మెయన్ ఫీచర్

రాజకీయ క్రీడ.. చట్టంతో చెలగాటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా పోలీసు కమిషనర్ సీబీఐ విచారణకు హాజరు కావల్సిందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇటు తృణముల్ కాంగ్రెస్, అటు బీజేపీ వర్గాలు నైతిక విజయం తమదంటే తమదేనని ప్రకటించుకున్నాయి. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఆదేశాలను ఉల్లంఘించడం నేరమా? కాదా?? దర్యాప్తునకు సహకరించమని పదే పదే సీబీఐ కోరుతున్నా కోల్‌కతా పోలీసు కమిషనర్ ఎందుకు నిరాకరిస్తున్నారు? ఆయనను విచారించడానికి వెళ్లిన 40 మంది సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోవల్సి వచ్చింది? మరుసటి రోజు స్థానిక సీబీఐ జేడీ పంకజ్ శ్రీవాస్తవ్‌పై పాత కేసును తిరగతోడి విచారణకు హాజరుకమ్మని పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారు? దీనిని కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య జరుగుతున్న పోరుగా ఎందుకు మలుస్తున్నారు? ‘సహకార సమాఖ్య’ వ్యవస్థను కాలరాస్తున్నది ఎవరు?
రాష్ట్రాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు సీబీఐని కేంద్రం ఒక అస్త్రంగా వాడుకుంటుంటే, రాష్ట్రాలూ అదే బాటలో తమకు నచ్చని వ్యక్తులను, శక్తులను అదుపు చేసేందుకు స్థానిక పోలీసులను ప్రయోగిస్తున్నాయి. అధికారం కోసం రాజకీయ పార్టీలు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న మాట బహిరంగ రహస్యమే. ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా, బెంగాల్, యూపీ, బిహార్, మహారాష్టల్ల్రో ఈ వైనం కళ్లారా చూసిందే. తాజాగా బెంగాల్ ఇందుకు వేదికైంది. వాస్తవానికి ఇది కేవలం కోల్‌కతా కేసుకే పరిమితమా? కానే కాదు, దీని వెనుక ఉన్న పని చేస్తున్న ‘పెద్ద నెట్‌వర్క్’ను పరిశీలిస్తే తప్ప అసలు వివాదం అర్థం కాదు. సీబీఐ అధికారులు కోల్‌కతా కమిషనర్‌ను ఎందుకు విచారించాలనుకున్నారు? అన్న చోట మొదలు పెడితే కేసు పూర్వపరాలు అర్థమైపోతాయి. కోల్‌కతా కమిషనర్ రాజీవ్ కుమార్‌ను శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ విచారించాలనుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఇప్పటికే పలు మార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది. చిట్‌ఫండ్ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఆయన చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. కేసు దర్యాప్తు పేరిట నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తూ నిందితులను కాపాడుతూ, సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారనేది సీబీఐ వాదన. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు కోల్‌కతాలోని జాయింట్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ్ నేతృత్వంలో కమిషనర్ వద్దకు వెళ్లారు.
2000 సంవత్సరంలో శారద చిట్‌ఫండ్ కుంభకోణం జరిగింది. 239 డొల్ల కంపెనీల ద్వారా అధిక వడ్డీ చెల్లింపుల పేరుతో రూ. 4వేల కోట్లను 1.7 కోట్ల మంది డిపాజిటర్ల నుండి వసూలు చేశారు. అదే సమయంలో రోజ్‌వేలీ కంపెనీ 15వేల కోట్ల రూపాయలను వసూలుచేసింది. ఈ వ్యవహారంపై 2012లో డిపాజిట్‌దారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా శారదాచిట్ ఫండ్ సంస్థ వ్యవస్థాపకులు పరారయ్యారు. 2013 ఏప్రిల్‌లో సుదీప్తో సేన్, ఆయన సహచరుడు దేబ్‌జాని ముఖర్జీలు పరారయ్యారని గుర్తించి వారిని 2013 ఏప్రిల్ 18న కశ్మీర్‌లో ప్రస్తుత కోల్‌కతా కమిషనర్ రాజీవ్‌కుమార్ అరెస్టు చేశారు. అపుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న కునాల్ ఘోష్ అరెస్టుకు ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలని కోరుతూ అబ్దుల్ మన్నన్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అప్పటి తృణముల్ కాంగ్రెస్ నేత రజత్ మజుందార్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు ఎంపీ శ్రీమ్‌జోయ్ బోస్, రవాణా మంత్రి మదన్ మిత్రలను అరెస్టు చేసింది.
