మెయన్ ఫీచర్

కాంగ్రెస్ లేకుండా ‘కాషాయం’పై పోరు ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఇటీవల కోల్‌కతలో జరిగిన మహార్యాలీలో విపక్ష పార్టీల డొల్లతనం మరోసారి బహిర్గతమైంది. ఈ ర్యాలీలో నేతల ప్రసంగాల తీరు చూస్తే- ‘బీజేపీ మతతత్వ విధానాలను భరిస్తాం కాని ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపే దాకా నిద్రపోం..’ అనే సంకేతాలు ఇచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన అజెండాను ఖరారు చేయడంలో విపక్ష నేతలు విఫలమయ్యారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాయావతి వంటి అగ్రనేతలు మమత జరిపిన ర్యాలీకి గైర్హాజరు కావడంతో విపక్షాల ఐక్యతపై అనుమానాలు బయలుదేరాయి. కాగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పాతికేళ్ల క్రితమే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ సహా అన్ని పార్టీలను కలుపుకుని విజయం సాధించారు. ఎన్టీఆర్ చొరవ వల్లనే 1989లో వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. కేరళ, బెంగాల్ లేదా ఏ ఉత్తరాది రాష్ట్రం నేతనో ఇటువంటి ర్యాలీ నిర్వహిస్తే అదేదో గొప్ప రాజకీయ సభ అయినట్లు, ఆ ప్రాంతం వారే మహానేతలనే భ్రమలు చాలామందికి ఉన్నాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కాంగ్రెస్‌ను గద్దె దించాలంటే ఏమి చేయాలో చేసి చూపించారు.
కోల్‌కత ర్యాలీ సరైన నాయకత్వాన్ని దేశానికి చూపించిందా? 1983-1989 మధ్య కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష పార్టీని ఎన్టీఆర్ నిర్మించారు. అందుకే 1984 పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ 1989 ఎన్నికల్లో చిత్తుగా ఓటమి చెందింది. ఆనాడు కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ ఢీకొన్నట్టు- ఇపుడు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు నేత దేశంలో ఎవరూ లేరు. ఈ విషయం కోల్‌కత ర్యాలీతో స్పష్టమైంది.
1980,90 దశకాల్లో అన్ని పార్టీల్లో సిద్ధాంత భావజాలం ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్ వామపక్షాలను, బీజేపీని ఒక వేదికపైకి తెచ్చారంటే ఆషామాషీ కాదు. ఎన్టీఆర్ రాజకీయాలకు అప్పట్లో విశ్వసనీయత ఉండేది. ఇటీవల మమతా బెనర్జీ నిర్వహించిన మహార్యాలీలో అలాంటి విశ్వసనీయత కనిపించ లేదు. రాజకీయ లక్ష్యాలు ఏమైనప్పటికీ విపక్ష పార్టీలు ఒక వేదికపైకి రావడం మంచి పరిణామమే కానీ, ఈ వేదికపై జతకట్టిన పార్టీలకు ఉన్న అర్హత ఏమిటి? వీటికి సిద్ధాంత నిబద్ధత ఉందా? మహార్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మొక్కుబడిగా ఆహ్వానించారు. అవకాశం ఉంటే రావాలనే రీతిలో ఆహ్వానం పంపారు. అందుకే రాహుల్ ఈ సభకు హాజరుకాలేదు. తమ పార్టీ తరఫున సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను పంపారు. బీజేపీని ఓడించాలంటే తన నాయకత్వంలో ఏర్పడే కూటమికి ఓట్లు వేయాలని మమతా బెనర్జీ సందేశం ఇచ్చారు. ఎన్నికల తర్వాత మాత్రమే ప్రధానమంత్రి ఎవరన్నది తేలుస్తామని ఆమె అన్నారు. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి మహార్యాలీని నిర్వహించినా, తమ కూటమిని గెలిపిస్తే ఫలానా నేత ప్రధానమంత్రి అవుతారని ఎందుకు ప్రకటించలేకపోయారు?
