మెయన్ ఫీచర్

‘సత్వర న్యాయం’ సాకారం ఎపుడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై ఏళ్ల వయసు దాటినా ‘తుది డిగ్రీ’ కోసం రాహుల్ పాథక్ ఇంకా దమ్రాన్ సివిల్ కోర్టులో పోరాటం చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘నేషనల్ జ్యుడీషియల్ డేటాగ్రిడ్’ను పరిశీలిస్తే 1951 మే 5న ఆయన తుది డిగ్రీ కోరుతూ వేసిన పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. 60 ఏళ్లు దాటిన కేసులు దేశంలో 140 వరకూ పెండింగ్‌లో ఉండగా, 58 ఏళ్లు దాటినవి 1800, 40 ఏళ్లు దాటినవి 13వేలు, 37 ఏళ్లు దాటినవి 51 వేల కేసులు కోర్టుల్లో మూలుగుతున్నాయి. సుప్రీం కోర్టులో 57,987 కేసులతో పాటు దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో 43 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దిగువ న్యాయస్థానాలతో కలిపి చూస్తే 3.3కోట్ల కేసులు విచారణలో ఉన్నాయి.
అత్యధికంగా యూపీలో 61.58 లక్షలు, మహారాష్టల్రో 33.22 లక్షలు, బెంగాల్‌లో 17.59 లక్షలు, బిహార్‌లో 16.58 లక్షలు, గుజరాత్‌లో 16.45 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త కేసులు నమోదు కాకుండా ఇవన్నీ పరిష్కారం కావాలంటే కనీసం 324 సంవత్సరాలు పడుతుందని ఒక సంస్థ అంచనా వేసింది. అన్ని స్థాయిల్లో కోర్టులకు సంబంధించి తక్షణం అన్ని సౌకర్యాలూ కల్పించాలంటే రూ. 54 వేల కోట్లు కావాలి. ఇదంతా వింటుంటే గుండె తరుక్కుపోవడం ఖాయం.
న్యాయవ్యవస్థలో సమూల మార్పులు జరిగినప్పుడే సామాన్యులకు సత్వర న్యాయం దక్కుతుందని అఖిల భారత న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. సత్వర న్యాయం అందించే దిశగా న్యాయవ్యవస్థలో సంస్కరణలు ఎన్ని వస్తున్నా ఈ ప్రక్రియ అనునిత్యం కొనసాగాల్సిందేనని ఆయన చెప్పారు. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ చాలామంది సుప్రీం కోర్టు వరకూ వెళ్తున్న నేపథ్యంలో కేసుల విచారణలో జాప్యం జరగడంతో సామాన్యులకు న్యాయం అందడం లేదు. జిల్లా స్థాయిలోనే తుది తీర్పు ఇచ్చే వ్యవస్థ అవసరమనే చర్చ ఇపుడిపుడే మొదలైంది. కాలం చెల్లిన బ్రిటిష్ కాలం నాటి విధానాలు కూడా జాప్యానికి కారణం అవుతున్నాయి. పోలీసులు సమర్పించే ఆధారాలతో శిక్షలు పడినా, కొందరు పలుకుబడి, అధికారం ఉపయోగించుకుంటూ శిక్షల నుండి తప్పించుకుంటున్నారు.
భారత్‌లో ఉన్నంత అత్యంత పకడ్బందీ న్యాయ వ్యవస్థ ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. అయినా కోర్టు మెట్లు ఎక్కడం అంటే జీవితం కాలిపోయినట్టే అని చలనచిత్రాల్లో చూపిస్తుంటారు. ఎప్పటికైనా న్యాయం గెలిచితీరుతుందనే సామాన్యుడి నమ్మకాన్ని న్యాయస్థానాలు నిలుపుకుంటూనే ఉన్నా, ధైర్యాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నాయనేది నిస్సందేహం. సర్వోన్నత న్యాయస్థానం సైతం అనేక మార్లు సకాలంలో న్యాయం అందించడంలో దిగువ స్థాయి కోర్టులు క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని నిలదీసిన సందర్భాలు ఎన్నో. హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో సైతం ఒకటి రెండు నెలల్లో శిక్ష పడాల్సిన కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో మూలుగుతున్నాయి. 40 ఏళ్ల వ్యక్తిపై నమోదైన హత్యానేరం రుజువుకావడానికి 30 ఏళ్లు పడుతోంది. దీనివల్ల సాధించిన ప్రయోజనం ఏమీ ఉండటం లేదు. శిక్ష పడిన మరుసటి రోజే కొందరు దోషులు- రిమాండ్ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో విడుదలవుతున్నారు.
న్యాయం సకాలంలో అందకపోవడానికి న్యాయాధికారులే కారణం కాదు. న్యాయం అందకపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. నిష్కారణంగా న్యాయస్థానాలను నిందించుకుంటున్నామనేది ఎవరికీ అంతుచిక్కని విష యం. దీర్ఘకాలిక వ్యాజ్యాలకు కారణం చట్టం పట్ల అవగాహన, అనుభవం లోపించడం ప్రధాన కారణమైతే ఇంకో కారణం వివిధ వ్యవస్థల నిస్తేజం, నిస్పృహ అనేది సుస్పష్టం. సమాజం, ప్రభుత్వం, పాలనావ్యవస్థ, వ్యాజ్యాలు వేసేవారు, కక్షిదారులు, న్యాయస్థానాల్లో ఖాళీలు, వేతనాలు, కోర్టు భవనాలు, కోర్టు విచారణ హాళ్లు, సహాయక సిబ్బంది కొరత, ఐసీటీ లోపం, అన్నింటికీ మించి వౌలిక వసతులు వంటివి ఈ జాప్యానికి హేతువులు. ఇవేవీ సామన్యులకు కనిపించడం లేదు.
కేవలం కోర్టులు సకాలంలో తీర్పులు ఇవ్వడం లేదనే నింద వేయడం వినా మిగిలిన పరిస్థితులు ఎవరికీ అంతుపట్టడం లేదు. న్యాయస్థానాలలో సౌకర్యాలు, సదుపాయాలు తమకెందుకు పట్టాలి అన్నట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం, నామమాత్రపు నిధులతో చేతులు దులుపుకోవడం, వౌలిక సదుపాయాల కల్పనలో మొండిచేయి చూపడం.. ఇవన్నీ న్యాయస్థానాలపై నమ్మకాన్ని క్షీణించేలా చేస్తున్నాయి.
