మెయిన్ ఫీచర్

జ్ఞాన వారధి గురువే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాఘమాసంలో ముఖ్యమైన పర్వదినం-మాఘ పౌర్ణమి. పౌర్ణమి చంద్రునికి సంబంధించింది. చంద్రుడు మనస్సుకు అధిపతి.ఏ మనిషికైనా మానసిక వికాసం లేకపోతే ఏ భాగ్యాన్ని అనుభవించలేడు.. నిర్మలమైన మనస్సును పొందే మార్గాన్ని చూపించేది మాఘపౌర్ణమి. కనుక ఈ పున్నమి నాడు గురువును స్మరించుకోవడం, నదీస్నానం చేయడం, వివిధ దానాలు చేయడం ద్వారా మాఘ పూర్ణిమను పర్వదినంగా జరుపుకుని మానవులంతా తమ తమ జన్మలను సార్థకం చేసుకుంటారు. నదీలోనైనా, సముద్రంలోనై తటాకం లోనైనా చివరకు బావిలోనైనా స్నానం చేయడం పరమోత్తమం అంటారు. మాఘమాసం నదీస్నానాలకు ప్రశస్తమైన మాసం.
గురువు చూపిన బాటలో పయనిస్తే మానసికవికాసమే కాక మానసికానందమూ కలుగుతుంది. ఇహంలోను, పరంలోను మార్గనిర్దేశకుడైన గురువులేకపోతే అజ్ఞానాన్ని వీడలేరు. గురువు యొక్క ఆవశ్యకతను తెల్పడానికే సాక్షాత్తు పరమేశ్వరుడే కృష్ణుడుగా అవతరించి సాందీపుణ్ణి తన గురువుగా ఎంచుకుని విద్యాభ్యాసం చేశాడు.శ్రీరాముడిగా పుట్టినపుడు వశిష్ఠ, విశ్వామిత్రులను గురువులుగా పూజించాడు. త్రిమూర్తులను కూడా శాసించగల శక్తి సంపన్నుడు గురువు.ఆ గురువుకు నమస్కారం చేస్తే చాలు గురువు అనుగ్రహం లభిస్తుంది. అఖిల జనులకు ఆరాధ్యదైవంగా భాసిల్లే శిరిడీ సాయిబాబా కూడా గురువు ఆవశ్యకతను వివరిస్తూ తాను గురువుమాట విన్నానన్న విషయాన్ని గుర్తుచేసుకొంటారు. గురువును పూజించడం మన సంప్రదాయం. సర్వజనులకు, సర్వలోకాలకు గురువైన దత్తాత్రేయులు కూడా గురువు ఆవశ్యకతను చెబుతూ తాను ఇరవై నాల్గుమంది గురువుల నుంచి జ్ఞానాన్ని సంపాదించానని అన్నారు. ఈ మహామాఘి రోజు దత్తాత్రేయుల స్మరణ, గురుచరిత్ర పారాయణ అజ్ఞానాన్నుంచి జ్ఞానం వైపుకు దారులను చూపిస్తుంది. దత్తాత్రేయులు చూపించిన గురువులను ఒక్కసారి మాఘ పూర్ణిమ రోజు స్మరించిన వారికి సద్గురువు లభిస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనింపచేస్తాడు. కనుక ఆ 24 మంది గురువులను ఒక్కసారి తలుచుకుందాం.
భూమి: సర్వజనులల్లో మంచిచెడు అన్నది చూడకుండా సర్వులకూ ఆహారాన్ని అందించి, వారిని భరించగలిగే భూమి సహనానికి ఆదర్శమూర్తిగా భావించాలి. పరులు కీడు తలపెట్టినా వాటిని స్మరించక అందరిలో పరమాత్మను చూడగలిగే నేర్పును సాధించడంలో క్షమ ముఖ్యపాత్ర వహిస్తుంది. ఈ క్షమను భూమినుంచి దత్తాత్రేయులు గ్రహించారు.
