మెయన్ ఫీచర్

ఎన్నికల కోలాహలం.. పొత్తుల కోలాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశనిరాశల కోలాహలమే అధికార పీఠం కోసం సాగే పోరాటం! మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల హడావుడి లేని పరిస్థితి ఎప్పుడూ లేదు. పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకూ అనునిత్యం ఎన్నికల వేడి ఎక్కడో అక్కడ రగులుకుంటూనే ఉంటుంది. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ.. ప్రజలు ఎన్నుకునే ప్రతినిధుల ద్వారా సాగే పాలనా విధానం. ప్రజల మద్దతు కోసం ఎన్నికల సమయంలో అంగలార్చే నేతలు పబ్బం గడిచిన తర్వాత కనిపిస్తారో లేదోగానీ ఎన్నికల ముందు మాత్రం వారు చేసే హడావడి అంతా ఇంతా కాదు. ఇవ్వని హామీ ఉండదు. ఆకాశమే హద్దన్నట్టుగా అరచేతిలో వైకుంఠానే్న సాక్షాత్మరింపజేస్తారు. వీటన్నింటినీ నమ్మే ప్రజలు ఓటేస్తారా? లేక ఆయా పార్టీ విధానాలు, ఆశయాలు, సిద్ధాంతాలను తులనాత్మక రీతిలో బేరీజువేసుకుని పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకుంటారా? అన్నది వారి వారి విజ్ఞతకు సంబంధించిన అంశం.
మొత్తం మీద ప్రజాస్వామ్యమంటే నిత్యం ఎన్నికల హేల.. అధికారమే పరమావధిగా భావించే రాజకీయ పార్టీలకు భారీ వేడుక. మొన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గత నాలుగున్నరేళ్ల నుంచి పరాజయ పరంపరగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల ఫలితాలు కొంత ఊపిరినిచ్చాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో లభించిన అనూహ్య విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంపైనా, ఆయన నాయకత్వ పటిమపైనా సీనియర్లలో నమ్మకమూ కుదిరింది. మరింకేం.. ‘హస్త’వాసి మారుతుందని, కాంగ్రెస్ దశ తిరుగుతుందన్న నమ్మకమూ బీజేపీయేతర పార్టీల్లో అ మాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుకు ఇతర పార్టీలు ఎగబడుతున్నాయి. అలాగే.. తమకు కేంద్రంలో అధికారాన్ని దక్కించే సత్తా ఉందనుకున్న ప్రాంతీయ పార్టీలతోనూ పొత్తులకు కాంగ్రెస్ తెరతీసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. నిన్న మొన్నటి వరకూ బీజేపీతో కలిసి నడిచిన తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుని జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు అహరహం శ్రమిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయలేదంటూ ఢిల్లీలో నిరసన ధర్నాకు దిగిన చంద్రబాబుకు కాంగ్రెస్ మొదలుకుని అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతూ లభించింది. ఇది చంద్రబాబు విజయమా? లేక బీజేపీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించి తీరాలన్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి బల ప్రదర్శనా? అన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేం.
