మెయన్ ఫీచర్

పాలనా సంస్కరణలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన ప్రభుత్వ పనితీరు, సాధించిన విజయాలు, ముందున్న లక్ష్యాల గురించి ప్రజలకు ‘ప్రగతి నివేదిక’ అందజేసే అవకాశాన్ని ప్రతి ప్రధానమంత్రికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటనుండి చేసే ప్రసంగం అవకాశం ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడవసారి ఆవిధం గా ప్రసంగించారు. ఈ సందర్భంగా 90 నిముషాలకు పైగా ప్రసంగించి గత సంవత్సరం తాను సృష్టించిన రికార్డును అధిగమించారు. దేశ చరిత్రలో ప్రధానమంత్రులు అందరికన్నా జవహర్‌లాల్ నెహ్రూ ఎక్కువసేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తే, ఆ రికార్డును గత సంవత్సరం మోదీ అధిగమించారు.
పదవి చేపట్టిన రెండు-మూడు నెలలకే మొదటిసారిగా ప్రసంగించిన మోదీ 2014లో తాను సాధించిన విజయాల గురించి ప్రజలకు చెప్పవలసిన అంశాలు ఏమీలేవు. దానితో దేశ అభివృద్ధికోసం తన సుందర స్వప్నాన్ని, తన ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను, తన సంకల్పాన్ని ప్రజలముందుంచారు. బహుశా ఇటీవలి కాలంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రులు అందరూ చేసిన ప్రసంగాల్లో ఈ ప్రసంగాన్ని ఉత్తమమైనదిగా చెప్పవచ్చు.
అయితే గత ఏడాది ఆయన చేసిన రెండో ప్రసంగం ఒకవిధంగా ఆత్మరక్షణలో పడి ప్రజలకు సంజాయిషీ చెబుతున్నట్టు ఉన్నది. ము ఖ్యంగా బలహీనవర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరకపోవడం, పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉండటంతో ఆయన ఆత్మవిశ్వాసంతో ప్రసంగించలేకపోయారు. ఈ ఏడాది మాత్రం తాను ప్రారంభించిన వివిధ పథకాల వల్లనే ప్రజల జీవితంలో మెరుగైన మార్పులు తీసుకురావడం సాధ్యమవుతున్నట్లు విశ్వాసం కలిపించే యత్నం చేశారు. 2019 ఎన్నికలలో తిరిగి గెలుపొందడానికి తన పార్టీ బలంపైన కన్నా తన పనితీరుపైననే ఎక్కువగా ఆధారపడవలసి వస్తుందని ఆయనకు తెలుసు.
2004లో వాజ్‌పేయి ప్రభుత్వం ఓటమి చెం దడానికి ఆయన ప్రభుత్వం ఆర్థికంగా సాధించిన విజయాలు ప్రజలపై ప్రభావం చూపడం ప్రారంభం కాకపోవడం, వాటి గురించి ప్రజలకు అవగాహన ఏర్పడకపోవడం అని చెప్పవచ్చు. అందుకనే నరేంద్రమోదీ ఆర్థికరంగం లో తన ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ఏకరువు పెట్టేయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జిఎస్‌టి బిల్లు పార్లమెంటు ఆమోదం పొందగలగడం దాని ప్రభావం ఎన్నికలలోపు ప్రజల కు చేరేట్లు చేయడాని ప్రయత్నాలు ప్రారంభించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, పెద్ద ఎత్తున వౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తుండడం, ప్రజలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
డెబ్బయవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రధాని ప్రసంగంలో ‘స్వరా జ్యం’ నుండి ‘సురాజ్యం’ వైపు దేశ గమనాన్ని తమ ప్రభుత్వం ఏవిధంగా మార్చనుందో వివరించే ప్రయత్నం చేశారు. అందుకు రైల్వే టికెట్ల జారీని వేగవంతం చేయడం, ఆదాయపు పన్ను రిటర్న్‌లను త్వరితగతిన చెల్లించడం, సత్వరమే పాస్‌పోర్ట్‌లను జారీ చేయాలని సంకల్పించడం వంటి పలు పరిపాలనా పరమైన చర్యలను ఆయన ఉదహరించారు. అదేవిధంగా సంక్షేమ పథకాల లబ్దిదారులకు ప్రభుత్వ సబ్సిడీ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖా తాలలో జమచేస్తున్న ప్రయత్నాలను వివరించారు. గ్రూప్ సి,డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయడం ద్వారా ఉద్యోగుల ఎంపికలో పారదర్శకతకోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.