గాలి: వాయువు ఏ భావాన్ని అంటుకోకుండా ప్రతిచోట అంటే దుర్గంధంపైనా, సుగంధం పైనా ఒకేలాగా వీస్తుంది. అట్లానే ఎన్నింటినో చూచినా, తెలుసుకొన్నా వాటిని వేటినీ అంటిపెట్టకుని ఉండకుండా ఎన్ని భావాలు మనసును చుట్టుముట్టుకున్నా వాటిని వదిలివేసి పరమేశ్వర ధ్యానం చేయడానికి అనువుగా మనసుని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నిలుపుకోవడం ఈ వాయువునుంచి నేర్చుకోవాలి.
ఆకాశం: అనంతమైన ఆకాశాన్ని చూసి ఆత్మకు ఎలాంటి ఎల్లలూ లేవన్న సత్యాన్ని గ్రహించాలి. అనంతమైన భగవంతుని తత్త్వాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకొంటూ పరమాత్మకు మారురూపులుగా మారగలిగే నైపుణ్యాన్ని ఆకాశం నుంచినేర్చుకోవాలి.
నీరు: నీటిలో ఎన్ని ఇతర వస్తువులు కలిపినా వాటిని తీసివేయగానే తిరిగి అంతే స్వచ్ఛంగా ఉండే నీరు మనసును ఎట్లా స్వచ్ఛతను కలిగి ఉండాలి. నీటిలాగా మనసుకూడా స్వచ్ఛంగా ఉండాలని ఈ నీటినుంచి నేర్చుకోవాలి. నిప్పు: నిప్పు వల్ల వెలుగు, వేడి జనించినట్లుగానే జ్ఞానమనే అగ్నికి దగ్గరైతే తెలివితేటలు, విషయ పరిజ్ఞానం అలవడుతాయి. జ్ఞానాగ్నితోనే అజ్ఞానతిమిరాంధకారాన్ని చిదిమివేసి వెలుగుల వేల్పు గురించి తెలుసుకోవచ్చు. కనుక నిరంతరం నిప్పులాంటి జ్ఞానాగ్ని సముపార్జించడంలోనే జీవితాన్ని వెచ్చించాలి.
చంద్రుడు: చంద్రునిలో కళలు వల్ల చంద్రుడు పెరుగుతున్నట్లుగాను, తరుగుతున్నట్లుగాను కనిపించినప్పటికీ అసలైన చంద్రబింబం ఉన్నదిఉన్నట్లుగానే ఉండడం చూసి జనన మరణాలకు అతీతంగా ఉండే ఆత్మ నిత్యసత్యమైనది దానికి జనన మరణాలు లేవు అన్న విషయాన్ని తెలుసుకోవాలి.
సూర్యుడు: సూర్యుడు ఒక్కడే అయి కూడా సర్వప్రపంచానికి వెలుగును పంచినట్లుగా, సూర్యుడు ఒక్కడే అయినా అనేక వేగ జలాశయాల్లో అనేక సూర్య ప్రతిబింబాలు ఏర్పడినట్లుగా ఆత్మ ఒక్కటే అయినా అది వేర్వేరు శరీరాలను ధరించి తిరిగి వాటిని విడిచి పరమాత్మలో లీనమైనట్లుగానే జీవుడు పరమాత్మనే చేరాలన్న విషయాన్ని గ్రహించాలి.
పావురాళ్లు: ఒక్క పావురం వలలో చిక్కుకుని ఉంటే దాన్ని చూసి మిగతా పావురాళ్లు కూడా ఆ పావురాన్ని విడిపించపోయి ఇవీ ఇరుక్కున్నట్లుగానే సంసార భ్రాంతిలో చిక్కుకుని జీవులందరూ ప్రాపంచిక బంధాల్లో ఇరుక్కుని పోతుంటారు. కనుక ఈ వలలో చిక్కుకున్న పావురాళ్లను చూసి తెలివిగా ఆలోచించి ఈప్రాపంచిక బంధాలల్లో చిక్కుకోకూడదు.
