మెయన్ ఫీచర్

టోక్యో లక్ష్యంగా క్రీడల ప్రణాళిక సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండ్లు తినాలన్నప్పుడే చెట్లు పెట్టం. భవిష్యత్ అవసరాలకై చెట్లు నాట డం ప్రకృతి రీతి. తలెత్తుకోవడం తెలిస్తేనే తలదించుకోవడం అబ్బుతుంది. జ్ఞాన దంతాల్నే తెలివితేటలకు చిహ్నంగా భా వించే రాజకీయాలు అన్ని రంగాలతోపాటు క్రీడరంగాన్ని భ్రష్టు పట్టిస్తూనే ఉన్నాయి. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌నుంచి 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో తలదించుకొని బతకాలంటున్న ఆకాశంలో సగం, మనను అంతర్జాతీయం గా తలెత్తుకునేలా చేస్తున్నది. ఒకే ఒడ్డున పులి, మేక నీళ్లు తాగడాన్ని సహించని హర్యానా కాప్ పెద్దల బెదిరింపులకు లొంగకుండా కోచ్ ఈశ్వర్ దాహియా సాక్షిమాలిక్‌కు కుస్తీ పోటీలో శిక్షణనిచ్చి పితృస్వామ్య సమాజాన్ని తలదించుకునేలా చేసా డు. అలాగే బిశే్వస్వర నంది దీపను, గోపీచంద్ సింధును తీర్చి దిద్దారు. తనకు ఖేల్‌ర త్న పురస్కారం ఇవ్వకున్నా ద్రోణాచార్య పురస్కారాన్ని తన కోచ్ నందికి ఇస్తే సంతోషపడతానని దీప అనడం గమనార్హం!
పతకాల సాధన గొప్ప విషయమే! మెడ ల్స్ తెచ్చిన వారిని మెడలు ఎత్తకుండా నజరానాలతో సత్కరించడమే మన పీత రాజకీయాలకు చిహ్నం. వారి క్రీడాస్పూర్తితో భవిష్యత్తుకు బాటలు వేయడం విజ్ఞతతో కూడుకునే పని. పోటీపడి సింధును సత్కరించిన ఇరు తెలుగు రాష్ట్రాల చంద్రులకు గత రెండు సంవత్సరాలు ఒలింపిక్ క్రీడలు కాదు-ఏ క్రీడా అంశాలు పట్టలేదు. కరణం మల్లీశ్వరి బాబు హయాంలోనే బరువునెత్తి దేశ పరువునే కాదు మహిళల గౌరవాన్ని పెంచింది. ఆ తర్వాత 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌దాకా ఉమ్మడి రాష్ట్రానికి బాబే కదా ముఖ్యమంత్రి. ఈ కాలంలో ఆయన ఏం చేసినట్టు? ఇక కెసిఆర్ తక్కువ తిన్నారా? కొత్తగా అధికారంలోకి రాగానే సానియా మీర్జాను ఆటలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. గతరెండు సం వత్సరాలుగా వ్యక్తిగతంగా ఆమె ఆడవచ్చుగానీ రాష్ట్రానికి చేసిందేమిటి? ఈ రెండు సం వత్సరాలు క్రీడల అభివృద్ధికై కెసిఆర్ ఒనగూర్చిందేమిటి? ఇద్దరు చంద్రులు తలుచుకుంటే రెండు బంగారు పతకాలు సాధించే క్రీడాకారులు దొరక్కపోయేవారా?
తానేమీ తక్కువ తిన్నానా అంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ సింధుకు 50 ల క్షల్ని ప్రకటించారు. సంతోషమే! కానీ రియో ఒలింపిక్స్ ముగింపునకు ఒకరోజు ముందే రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు, సాత్నా జి ల్లాలోని మాయర్ పట్టణంలో కూలిన మూ డంతస్తుల భవన శిథిలాల్లో ఇరుక్కుపోయిన అక్కాతమ్ముల్ని రక్షించి, అవే శిథిలాల్లో పీకలదాకా కూరుకుపోయి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించిన జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు బబ్లు మార్టిన్ (34) సదరు ముఖ్యమంత్రికి ఏనాడు కనపడలేదు. ఈ మానవతావాది స్వయంగా ఫుట్‌బాల్ అకాడమీని నడుపుతూ బీద పిల్లలకు కోచింగ్ ఇచ్చేవాడు.
