మెయన్ ఫీచర్

విషానికి విషమే మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

80వదశకం నుండి పాకిస్థాన్ వ్యూహాత్మకంగా ఉగ్రవాదాన్ని పెంచి, పోషించి, మన దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నది. విచ్ఛిన్నం చెయ్యాలన్న లక్ష్యంతో మత రాజ్యమైన పాకిస్థాన్ మధ్యయుగాలనాటి భావజాలంతో, ప్రజాస్వామిక, లౌకిక, ఆధునిక రాజ్యమైన భారతదేశంపై చేస్తున్న ‘పవిత్ర యుద్ధం’లో భాగంగానే దేశంలో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. భయోత్పాతాన్ని సృష్టించి, భద్రతాదళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టి, వివిధ వర్గాల ప్రజలమధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నంచేసి దేశాన్ని ముక్కలు చేయటమే లక్ష్యంగాసాగుతున్న ఈ యుద్ధానికి కేంద్రం కాశ్మీర్. కాశ్మీర్‌ను ముందు కబళిస్తే, ఆ దారిలోనే మిగిలిన ప్రాంతాలను కూడా కబళించవచ్చునన్న దుష్టపన్నాగంతో భారత్‌పై తల పెట్టిన ‘వెయ్యి సంవత్సరాల’ యుద్ధంలో 70 సంవత్సరాలే గడిచాయి. కొందరు పేర్కొన్నట్లుగా ఇది పాకిస్థాన్ చేస్తున్న ‘ప్రచ్ఛన్న యుద్ధం’కాదు. గతంలో అగ్రదేశాలైన అమెరికా, రష్యాలు నేరుగా ఎప్పుడూ తలపడలేదు. కాని తమ సామంత దేశాల్లో అంతర్యుద్ధాన్ని ప్రేరేపించి, కయ్యానికి కాలుదువ్విన ఒక పక్షంవైపు అమెరికా, మరో పక్షం వైపు రష్యా చేరి వారికి సహాయ సహకారాలు అందించటాన్ని ప్రచ్ఛన్నయుద్ధం అనేవారు. వియత్నాం, అంగోలా, ఇథోపియా, లెబనాన్, నైజీరియా, అరబ్బు, ఇజ్రాయిల్ సంఘర్షణలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. కాని పాకిస్థాన్ మన దేశంలో కాశ్మీర్‌లోనూ, ఇతర ప్రాంతాలలోనూ చేస్తున్న యుద్ధం ఆ కోవకు చెందింది కాదు. ఇది ఒక రాజ్యం ఇంకో రాజ్యంమీద చేస్తున్న యుద్ధం. లష్యరే తొయిబా, జైషే మహమ్మద్‌లకు కావలసిన సాధన సంపత్తిని, ఆయుధాలను, శిక్షణను, లక్ష్యాలను పాకిస్థాన్ గూఢచారి సంస్థ సమకూర్చుతున్నది. వారు దేశంలో చొరబడటానికి పాకిస్థాన్ సైన్యమే సహకరిస్తుంది. దేశంలోకి ప్రవేశించిన తర్వాత వారి లక్ష్యాలను ఛేదించేందుకు కావలసిన సమాచారాన్ని ఆదేశాలను ఉపగ్రహ ఫోన్లుద్వారా ఎప్పటికప్పుడు పాక్ సైన్యం యిస్తున్నది. జీహాది నాయకులపై ఈగకూడా వాలకుండా భద్రత కల్పిస్తుంది. సైన్యం నేరుగా పాల్గొనకుండా మరొక దేశంపై నిరంతరాయంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చెయ్యగలగటం యుద్ధవ్యూహాల్లో విలక్షణమైంది. తన లక్ష్యానికి అనుగుణమైన యుద్ధవ్యూహాన్ని రచించి, అమలుచేయటంలో పాకిస్థాన్ విజయం సాధించిందని చెప్పవచ్చు.
