మెయిన్ ఫీచర్

ఆ కథలకు కామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మే 9, 2018.
మహానటి సినిమా విడుదలైంది. అప్పటి వరకూ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసినోళ్లంతా -థియేటర్ల నుంచి బయటికొస్తూ నోరెళ్లబెట్టారు. మహానటి సావిత్రి జీవితమంటే ఏదో చూపిస్తారని ఎక్కువ అంచనాలతో వెళ్లినోళ్లంతా -స్క్రీన్‌మీద కనిపించిన నిజాయితీ చిత్రాన్ని చూసి ‘ఓహ్’ అనేశారు. నిజానికి సావిత్రి గురించి ఆడియన్స్ ఊహించుకున్నదేదీ స్క్రీన్‌పై కనిపించకపోయినా -నిజాయితీగా తీసిన చిత్రాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మహానటి మెల్లగా ఆడియన్స్‌కి దగ్గరైంది. క్రమంగా ఊపందుకుంది. రిపీటెడ్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది. కట్‌చేస్తే -సినిమా హిట్టనిపించుకుంది. కమర్షియల్‌గానూ హిట్టైంది. కలెక్షన్ల మోత మోగించింది. పెద్దగా అనుభవం లేని దర్శకుడిగా ‘మహానటి’ని భుజానికెత్తుకున్న నాగ్‌అశ్విన్‌కు గొప్ప పేరు తెచ్చింది. మహానటి గురించి ముక్తసరిగా ఇది.
*
సరిగా ఎనిమిది నెలల తరువాత-
జనవరి 9, 2019. యన్‌టిఆర్ కథనాయకుడు చిత్రం విడుదలైంది. ఎప్పటినుంచో సినిమా కోసం ఎదురు చూసినోళ్లంతా -థియేటర్ల నుంచి బయటికొస్తూ నోరెళ్లబెట్టారు. మహానటుడు యన్‌టిఆర్ సినిమా జీవితమంటే ఏదో చూపిస్తారని ఎక్కువెక్కువ అంచనాలతో వెళ్లినోళ్లంతా -ఊహించకున్నది కనిపించక ‘ఉఫ్’ అనేశారు. ఉసూరుమన్నారు. నిజానికి యన్‌టిఆర్ గురించి ఆడియన్స్ ఊహించుకున్నదంతా స్క్రీన్‌పై కనిపించినా -ఎందుకనో సినిమాను మాత్రం మెచ్చుకోలేకపోయారు. కథానాయకుడు మెల్లగా ఆడియన్స్‌కి దూరమైంది. క్రమంగా థియేటర్ల నుంచి మాయమైంది. రిపీటెడ్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయలేకపోయింది. కట్‌చేస్తే -సినిమా ఫట్టనిపించుకుంది. కమర్షియల్‌గానూ కష్టాలను చూసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా అనుభవాన్ని అపారంగా పుణికి పుచ్చుకున్న దర్శకుడిగా ‘కథానాయకుడు’ని భుజానికెత్తుకున్న క్రిష్‌కు పేరు తేలేకపోయింది. కథానాయకుడు గురించి క్లుప్తంగా ఇదీ. చెప్పుకోడానికి చాలా ఉండొచ్చేమో.
***
పై రెండు సినిమా విషయాలు కంపారిజన్స్ కాదు. కానీ, వాటి ఇంపాక్ట్ మాత్రం మిగిలిన ప్రాజెక్టులపై పడిందన్న వాతావరణాన్ని చర్చించడానికే. ఎందుకంటే -‘మహానటి’ హిట్టవ్వగానే చాలామంది దర్శకులు బయోపిక్‌లపై దృష్టి పెట్టారు. కొందరు నిర్మాతలు గొప్ప వ్యక్తుల జీవితాలు అనే్వషించమంటూ ఆశలు బయటపెట్టారు. ఎవరి జీవితాన్ని కథగా మలుచుకోవచ్చన్న చర్చలకు కొందరు రచయితలూ తెరలేపారు. ఆ క్రమంలో బయోపిక్ తీద్దామన్న ఆలోచన కొందరిది. సూత్రప్రాయంగా విషయాన్ని బయటకు చెప్పుకొన్నవాళ్లు కొందరు. ప్రకటిండానికి సిద్ధమైనవాళ్లూ లేకపోలేదు. ఇందులో నిర్మాతలు, దర్శకులు, ప్రొడక్షన్ హౌస్‌లు.. ఇలా చాలామందే ఉన్నారు.