2015 జూన్‌లో రోజ్‌వ్యాలీ గ్రూప్ ఎండీ గౌతం కుందును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అదే సమయంలో మమతా బెనర్జీ సహచరుడు ముఖుల్ రాయ్‌ను సీబీఐ ప్రశ్నించింది. 2016 డిసెంబర్‌లో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్, సుదీప్ బందోపాధ్యాయలను సీబీఐ అరెస్టు చేసింది. 2017 నవంబర్ 3న ముకుల్‌రాయ్ బీజేపీలో చేరడంతో వ్యవహారంలో మార్పులు వచ్చాయి. 2018లో మమతా బెనర్జీ పెయింటింగ్స్‌ను ఎక్కువ ధరకు కొనుగోలుచేశారనే పేరుతో నిందితుల నుండి వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. గత ఏడాది ఫిబ్రవరి 2న ఈ రెండు కేసులను సమీక్షించిన సీబీఐ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. గత నెలలో రోజ్‌వ్యాలీలో పెట్టుబడులకు సంబంధించి శ్రీకాంత్ మెహతాను అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ బృందం కమిషనర్ కార్యాలయానికి వచ్చింది. దీనికి ప్రతిగా కోల్‌కతా పోలీసులు సీబీఐ జాయింట్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవకు నోటీసులు జారీ చేశారు. దీనికీ ఓ నేపథ్యం ఉంది.
సెంట్రల్ రోలర్ మిల్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థపై సీబీఐ దాడులు చేసిన సందర్భంగా అడ్డుకున్నారనే నెపంతో తనను సీబీఐ అధికారులు నిర్బంధించి హింసించారని పేర్కొంటూ వైభవ్ ఖత్తర్ అనే వ్యక్తి స్థానిక సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కేసుతో సంబంధం లేని వైభవ్ ఖత్తర్‌ను నిర్బంధించిన సీబీఐ అధికారులపై కేసు నమోదు చేయాలని సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిటీ పోలీసులు కోల్‌కతా భవానీపుర పోలీసు స్టేషన్‌లో జనవరి 21న కేసు నమోదు చేశారు. వైభవ్‌ను నిర్బంధించిన సీబీఐ బృందానికి పంకజ్ శ్రీవాస్తవ్ నేతృత్వం వహించారనేది ఆరోపణ. ఇంతకీ సీబీఐ సెంట్రల్ రోలర్ మిల్స్‌పై ఎందుకు దాడి చేసిందీ అనేదే ప్రస్తుత వివాదానికి కీలకం. ఆ మిల్స్ యజమాని దీపేష్ చందర్ బిహార్‌లో జరిగిన పశుదాణా కుంభకోణం కేసులో అప్రూవర్. ఈకేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, డిప్యూటీ రాకేష్ ఆస్థానల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం నెలకొంది. ఇద్దరికి ఇద్దరూ వేర్వేరు కేసుల్లో ఇరికించుకునే క్రమంలోనే పశుదాణా కుంభకోణం దర్యాప్తులో ఆస్థానా అక్రమాలకు పాల్పడ్డారని, కేసును తప్పుదారి పట్టించారని దీపేష్ చందర్‌తో చెప్పించారు. ఆ క్రమంలోనే ఆయన మిల్లుపై సీబీఐ దాడి చేసింది. దీపేష్‌ను అదుపులోకి తీసుకుని హింసిస్తున్న సమయంలో ఆయన సీబీఐ కస్టడీ నుండి తప్పించుకుని పారిపోయారు. కోల్‌కతా పోలీసులు ఆయన జాడను గుర్తించి అరెస్టు చేశారు. ఆయన అరెస్టయ్యేలోగా సీబీఐలో అనేక పరిణామాలు