ఇది ఎన్నికల సీజను కాబట్టి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయ ఆశాజీవులు అందిపుచ్చుకుంటారు. కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ధర్నాకు దిగినా, నిరసన గళం వినిపించినా.. వీధికెక్కి పోరాటం చేసినా.. అనివార్యంగానే భావసారూప్యం కలిగిన పా ర్టీలు తమ చేతిలో అధికారం ఉన్నా లేకపోయినా మద్దతు ప్రకటిస్తాయి. ఇప్పుడు కేంద్రంలోని మోదీ సర్కారే కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకూ ఏకైక టార్గెట్. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం అన్ని పార్టీలనూ కుదిపేసింది. కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారం చేపట్టిన మోదీ ఆ తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ఒకదాని తర్వాత ఒకటిగా విజయం సాధిస్తూ రావడం.. అలాగే కాంగ్రెస్ కూడా తమ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో పరాజితం కావడంతో తాజా లోక్‌సభ ఎన్నికలకు అనూహ్యమైన ప్రాధాన్యత ఏర్పడింది. మోదీని ఒంటరిగా ఎదుర్కోవడం అన్నది ఇప్పుడున్న బీజేపీయేతర పార్టీల్లో దేనికీ సాధ్యం కాని పరిస్థితి. అం దుకే.. కూటములు, మహాకూటములు, ప్రాంతీయ పొత్తులు, రాష్ట్రాల వారీ ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. మోదీ వ్యతిరేకతను చాటుకునేందుకు, ఆయన విధానాలను తూర్పారబట్టేందుకూ విపక్షాలు పరస్పరం పోటీ పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం నాటి రాజకీయ పరిస్థితికి నేడు అన్ని విధాలుగా మారిన రాజకీయ వాతావరణానికీ ఏకోశానా పొంతన లేదు. మొదటి మూడేళ్ల పాటూ ఏ పార్టీ తనపై కనె్నత్తి చూసే అవకాశం కూడా ఇవ్వని నరేంద్ర మోదీ దూకుడుగా తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు ప్రజల్లో కొంత వ్యతిరేకతను పెంచిన మాట నిజం. ముఖ్యంగా పిడుగుపాటు చందంగా పెద్దనోట్లను ఏకాఎకిన రద్దు చేసేయడం ఇందుకు ప్రధాన కారణం. పాత పన్నుల విధానాన్ని రద్దుచేస్తూ కొత్తగా జీఎస్టీని ప్రవేశ పెట్టడం మంచిదే అయినా అది భారత వ్యాపార, వాణిజ్య వ్యవస్థకు ఎంత మేరకు అనుకూలమన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య, రైతుల ఇక్కట్లూ ఎప్పటికప్పుడు చిక్కుముడులుగానే పరిణమిస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్న ఆందోళన వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను ప్రభుత్వం ఇవ్వడం లేదన్న అభిప్రాయానే్న కలిగిస్తోంది. కాంగ్రెస్ హయాంలో స్పెక్ట్రమ్, 2-జీ కుంభకోణాలను అప్పటి ప్రతిపక్ష బీజేపీ ఎలా అందిపుచ్చుకుని నాటి ప్రధాని మన్మోహన్‌ను ఎలా ముప్పుతిప్పలు పెట్టిందో ఇప్పుడు రాఫెల్ వ్యవహారాన్ని లోక్‌సభ ఎన్నికల ముందు బలమైన రాజకీయ ఆయుధంగా కాంగ్రెస్ ఎంచుకుంది. రాహుల్ నోట రాఫెల్ మాట వినిపించని రోజు లేదు. ఈ కుంభకోణంలో నిజానిజాల మాట ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో దేశ రాజకీయాలను వేడెక్కించడానికి.. మూడు రాష్ట్రాల విజయం నేపథ్యంలో తన రాజకీయ బలాన్ని చాటుకోవడానికి కాంగ్రెస్‌కు మాత్రం ఇది రాజకీయంగా ఉపయోగపడుతోందన్నది నిజం. మోదీ ప్రభుత్వం పట్ల ఎవరి వ్యతిరేకత వారికి ఉంది. ఆ వ్యతిరేకత వెనుక కేంద్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ఆరాటమూ ఉంది. అందుకే విపక్ష నేత ఎవరు ఎక్కడ దీక్ష చేసినా అక్కడ ప్రాంతీయ పార్టీల నేతలందరూ ‘క్యూ’ కడుతున్నారు. సీబీఐ దాడిని ఆసరా చేసుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏకంగా ‘దేశాన్ని రక్షించండి’ అంటూ ధర్నాకు దిగినా బీజేపీ వ్యతిరేక కూటమి నేతలు తరలి వెళ్లారు.
