మెయన్ ఫీచర్

అంతర్జాతీయ చట్టాలే శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల సందర్భంగా ‘జెనీవా ఒ ప్పందం’పై సర్వత్రా విస్తృత చర్చ జరిగింది. అసలు ‘జెనీవా ఒప్పందం’ అంటే ఏమిటి? ఎందుకు దాన్ని అమలు చేస్తున్నారు? ఈ ఒప్పందం ఎపుడు మొదలైంది? వంటి అనుమానాలకు సమాధానం తెలుసుకునే ఉత్సుకత ఇపుడు అందరిలోనూ కలిగింది. ప్రతి వ్యక్తీ ప్రైవేటు చట్టాలు, ప్రభుత్వ చట్టాలను పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ చట్టాల్లో రాష్టస్థ్రాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి చట్టాలు ఉంటాయి. ప్రైవేటు చట్టాల్లో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు నిర్దేశించే నిబంధనలను పాటించడం తప్పనిసరి అవుతుంది. అంతర్జాతీయ చట్టాలను పర్యవేక్షించే బాధ్యతను నేడు ఐక్యరాజ్య సమితి తన భుజస్కంధాలపై వేసుకొంది. అందులోభాగంగా వచ్చిన మానవ హక్కులే అంతర్జాతీయ చట్టాలుగా, అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలుగా, ద్వైపాక్షిక ఒప్పందాల రూపంలో అమలులోకి వచ్చాయి.
జెనీవా ఒప్పందం 1949లో కుదిరింది. స్నేహపూర్వక వాతావరణంలో సోదర భావంతో కలసి మెలసి జీవించడం, మహిళలపై ఎలాంటి దాడులు జరగకుండా లైంగిక దోపిడీ, వేధింపులు లేని స్వేచ్ఛాయుత ప్రపంచం ఏర్పాటు చేసుకోవడం, పిల్లలపైనా, బాలలపైనా పీడన లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం, పర్యావరణ హితమైన వాతావరణం ఏర్పడడం, కుల, మత, లింగ, వర్ణ, సంస్కృతి, భాషాపరమైన తేడాలు లేకుండా ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన , సుఖవంతమైన జీవితం గడపడం- ఒక్కముక్కలో చెప్పాలంటే ‘వసుధైక కుటుంబం’గా జీవించడం. ఇదే మనిషి అంతిమ లక్ష్యం. అందర్నీ క్రమబద్ధమైన జీవితానికి అలవాటు చేసే క్రమంలో చట్టాలు, నియమ నిబంధనలు, కోర్టులు, ప్రభుత్వాల నియంత్రణ, జైళ్లు అన్నీ ఒకదానికొకటిగా అవతరించాయి. ఎన్ని ఆంక్షలు ఉన్నా మానవ హక్కులను మాత్రం ఎవరూ కాదనలేరు. వాస్తవానికి మానవ హక్కుల భావన 1780లోనే జెర్మి బెంథమ్‌తో మొదలైంది.
మానవ హక్కులు అనేవి ఒక దేశానికో, ఒక వర్గానికో, ఒక జాతికో సంబంధించిన సమస్య కాదు. మానవ హక్కులు అందరి సమస్య, ప్రపంచ ప్రజల సమస్య. కొన్ని వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్న సమస్య. ఆదిమ కమ్యూనిజం, బానిస వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థలోనూ, పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ, కమ్యూనిస్టు వ్యవస్థలోనూ మానవ హక్కుల కోసం పోరు సాగింది. ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థకు పుట్టినిల్లు బ్రిటన్. ఆ క్రమంలోనే పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య మానవ హక్కుల భావజాలానికి నాందీ ప్రస్తావన జరిగింది. బ్రిటన్‌లో 1225లో ప్రకటించిన మాగ్నా కార్టా హక్కులకు సంబంధించినదే. మాగ్నా కార్టా తర్వాత 1668లో ‘పిటిషన్ ఆఫ్ రైట్స్’ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అమెరికా 1776లో స్వతంత్రం ప్రకటించుకున్నాక 1787 నుండి అమెరికా రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులో మానవ హక్కులకు పెద్దపీట వేశారు. ఆ తర్వాత అమెరికా రాజ్యాంగంలో పది సవరణలు జరిగాయి. వీటన్నింటినీ కలిపి ‘బిల్ ఆఫ్ రైట్స్ (1791)’గా ఇప్పటికీ వ్యవహరిస్తున్నాం. 1944లో రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాల నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. ఐక్యరాజ్యసమితి రాజ్యాంగాన్ని లేదా నిబంధనావళిని మనం ‘చార్టర్’ అని వ్యవహరిస్తాం. అందులో ఒక పీఠిక, 19 అధ్యాయాలున్నాయి. మొత్తం 111 అధికరణాలున్నాయి.