ఒక సంవత్సరంలో నాలుగుకోట్ల మందికి ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగలగడం, ఉజ్వల పథకం కింద ఐదుకోట్ల మంది పేద మహిళలకు మూడేళ్లలో ఈ పథకం వర్తింపజేయడం, వంటి నేరుగా ప్రజలకు వ్యక్తిగత జీవితంలో అనుభవంలోకి రాగల కార్యక్రమాల గురించి వివరించారు. అయితే ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఒక విషయాన్ని గమనించాలి. కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే దేశ పురోభివృద్ధికి సహకరించదని గుర్తించాలి. సమర్థవంతమైన పరిపాలన అందించడమే సుపరిపాలనకు దారితీయదని కూడా తెలుసుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధానమంత్రి ప్రసంగం పూర్తికాగానే ఆయన న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలను ముఖ్యంగా న్యాయమూర్తుల ఖాళీలను భర్తీచేయడం గురించి, ప్రస్తావించలేదని స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. థక్కర్ విచారం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు-కేంద్ర ప్రభుత్వ వైఖరుల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడింది. దాన్ని పరిష్కరించడం కోసం ప్రధానమంత్రి చొరవ తీసుకొనకపోవడం తెలిసిందే. ఒక ప్రధాన అంగం పటిష్ఠంగా లేకుండా ‘సుపరిపాలన’ సాధ్యం కాదని గమనించాలి.
ఆర్థికాభివృద్ధి పట్ల దృష్టి కేంద్రీకరిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిపాలనా పరంగా తీసుకొని రావలసిన సంస్కరణల గురించి, పోలీసు సంస్కరణల గురించి దృష్టి సారించకపోవడం విచారకరం. ఈ సంస్కరణలు తీసుకురాకుండా సాధారణ ప్రజల దృష్టిలో ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి కలిగించడం సాధ్యంకాదు. నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ‘‘పరిమిత ప్రభుత్వం-అపరిమిత పరిపాలన’’ తన లక్ష్యంగా ప్రకటించారు. అయితే ఆ దిశ లో ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేసే ప్రయత్నం చేయడంలేదు. పైగా ఎక్కువగా ప్రభుత్వ యంత్రాంగం పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు మన్మోహన్ సింగ్ హయాంలో ప్రధానమంత్రి కార్యాలయంలో సుమారు వందమంది అధికార్లు పనిచేస్తుంటే, ఇప్పుడు ఆ సంఖ్య నాలు గు రెట్లకు పెరిగింది. మంత్రుల నిర్ణయాలను, ప్రధాని ప్రమేయం లేకుండానే ఆయన కార్యాలయంలోని అధికారులు తారుమారు చేస్తున్నారు.
మరోవంక పోలీసు సంస్కరణల గురించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దశా బ్దం దాటిపోతున్నా కేరళలో మినహా మరెక్కడా అమలులోకి రావడం లేదు. ప్రభుత్వం పనితీరులో మార్పు తీసుకు రావడానికి పరిపాలన-పోలీసు సంస్కరణలు అత్యవసరం కాగలవు. అయితే ఈ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకురాలేదు. జిఎస్‌టి బిల్లు విషయంలో మాదిరిగానే, పాలనా సంస్కరణల విషయంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి అవగాహనతో ఉపక్రమిస్తే కాని ఇటువంటి సంస్కరణలు సాధ్యంకావు. అందుకోసం స్వయంగా ప్రధాన మంత్రి చొరవ తీసుకోవలసిందే.
సామాజిక రుగ్మతల పట్ల ప్రజల ఉపేక్షాభావాన్ని తన ప్రసంగంలో నరేంద్ర మోదీ ఎండగట్టే యత్నం చేశారు. సామాజిక రుగ్మతలు లోతైనవి కావడం వల్ల వాటిని తుదముట్టించడానికి బలప్రయోగం అవసరమని కూడా చెప్పారు. కేవలం చట్టాల వల్లనే సామాజిక రుగ్మతలను తరిమికొట్టడం సాధ్యం కాదు కాబట్టి ప్రతి పౌరుడు పోరాడవలసిందేనని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. అయితే ఆవిధంగా పోరాడడానికి సాధారణ ప్రజలకు ప్రభుత్వం నుండి మద్దతు అవసరం. కేవలం పరిపాలనాపరమైన, పోలీసు సంస్కరణల ద్వారానే ప్రభుత్వ పారదర్శకత పెరుగుతుంది. అప్పుడు ప్రజలను నియంత్రించే వ్యవస్థగా కాకుండా ప్రజలకు సహకరించే వ్యవస్థగా ప్రభుత్వం రూపొందగలదు.