జయలలిత కేసు, సల్మాన్ ఖాన్ కేసు, శశికళ కేసు వంటివి దశాబ్దాల తరబడి కొనసాగడంతో చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. పలుకుబడి ఉన్న వారు తాము కోరుకున్నట్టు న్యాయస్థానాల నుండి తీర్పులను రాబట్టుకోగలుగుతారేమో అనే అనుమానం కలిగేలా కొన్ని తీర్పుల తీరు ఉంటోంది. చట్టం, న్యాయం ఓడిపోయి.. రాజకీయం- పలుకుబడి గెలుస్తాయనడానికి ఉదాహరణగా అనేక సంఘటనలు మన కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఏళ్ల తరబడి నడిచిన సల్మాన్‌ఖాన్ కేసు విషయం తీసుకుంటే సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తే హైకోర్టు దానిని రద్దు చేసింది. పదమూడేళ్ల పాటు నడిచిన కేసులో తుది తీర్పు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఎందుకు జరుగుతోంది..? ఆయేషా హత్య కేసు సంగతి చూస్తుంటే ఇంతకాలంగా జరిగిన విచారణ అంతా ఏమైంది? చాలా కేసులు 20-30 ఏళ్లు గడచిన తర్వాత కోర్టుల్లో వీగిపోతుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? ఇంతకాలం జరిగిన వ్యయానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? ఇవన్నీ ఆలోచించుకుని సామన్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో సైతం దశాబ్దాల తరబడి ఎన్నో కేసులు అతీగతీ లేకుండా ఉన్నాయి.
ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం మాలిక్ మజార్ సుల్తాన్, ఇతరుల కేసు (సీఏ 1867/2006) విచారణ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో కల్పించిన వౌలిక వసతులు, నిధుల కేటాయింపుపై చర్చ జరిగింది. అన్ని రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులు హాజరై తమ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను వివరించినపుడు ఆశ్చర్యపోవడం ధర్మాసనం వంతైంది. న్యాయస్థానాల్లో సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం మేర నిధులను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం మేర నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా వంద శాతం నిధులను రాష్ట్రాలు వెచ్చిస్తే ‘యూటిలైజేషన్ సర్ట్ఫికెట్ల’ను పొందిన తర్వాత తమ వాటాను కేంద్రం విడుదల చేస్తూ వస్తోంది. రాష్ట్రాలు నిధులను వెచ్చించడం లేదు కనుక తాము ఇవ్వడం లేదని కేంద్రం, నిధులు రావడం లేదు కనుక వెచ్చించ లేకపోతున్నామని రాష్ట్రాలు పేర్కొనడం గమనార్హం.
ఈ కేసులు అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న విజయ్ హన్సరాజ్ కోర్టు ముందు కొన్ని వాస్తవాలు ఉంచారు. బిహార్‌కు కేంద్రం గత నాలుగేళ్లలో రూ. 204.03 కోట్లు విడుదల చేయగా, అదే కాలంలో ఒడిశాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్రాలకు నిధులను ఇవ్వడంలో కేంద్రం అనుసరిస్తున్న వివక్షపై ధర్మాసనం ముందు సుదీర్ఘ చర్చ జరిగింది. సీనియర్ న్యాయవాదులు స్నేహా కలిత, అవినాష్ పాండేలు ధర్మాసనం దృష్టికి ఈ విషయాన్ని తెచ్చినపుడు దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని రంజన్ గొగాయ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించారు. ఒడిశా, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, బిహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాలలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ప్రాథమిక నివేదికలు ఇచ్చాయి. అన్ని రాష్ట్రాల్లో న్యాయమూర్తుల కొరత, భవనాల కొరత, సహాయక సిబ్బంది కొరత, వౌలిక సదుపాయాల లేమి సుస్పష్టం. దేశంలో తక్షణం 5వేల మంది న్యాయాధికారులను నియమించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించడానికి రాష్ట్రాల వారీ ఇన్‌చార్జిలను కూడా నియమించింది. శ్యాందివాన్, కేవీ విశ్వనాధన్, విజయ్ హన్సరియా, గౌరవ్ అగర్వాల్‌లను అమికస్ క్యూరీలుగా నియమించింది. దివాన్‌కు యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలను అప్పగించింది. విశ్వనాథన్‌కు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, కర్నాటక, కేరళలను, హన్సారియాకు మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ , హర్యానా హైకోర్టుల బాధ్యతలు, అగర్వాల్‌కు రాజస్థాన్ , సిక్కిం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించింది. ఇదంతా సవ్యంగా సకాలంలో జరిగితే తప్ప సామాన్యుడికి సత్వర న్యాయం అందని ద్రాక్షే అవుతుంది.

చిత్రం..తి జస్టిస్ రంజన్ గొగోయ్

-బీవీ ప్రసాద్ 98499 98090