మెయిన్ ఫీచర్

మానవత్వమే మహోన్నతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మఠం’ అంటే నిత్యపూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, స్తోత్ర పారాయణలు కాదు.. మానవసేవలో తరించాలన్నదే ఆయన ఆకాంక్ష. మతం, కులం, రాజకీయాలకు అతీతంగా మానవత్వం మూర్త్భీవించిన పరిపూర్ణ వ్యక్తిగా ఆయన జనం గుండెల్లో నిలిచారు. ‘కాయక’ (శారీరక శ్రమ), ‘దాసోహ’ (సమర్పణా భావం) అనే రెండు సద్గుణాలను ఆచరించి ఆయన తన జీవితాన్ని పునీతం చేసుకున్నారు. సామాజిక, విద్య, సేవారంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించినందునే కోట్లాదిమంది ప్రజలు ఆయనను ‘నడిచే దేవుడి’గా ఆరాధిస్తారు.
111 ఏళ్ల వయసులో శివైక్యం చెందిన తుమకూరు సిద్దగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ తన జీవితాంతం అభాగ్యుల సేవలో తరించారు. ఆకలిదప్పులతో అలమటించేవారి కోసం, విద్యాగంధానికి నోచుకోని వారి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మానవత్వమే గొప్ప మతమని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఆయన తన మఠాన్ని మహా విశ్వవిద్యాలయంగా మార్చారు. ‘త్రివిధ దాసోహి’, ‘ఆధునిక బసవణ్ణ’, ‘నడిచే దేవుడి’గా జన నీరాజనాలందుకొన్న స్వామీజీ నిరంతర సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. కీర్తిప్రతిష్టలకు, ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూనే పేదరికం, ఆకలి, సామాజిక రుగ్మతల నిర్మూలనకు తుది శ్వాస వరకూ కృషి చేశారు. అన్ని మతాలు, సామాజిక వర్గాలకు చెందిన కోట్లాదిమంది భారతీయులు గౌరవించే అత్యంత పూజనీయుడు అయిన ఆయన సామాజిక మార్పును తీసుకొచ్చారు.
ధర్మసత్రంలో ఉంటూ చదువు..
శివకుమార స్వామీజీ మాగడి తాలూకాలోని వీరాపురలో 1907 ఏప్రిల్ 1న జన్మించారు. పాఠశాల విద్యను అభ్యసిస్తుండగా తల్లి మరణించడంతో ఆయన తుమకూరులోని తన అక్క ఇంట్లో పెరిగారు. 1922లో అప్పటి సిద్దగంగ మఠాధిపతి శ్రీ శివయోగి వద్ద ఆధ్యాత్మిక సాధనకు శ్రీకారం చుట్టారు. రావ్ బహద్దూర్ గుబ్బితోట ధర్మసత్రంలో ఉంటూ ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సిద్దగంగ మఠం కార్యకలాపాలతో మమేకమయ్యారు. 1930లో శ్రీ శివయోగి శివైక్యం చెందడంతో శివకుమార స్వామీజీ మఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని యోగ సాధన చేసేవారు. ఉదయం ఏడు గంటలకు భక్తులకు దర్శనం ఇచ్చి ఆశీర్వదించేవారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12-30 గంటల వరకూ భక్తుల యోగక్షేమాలను విచారించేవారు. చిన్నారుల క్షేమం కోసం ఆయన ఎంతగానో పరితపించేవారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకోవాలని, వేళకు భోజనం చేయాలని చెప్పేవారు. ఎన్ని పనులున్నా నిత్యం శివపూజ చేసేవారు. లక్ష గంటల పాటు శివపూజ చేసి ఆయన సంచలనం సృష్టించారు. సంస్కృత భాష పరిరక్షణ కోసం అకుంఠిత దీక్షతో కృషి చేశారు.
పేదపిల్లలకు విద్య..
సిద్దగంగ మఠంలో తొలిసారిగా 500 మంది పిల్లలకు విద్యాదాన కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించగా, ఇపుడు అక్కడ చదువుకొన్న విద్యార్థుల సంఖ్య ఏడున్నర లక్షలను మించిపోయింది. ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా స్థిరపడ్డారు. కులం, మతం, వర్గం అనే తారతమ్యం లేకుండా పేద పిల్లలందరికీ విద్యను అందించాలన్న ఆయన సంకల్పం ఫలించింది.