ప్రభుత్వం తన శక్తి సామర్ధ్యాలను అనేక అంశాలకు విస్తరించవలసి వచ్చినప్పుడు సుపరిపాలన సాధ్యంకాదు. అందుకనే ప్రభుత్వ పనితీరులో సమూలమైన సంస్కరణలకు ఇప్పటికే సమయం మించిపోతున్నదని గమనించాలి. గత 25 సంవత్సరాలుగా మన ప్రభు త్వం ఆర్థిక సంస్కరణల పట్లనే దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఆర్థిక సంస్కరణల కారణంగా దే శంలో సంపద గణనీయంగా పెరిగినా అది కొద్దిమంది చేతులలోనే కేంద్రీకృతం అవుతున్నదని, ఆర్థిక తారతమ్యాలను విశేషంగా పెం చుతున్నదని స్పష్టం అవుతున్నది.
ఆర్థిక సంస్కరణల రూపకర్తలు చెబుతున్న ట్లు ఆర్థిక సంస్కరణలు దేశంలో ఉపాధి అవకాశాలను పెంచకపోగా, కుదించివేస్తున్నాయి. నేడు దేశంలోని ఉద్యోగులు కేవలం ఆరుశా తం మాత్రమే సంఘటిత రంగంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఉద్యోగ భద్రత ఎండమావిగా మారుతున్నది. ఆర్థిక సంస్కరణల కారణంగా పెద్దపెద్ద కార్పొరేటు సంస్థల సంపదలు పలురెట్లు పెరుగుతున్నప్పటికీ దే శంలో ఉత్పాదకత పెరగడంలేదు. ఆర్థిక వ్యవహారాల వికేంద్రీకరణ సాధ్యం కావడం లేదు. గత 25 ఏళ్ల లో మహిళల ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి.
వ్యవసాయ వృద్ధిరేటు ఆందోళనకరంగా కొనసాగుతుండగా, వ్యవసాయంలో పనిచేస్తున్న కార్మికుల శాతం 70 నుండి 60కి పడిపోయింది. జిడిపిలో వ్యవసాయం వాటా ఒకనాటి 50 నుంచి 15 శాతానికి పడిపోయింది. దీంతో గ్రామీణ రంగంలో దుర్భరమైన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయి. ఇదేకాలంలో చైనాతో పాటు పలు దేశాలు ఆర్థిక వికేంద్రీకరణ ద్వారా కార్మికులకు ఉపాధికతను గణనీయంగా పెంచగలిగాయి. మనదేశంలో టెలి కాం రంగం ఆదాయం రీత్యా అగ్రగామిగా ఉండగా అందులో పనిచేస్తున్న ఉద్యోగులు 5 శాతం మంది మాత్రమే కావడం గమనార్హం. అత్యధికంగా కార్మికులు పనిచేసే మధ్య చిన్నతరహా పరిశ్రమల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. అయితే వీటిల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్యమాత్రం తగ్గలేదు. దీంతో లాభదాయకత పడిపోయింది.
బిజెపి మంత్రులు రెండేళ్ల కాలంలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని సంబరపడుతున్నారు. అయితే మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంపై కూడా మొదటి ఐదేళ్లలో చెప్పుకోదగిన అవినీతి ఆరోపణలు వెలుగులోకి రాలేదు. పైగా 2009 ఎన్నికలలో కేవలం మన్మోహన్ సింగ్ ‘సుపరిపాలన’ ద్వారా మాత్రమే, కాంగ్రెస్ గెలుపొందిందని గమనించాలి. ప్రతిపక్షాలు, మీడియా ద్వారా కాకుండా ఉన్నత న్యాయస్థానాల క్రియాశీలత కారణంగా, డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి వంటి కొద్దిపాటి నేతల పట్టుదల కారణంగా ఆ తర్వాత యుపిఎ ప్రభుత్వం భారీ కుంభకోణాలలో దోషిగా నిలబడవలసి వచ్చింది. నరేంద్రమోదీ ప్రభుత్వం సహితం రెండేళ్లుగా హడావిడిగా, యదేచ్ఛగా పలు పరిశ్రమలకు, పర్యావరణ అనుమతులు ఇచ్చింది. రాబోయే సంవత్సరాల్లో ఈ సందర్భంగా జరిగిన అక్రమాలు ప్రభుత్వాన్ని వెన్నాడే అవకాశాలు లేకపోలేదు. అందుకనే కేవలం ఆర్థికాభివృద్ధిపట్లనే కాకుం డా, పరిపాలనా సంస్కరణలకు, పోలీసు- న్యా యవ్యవస్థల సంస్కరణకు సహితం ప్రధానమంత్రి తగిన ప్రాధాన్యతనివ్వాలి.

- చలసాని నరేంద్ర