మాటల గారడీ చేసే మన రాజకీయ నాయకులకు ఏనాడూ ఆటల మైదానాలు పట్టడంలేదు. పార్లమెంటులో అసెంబ్లీలో ఆడినంతగా బయట ఆటగాళ్లని గుర్తించి ప్రోత్సహించినా మొన్నటి రియోలో మన దేశం 67వస్థానంలో కాకుండా మొదటి 5 స్థానాల్లో వుం డేది. పాల్గొన్న 207 దేశాల్లో 120 దేశాలకు ఒక్క పతకం కూడా రాలేదని, పైగా మనకింద మరో 20 దేశాలున్నాయని మనవారు బుకాయించినా బుకాయిస్తారు. ఒలింపిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండర్ సచిన్ టెండూల్కర్, సభ్యురాలిగా అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఉన్నప్పుడు మనం ఇంతకన్నా మెరుగైన ఫలితాల్ని సాధించాలనుకోవడం కూడా అత్యాశనే! మన క్రీడాకారుల బాగోగులు పట్టించుకోని అధికారగణం ఉన్నంతకాలం కాంస్య పతకాలు కూడా మనలాంటి దేశానికి గొప్పే! పేరుకు 49 జాతీయస్థాయి స్పోర్ట్స్ ఫెడరేషన్స్ లున్నాయి. ఇందులో 13 ఫెడరేషన్స్‌కు జాతీయస్థాయి రాజకీయ పార్టీ నాయకులే చైర్మన్లుగా వుం డగా మిగతా వాటికి పెట్టుబడిదారులు, వ్యా పారవేత్తలు, ఇతర రాజకీయ పార్టీ నేతలు అధికారులుగా వుంటే, అశేష మానవ వనరులు బూడిదలో పన్నీరుగానే మిగులుతాయి.
ఒలింపిక్స్‌లో పతకాల సాధన లక్ష్యంగా ఏర్పాటైన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)కు మంజూరైన 49.23 కోట్ల రూపాయల పంపిణీ విధానం కూడా వివాదాస్పదమే! ఇందులోనుంచి ఒక్క అభినవ్ బిం ద్రాకే రెండు కోట్లకు పైగా ఇవ్వగా, మరో 8 మంది షూటర్లకు, డిస్కస్ త్రోకు ఎంపికైన వికాస్‌గౌడ్‌లకు మాత్రం ఒక్కొక్కరికి కోటికి పైగా ఇచ్చారు. సాక్షికి 12 లక్షలు ఇవ్వగా దీపకు అందింది కేవలం రెండు లక్షలే! గత మూడు సంవత్సరాలుగా ఈ సంస్థకు మం జూరైన 390.38 కోట్లలో రైఫిల్ అసోసియేషన్‌కే 50 కోట్లు దక్కాయి. హాకీ ఫెడరేషన్‌కు 38.26 కోట్లు అందగా జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్‌కు కేవలం 3.95 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీనంతటికీ కారణం వివిధ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సామాజిక నేపథ్యమే! జిమ్నాస్టిక్స్, కుస్తీ, బాక్సింగ్, మారథాన్‌లలో పాల్గొ నే వారంతా ఆర్థికంగా చితికిన కుటుంబాల వారే కావడం! ముఖ్యంగా షూటింగ్‌లాంటి క్రీడలకు ఉన్నత వర్గాల వారు ఇష్టపడడమే మ రో కారణం!
