మెయిన్ ఫీచర్

అక్కడ.. హిట్టయ్యారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయ్ -అంటాడు మాయాబజార్‌లో ఘటోత్కచ పాత్రధారి యస్వీ రంగారావు. ప్రయోగాల వెంట పరిగెత్తకుంటే కొత్త కథలెలా తడతాయ్ అంటాడు కథాబ్రహ్మ సదాశివబ్రహ్మం. నిజానికి ఈ రెండూ -ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ స్టేట్‌మెంట్లు. ఈ ప్రస్తావన ఎందుకూ అంటే -హీరోల కొత్త ట్రెండ్‌ను చర్చించుకోడానికే. మాటల్ని ఎవరో ఒకరు పుట్టించాలి. ప్రయోగాన్ని ఎవరోకరు మొదలెట్టాలి. పుట్టించడం, ప్రయోగించటం.. రెండూ జతతై మాత్రం కచ్చితంగా అది -ట్రెండే. ఇది ఏ ఒక్కరోజులోనో జరిగేది కాదు. క్రమంగా బలపడుతుంది. ఇప్పుడు -అటు జాతీయ, ఇటు ప్రాంతీయ సినీ పరిశ్రమలో ఇలాంటిదే ఓ ట్రెండ్ మొదలైంది. అది -సినిమా ఫలితాన్ని ఆ హీరో నిక్కచ్చిగా అంగీకరించటం. అదీ పబ్లిక్ అప్పీల్‌తో. నిజానికి ఇది ఇప్పుడే మొదలైంది కాకున్నా -ఇప్పటి కాలమాన పరిస్థితులకు మాత్రం ఇది ట్రెండే.

ఆ మధ్య నాగార్జున చేసిన 'భాయ్’ చిత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. హాంకాంగ్ బేస్‌డ్ డాన్ డ్రామా -ఢమాల్‌మంది. ఆ సినిమాకు దర్శకుడు వీరభద్రం. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడని సంస్థ -అన్నపూర్ణా స్టూడియోస్ (నాగ్ సొంత సంస్థ). టెక్నీషియన్లూ చిన్నవాళ్లేమీ కాదు. దేవీశ్రీ, సమీర్‌రెడ్డి, కార్తీక్ శ్రీనివాస్.. ఇలా అన్నీవున్నా సినిమాకు ఐదోతనం తక్కువైంది. కట్‌చేస్తే ప్లాప్ టాక్ వచ్చేసింది. అక్కినేని అభిమానుల ముందు నోరు మెదపకపోవచ్చుగానీ, భాయ్ గురించి మాత్రం నాగార్జున బెంగపడ్డాడు. బహిరంగంగానే బాధ వ్యక్తం చేశాడు. తన కెరీర్‌కు అదొక మైలురాయి అవుతుందన్న ఉద్దేశంతోన సినిమా చేశాడు. కెరీర్‌లో అదే టాప్ డిజాస్టర్ ర్యాంకులో నిలబడింది.
ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే -తాజాగా హీరోలంతా ఈ బాధను పబ్లిక్‌లో వ్యక్తం చేయడానికి, పబ్లిక్‌కు అప్పాలజీ చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇదీ ట్రెండ్. సినిమా విఫలమైనపుడు నిర్మాత ఆర్థికంగా నష్టపోతే, నటుడు కెరీర్‌పరంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ‘చెత్త సినిమాను తీశాను, క్షమించండి’ అని నిర్మాత చెప్పుకోలేడు. ఎందుకంటే అతనికి ఫ్యాన్స్ ఉండరు, అతన్ని ప్రశ్నించే వాళ్లూ ఉండరు. హీరోకి అలా కుదరదు. కాస్త పెద్ద హీరో అయితే అస్సలు కుదరదు. అందుకే -ఈ కొత్త ట్రెండ్ బలపడుతోంది. పైగా ఇప్పుడొచ్చే జనరేషన్ హీరోలు కాస్త నిజాయితీగా ఉందామన్న యాటిట్యూడ్ సైతం గట్స్‌ను ప్రేరేపిస్తోంది.
మొన్నటికి మొన్న రామ్‌గోపాల్‌వర్మ ‘ఆఫీసర్’ విషయంలోనూ -పబ్లిక్‌గా చెప్పలేకపోయినా, సన్నిహితుల వద్ద నాగ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పర్టిక్యులర్‌గా టాలీవుడ్‌లో బహిరంగంగా ‘గట్స్’ ప్రదర్శించింది మాత్రం లేటెస్ట్ సెన్సేషన్ విజయ దేవరకొండ అనాలి. 2017లో వచ్చిన ‘ద్వారక’ సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకున్నపుడు పబ్లిక్‌లోనే ఆ మాటనేశాడు. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఆ చిత్రానికీ సాయికార్తీక్, శ్యాం కె నాయుడు లాంటి దిగ్గజాలే పనిచేశారు. ప్రయోగాత్మక పాత్ర కనుక హిట్టవుతుందనే విజయ్ కూడా అనుకుని ఉంటాడు. ఆడియన్స్‌కి రుచించకలేదన్న విషయాన్ని విడుదల తరువాత పబ్లిక్‌గానే అంగీకరించాడు. ఒకవిధంగా కొత్త ట్రెండ్ ఇక్కడి నుంచి బలోపేతమైంది. ఈమధ్య నాగచైతన్య అదే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం క్రిటిక్సే కాదు, ఆడియన్స్‌కీ నచ్చలేదన్న విషయాన్ని మీడియా ముందే అంగీకరించాడు చైతూ. అటు ‘ఏం మంత్రం వేశావే’ ఇటు ‘నోటా’ చిత్రాలూ పరాజయం బాటలో నిలిచినపుడూ దేవరకొండ నోట అదే మాటొచ్చింది.
ఒక్కక్షణం బాలీవుడ్ వైపు చూద్దాం. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఇటీవలే అమీర్‌ఖాన్ చేసిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. ప్రయోగాత్మక కథ. భారీ బడ్జెట్. ఉద్దండ ఆర్టిస్టులు. చెయ్యి తిరిగిన సాంకేతిక నిపుణులు. ఆది నుంచి అంతం వరకూ బాలీవుడ్‌లో చర్చలేపిన ప్రాజెక్టు. ఆశలన్నీ ఒక్కరోజులో ఆవిరైపోయాయి. వారం తిరక్కుండా ‘థగ్స్..’ తిరుగుముకం పట్టేశారు. దీనిపై అమీర్ ఏమాత్రం బీరాలకు పోలేదు. ఉద్దేశం ఏదైనా -వైఫల్యాన్ని అంగీకరించాడు. తనమీద నమ్మకంతో సినిమాకొచ్చి అసహనానికి గురైన అందరికీ క్షమాపణలు అన్నాడు.
ఇంత ఓపెన్‌గా తన వైఫల్యాన్ని అంగీకరించకున్నా -ఆవేదనను మాత్రం వ్యక్తం చేశాడు మెగా హీరో రామ్‌చరణ్. ఇది తాజా ఘటన. వినయ విధేయ రామ -ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయిందని బహిరంగంగానే అంగీకరించాడు. ఈ మెసేజ్‌తో అభిమానులకు ఓ లేఖ సైతం విడుదల చేశాడు. భవిష్యత్ సినిమాల విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటానని కూడా హామీ ఇచ్చాడు. ఈ సరికొత్త ట్రెండ్‌ను ఇంకెంతమంది హీరోలు అనుసరిస్తారో చూడాలి.
ముక్తాయింపు: సినిమా పోయింది. మిమ్మల్ని నిరాశపర్చాను. మరోసారి జరక్కుండా చూస్తాను -అంటూ మనస్ఫూర్తిగా చెప్పే పొడి మాటలు హీరోకి లాభమే తప్ప నష్టమేమీ కాదన్నది నిజం. సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఆడియో ఫంక్షనో, ప్రీరిలీజ్ ఫంక్షన్ వరకో ‘ఆహా.. ఓహో’ అని చెప్పిన తరువాత థియేటర్లలో ఆడియన్స్‌కి ఆ ఫీల్ కలగకపోతే మాత్రం కచ్చితంగా హీరో కెరీర్‌పై ప్రభావం చూపించే ప్రమాదం ఉండొచ్చు. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోడానికే ఈ ‘నిజాయితీ’ ఉపకరిస్తుందన్న వాదననూ సమీక్షించాలి. అన్నీ కలిసొచ్చి సినిమా హిట్టయితే ఒకే. కాకపోతే మాత్రం -తరువాతి చిత్రంపై ప్రభావం పడకుండా ఉండేందుకే పెద్ద హీరోలు ‘ఓపెన్’ అవుతున్నారన్న గుసగుసలూ లేకపోలేదు. ఇదంతా బాగానే ఉంది, కానీ -కథానాయకుడే సినిమా పోయిందని చెప్పేస్తే, దర్శకుడు, టెక్నికల్ స్టాఫ్ పరిస్థితి ఏంకావాలి? వాళ్లేం మాట్లాడాలి? అన్నది వెండితెరపైనే చూడాలి. ఫ్లాప్‌పై రామ్‌చరణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తరువాత -అది సూటిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకే తగిలింది. ఆయన ఫీలయ్యాడన్న గాసిప్స్ తప్ప ఓపెన్ కాలేదు. దీనిపై ఎక్కడోకచోట బోయపాటి ఓపెనైతే -ఆ వివాదం ట్రెండ్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. *