అలాగే ఏపీ హోదా కోసం చంద్రబాబు ఢిల్లీలో చేసిన నిరసనకూ అదే తరహాలో ఇరవై పార్టీలకు పైగా నేతలు తరలివచ్చారు. ఎన్నికల ముందు విపక్షాల్లో ఈ ఐక్యత కనిపించడం కొత్తేమీ కాదు. ఎందుకంటే ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఈ తరహా ఐక్యత విపక్షాల్లో అనివార్యంగా వస్తూనే ఉంది! అసలు చిక్కల్లా ఎవరు ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న అంశంపైనే ఉంటుంది. ఒకప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు సిపి ఎం నాయకత్వం ప్రయత్నించేది. ఆ బాధ్యతను, భారాన్ని భుజాన వేసుకుని వాపపక్ష నేతలు అన్ని రాష్ట్రాలూ తిరిగి విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నించేవారు. మారిన పరిస్థితుల్లో వామపక్షాలు ఈ ప్రయత్నాలకు దూరం కావడంతో ప్రాంతీయంగా బలంగా ఉన్న నేతలే ఇప్పుడు తెరపైకి వచ్చారు. చంద్రబాబు, మమతా బెనర్జీ ముందుండి విపక్షాలను నడిపించే భారాన్ని మీద వేసుకున్నా.. ఎన్నికల వరకూ వీరితో ఎన్ని పార్టీలు ఉంటాయన్నది ఊహకందని విషయమేమీ కాదు. ఇప్పటికే యూపీలో కాంగ్రెస్ ఏకాకి అయింది. అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్‌పీలు ఇప్పటికే చేతులు కలిపాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా దోహదం చేసిన ఉత్తర ప్రదేశ్‌లోనే విపక్షాలు మూడుముక్కలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే విపక్షాల్లో మోదీ వ్యతిరేకతకు ఉండాల్సినంత బలం లేదన్న విషయం స్పష్టమవుతోంది.
ఎవరికి వారుగా పోటీ చేసి ఎన్నికల అనంతర ఫలితాలను బట్టి జత కట్టాలన్నది కూడా దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం కావచ్చు. కలసి పోటీ చేసి ఒకరి ఓట్లను మరొకరు చీల్చుకునే కంటే విడివిడిగా పోటీ చేసి బీజేపీ ఓట్లను చీల్చేయడమే ఉత్తమ రాజకీయ వ్యూహమని అఖిలేష్, మాయావతి భావించి ఉండవచ్చు. వారి పొత్తుపై పల్లెత్తు మాట అనకుండా తామూ ఒంటరిగానే యూపీ బరిలో దిగుతామని కాంగ్రెస్ చెప్పడమూ రాజకీయ వ్యూహమేననడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద ఎవరి ఉద్దేశం, వ్యూహం ఏదైనా అంతిమ లక్ష్యం మాత్రం మోదీని ఓడించాలన్నదే. ఇది ఎంతమేరకు ఫలిస్తుంది? విపక్షాల ఐక్యతా మంత్రానికి మోదీ విరుగుడు మంత్రం ఏమిటన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎవరి ఆశయం ఏదైనా రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దేశ గతిని మరోమలుపు తిప్పేవే అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా? విపక్షాలకే జనం పట్టం కడతారా? ఒకే పార్టీకి అధికారం అప్పగిస్తే కలిగే మేలేమిటి? నష్ట మేమిటి? కూటమికి పగ్గాలు అప్పగిస్తే ఒరిగేదేమిటి? అన్న కీలక అంశాలపై జనం విజ్ఞతాయుతంగా తీసుకునే నిర్ణయంపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రాజకీయ వివేచన, విజ్ఞత, దూరదృష్టే గీటురాయిగా నవభారతం ముందుకు సాగాలంటే రాజకీయ వ్యతిరేకత కంటే- సైద్ధాంతిక నిబద్ధతే కొలమానం కావాలి.

-బి.రాజేశ్వర ప్రసాద్