ఈ సందర్భంగా దీపా కర్మాకర్ శిక్షణ పొందిన అగర్తాలలోని బ్రిటిషు కాలంనాటి బ్యామాగర్ శిక్షణ కేంద్రమే చక్కని నిదర్శనం. 1947 నాటి ఈ కేంద్రంలో పాడుపడిన పరుపులు, తుప్పుపట్టిన బాలెన్సింగ్ బార్, ఫోం పిట్ తెలియని స్థలం చూస్తే దీప ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తెలుస్తుంది. విధిలేక పాత సైకిల్ మోటార్ సామగ్రితో తయారుచేసుకున్న వాల్ట్ బోర్డుపై, పాత పరుపుల్నే వేసుకుని ప్రాక్టీసు చేయడం జరిగింది. ఇదే క్రీడలో అమెరికాలోని హోస్టన్, టెక్సాస్‌ల్లోని అధునాతన వాల్ట్‌బోర్డ్‌పై బైల్స్ వారానికి కేవలం 15 సార్లు ప్రాక్టీసు చేయగా దీప 127 సార్లు చేసేదట! కేవలం మూడు నెలల ముందే ఢిల్లీలో శిక్షణ తీసుకోవడం జరిగింది. సాధారణ కుటుంబానికి చెందిన దీప తండ్రి దులాల్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ కావడంవల్ల ఈ మాత్రమైనా సాధ్యమైంది. దీప స్ఫూర్తి తో జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్న బాలికలు వందల సంఖ్యలో త్రిపురలో ఉండడానికి గల కారణం వారి ఆర్థిక పరిస్థితి! ఈ క్రీడాంశాల ద్వారా వారి కుటుంబాల్ని పోషించుకోవాలన్నది వారి అంతరంగం. 15 సంవత్సరాల అస్మిత పాల్ ఇప్పటికే దీప దారిలో నడుస్తూ పతకాల పంటను పండిస్తున్నది. ఇలాంటి వారికి ఇప్పటినుంచే అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తే టోక్యోలో కచ్చితంగా మెరుస్తారు.
సాక్షి మాలిక్ తండ్రి ఢిల్లీ రవాణా సంస్థలో కండక్టర్ కాగా తల్లి అంగన్‌వాడీ టీచర్. హర్యానా, రోథక్ జిల్లాలోని మోక్రకూడా కాప్ పంచాయతీ, పితృస్వామ్య భావజాలం తో వుండే గ్రామం. ఇలాంటి వాతావరణంనుంచి మహిళగా కుస్తీ పోటీల్లో పాల్గొనడం వింతగానే వుంటుంది. అలాగే జూడోకు అర్హత పొందిన అవతార్‌సింగ్‌ను టర్కీలో శిక్షణకోసం పంపిండానికై ప్రభుత్వ ఉద్యోగిగా తండ్రి దాచుకున్న డబ్బంతా ఖర్చయింది. విలువిద్యకు ఎంపికైన దీపిక రాంచీ దగ్గరలోని ఓ గ్రామనివాసి. రాళ్లతో మామిడి కాయ ల్ని కొట్టగా ఈమె వెలుగులోకి వచ్చింది. వంద మీటర్ల పరుగు పందేనికి మొదటి మహిళగా ఎంపికైన దూతిచాంద్ ఒడిస్సాలో ఓమారుమూల గ్రామ వాసే! ఈమె శక్తి యుక్తులకు అనుమానం వచ్చి లింగనిర్ధారణ పరీక్షకు గురికావాల్సి వచ్చింది. రియోలో నీటికై తపించిన మారథాన్ జైస్వాల్ కేరళలో ఓ పశువుల కాపరి కూతురు. తండ్రి ప్రమాదానికి గురి కాగా స్వయంగా పశువుల్ని మేపు తూ ఈ పరుగును నేర్చుకుంది. మరో మార థాన్ కవితా రావట్ నాసిక్ దగ్గరలోని ఓ గ్రామానికి చెందినది. ఈమె రోజూ 20 కిలో మీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లేది. గోల్ఫ్ ఆటగాడిగా ఎంపికైన చౌరాసియా ఆటగాళ్లకు సహాయపడే కాడిబాయ్ కావడం గమనార్హం! ఇక రోయింగ్‌కు ఎంపికైన దత్తు నాసిక్ దగ్గరలోని ఓ గ్రామానికి చెంది తండ్రి చనిపోవడం, తల్లి మతిస్థిమితం కోల్పోవడంతో కు టుంబ భారాన్ని మోయడానికి ఆర్మీలో జవానుగా చేరాడు. అక్కడే ఈ క్రీడను నేర్చుకున్నాడు.