ఐరాస చార్టర్‌లోని తొమ్మిదో అధ్యాయంలో 55 నుండి 60 అధికరణాలు ప్రత్యేకించి మానవ హక్కులకు సంబంధించినవే. ఈ అధ్యాయం కిందనే ఆర్ధిక, సామాజిక మండలి ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి ఆధీనంలో మానవ హక్కుల కమిషన్, మానవ హక్కుల మండలి, మానవ హక్కుల ఉపసంఘం, మానవ హక్కుల హైకమిషన్, మహిళా హక్కుల కమిషన్, ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక సాంస్కృతిక సంఘం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ బాలల ఆపత్కాల నిధి తదితర సంస్థలు పరోక్షంగా మానవ హక్కుల పరిరక్షణకే తోడ్పడుతున్నాయి. ఇందులో భాగంగానే మానవ హక్కులకు సంబంధించి ఐక్య రాజ్య సమితి నేతృత్వంలో మూడు ప్రధాన డిక్లరేషన్లు ఉన్నాయి. ప్రపంచ మానవ హక్కుల ప్రకటన, ప్రపంచ పౌర రాజకీయ హక్కుల ప్రకటన, ప్రపంచ ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల ప్రకటనలను మూడు మూల స్తంభాలుగా చెప్పవచ్చు.
1948 డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ మానవ హక్కుల ప్రకటనను ఆమోదించారు. ప్రపంచ పౌర, రాజకీయ హక్కుల ప్రకటన 1976 మార్చి 23 నుండి అమలులోకి వచ్చింది. ప్రపంచ ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల ప్రకటనను 1966లో ఆమోదించినా, చాలా ఆలస్యంగా అమలులోకి వచ్చింది. 1950లో మానవ హక్కులపై జరిగిన యురోపియన్ యూనియన్ సదస్సు, 1961లో యురోపియన్ యూనియన్ సోషల్ చార్టర్, 1969లోని అమెరికా మానవ హక్కుల సదస్సు, 2004 అరబ్ దేశాల మానవ హక్కుల చార్టర్, 1981 ఆఫ్రికా దేశాల మానవ హక్కుల చార్టర్, జాతీయత లేని వ్యక్తుల హక్కుల సదస్సు -1960, జాతిపరమైన వివక్ష వ్యతిరేక అంతర్జాతీయ సదస్సు-1966, 1975లో జరిగిన చిత్రహింసల వ్యతిరేక సదస్సు వంటి అనేకానేక ఒప్పందాల్లో ‘జెనీవా ఒప్పందం’ చాలా కీలకమైంది.
మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు శ్రీపాద అమృత డాంగే రచించిన ‘ఆదిమ కమ్యూనిజం నుండి బానిస సమాజం వరకూ భారతదేశం ’ గ్రంథంలోనూ, రాహుల్ సాంకృత్యయన్ రాసిన ‘ఓల్గా నుండి గంగా’, ‘రుగ్వేద ఆర్యులు’ గ్రంథాల్లో ఈ రచ్చ విస్తృతంగానే సాగింది. 1917లో సోవియట్ రష్యాలో సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భావం మానవ హక్కులకు సంబంధించి పెను తుపానునే సృష్టించింది. అల్పసంఖ్యాక పెట్టుబడిదారీ నియంతృత్వం స్థానంలో మెజారిటీ కార్మిక వర్గం, కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో సోవియట్ రష్యాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. లెనిన్ మరణం తర్వాత జోసఫ్ స్టాలిన్ నాయకత్వంలో రష్యాలో సోషలిస్టు ఉద్యమ పునాదులు బలపడ్డాయి. అదే సమయంలో 1949లో మావో నాయకత్వంలో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. యూరప్, ఆసియా దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఈదేశాల్లో సంస్కరణలు మానవ హక్కుల పరిధి విస్తృతం కావడానికి దోహదం చేశాయి.
