రచించిన ఆర్‌సీ మజుందార్ పుస్తకం ప్రచురించిన ప్రచురణకర్తలకు ఒక లేఖ వ్రాసారు. అందులో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు....
‘నేను యాక్టింగ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనను ఉపసంహ రించుకున్న లార్డ్ అట్లీ భారత దేశ పర్యటనలో కలకత్తాలోని గవర్నర్ ప్యాలస్ లో రెండు రోజులపాటు గడిపారు. ఆ సమయంలో బ్రిటిష్ వారు భారత్ నుండి తిరిగి వెళ్లడం గురించి నేను సుదీర్ఘంగా చర్చించాను.
గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం నీరు కారిపోవడం, 1947లో వత్తిడి తెచ్చే పరిస్థితులు ఏమీ లేకపోయినా బ్రిటిష్ వారిని దేశం వదిలి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని నేను సూటిగా ప్రశ్నించాను. అందుకు సమాధానంగా అట్లీ పలు కారణలను ఉదహరించారు. ప్రధాన కారణం నేతాజీ మిలిటరీ కార్యకలాపాల కారణంగా భారత సైన్యం, నావికాదళంలో బ్రిటిష్ రాణి పట్ల విధేయత బాగా పడిపోవడం అని చెప్పారు. నా సంభాషణల చివరిలో భారత్‌ను వదలాలన్న బ్రిటిష్ వారి నిర్ణయంపై గాంధీజీ ప్రభావం ఏ మేరకు ఉన్నదని అట్లీని అడిగాను. అట్లీ వ్యంగ్యంగా నవ్వుతూ- చాలా తక్కువ’ అని మాత్రమే చెప్పారు.
ఈ సంచలన సంభాషణ మొదట 1982లో ఇని స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ రివ్యూ’లో రంజన్ బొర్రా ప్రచురించారు. అట్లీ మాటల ప్రాధాన్యత గురించి తెలుసు కోవాలంటే మనం 1945కు వెళ్ళాలి. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. బ్రిటన్, అమెరికాల నాయకత్వంలోని మిత్ర రాజ్యాలు విజయం సాధించాయి. జర్మనీ నియంత హిట్లర్ నాయకత్వంలోని రాజ్యాలు తుడిచి పెట్టుకు పోయాయి. దాంతో గెలుపొందిన వారు పరాజయం చెందిన సైనికులను శిక్షించాలని ని ర్ణయించారు. భారత దేశంలో నేతాజీకి చెందిన భారత జాతీయ సైన్యానికి చెందిన అధికారులపై రాజద్రోహం, చిత్ర హింసలు, హత్యలు వంటి నేరాలపై విచారణ చేపట్టారు. వరుసగా జరిగిన ఈ కోర్ట్ మార్షల్స్ ను ‘ రెడ్ ఫోర్డ్ టైల్స్’ అని పిలిచేవారు. ఈ విచారణ పట్ల బ్రిటిష్ సైన్యంలోని భారతీయులు ఆగ్రహంతో ఊగిపోతూ ఉండేవారు. 1947 ఫిబ్రవరిలో రాయల్ ఇండియన్ నేవీకి చెందిన సుమారు 20 వేల మంది నావికులు బ్రిటిష్ ఎంపైర్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపారు.
నేతాజీ ఫోటోలు పెట్టుకొని ముంబై అంతా తిరుగుతూ బ్రిటిష్ వారిని జైహింద్ వంటి నినాదాలు ఇవ్వమని వత్తిడి చేశారు. తమ తోటలోని బ్రిటిష్ పతాకాలను చించి వేశారు. అటువంటి తిరుగుబాట్లు జబల్పూర్‌లోని రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ యూనిట్‌లలో కూడా జరిగాయి. వీటితో బ్రిటిష్ వారు భయభ్రాంతులకు గురయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 25 లక్షల మంది భారతీయ సైనికులను బ్రిటిష్ సైన్యం నుండి పంపి వేశారు.
భారతీయ సైనికులు ఆగ్రహంగా ఉన్నారని, తమ బ్రిటిష్ అధికారుల పట్ల విధేయత ప్రదర్శించడం లేదని 1946 నాటి బ్రిటిష్ మిలిటరీ నిఘా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితులలో బ్రిటిష్ వారు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. భారత దేశంలో తమ మనుగడ ప్రమాదంలో పడినదని గ్రహించారు. ఈ కథనాలు భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి నాయకులు చేసిన పోరాటాలను తక్కువ చేయడానికి మాత్రం కానేకాదు. అయితే- నిర్ణయాత్మక ప్రభావం చూపిన భారత జాతీయ సైన్యం గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎక్కడా కనిపించదు. అందుకనే చారిత్రిక వాస్తవాలను దేశం ముందు ఉంచవలసి ఉంది.
అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి భారత్ కు మాత్రమే కాకుండా మొత్తం ఆసియా, పసిఫిక్ లలో 60 దేశాలు స్వాతంత్య్రం పొందడానికి కారకులైన నేతాజీ పట్ల ఒక విధంగా మన దేశంలోని సమకాలిక నేతలు అడుగడుగునా అవమానకరంగా వ్యవహరించడం దుర దృష్టకరం. దాదాపుగా వారంతా బ్రిటిష్ వారిని ప్రాధేయపడి, వారిని మెప్పించి, వత్తిడి తెచ్చి స్వాతంత్య్రం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పోరాటమే మార్గమని మొదటిగా స్పష్టం చేయడమే కాదు, ఆ దిశలో నిర్ణయాత్మకంగా అడుగులు వేసిన ఏకైక నేత నేతాజీ. అందుకనే ఇప్పటికీ భారత ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మహాత్మా గాంధీ స్వయంగా ఒక అభ్యర్థిని నిలబెడితే కాదని, ఎదురుగా నిలబడి గెలుపొందగలిగిన ధైర్యశాలి నేతాజీ. ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ చూసిన మిగిలిన నేతలు ఈర్శ్య అసూ యలతో చాల సంకుచితంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. గాంధీ, నేతాజీ, పటేల్ వంటి వారు అనుసరిస్తున్న మితవాద విధానాల పట్ల నేతాజీ మాత్రమే కాదు మొత్తం దేశ ప్రజలు అందరూ ఆ సమయంలో అసహనం వ్యక్తం చేయసాగారు. సంపూర్ణ స్వరాజ్యం కోసం స్పష్టమైన పిలుపు ఇవ్వలేక పోయారు. భారత దేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించాలని అంటూ రాజీ ధోరణి ప్రదర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి మడ్దతు ఇవ్వడం, ఖిలాఫత్ ఉద్యమానికి అండగా నిలబడటం చారిత్రకంగా జరిగిన పెద్ద పొరపాట్లను అంగీకరించాలి.
ఇటువంటి ధోరణులను మొదటి నుండి నేతాజీ నిరసించారు. భారత దేశానికి సంపూర్ణ స్వరాజ్యం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తూ వచ్చారు. అందుకనే బ్రిటిష్ పాలకులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచితే, ఆయన తప్పించుకొని జర్మనీకి వెళ్లి పోయారు. అక్కడి నుండే- భారత్ నుండి బ్రిటిష్ వారిని పంపి వేయడం కోసం వ్యూహాత్మకంగా జర్మనీ, జపాన్ వంటి దేశాల మద్దతు కూడదీసుకునే ప్రయత్నం చేశారు. ఒక విదేశీ గడ్డ మీద నుండి ఒక సైన్యాన్ని సృష్టించడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన. ఈ సందర్భంగా నేతాజీ ప్రదర్శించిన నైపుణ్యం, ధైర్య సాహసాలు ప్రపంచ చరిత్రలో ఎవ్వరితో పోల్చలేనివి. యుద్ధంలో జర్మనీ బలహీనమవుతున్న సమయంలో జపాన్‌కు వెళ్లి తన సైన్యాన్ని మన దేశ సరిహద్దు వరకు తీసుకు వచ్చారు. అయితే స్వతంత్ర భారత పాలకులు నేతాజీ పట్ల నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందారంటే- అది ఏ విధంగా జరిగిందన్న ఆసక్తిని కూడా మన నేతలు కనపరచ లేదు. టోక్యోలోని ఒక దేవాలయం వద్ద ఆయన చితాభస్మం భద్రపరచబడి ఉన్నదంటే దానిని తీసుకొచ్చి, డీఎన్‌ఏ పరీక్ష చేసే ప్రయత్నం చేయనే లేదు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎటువంటి విమాన ప్రమాదం జరగ లేదని తైవాన్ ప్రభుత్వం అంటుంటే- అక్కడికి వెళ్లి వాస్తవాలను సేకరించే ప్రయత్నం జరగనే లేదు. ఒక మహాయోధుడి పట్ల ప్రపంచంలో మరే దేశం ఇంత నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించి ఉండదు.

-చలసాని నరేంద్ర