నాయకత్వం లేని కూటమిని ప్రజలు నమ్మరు. ర్యాలీకి హాజరైన నేతల్లో ప్రధాని పదవిని చేపట్టేందుకు అర్హతలున్న నేతలు లేకపోలేదు. కాని వారిని ఎందుకు పట్టించుకోలేదు? 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు తగరా? ర్యాలీకి హాజరైన నేతల్లో ఎక్కువ అనుభవం ఉన్న నేత చంద్రబాబు. మమత వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. వామపక్షపార్టీలపై 20 ఏళ్లు పోరాటం చేసిన ఘనత ఆమెకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కనపడలేదా? వయోభారం మీదపడినా ప్రధాని పదవి వరిస్తుందనే ఆశతో ఉన్న మరాఠా యోధుడు శరద్ పవార్ కూడా ర్యాలీకి హాజరయ్యారు. ర్యాలీకి హాజరైన వారిలో నలుగురు మాత్రమే జనాదరణ ఉన్న నేతలు. మిగతా నేతలు వారి సొంత రాష్ట్రాలకే పరిమితం. అయినా కాంగ్రెస్‌కు ప్రాధాన్యత లేని కూటమితో బీజేపీని ఓడించాలనుకోవడం పగటి కలే!
ఈ రోజుల్లో మహార్యాలీలకు జనం స్వచ్ఛందంగా వస్తారా? ఎంతో డబ్బు ఖర్చు చేస్తేగాని సభలకు జనం రాని పరిస్థితి నెలకొంది. జనం తమంతట తాముగా ర్యాలీలకు రావడం మానుకొని చాలా కాలమైంది. వచ్చిన జనమంతా తమ వెంటే ఉన్నారని నేతలు భావించడం పొరపాటే. ఏ పార్టీలు సభలు పెట్టినా అదే జనం వస్తారు. ఇక అధికారంలో ఉన్న పార్టీ అయితే జనాన్ని ఏ విధంగానైనా తరలిస్తారు. కోల్‌కత ర్యాలీలో మోదీని తిట్టడమే పనిగా విపక్ష నేతలు పెట్టుకున్నారు. బీజేపీలో ఇతర నేతలు మోదీ కంటే మంచి వారని మమత పొగడడం విడ్డూరం. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా బలపడడం అంత సులభం కాదు. ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ముందుగా సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ తర్వాత స్పష్టమైన అజెండా ఉండాలి. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోవాలి. కోల్‌కత ర్యాలీ 'ఫ్యామిలీ షో’గా నడిచింది. ఈ కూటమికి హాజరైన నేతలందరూ కుటుంబ పార్టీల నేతలే. ఈ పార్టీల్లో ప్రజాస్వామ్యం లేదు. ఈ నేతలు దేశానికి సమర్థ నాయకత్వం ఎలా అందిస్తారు?
కుటుంబ పార్టీ అయినా దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. ఆ పార్టీ ఈ మధ్య పునరుజ్జీవం పొందుతోంది. రాహుల్ గాంధీ కోల్‌కత ర్యాలీకి హాజరైతే తన చాప కిందకు నీరు చేరుతుందనే భయంతో మమత ఏమీ తెలియనట్లు నటించినా జనం ఆమె అంతరంగాన్ని గ్రహించకుండా ఎలా ఉంటారు. వామపక్ష పార్టీలు కేరళలో కాంగ్రెస్‌పై, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌పై పోరాటం చేస్తున్నాయి. అందుకే వామపక్ష పార్టీలు కోల్‌కత సభకు హాజరు కాలేదు. ర్యాలీకి వచ్చిన పార్టీలన్నీ గతంలో కాంగ్రెస్‌పై పోరాడాయి. ఈ రోజు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమంటున్నాయి. అయతే, కాంగ్రెస్ నాయకత్వాన్ని జాతీయ స్థాయిలో అంగీకరించేందుకు చాలా పార్టీలు సిద్ధంగా లేవు. ఈ ర్యాలీకి హాజరు కాని వైకాపా, టీఆర్‌ఎస్‌లు కూడా ఇదే కోవలోకి వస్తాయి. టీడీపీ హాజరైనందు వల్ల వైకాపా, తెరాసలు ర్యాలీపై ఆసక్తిని కనపరచలేదు.
కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు రాహుల్ సోదరి ప్రియాంకా వాద్రా రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఆమెకు తొలిసారిగా యూపీలో తూర్పు విభాగం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీచేసే అవకాశం ఉంది. ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే సమీకరణలు త్వరితగతిన మారుతాయా? యూపీలో కాంగ్రెస్‌ను దూరంగా పెట్టిన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు ఆత్మరక్షణలో పడతాయా? సీట్ల పంపకంపై పునరాలోచన చేస్తాయా? ప్రియాంకను పార్టీలో ఇపుడు చిన్న పదవికి పరిమితం చేసినట్లు భావింవచ్చు. కాంగ్రెస్‌లో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఇంతకాలం ఆమెకు బాధ్యతలు అప్పగించని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకొంది. ఆమె క్రియాశీలకంగా ఉంటారా? లేదా? అనే విషయం పక్కనపెడితే, ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీని పునరుజ్జీవింప చేయడానికి ప్రియాంక రూపంలో కాంగ్రెస్ పార్టీ ఓ అస్త్రాన్ని బయటకు తీసిందని చెప్పవచ్చు.
విపరీతమైన ప్రేమ, విపరీతమైన ద్వేషం అనే అంశాలకు ఎన్నికలు వేదికకానున్నాయి. మోదీకి, ఇతరులకు మధ్య పోరు జరగనుంది. మోదీని ద్వేషించే వారికి సరైన నాయకత్వం చూపినపుడే బీజేపీ వ్యతిరేక కూటమిని ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది. హిందీ బెల్ట్‌లో ఇటీవల కాంగ్రెస్ విజయం సాధించడానికి ముందు రాహుల్‌ను ఫోకస్ చేసిన కుటుంబ పార్టీలు కోల్‌కత ర్యాలీ తర్వాత దూరం జరుగుతున్నాయి. పటిష్టమైన నాయకత్వం ఉన్న బీజేపీని ఢీ కొనాలంటే- కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి ఉన్నంత విలువ, ప్రజాదరణ, మమతా బెనర్జీ సారథ్యంలోని కూటమికి ఉండదు.
హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్ గెలుపు సామాన్యమైనది కాదు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు వేరుగా ఉంటుంది. జాతీయస్థాయి రాజకీయాల ప్రభావం ప్రజలపైన ఉంటుంది. బీజేపీని ఓడించాలనుకొనే పార్టీలు సిద్ధాంతాలు, బేషజాలను పక్కనపెట్టి ఒక వేదికపైకి రావాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందే ఎవరో ఒక సమర్ధనేతను ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఖరారు చేయాలి. కశ్మీర్ నుంచి ఆంధ్రా వరకు, నాగాలాండ్ నుంచి కేరళ, మహారాష్ట్ర వరకు విపక్షాలు ఒకే వేదికపైకి వస్తే తప్ప- బీజేపీని మట్టికరిపించడం అంత సులువుకాదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీల్లో చాలా మంది సిద్ధాంత ప్రాతిపదికన ఆ పార్టీని వ్యతిరేకించడం లేదు. మోదీ తప్ప మరొకరు ప్రధాని అవుతారని తెలిస్తే, ఈ రోజు బీజేపీ వ్యతిరేక కూటమిలోని సగం పార్టీలు జారుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే తప్ప, ఈ తరహా రాజకీయ అంచనాలు నిజం కావు. బీజేపీ వ్యితిరేక కూటమిలోని పార్టీల్లో నేర్పు, నైపుణ్యం, చొరవ, ఆమోద యోగ్యం ఉన్న నేతలు లేరు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటైతేనే సాధ్యమవుతుంది. ఒకవేళ కర్నాటక తరహాలో ప్రజలు తీర్పు ఇస్తే, ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం ఎక్కువ కాలం బతకదు. ప్రజల విస్పష్టమైన తీర్పు ఇవ్వనందు వల్ల 1989, 1996, 1998లో కేంద్రంలో ఎటువంటి ప్రభుత్వాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌ను దూరంగా ఉంచి, వన్ మ్యాన్ షోగా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసి ఢిల్లీలో చక్రం తిప్పుతామనుకునే రోజులకు కాలం చెల్లింది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097