సరిగ్గా ఎనిమిది నెలల తరువాత-
సీన్ మారింది. కథనాయకుడు సరైన ఫలితం ఇవ్వలేకపోవడంతో బయోపిక్ ఆలోచనలకు కామా పడింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ యన్‌టిఆర్ సినీ జీవితమే ఆడియన్స్‌కి రుచించలేదంటే -మిగిలిన వాళ్ల జీవితాలతో తెరకెక్కే కథలు నచ్చుతాయా? అన్న సందిగ్ధం మొదలైంది. అందకే -మొన్నటివరకూ రోజుకొక్కటిగా వినిపించిన బయోపిక్ ప్రాజెక్టుల విశేషాలు ఇప్పుడు వినిపించడం లేదు. అసలు ఆలోచనలే ఆగిపోయాయని చెప్పొచ్చు. ఇదీ పరిస్థితి.
**
కల్పిత కథలకంటే -సక్సెస్‌ఫుల్ వ్యక్తుల జీవితాలపట్లే ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారన్న విషయాన్ని బాలీవుడ్ బయోపిక్‌లో ఒకదశలో రుజువు చేశాయి. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు ఆడియన్స్ పట్టంగట్టారు. బాలీవుడ్‌ను పరిగణనలోకి తీసుకుని ఇతర భాషల మేకర్లు -బయోపిక్‌లపై ఫోకస్ పెట్టారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. జనాలకు ఏయే వ్యక్తుల విజయ గాథలపై ఆసక్తి ఉందోనన్న ఆరా మొదలుపెట్టారు. అలా తెలుగులో మొదటి బయోపిక్‌గా వచ్చిన చిత్రమే ‘మహానటి’. సావిత్రి జీవిత కథ. మహానటి ఇచ్చిన స్ఫూర్తితో అందరూ బయోపిక్‌ వైపు చూశారు.
అలా బయోపిక్‌లు మొదలైన కొన్ని సినిమాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. అయితే -కథానాయకుడు నుంచి వచ్చిన ఫలితంతో బయోపిక్ ఎంతవరకు ఫలితాలనిస్తాయోనన్న పునరాలోచన మొదలైంది. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన మహానాయకుడు, తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంలా భావించే నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు విజయం సాధించి వుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో -స్టార్ హీరో ఉన్నంత మాత్రాన జనం ఎగబడి చూడరన్న క్లారిటీ వచ్చేసింది. విడుదలకు ముందు ఎర్పడిన భారీ అంచనాలు విడుదల తరువాత తలకిందులయ్యాయి.
ఇక్కడి పరిస్థితి కాసేపు పక్కనపెడితే -బాలీవుడ్‌లో కంగనా రౌనత్ ముఖ్యపాత్రలో వచ్చిన సినిమా -మణికర్ణిక. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవిత కథ ప్రచారంతో స్క్రీన్స్‌కు వచ్చింది. హిందీ సహా పలు భాషల్లో విడుదలైన చిత్రానికి మంచి టాక్ వచ్చినా -ఆ ఆనందం ఎవ్వరికీ మిగలలేదన్నట్టే ఉంది. దర్శకుడు క్రిష్, నటి కంగనాల మధ్య సాగిన ‘మణికర్ణిక’ యుద్ధంపైనే ఆడియన్స్ ఆసక్తి కనిపిస్తోంది. మరోపక్క సినిమాకు కలెక్షన్లు పెరిగాయన్న కథనాలు వినిపిస్తున్నా, నార్త్‌లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో కాదన్నది తాజా సమాచారం. భారీ పెట్టుబడులు పూర్తిగా వెనక్కి వస్తాయా? అన్న సంకోచాలూ లేకపోలేదు.
