మెయిన్ ఫీచర్

టాలీవుడ్ ట్రెండ్ ప్రాక్టికల్ హీరోయిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాక్టికల్ హీరోయిజం.
సౌండింగ్ కొత్తగా అనిపించొచ్చుగానీ, స్ట్రాటజీ మాత్రం పాతదే. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్ సరిగ్గా సహకరిస్తే -స్క్రీన్‌మీద హీరోయిజం పండుతుంది. అదే ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌ని సరిగ్గా నడిపిస్తే -స్క్రీన్ బయట హీరోయిజం పండుతుంది. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు -స్క్రీన్ మీదే కాదు బయటా హీరోయిజాన్ని పండిస్తున్నారు. మరుగున పడిన స్ట్రాటజీకి మళ్లీ ఊపిరూదుతున్నారు. సూటిగా చెప్పాలంటే -హీరోలు నిర్మాతలవుతున్నారు.
**
టాలీవుడ్‌లో ఓ మోస్తరు క్రేజ్ తెచ్చుకున్న హీరోనుంచి ‘స్టార్’ వరకూ ఏంచేసినా -సెనే్సషనే. ఆ సెనే్సషనే్న -స్టార్‌డమ్‌గా మలచుకుని కెరీర్‌ను టాప్‌గేర్‌లో పరిగెత్తించడం నిన్నటి వరకూ చూశాం. ఇప్పుడు హీరో అంటే -స్క్రీన్‌మీద నాలుగు ఫైట్లు, ఆరు పాటలు వేసుకునేవాడే కాదు. నానా పాట్లూపడి.. నిర్మాత అవతారమెత్తి.. అష్టకష్టాలకోర్చి.. తన అభిరుచిని సిల్వర్ స్క్రీన్‌పై ఆడియన్స్‌కి రుచిచూపించేవాడు. ఈ హీరోయిజానే్న ఇప్పుడు ఇండస్ట్రీలో -ప్రాక్టికల్ హీరోయిజం అనేది.
**
ఎవరు ఔనన్నా కాదన్నా -పరిశ్రమకు రీళ్లెత్తే హీరో ఎవరూ? అంటే నిర్మాతే. పెట్టుబడి పెట్టేవాడే రియల్ హీరో. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతకు అంతటి గౌరవం కేవలం ఆడియో ఫంక్షన్లు, ట్రైలర్ విడుదల కార్యక్రమాల్లో మాత్రమే దక్కుతూ ఉండొచ్చు. కానీ, ఒక సినిమాకు నిర్మాతే నిజమైన హీరో. అందులో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. టాలీవుడ్‌లో యన్టీఆర్, ఏయన్నాఆర్‌లాంటి మహానుభావులు నిర్మాతకు ఉండే గౌరవాన్ని ప్రారంభదశలోనే తెలుసుకున్నారు కనుక -సినిమా నిర్మాణంపైనా దృష్టిపెట్టి ఆ హోదాను అందుకున్నారు. హీరోలుగా బిజీ జీవితాన్ని గడుపుతూ కూడా తమ అభిరుచికి తగిన చిత్రాలను నిర్మించి నిజమైన హీరోలయ్యారు. అప్పటి అగ్రహీరోల వరసను చిన్నా చితకా హీరోలూ అనుసరించిన దాఖలాలు లేకపోలేదు. అదే ఒరవడి ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో మళ్లీ బలపడుతుంది. స్టార్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న మామూలు హీరోలు సైతం తన అభిరుచిని స్క్రీన్‌పై చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సంపాదించిన దాంట్లో కొద్దో గొప్పో పెట్టుబడి పెట్టి నిర్మాత అవతారం ఎత్తుతున్నారు. నిర్మాత అవతారం ఎత్తడంలో ఒకప్పటి యన్టీఆర్, ఏయన్నాఆర్‌ల ఆలోచన ఏమిటన్నది ఇతమిత్థంగా చెప్పలేకపోవచ్చుగానీ, ఈ తరం హీరోలు చిత్ర నిర్మాణానికి జెండా ఎత్తడం వెనుక -ఎవరి స్ట్రాటజీలు వాళ్లకున్నాయన్న విషయం అర్థమవుతుంది.
