మెయన్ ఫీచర్

ఈబీసీ రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకించాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10 శాతం రిజర్వేషన్లను ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం అని కొందరు వాదనకు దిగుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు (డిఎమ్‌కె, మజ్లీస్ మినహా) సమర్ధించాయి. అయినప్పటికీ కొన్ని కుల సంఘాలు, కొందరు వ్యక్తులు ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అంటూ నిరసన గళం విప్పటం ప్రారంభించారు.
స్వాతంత్య్రానికి పూర్వం మన దేశానికి సంబంధించి రాజకీయ రంగంలో మతం ఆధారంగా ముస్లింలు, సిక్కులు, హిందువులకు రిజర్వేషన్‌ను బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది. ఆ సమయంలోనే షెడ్యూల్డు కులాల వారికి రిజర్వేషన్లను ఇవ్వాలన్న డిమాండు ప్రారంభమయింది. పూణె ఒప్పందం తర్వాత రాజకీయ రంగంలో షెడ్యూల్డు కులాల వారికి కూడా రిజర్వేషన్లు కేటాయించారు. హిందూ, ముస్లింల ఐక్యత కోసం రాజకీయ రిజర్వేషన్లను, ఆనాటి ఒప్పందాలను అందరూ స్వాగతించారు. లక్నో ఒప్పందం ఆ కోవలోనిదే. ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ల శాతం పెంచుతూ పోయినా, వారి అనేక డిమాండ్లను అంగీకరిస్తూ పోయినా, ముస్లింలలో వేర్పాటువాదం తగ్గలేదు. మంటల్లో నెయ్యి పోస్తే మంటలు పెరిగినట్లుగా దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ముస్లిం వేర్పాటువాదం మరింత తీవ్ర రూపం దాల్చి పాకిస్తాన్ ఏర్పడడానికి దారితీసింది.
దేశ విభజన తరువాత ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ నాయకత్వంలో రిజర్వేషన్ల విషయమై ఒక ఉప సంఘం ఏర్పడింది. ఆ ఉప సంఘం ప్రతిపాదన మేరకు మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, శాసనసభ, లోక్‌సభలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. విస్తృత చర్చ అనంతరం భారత రాజ్యాంగ సభ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఈ నేపథ్యంలో సిక్కులు, ముస్లింలు మతపరమైన రాజకీయ రిజర్వేషన్లను కోల్పోయారు. ఆంగ్లో ఇండియన్లకు మాత్రం రాజకీయ రంగంలో కోటా కల్పించారు. కాకా కాలేల్కర్ కమిషన్ వెనుకబడిన కులాలకు కూడా రిజర్వేషన్లు వర్తింపచేయాలని సూచించింది. అనేక కమిషన్ల సూచనల మేరకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో బి.సి.లకు రిజర్వేషన్లు ఇవ్వడం ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా చూస్తే బీసీ జాబితాలోని అన్ని కులాలు అన్ని విధాలా వెనుకబడినవి కావు. కొన్ని రాష్ట్రాలలో కొన్ని బి.సి. కులాలు పరిపాలకులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎస్.సి, ఎస్.టి, వర్గాల పట్ల చిన్నచూపు చూసేది కూడా బి.సి. కులాలే కావడం గమనార్హం. బీసీల్లో కూడా అత్యంత వెనుకబడిన కులాల వారు ఎంబీసీ పేరిట ఉద్యమం ప్రారంభించారు. వికలాంగుల కోటా, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాలు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలోవచ్చి చేరాయి. స్థానిక, స్థానికేతర కోటాలు కూడా రూపొందాయి. ఒకప్పుడు ఎస్.సి, ఎస్.టిలకే పరిమితమైన రిజర్వేషన్ల రూపం రానురానూ విస్తరించింది. రాజకీయ లబ్ధికోసం అనేక కులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ జాబితాల్లోకి చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మతపరంగా ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండు ఊపందుకొంది.
గతంలో బి.సి. కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వటం ప్రారంభమైనది. ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్లపై నిరసన వ్యక్తం చేసేవారు ఆనాడు మాత్రం నోరు విప్పలేదు. తమిళనాడులో జస్టస్ పార్టీ, డీఎంకే పార్టీల వల్ల కొన్ని వెనుకబడ్డ కులాలకు సామాజిక న్యాయం అందినా, బి.సిలు, ఎస్.సిల మధ్య అగాధం మాత్రం తగ్గలేదు. నూతన రిజర్వేషన్లలో ఎస్.సి, ఎస్.టి, బి.సి.లకు వారి కోటాలో ఏమీ తగ్గించలేదు. ఈబీసీ రిజర్వేషన్ల వల్ల ఇన్నాళ్లూ ‘ఎస్.సి, ఎస్.టి.లకు ఎంతకాలం రిజర్వేషన్లు ఇవ్వాల’ని ప్రశ్నించేవారి గొంతులు ఇపుడు వౌనం వహించాయి. సుప్రీం కోర్టు తాజా రిజర్వేషన్లను కొట్టివేయడం ఖాయమని కొందరు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధం, న్యాయబద్ధం అయిన ఈబీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. గతంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సహా కొన్ని దళిత సంఘాలు ఈబీసీ రిజర్వేషన్లకు మద్దతు పలికాయి. కనుకనే లోక్‌సభలో ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఈ రిజర్వేషన్ల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా వెనుకబడ్డ, పేదరికంలో మగ్గుతున్న ఎస్.సి, ఎస్.టి, బి.సి., మైనార్టీలకు నష్టం జరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితిలో ఈబీసీ రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకించాలి?

-డా. కడియం రాజు