మెయిన్ ఫీచర్

సాహసమే ఊపిరిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది మృత్యుబావి..
అదేనండీ వెల్ ఆఫ్ డెత్..
అలాంటి బావిలోకి ఆమె అవలీలగా దిగేస్తుంది..
రకరకాల విన్యాసాలు చేస్తుంది..
అడిగితే ఇవి నాకు చాలా ఇష్టం అని చెప్పేస్తుంది. ఆమే ఉత్తరప్రదేశ్‌లోని ఈటా జిల్లాకు చెందిన రెహానా ఖాన్.. వివరాల్లోకి వెళితే..
రెహానాఖాన్ హైదరాబాద్ ఎగ్జిబిషన్లో వెల్ ఆఫ్ డెత్ బైక్ విన్యాసాలతో సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆమె విన్యాసాలను చూసి వెల్ చుట్టూ ఉన్న సందర్శకులు చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మారుమోగిస్తున్నారు. మరి అలాంటి బైక్ విన్యాసాలకు ఆ మాత్రం చప్పట్లు పడాలి.. కేవలం బైక్ విన్యాసాలే కాదు.. వెల్ ఆఫ్ డెత్‌లో ప్రయాణించే కారుపైన నిల్చుని ఆమె రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణాపాయమే.. కానీ అదేమీ లెక్కచేయడం లేదామె. ఆమెకు సాహసాలంటే ప్రాణమట.
రెహానా తండ్రి ఇంజనీర్. తల్లి గృహిణి. ఆమెకు ఇద్దరు అక్కడు, ఇద్దరు అన్నల తరువాత ఐదో సంతానంగా పుట్టింది. వారి కుటుంబ ఆచారం ప్రకారం ఆమెకు పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రియాజ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అత్తారింటికి వచ్చిన తరువాత చదువు పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి ఆమెతో డిగ్రీ పూర్తిచేయించాడు రియాజ్. ఆమెకు బైకు నడపడం అంటే చాలా ఇష్టం. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను బైకు నేర్పించాడు. కట్టుబాట్లు ఉన్నా భర్త సహకారం లభించడంతో అనుకున్నది సాధించింది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒకరోజు ఆమె చత్తీస్‌గఢ్‌లో జరుగుతోన్న ఎగ్జిబిషన్‌కు వెళ్లిందట. అక్కడ కొందరు అబ్బాయిలు మృత్యుబావిలో బైక్‌తో స్టంట్స్ చేయడం చూసిందట.. ఆ విన్యాసాలు ఆమెకు బాగా నచ్చాయిట. అందులో ఏదో కిక్ ఉందని అనుకుని తనూ అలాంటి విన్యాసాలు నేర్చుకోవాలనుకుందట. అవి నేర్చుకుంటానంటే ఆమె భర్త ఏమీ అనలేదు కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం వద్దనేశారట. ముఖ్యంగా రెహానా తల్లి అయితే వద్దని ఏడ్చేసిందట. అయినా రెహానా వినలేదు. ఆమెలో ఆ విన్యాసాలు చేయాలనే పట్టుదల పెరిగింది. భర్తను అడిగింది.
రెహానా ఆసక్తిని గమనించిన ఆమె భర్త అలాంటి బైకు శిక్షణకు సంబంధించిన వివరాలను సేకరించాడు. రాంచీకి చెందిన సమీర్ అన్సారీ అనే వ్యక్తి శిక్షణ ఇస్తాడని తెలిసి అతడిని కలిశారు వారిద్దరూ. ఈ విన్యాసాలు చేయడం అబ్బాయిలకే కష్టం అని తెలిసినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా శిక్షణ మొదలుపెట్టింది రెహానా.. ఆరునెలల పాటు ఆమెకు శిక్షణే ప్రపంచమైంది. మామూలు బైకు నడపడం వేరు.. లోయలా ఉండే బావిలో.. అదీ ఏటవాలుగా ఉండే గోడపై బైకు నడపడం వేరు. ముందు బాలెన్సింగ్ రావాలి. దానితో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇలాంటి ఫీట్స్ చేయడానికి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. రెహానా రోజూ వ్యాయామంతో పాటు, శారీరక అవసరానికి తగ్గినట్లుగా ఆహారాన్ని తీసుకుంటుంది. అలా ఎన్నో కష్టనష్టాలకోర్చి బావిలో బైకు నడపడం నేర్చుకుంది రెహానా.. మొదటి ప్రదర్శనను రాంచీలో ఇచ్చింది. బావిపైనంతా జనం ఉన్నారు. గోలగోలగా, సందడిగా ఉన్న ఆ వాతావరణంలో మొదటిసారి ‘వెల్ ఆఫ్ డెత్’లోకి వెళ్లింది రెహానా.. అలా వెళ్లినప్పుడు మొదట ఆమె భయపడిందట.. కానీ ఒక్కసారిగా చుట్టూ జనాలున్నారు అని ఆలోచించకుండా తనను తాను నియంత్రించుకుని, భయాన్ని తగ్గించుకుని వేగంగానే విన్యాసాలు చేసి కిందికి దిగిందట. తరువాత ఆమెకు శిక్షణ ఇచ్చిన సమీర్ వచ్చి ప్రశసించినట్లుగా చూడటంతో ఆమెలో ఆత్మవిశ్వాసం చాలా పెరిగిందట. శిక్షణ వద్దని ఏడ్చిన రెహానా తల్లి రెహానా మొదటి ప్రదర్శన చూసి ఏడ్చేసిందట. ఇలా కొన్ని ప్రదర్శనలు ఇచ్చిన తరువాత రెహానాలో ధైర్యం పెరిగిందట. ఈ విన్యాసాలతో ఆమెకు ఆదాయం కూడా రావడం మొదలైంది. ఇప్పుడు ఆమె కారుకు సంబంధించిన విన్యాసాలను కూడా చేస్తోంది.
మొదటిసారి హైదరాబాద్ నాంపల్లిలో జరుగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో మొదటిసారి పాల్గొంటోంది రెహానా. ఇక్కడకు వచ్చిన బృందంలో రెహానా మాత్రమే అమ్మాయి. ఈమె ఒక్కో ప్రదర్శనలో దాదాపు 30 సార్లు వేగంగా రౌండ్లు వేస్తూనే ఉంటుంది. ఎక్కడ ప్రదర్శన జరిగినా సరే.. బైక్ ఎక్కే ముందు దేవుడిని తలచుకుంటుంది. అలాగే బైక్ దిగిన తరువాత కూడా రెహానా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతుంది. రెహానా ముందు ముందు ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటుందట.. అలాగే ‘ఈ రంగంలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అమ్మాయిలు ఇది చేయలేరు, అది చేయలేరు అనడం కన్నా.. వారిని ప్రోత్సహిస్తే వారు దేన్నైనా సాధించగలరు.. అమ్మాయిలను ప్రోత్సహించండి’ అని చెబుతోంది రెహానా. *