దక్షిణాదిని పరిగణనలోకి తీసుకుంటే -తమిళ చిత్రసీమతో పోలిస్తే టాలీవుడ్ తక్కువేం కాదు. ఏటా వెయ్యికోట్ల పెట్టుబడులు ఇండస్ట్రీకి వస్తున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోన్న పరిశ్రమలో -స్టార్ హీరోలకు అందుతున్నది తక్కువేనన్నది కాదనలేని విషయం. నిజానికి టాలీవుడ్‌లో పెద్ద హీరోల రెమ్యునరేషన్ ఒక్కో చిత్రానికి ఒక్కోలా.. సరాసరిన రూ. 20కోట్ల వరకూ ముడుతుంది. అదే తమిళ చిత్ర సీమలో స్టార్ హీరోలు పాతిక, ముప్పై కోట్ల రేంజ్ ఎప్పుడో దాటేశారు. పైగా తమిళ చిత్రాలు చేస్తున్న బిజినెస్‌కంటే తెలుగు చిత్రాలు చేస్తున్న బిజినెస్ తక్కువేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా సినిమాలు విడుదలవుతూ అటు పొరుగు రాష్ట్రాల్లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ, చివరకు ఓవర్సీస్ బిజినెస్ సైతం దుమ్ములేపుతున్న వైనాన్ని చూస్తూనే ఉన్నాం. హీరో రేంజ్‌ని బట్టి సినిమా ఆడుతుందన్న ప్రచారం జరుగుతున్నా -ముడుతున్నది మాత్రం తక్కువేనన్న భావన పెద్ద హీరోల్లో లేదని అనలేం. సో, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. సొంత బ్యానర్‌ను మొదలుపెట్టి.. తమ రెమ్యునరేషనే పెట్టుబడిగా పెద్ద నిర్మాతలతో భాగస్వామి అయితే చేతికొచ్చే షేరు తక్కువేం కాదు. సినిమా పోయినా పోయేదేం లేదు, ఫణంగా పెట్టిన పరిహారం తప్ప. ఇదీ స్టార్ హీరోల సరికొత్త స్ట్రాటజీ. అలాగని పూర్తిగా ఆర్థికాంశాలపైనే ఈ స్ట్రాటజీ సాగుతుందని అనలేం. హీరోలకు ఉండే అభిరుచులు.. వ్యక్తిగతమైన బడ్జెట్ లెక్కలు.. ప్రాజెక్టులో ప్రాధాన్యతాంశాలు.. ఇలాంటివాటినీ పరిగణనలోకి తీసుకునే కొందరు నిర్మాణ రంగంపైకి వస్తున్నట్టు చెబుతున్నారు.
వెటరన్ హీరోగానూ టాలీవుడ్ మన్మధుడు అనిపించుకుంటున్న నాగార్జుననే తీసుకుందాం. అక్కినేని స్థాపించిన అన్నపూర్ణా దినదినప్రవర్థమానంగా సాగుతున్నా -‘మనం’ పేరిట నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఏయన్నాఆర్ అనుసరణను కొనసాగిస్తూనే, చిన్న బడ్జెట్ చిత్రాలను ‘మనం’తో టార్గెట్ చేశాడు. కొత్త టాలెంట్‌ను పరిచయం చేయడమే కాదు, ఆ టాలెంట్‌ను వ్యాపారాత్మకంగానూ మలుచుకుంటున్నాడు.
ఈ స్టయిల్‌ను అనుసరిస్తూ ప్రాక్టికల్ హీరోయిజంపై దృష్టిపెట్టిన హీరోల సంఖ్య టాలీవుడ్‌లో తక్కువేం లేదు. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ (ఎవరి కారణాలు, అభిరుచులు వాళ్లవి) -అటు సృజనాత్మకంగానూ, ఇటు వ్యాపారాత్మకంగానూ నిర్మాతల అవతారం ఎత్తుతూనే ఉన్నారు.