కొండచిలువ: కొండచిలువ తనకు దొరికిన ఆహారం తో తృప్తిచెందినట్లుగానే సంపాదించాలనే ఇచ్ఛను ఎప్పటికప్పుడు పెంచుకోక ఉన్నదానితో, లేక లభించిన దానితో తృప్తి పొందాలి.
తుమ్మెద: ఒక పువ్వునుంచి మరో పువ్వుపైకి తేనెకోసం ఎగురుతూ వెళ్లి వెళ్లి చివరకు అందులోనే చిక్కుకుని పోయినట్లు మనుష్యులు కూడా ఈ ఒక్కసారి అంటూ బంధాల్లోచిక్కుకుని నిత్యమైన సత్యాన్ని తెలుసుకొనలేరు కనుక విషయవాంఛలపై దృష్టిని అదుపు చేసుకోవాలి.
తేనెటీగ: ఈ తేనెటీగలు పూవు పూవు తిరిగి ఎంతో కష్టపడి మకరందాన్ని తినకుండా తీసుకొని వచ్చి దాచిపెడ్తాయి. కాని చివరకు ఆ తేనెటీగలు పెట్టిన తుట్టెను బాటసారులు కొట్టి తినేసినట్లుగానే అవసరానికి మించిన ధనాన్ని సేకరించి దానిపై ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటూ దైవాన్ని విస్మరిస్తే జననమరణ చక్రంలోనే ఈదులాడవలసి వస్తుంది.
ఏనుగు: మగ ఏనుగు ముందు తనను పట్టుకోవడానికి కందకాన్ని ఏర్పరిచారన్న ఆలోచన లేకుండా వ్యామోహంతో ముందుకు వెళ్లి ఆ గుంతలో చిక్కుకున్నట్లుగానే మనిషి బంధాల్లో చిక్కుకుని ఈ ప్రాపంచిన సంపదను పేర్చుకొనే క్రమంలో ఉండిపోతే చివరకు దుఃఖమే మిగులుతుంది. కోరిక ఎంతటి వారినైనా బలహీనులుగా చేస్తుంది. కనుక కోరికలకు దాసులు కాకూడదు.
జింక: వేటగాళ్ల డప్పుల మోతకు భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే బుద్ధితో అటు ఇటు పరుగిడి అనాలోచితంగానే వేటగాళ్ల ఉచ్చులో ఇరుక్కుని పోయినట్లుగా మనిషి విషయవాంఛలల్లో ఇరుక్కుని తన స్వేచ్ఛను కోల్పోతాడు. కనుక సమయం ఆగదు కనుక సదా భగవంతుని చింతన లోనే కాలం గడపాలి.
చేప: ఆశకు విచక్షణ, వివేకాలు ఉండవు. ఆశకు లోబడిన మనిషి దేనికైనా ముందుకు పోతాడు. అపుడు ఆశ అతడినే మింగివేస్తుంది. అదెలాగంటే ఎరకు ఆశపడి చేప గాలానికి చిక్కినట్లుగా మనిషి కోరికకు బంధీ అయి మృత్యువుకోరలకు చిక్కుకుని పోతాడు.
గద్ద: ఆహారం దొరకగానే తనకు అవసరానికి మించిన ఆహారాన్ని నోట కరుచుకుని దూరంగా ఎగిరిపోతుంది గద్ద. కానీ ఆగద్దను తరుముతూ ఇతర పక్షులు అనుసరించగానే వాటి ధాటికి తట్టుకోలేక నోట్లో ఉన్న ఆహారాన్ని విడిచివేసినట్లుగానే అవసరానికి మించిన సంపద మనిషిని అపకీర్తికి దగ్గర చేస్తుంది కనుక మనిషి ఎప్పుడూ అప్రమత్తునిగానే ఉండాలి.