1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించినా, 1951లో కొత్తగా రూపొందించిన భారత రాజ్యాంగంలో సమానత్వానికి, స్వేచ్చకు పెద్ద పీటవేశారు. ప్రాథమిక హక్కులు అంటే ఒక రకంగా మానవ హక్కులే. రాజ్యాంగంలోని మూడో విభాగంలో ప్రాథమిక హక్కులకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అధికరణం 12,13,14,15,16, 17,18 పూర్తిగానో పాక్షికంగానో హక్కులకు సంబంధించినవే. అదే విధంగా ఆదేశిక సూత్రాలను కూడా పొందుపరిచారు. విభాగం-4లోని 38, 39, 40, 42, 43, 44, 45,46 తదితర అధికరణాలు కూడా మానవ హక్కులకు సంబంధించినవే. గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించి 244, 244ఏ అధికరణాలున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 330 నుండి 342 వరకూ అధికరణాలున్నాయి.
సైనిక పాలన ఉన్న దేశాల్లో మానవ హక్కులు ఒక రకంగా ఉంటాయి. సోషలిస్టు దేశాల్లో ఇంకో రకంగానూ, పెట్టుబడిదారీ దేశాల్లో మరో రకంగానూ ఉంటాయి. కొన్ని దేశాల్లో మతం ప్రాతిపదికగా ఉంటాయి. మానవ హక్కులు ఆంతరంగిక అంశం. ఈ పరిస్థితుల్లో ఏ దేశం మానవ హక్కులను ఉల్లంఘించిందో చెప్పడానికి ఐక్యరాజ్య సమితికి ఒక ‘బెంచ్‌మార్క్’ ఉండాలి. అదే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఒప్పందాలే ప్రామాణికంగా ఆయాదేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎలా ఉన్నాయో నిర్ధారించే వీలుంది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ఐక్యరాజ్య సమతిలో అనేక మార్లు ప్రస్తావించింది. కాని మన ప్రభుత్వం కశ్మీర్ ప్రాంతాన్ని దేశ ఆంతరంగిక సమస్యగా చెబుతోంది. భారత్- పాకిస్తాన్‌లను రెండు సార్వభౌమ దేశాలుగా బ్రిటిష్ ప్రభుత్వం విభజించడంతో పాటు విభజన సరిహద్దును నిర్ధారించేందుకు సర్ సిల్ రాడ్‌క్లిఫ్ అనే న్యాయాధికారిని చైర్మన్‌గా నియమిస్తూ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇరు దేశాల నుండి వలసలు విపరీతంగా పెరగడంతో ఒక రకమైన గందరగోళం ఏర్పడి దేశాల సరిహద్దును ఐదు వారాల్లో ముగించాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నడూ భారత్‌ను సందర్శించని రాడ్‌క్లిఫ్ సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఎలాంటి అవగాహనా లేకున్నా మ్యాప్ తీసుకుని ఒక పెన్నుతో గీత కొట్టి దానిని బ్రిటిష్ ప్రభుత్వానికి అందించి చేతులు దులుపుకుని బ్రిటన్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన ఎన్నడూ భారత్‌ను సందర్శించలేదు. రాడ్‌క్లిఫ్ గీసిన గీత ప్రకారం లాహోర్ నగరం భారత్‌లో చేరింది, తన సహాయకుడు దానిని చూసి పాకిస్తాన్‌కు ఒక్క మహానగరం కూడాలేదని చెప్పడంతో మరో గీత గీసాడు రాడ్‌క్లిఫ్. ముస్లింలు అధికంగా ఉన్న సింథ్, బలూచిస్తాన్ రాష్ట్రాలను పాక్‌కు కేటాయించిన రాడ్‌క్లిఫ్ పంజాబ్, బెంగాల్ విషయంలో సందిగ్ధంలో పడి బెంగాల్‌కు మధ్యలో ఒక గీత, పంజాబ్ మధ్యలో ఒక గీత గీశాడు. దీంతో తూర్పు బెంగాల్ పాక్‌కు, పశ్చిమ బెంగాల్ భారత్‌కు దక్కాయి. పశ్చిమ పంజాబ్ పాక్‌కు, తూర్పు పంజాబ్ భారత్‌కు వచ్చాయి. తూర్పు బెంగాల్ ఆ తర్వాత బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. ఆ రాడ్‌క్లిఫ్ గీతే నేటికీ భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోంది.

-బీవీ ప్రసాద్ 98499 98090