మీ అంచనాలను అందుకోలేకపోయన మాట నిజం. మరోసారి అలా జరగకుండా జాగ్రత్తపడతాను. మీ ఆదరాభిమానాలే ప్రేరణగా భవిష్యత్‌లో మెచ్చే కథలతోనే సినిమాలు చేస్తా. నిజానికి వివిరా కోసం రేయింబవళ్లు కష్టపడ్డాం. వినోదంపంచే చిత్రంగానే నమ్మి శ్రమించాం. దురదృష్టవశాత్తూ అది అభిమానులు, ప్రేక్షకులకు రీచ్ కాలేదు. అయినప్పటికీ చిత్రానికి పూర్తి మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
*
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మనసు పెట్టి చేసిన సినిమా. యూనిట్‌మొత్తం కష్టపడిన సినిమా. ఆడియన్స్‌కి నచ్చలేదు. ఈ విషయంలో నేను బాధ్యత తీసుకుంటున్నా. అభిమానులు, ఆడియన్స్‌కి సారీ చెబుతున్నాను కూడా. పొరబాటు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తాను.
*
నోటా -మాట రాలేదు, సినిమా చూశాక. నిజమే ప్రాజెక్టు కోసం చాలానే కష్టపడ్డాం. కాకపోతే ఆడియన్స్‌కి రుచించలేదు. వైఫల్యాన్ని ఒప్పుకుంటే తప్పేముంది. కొంతమంది పండుగ చేసుకుంటున్నారట. అది వాళ్లిష్టం. ఎదురు దెబ్బ తగిలితే అది భవిష్యత్‌కు ఉపయోగపడే పాఠం అనుకునే రకం నేను. సో,..
*

చిత్రాలు.. రామ్‌చరణ్, అమీర్‌ఖాన్, విజయ దేవరకొండ

-శ్రీనివాస్ ఆర్ రావ్