దానమే ‘దాసోహం’
లింగాయత్ సామాజిక వర్గానికి ఆరాధ్యుడైన బసవేశ్వరుడు చెప్పిన మాటలను శివకుమార స్వామీజీ ఆచరణలో పాటిస్తూ ఆదర్శప్రాయుడిగా నిలిచారు. బసవణ్ణ బోధనల మేరకు ప్రతి వ్యక్తీ తన జీవనం కోసం పనిచేయాలని, ఇతరుల సంపాదన కోసం ఆశపడరాదని ఆయన ఉద్బోధించేవారు. ఎంతగా సంపాదించినా నిరాడంబరంగా బతకాలని, సమాజానికి ఎంతోకొంత దానం చేయాలని భక్తులకు హితవు చెప్పేవారు. దానమే ‘దాసోహం’ అని ఆయన అభివర్ణించేవారు. ‘దాసోహం’ పేరిట ఆయన సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు ఇతరుల నుంచి సేకరించిన ధనాన్ని, ఆహార ధాన్యాలను పేద ప్రజల కోసం వెచ్చించారు. నిరుపేద పిల్లలకు విద్యనందించేందుకు, అభాగ్యులకు ఆకలి బాధ తీర్చేందుకు మాత్రమే ఆయన తొలి ప్రాధ్యాన్యం ఇచ్చేవారు. ఎన్నో విషయాలపై అవగాహన ఉన్నప్పటికీ స్వామీజీ తక్కువగా మాట్లాడేవారు. ఇతరులు చెప్పే విషయాలను వినేందుకు ఎక్కువ సమయం కేటాయించేవారు. ఆర్భాటంగా ఆలయాలను నిర్మించడం కన్నా, భారీ ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం కన్నా మంచి పుస్తకాలతో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించేవారు. పిల్లలకు విద్యతో పాటు శుచికరమైన భోజనం అందించాలని భక్తులకు చెప్పేవారు. సిద్దగంగ మఠం ఆధ్వర్యంలో ఏటా సుమారు తొమ్మిది వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతులను అందించేలా ఆయన శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల చదువుకు అనుగుణంగా విశాలమైన హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయించారు. దశాబ్దాల క్రితం ఆయన తుమకూరు సమీప గ్రామాల్లోకి స్వయంగా వెళ్లి బియ్యం, ఆహార ధాన్యాలను, కూరగాయలను సేకరించేవారు. స్వామీజీ పడుతున్న కష్టాలను చూసి కొన్నాళ్లకు గ్రామాల్లోని వ్యాపారులు, సంపన్నులు నేరుగా మఠానికి బియ్యం, కూరగాయలు చేరవేయడం ప్రారంభించారు. వందకు పైగా విద్యాసంస్థలను మఠం ఆధ్యర్యంలో నడుపుతూ పేద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసేవారు. తుమకూరు, హసన్, బెంగళూరు రూరల్ జిల్లాలకు చెందిన సుమారు మూడు వేల గ్రామాల నుంచి పీఠానికి ఆహార ధాన్యాలు అందుతున్నాయి. ప్రతిరోజూ మూడు గ్రామాల నుంచి నిత్యావసర సరకులు అందుతుంటాయి. నిర్ణీత తేదీల ప్రకారం ఈ గ్రామాల వారు ఆహార పదార్థాలను భక్తిశ్రద్ధలతో మఠానికి చేరవేయడం ఆనవాయితీగా మారింది. వివిధ కులాలు, మతాలు, సామాజిక వర్గాలకు చెందిన వారు మఠానికి ఆర్థికంగా, వస్తు రూపంలో విరాళాలు ఇస్తుంటారు.
హృదయంలోనే దైవం..
తెల్లవారు జామునే నాలుగు గంటలకు నిద్రలేచి ‘ఇష్ట లింగ’ అర్చన చేయడం స్వామీజీకి అలవాటు. అరచేతిలో చిన్న లింగాన్ని ఉంచుకొని ధ్యానం చేసేవారు. మఠం ఆవరణలో నిర్మించిన ఆరు ఆలయాలను ప్రతిరోజూ సందర్శిస్తూ భక్తులను కలుసు కునేవారు. అయితే, పూజలు చేయాలని మాత్రం ఆయన గుడులకు వెళ్లేవారు కాదు. ఆలయాలంటే భక్త్భివం ఉన్నా, తన అరచేతిలోనే దైవం ఉందని భావించి మనసులోనే ప్రార్థన చేసేవారు. తనకు, దైవానికి మధ్య ఆలయం గాని, పూజారి గాని, మరో మధ్యవర్తి గాని ఉండరాదని విశ్వసించేవారు. అన్ని విషయాల్లోనూ పురుషులకు దీటుగా మహిళలకు సమానత్వం దక్కాలని ఆరాటపడేవారు. రుతు సమయంలో మహిళలను ఆధ్యాత్మిక కార్య్రకమాలకు దూరంగా ఉంచాలన డాన్ని స్వామీజీ నిరసించారు. కుల వివక్షకు అతీతంగా పిల్లలకు చదువు చెప్పించేవారు.
మతం కంటే మానవత్వం గొప్పదన్న భావం ఉన్నపుడే మానవాళి నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని భక్తులకు స్వామీజీ చెప్పేవారు. లింగాయత్‌లే కాదు, అన్ని సామాజిక వర్గాల వారూ ఆయనను ఆరాధించేవారు. ఎంతోమంది నాయకులు మఠానికి వచ్చినా, రాజకీయ పార్టీల ప్రభావం తనపైన, మఠంపైన పడకుండా ఆయన జాగ్రత్త పడేవారు. లింగాయత్‌లకు ‘మతపరమైన ప్రత్యేక హోదా’ అనే అంశంలో రాజకీయ కోణాలున్నట్లు స్వామీజీ గమనించారు. లింగాయత్‌లకు ప్రభుత్వం ‘ప్రత్యేక హోదా’ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ప్రాధాన్యత లేని అంశంగానే ఆయన పరిగణించారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వమే ఆయన విజయ రహస్యం అయింది. ‘మానవత్వమే మిన్న’ ఆయన బోధన అందరికీ శిరోధార్యం.

-ఎస్‌ఆర్