సాలీడు: సాలెపురుగు తానే గూడు అల్లుకుని తిరిగి ఆ గూటిలోనే చిక్కుని మరణిస్తుంది. ఆవిధంగానే మనిషి తనకు అంతా తెలుసుననుకుంటూ ఊహాప్రపంచాన్ని సృష్టించుకుని ఆ ఊహాలోనే చిక్కుకుని బయటకు రాలేక అవస్థపడుతాడు కనుక నిజమేదో తెలుసుకొనే ప్రయత్నంలోనే మనిషి జ్ఞానాన్ని పొందుతాడని తెలుసుకోవాలి.
సముద్రం: సముద్రం లోకి ఇతరమైన నీరు ఎంత చేరినా చెలియకట్ట దాటనట్టుగానే మనిషి ఇంద్రియాల ద్వారా తెలుసుకొన్న జ్ఞానం ఎంత ఉన్నా విషయవాసనలకు లోబడకుండా పరమాత్మను తెలుసుకొనే జ్ఞానమే నిజమైన జ్ఞానమని గ్రహించగలగాలి.
వేశ్య:సంపద కోసం సుఖాల కోసం ఎన్నో పనులు చేసినా చివరకు సుఖమూ, సంపద రెండూ మనిషి చివరి దాకా ఉండవన్న సత్యాన్ని గ్రహించి లౌకిక వాంఛల కోసం పరుగులు మాని పరమాత్మవైపు అడుగులు వేయాలి.
కన్య: తన ఇంటికి వచ్చిన అతిథులకు జొన్నలు దంచి రొట్టెలు చేయాల్సి వస్తే దంచేటపుడు చేతికున్న గాజుల శబ్దం విని అతిథులు ఆలస్యం అనుకొంటారేమో నని గాజులు తీసివేసి జొన్నపిండిని తయారు చేసినట్లుగానే యోగి ప్రదర్శనలు, మహిమల చుట్టూ కాక పరమాత్మ కోసమే ధ్యానం కొనసాగించాలి.
లోహకారుడు : లోహాన్ని వస్తువుగా తయారుచేయడంలో ఎలాంటి ఏకాగ్రతను లోహకారుడు కలిగి ఉంటాడో మనిషి కూడా ఏకాగ్రతతో తదేక ధ్యానంతో పరమాత్మకోసం అనే్వషించి తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.
శలభం: వెలుగును చూసి ఆకర్షించబడి ఆ వెలుగుకోసం దగ్గరకువెళ్లి, ఆ వెలుగు నిచ్చే మంటలో పడి దగ్ధమైనట్లుగానే మనుషులు విషయ వాంఛలపై మనసుపడి మృత్యువు కౌగిట చేరుకొంటారు కనుక విషయ వాంఛలను వదలాలి.
గొంగళిపురుగు: గొంగొళిపురుగు లార్వాలో ఉండి ఉండి చివరకు సీతాకోక చిలుకగా మారి బయటకు వచ్చినట్లుగానే పరమాత్మపై మనసు నిల్పి భక్తుడు దైవానికి ప్రతిరూపుగా మారి ప్రపంచాన నిలవాలి.
సర్పం: సర్పం తనకు అక్కర్లేని కుబుసాన్ని వదిలివేసి తిరిగి కొత్త చర్మాన్ని ఎలాధరిస్తుందో మనలో అనవసరమైన భావాలను,అహేతుకమైన విశ్వాసాలను వదిలి కేవలం పరమాత్మ ధ్యానంతోనే జ్ఞానం పొందితే మానవ జన్మ సార్థకం అవుతుంది.
ఇట్లా దత్తాత్రేయుడు చెప్పిన గురువుల నుంచి కూడా మనుష్యులు జ్ఞానాన్ని సంపాదించుకుని గురువు అనుగ్రహాన్ని పొంది మానవ జన్మను చరిత్రార్థం చేసుకోవడానికి ఈ మాఘపూర్ణిమ నాడూగురుపూజను ఆచరించి శుభాలను పొందాలి.

- చివుకుల రామ మోహన్