ఇలా దాదాపుగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరు మారుమూల గ్రామాలకు చెందినవారు కావడం, ఆర్థికంగా లేనివారు కావడం, వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందినవారు కావడం గమనించా లి. ఇలాం టి కింది స్థాయి వారినే ఎంపిక చేయడం నిజాయితీతో కూడుకున్న పనే కదా అనే వాదన వుంది. కానీ వీరంతా జాతీయ సంపదగా గుర్తించబడకపోవడం, ఎంపిక ద్వారా బయటపడకపోవడం జరుగుతున్నది. వ్యక్తిగత ఇష్టంతో వీరు క్రీడల్లో పాల్గొని మాత్రమే గుర్తింపును పొందుతున్నారు. కానీ వీరికి ఏ స్థాయిలో ప్రభుత్వపరంగా గానీ, క్రీడల ఫెడరేషన్ల పరంగా కానీ తగిన ప్రోత్సాహమే లేదనేదానికి దీపా కర్మాకర్‌దే చక్కని ఉదాహరణ. చివరికి సింధుకు శిక్షణనిచ్చిన గోపీ చంద్ కూడా అకాడమీని ప్రారంభించడానికి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
క్రీడలను ముందు పట్టించుకోని ప్రభుత్వాలు, గెలిచిన తర్వాత మాత్రం ఆకాశానికెత్తడం, కక్కేదాకా తినిపించినట్టు, అవసరానికి మించిన నజరానాలు సమర్పించి చేతులు దులుపుకోవడం సంప్రదాయంగా తయారైంది. గెలవడం మీవంతు, పొగడడం మా వంతుగా ప్రభుత్వాలు భావించినంత కాలం అంతర్జాతీయంగా మన క్రీడల పరిస్థితి ఇందుకు భిన్నంగా వుండదు. బద్రీనాథ్ లాంటి దేవాలయ ప్రాంతాంలోని ఓ చిన్న రెస్టారెంట్‌లో పనిచేసే వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన మనీష్‌రావత్ రోజూ అక్కడి అననుకూల వాతావరణంలోనే నడకను ప్రాక్టీసు చేస్తే అందరూ నవ్వేవారట! అయినా రియోలో నడకలో 13వ స్థానంలో నిలిచాడు. కాంస్య పతక గ్రహీతకు రావత్‌కు వ్యత్యాసం కేవలం ఒక నిముషం లోపే! సరైన శిక్షణ వుంటే ఇలాంటి రావత్‌లు ఎన్ని పతకాల్ని తెచ్చేవారో!
గ్రామస్థాయినుంచే గుర్తింపుకు నోచుకోని వేలాదిమంది చిన్నారులు పుస్తకాల బరువుల్ని మోయలేక అవస్థపడుతున్న పట్టణాల పిల్లలు అవకాశాలు వస్తే అద్భుతాల్ని సృష్టిస్తారు. వీరిని గుర్తించే వ్యవస్థ లేకపోగా నిర్వీర్యం చేసే విద్యావిధానం, సాంఘిక, రాజకీయ వ్యవస్థలు కొనసాగుతున్నాయి. ఇవి ధ్వంసం అయితే తప్ప మన క్రీడారంగం బాగుపడదు. కనీసం ఇప్పటినుంచైనా ఇటువైపు దృష్టి సారిస్తే టోక్యోలో నిజంగానే తలెత్తుకోగలం.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162