వరుస పరాజయాలతో కెరీర్ వత్తిడి ఎదుర్కొన్న హీరో నితిన్ -పంథా మార్చి పదునైన ప్రయత్నంతో హిట్టందుకున్నాడు. ఆ ప్రాజెక్టు -ఇష్క్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్యూట్ లవ్ నితిన్ సొంత బ్యానర్‌లో చేసిందే. అది మొదలు -శ్రేష్ట్ మూవీస్ ద్వారా నిర్మాతగా గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీ కోసం లాంటి ప్రాజెక్టులు చేశాడు. అంతేకాదు అక్కినేని కుటుంబంపై అభిమానం, అఖిల్‌తో అతనికున్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’నూ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరో మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’తో శ్రీమంతుడయ్యాడు. జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట సంస్థను నెలకొల్పి ఆయన ప్రతి సినిమాలో పార్టనర్ అవతారం ఎత్తుతున్నాడు. ప్రతిభావంతుడైన హీరో సిద్దార్థ్ కూడా సొంత సినిమా ‘లవ్ ఫెయిల్యూర్’తో నిర్మాతగా మారాడు. ఈకటి పేరిట బ్యానర్ పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. టాలీవుడ్‌లో మోహన్‌బాబుది సెపరేట్ ట్రాక్. విలన్ నుంచి హీరోగా మారి బిజీ అయిన తరువాతా -లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పేరిట ఎన్నో చిత్రాలను నిర్మించాడు. ఆ లక్ష్మీప్రసనే్న -ఇప్పుడు నటిగా, యాంకర్‌గా పలు పాత్రలు పోషిస్తూ నిర్మాతగానూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో ఐదు చిత్రాలు నిర్మించడమే కాదు, సోదరుడు మనోజ్ సినిమాలకు నిర్మాత బాధ్యతలు తీసుకుంటోంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 1994లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’తో నిర్మాతయ్యాడు. అంజనా ప్రొడక్షన్స్ పేరిట అన్న నాగబాబుతో కలిసి పవన్ నిర్మించిన చిత్రమిది. తరువాత డైరెక్షన్ విభాగంలోకీ అడుగుపెట్టి జానీ నిర్మించాడు. గీత ఆర్ట్స్‌తో కలిసి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరిట బ్యానర్ మొదలెట్టి, తరువాత సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికీ నిర్మాతగా నిలిచాడు. ఇక చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’తో స్టార్ హీరో రామ్‌చరణ్ సైతం నిర్మాతయ్యాడు. చిరు రీ ఎంట్రీ కనుక భారీ చిత్రంగా నిర్మించేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ పేరిట సొంత బ్యానర్ పెట్టాడు. ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయటంతో మెగాస్టార్‌తోనే మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు రామ్‌చరణ్. అదే -ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరఫ్ సైరా. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టు నడుస్తోంది. టాలీవుడ్ నాచురల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నాని ‘ఆ’తో నిర్మాతయ్యాడు. మొదటి సినిమాతోనే క్రేజ్ కొట్టేసిన నాని, క్రియేటివ్ స్టోరీలను సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. కో అంటే కోటితో శర్వానంత్ నిర్మాత అవతారం ఎత్తితే, అటు హీరోగాను, ఇటు నిర్మాతగానూ కళ్యాణ్‌రామ్ దూసుకుపోతుండటం చూస్తూనే ఉన్నాం. నందమూరి తారక రామారావు పేరిట పెట్టిన బ్యానర్‌లో తన సినిమాలతోపాటు సోదరుడు జూ.ఎన్టీఆర్, ఇతర హీరోల చిత్రాలనూ తెరకెక్కిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన సత్తా చాటుకున్న ప్రకాష్‌రాజ్ గురించీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు నిర్మాతగా మారి గగనం, గౌరవం, ఉలవచారు బిర్యానీ, మనఊరి రామాయణం వంటి చిత్రాలను తెరకెక్కించాడు. మనవూరి రామాయణంతో దర్శకుడిగానూ మారాడు. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో పలు భారీ చిత్రాలు తెరకెక్కుతున్నప్పటికీ, తన అభిరుచికి తగిన సినిమాలు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. హీరో నిర్మాతల జాబితాలోకి మరికొందరు హీరోలూ చేరిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
*

-శ్రీనివాస్