భావజాల ఎగుమతి
ఆత్మాహుతి బృందాలతో పాటుగా మధ్యయుగాలనాటి భావజాలాన్ని ద్విజాతి సిద్ధాంతపు ఆలోచనలనుకూడా మన దేశానికి ఎగుమతి చేస్తున్నది. శత్రుదేశాన్ని దెబ్బతీయటానికి, అంతర్గతంగా తనకు అనుకూలమైన వాతావరణాన్ని, మద్దతును సమకూర్చుకొనేందుకు ఈ దేశంలో అల్పసంఖ్యాక వర్గాలవారికి భద్రత లేదని, వారిపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని దుప్ప్రచారం చేస్తున్నది. జీహాదీ శక్తులకు ప్రస్తుతం కాశ్మీర్ లోయలో ముస్లిం ప్రజానీకం నుండి సహకారం లభిస్తున్నది. అందుకే గతంలోకంటే వర్తమానంలో వారు ఎంచుకొన్న లక్ష్యాలపై దాడిచేసి గరిష్ట ప్రాణనష్టాన్ని కలుగచేయగల్గుతున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం యివ్వటమేకాక, వారిపై చర్యలు తీసుకోకుండా భద్రతాదళాలపై రాళ్ళవర్షం కురిపిస్తున్నారు. భద్రతాదళాలను చూసి జీహాదీ శక్తులు భయపడటం లేదు. కాలం గడిచేకొద్ది వారి దుశ్చర్యలు మరింత కిరాతకంగా పాశవికంగా తయారవుతున్నాయి. కాశ్మీరీ నేతలు కూడా ఈ యుద్ధక్రీడలో భాగస్వాములే. భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టినప్పుడల్లా రక్తపాతం సమస్యకు పరిష్కారంకాదని చెప్తుంటారు. జీహాదీ యువతను దారితప్పిన కుర్రవాళ్ళుగా, స్వాతంత్య్ర సేనానులుగా అభివర్ణిస్తుంటారు. జీహాదీకి అనుకూలంగా వేర్పాటువాదాన్ని, హింసోన్మాదాన్ని ఏదోరకంగా సమర్థిస్తుంటారు. ఒక శత్రుదేశం మన దేశం మీద చేస్తున్న యుద్ధంగా వారు దీన్ని గుర్తించటంలేదు. చెప్పే కథనాన్ని పాకిస్థాన్‌కు అనుకూలంగా చెప్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోను జీహాదీకు అనుకూల కథనాలే విస్తృతంగా ప్రచారం చేయబడుతున్నాయి.
మాటలు కాదు చేతలు కావాలి
ఏదైనా దాడి జరిగినప్పుడు ఉద్వేగంతో ఊగిపోవడం, పాక్ నడ్డి విరుస్తామని గంభీరమైన ప్రకటనలుచేయటం మన నేతలకు అలవాటు. చేతలు తక్కువ మాటలు ఎక్కువ కనుక మన నేతల ప్రగల్భాలకు పాక్ బెదరటం మానివేసి చాలాకాలం అయింది. 1993లో బొంబాయిలో వరుస పేలుళ్ళకు జీహాదీలు పాల్పడ్డప్పుడు పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటనలు గుప్పించారు. కానీ 1996లో పాక్ అడగకుండానే ఆ దేశానికి ‘పోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాయిచ్చి, ఇతర దేశాలనుంచి వచ్చే దిగుమతులపై ఎట్టి సుంకాన్ని విధిస్తున్నామో, అట్టి సుంకాలనే పాక్ దిగుమతులపై కూడా విధించారు. అందుకు ప్రతిగా మన దేశానికి పాక్ అట్టి హోదా ఇవ్వలేదు. దానితో పాకిస్థాన్‌కు ఎగుమతయ్యే వస్తుసేవలపై దిగుమతి సుంకాలు హెచ్చుమొత్తంలో వేశారు. అయినా మనం ఇప్పటివరకు ఆ దేశానికి ‘మోస్ట్‌ఫేవర్డ్ నేషన్’ హోదాను కొనసాగించటం సిగ్గుచేటు. 2001లో పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు కూడా ఆ హోదాను తొలగించలేదు. 18 సంవత్సరాల తర్వాత ఇప్పటికి మన నేతలు మేల్కొన్నారు. పార్లమెంట్‌పై దాడి జరిగిన సందర్భంలో సింధూ నది జలాల ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పారు. సింధు, జీలం, చీనాబ్ నదులను పాక్‌కు, రావి, బియాస్, సట్లెజ్ నదులను ఆ ఒప్పందంకింద మన దేశానికి కేటాయించారు. నదీ జలాలను పంపిణీ చేయటం కాకుండా నదులను పంపిణీచేశారు. ఎగువ దేశం అయిన మన దేశం పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టేందుకు, దారికి తెచ్చేందుకు అవకాశం ఉంది. కనీసం మనకు కేటాయించిన మూడు నదుల జలాలను సైతం పూర్తిగా వినియోగించుకోగల వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోలేకపోయాము. ఇప్పుడు మేల్కొని ఆ దిశగా పనిచేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటన కార్యరూపం దాల్చటానికి, అవసరమైన ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయటానికి దశాబ్ద కాలం పడుతుంది. 2003లో జమ్మూ-కాశ్మీర్ శాసనసభ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దుచేయమని తీర్మానం చేసింది. ఆనాడే ఆ ఒప్పందాన్ని పునఃపరిశీలన చేసుంటే ఎంతో బాగుండేది. భౌగోళికంగా సింధు నదులపై మనకు సహజంగా ఉన్న సౌలభ్యాన్ని శత్రు దేశాన్ని దెబ్బతీయటానికి అస్త్రంగా వాడుకోవాలి.