జరిగిపోయాయి. అలోక్‌వర్మ, రాకేష్ ఆస్థానా ఇద్దరూ అక్కడి నుండి బదిలీ అయ్యారు. తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా తప్పుకున్నారు. కొత్త డైరెక్టర్ రిషీకుమార్ శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరికివారు తమదే పైచేయి కావాలనే పట్టుదల ఒక పక్క, ఇంకొకరిని ఇరికించాలనే కుట్రలు సుస్పష్టమవుతున్నాయి. సీబీఐలో అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మ, డిప్యూటీ రాకేష్ ఆస్థానాల మధ్య లుకలుకలు, పరస్పర ఫిర్యాదులు వెలుగుచూశాక ఎంతో ప్రతిష్టాత్మకం అనుకున్న సంస్థలు మసిబారిన తర్వాత ప్రజల్లో నమ్మకాన్ని కల్పించేదెవరు? చట్టసభలపైనా, పాలనా వ్యవస్థలపైనా పెదవి విరుస్తున్న ప్రజలకు తాజా పరిణామాలు- ఏ వ్యవస్థపైనా నమ్మకం లేని పరిస్థితిని కల్పిస్తున్నాయి.
రాజకీయాల క్రీడలో భాగంగా ప్రభుత్వాలు చట్టాన్ని తమ చుట్టంగా మలుచుకోవడం సగటు భారతీయుడికి అర్థం అవుతూనే ఉంది. తాజా పరిణామాలు స్వేచ్ఛకు ప్రతీక అనుకోవాలా? ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలా? రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా భావించాలా? కేం ద్రంతో రాష్ట్రాలకు ఉన్న పేచీ ఇప్పటిది కాదు, రాష్ట్రాలు ఎదురుతిరిగిన సందర్భాల్లో కేంద్రం ఉపయోగించుకునే ఆయుధాలు రెండు. అవి అత్యవసర పరిస్థితి విధించడం లేదా సీబీఐ దర్యాప్తు పేరిట కేసులు నమోదు చేయడం. రాష్ట్రాలను గాడిలోకి తెచ్చుకోవాలనుకున్న ప్రతిసారీ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసే కార్యక్రమం ఏమిటో దేశ ప్రజలందరికీ తెలిసిందే.
బెంగాల్ పరిణామాలు చూస్తుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ బెంగాల్‌లో తన ఉనికి చాటుకోవాలని చూస్తోందన్నది సుస్పష్టం. బీజేపీకి బెంగాల్‌లో చోటు లేకుండా చేయాలన్నది తృణముల్ కాంగ్రెస్ వ్యూహం. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న ఈ పోరును సీబీఐ- స్థానిక పోలీసులు మధ్య వివాదంగా మలిచారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన పరిపాలనా సంబంధమైన సర్దుబాటు అత్యంత క్లిష్ట సమస్యగా మారిపోతోంది. కేంద్రం, రా ష్ట్రాల మధ్య దూరం పెరుగుతుంది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 256 నుండి 263 వరకూ ఉన్న ప్రకరణల్లో పరిపాలనా సంబంధాలను తెలియజేశారు. ఇంకో పక్క చిన్న చిన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అంతర్రాష్ట్ర మండలి, నీతి ఆయోగ్ పనిచేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలకు అధికారం ఉన్నది చెలాయించడానికి కాదు, ప్రజలకు మేలు చేయడానికి, సమాఖ్య, సమానత్వం, సంక్షేమ రాజ్యాలను నెలకొల్పడానికనే భావన రానిదే ఈ వివాదాలు ప్రజలకు సంకటంగా మారడం ఖాయం.

-బీవీ ప్రసాద్ 98499 98090