ఇక శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జీవితం ఆధారంగా రూపొందిన థాకరేను ముంబైలో తప్ప ఇంకెక్కడా కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. హందీలో బయోపిక్‌ల ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. భాగ్ మిల్కా భాగ్‌తో మొదలుకని మేరీకోమ్, ధోని, సచిన్ అంటూ ఎన్నో వచ్చాయి. కొన్ని విజయం సాధించాయి. కొన్ని ఆడియన్స్ ఆదరణ నోచుకోలేకపోయాయి. క్రికెట్ మాస్టర్‌గా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న సచిన్ బయోపిక్ అట్టర్ ఫ్లాప్. క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ జీవితాన్ని సినిమాగా ఎందుకు ప్రేక్షకులు చూడలేకపోయారన్నది అసలు ప్రశ్న?
ఇక తెలుగులో సెట్స్‌పైవున్న వాటిలో హీరో కత్తివీరుడు కాంతారావు, ప్రముఖ గాయకుడు ఘంటశాల, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జీవిత కథతో యాత్ర సినిమాలు ఉన్నాయి. మరి ఇవి ప్రేక్షకులనుంచి ఎలాంటి ఆదరణ పొందుతాయన్నది చూడాలి. ఈ ఏడాదిలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 25 వరకూ బయోపిక్స్ వస్తాయన్న అంచనా నిన్నటి వరకూ వినిపించింది. తమిళంలో ఇప్పటికే మాజీ సీఎం జయలలిత పేరుతో మూడు సినిమాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ మొదటి భాగం కథానాయకుడు నిరాశపర్చడంతో, రెండో పార్ట్‌గా వస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు ఎప్పుడొస్తుందన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. అందుకు కారణం -విడుదల తేదీలు మారిపోతుండటమే. నిజానికి సెకెండ్ పార్ట్ -జనవరి చివరి వారంలో విడుదలవుతుందని ప్రకటించారు. కథానాయకుడు ఫలితంతో నిర్ణయం మారింది. రెండో భాగాన్ని రెండు వారాల వ్యవధిలో విడుదల చేయడంపై మల్లగుల్లాలు నడిచాయి. ఎవరేమన్నా బాలయ్య మాత్రం క్రిష్‌దే ఫైనల్ డెసిషన్ అనేసాడు. కానీ చివరికి పిబ్రవరి ఫస్ట్ వీక్‌లో రెండో భాగం విడుదల చేయాలని డిసైడ్ చేశారు. సమీక్షలు బావున్నా, థియేటర్లకు జనం రాలేదు. దాంతో ఎన్టీఆర్ టీమ్ డీలాపడింది. ఈ తరుణంలో పార్ట్ 2 మరోవారం వెనక్కంటే ఫిబ్రవరి రెండోవారానికి వెళ్లిందని గాసిప్‌లు వినిపించాయి. యూనిట్ మాత్రం వీటిని ధృవీకరించలేదు, ఖండించలేదు. అలాగని డిస్ట్రిబ్యూటర్లకైనా డేట్ గురించి చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. దీంతో బయ్యర్లు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, మళ్లీ మరోవారం వెనక్కు వెళ్తుందని. అంటే ఫిబ్రవరి 21న విడుదలవుతుందని టాక్.
2019 సినిమా సీజన్ అంతా బయోపిక్‌ల కాలమేనన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్ని బయోపిక్‌లు పూర్తిగా తెరకెక్కుతాయో, ఎన్ని ఆగిపోతాయో, ఎన్ని స్క్రిప్ట్ దశలోనే ఉండిపోయాయో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి. సో, కొద్దికాలం బయోపిక్‌లకు ‘కామా’ పెట్టేసినట్టే. రావాల్సిన చిత్రలూ థియేటర్లకు వచ్చిన తరువాత, వాటి ఫలితాలను చూశాకే కామా తీసేయాలా, ఏకంగా పుల్‌స్టాప్ పెట్టేయాలా అన్నది తేలొచ్చు.
*

శ్రీనివాస్ ఆర్ రావ్