మమతాబెనర్జీ, చంద్రబాబు వంటి నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ప్రజలలో పెల్లుబికిన దేశభక్తి, ప్రతీకారేచ్ఛ బి.జె.పి.కి అనుకూలంగా మార్చుకుంటారన్న అనుమానంతో ఆ ఇద్దరు నేతలు మోడీయే ఈ దాడి చేయించారనే అర్థంతో మాట్లాడటం చౌకబారు రాజకీయమే కాదు, అమరుల త్యాగాన్ని త్రుణీకరించటమే. తామిచ్చే ప్రకటనలు జీహాదీలకు బలంచేకూర్చేవిగా ఉంటే దేశానికి ప్రమాదమని వారు మర్చిపోతున్నారు. ఇలాంటి నేతలను నమ్మి దేశ భవితను వారి చేతుల్లో పెట్టటం ఎంతవరకు శ్రేయస్కరం? కాశ్మీరీ నేతలు ప్రజాధనంతో నిరంతర రక్షణ వలయంలో భద్ర జీవనం గడుపుతూ పాకిస్థాన్‌కు అనుకూల ప్రకటనలు యిస్తున్నారు. వారికి ప్రసార మాధ్యమాలు ప్రాధాన్యం యివ్వటం అనుచితం. కటకటాల వెనుక ఉండవలసిన నేతలతో అపవిత్ర పొత్తు పెట్టుకుని భారతీయ జనతాపార్టీ కాశ్మీర్‌లో పెద్ద తప్పుచేసింది.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా ద్వంద్వ పౌరసత్వం కాశ్మీర్‌లో కొనసాగుతున్నది. అందుకు అంగీకరించి నెహ్రూ పెద్ద పొరపాటు చేశారు. రాజ్యాంగ సభలో అంబేద్కర్ 370వ అధికరణాన్ని తాత్కాలిక ఏర్పాటుగానే ఆనాడు ప్రకటించారు. 70 సం.ల తర్వాత ద్వంద్వ పౌరసత్వం వలన కలుగుతున్న అనర్థాలను దృష్టిలోపెట్టుకుని ‘ఒక దేశం-ఒకే ప్రజ- ఒకే పౌరసత్వం’ విధానాన్ని అమలుచేయాలి. అందుకు అన్ని రాజకీయ పక్షాలు కలిసిరావాలి.
నిజమైన ప్రతీకారం
భారతదేశ విచ్ఛిత్తికోసం పాక్ ఎంతకైనా తెగించగలదు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని పాక్ పెంచిపోషించింది. ఈశాన్య రాష్ట్రాలలో అస్థిరతని, అరాచకాన్ని సృష్టించింది. ఆక్రమిత కాశ్మీర్‌లో కొంత భాగాన్ని చైనాకు ఉదారంగా యిచ్చివేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా భారత వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పంజాబులో మాదకద్రవ్యాల అలవాటును ముమ్మరం చేసి యువతరాన్ని భ్రష్టుపట్టించింది. ముస్లిం యువతను జీహాదీలుగా తయారుచేయటానికి పెద్ద ప్రయత్నంచేస్తున్నది. మనం అప్రమత్తులుగా ఉండాలి. మన యుద్ధం పాకిస్థాన్ మీదే గాని ఇస్లాం మీదకాదు. ఇస్లామ్‌ను ఒక ఉపకరణంగా పాక్ తన రాజ్యకాంక్షకు, యుద్ధనీతికి వాడుకొంటున్నది. పాకిస్థాన్ చేస్తున్న యుద్ధానికి, భారతీయ ముస్లిమ్ సోదరులకు సంబంధం లేదు. పాక్ దుష్ప్రచార ప్రభావానికి లోనయి వారిలో కొందరికి కొంత సానుభూతి ఉండవచ్చు. అంతమాత్రంచేత వారి చిత్తశుద్ధిని అనుమానించవలసిన పనిలేదు. జీహాదీ శక్తులకు ఊతమిచ్చే ముల్లాలు, మత పెద్దలు, రాజకీయ నేతలు, ప్రసార మాధ్యమాలను నిర్దయగా అణచివేయక తప్పదు. సామాన్య ప్రజలు ఎప్పుడూ శాంతినే కోరుకుంటారు. ప్రత్యామ్నాయ కథనాలను ప్రచురించి, ప్రసారం చెయ్యాలి. పాకిస్థాన్ యుద్ధవ్యూహంపై అన్ని స్థాయిలలోనూ చర్చలు జరిపి ప్రజలను జాగరూకులు గావించాలి.

-డా. బి. సారంగపాణి