మెయన్ ఫీచర్

మరణశిక్షకు ముగింపు ఎప్పుడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏవిధంగా చూసినా ఆధునిక నాగరిక ప్ర పంచంలో మరణశిక్ష అత్యంత దారు ణమైన, అమానుషమైన దండన. ఈ విషయం మొత్తం ప్రపంచం గుర్తించింది. అందుకే 80 శాతం దేశాలలో ఇది అమలులో లేదు. అత్యధిక దేశాలు తమ చట్టాలలోనే అటువంటి అవకాశం లేకుండా చేయగా, మరి కొన్ని దేశాలలో ఉన్నా మరణశిక్ష అమలు జరగడం లేదు. మన దేశంలో కూడా చాలా అరుదుగానే దీన్ని అమలు జరుపుతున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలలో మరణశిక్షలను అమలు పరచడం ద్వారా ఎక్కడా నేరాలు అదుపులోకి వచ్చినట్లు తేలలేదు. అమెరికా వంటి దేశంలోనే మరణశిక్షను అమలు పరచిన తర్వాత నిందితులు నిర్దోషులుగా తేలడం, అప్పుడు ఆ శిక్షను వెనక్కి తీసుకోలేని పరిస్థితులు ఏర్పడటం చాలా చూసాము. పైగా, ఈ శిక్షకు గురవుతున్న వారిలో 90 శాతం మంది వరకు అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, నిరుపేదలు మాత్రమే. ఎవరైతే భారీగా కోర్టు ఖర్చులు పెట్టుకొని తమ వాదనలను బలంగా వినిపించుకోలేరో, పోలీస్, న్యాయ ప్రక్రియను తారుమారు చేయగల సామర్ధ్యం లేని వారు మాత్రమే ఈ శిక్షకు గురవుతున్నారు.
తాజాగా మన సుప్రీం కోర్టులో జరిగిన ఉదంతం మనందరికీ ఒళ్లు జలదరించేటట్లు చేస్తుంది. అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు సంచార గిరిజనులకు మరణ శిక్షను ఖరారు చేసిన సుప్రీం కోర్టు పదేళ్ల తర్వాత గత మంగళవారం వారిని నిర్దోషులుగా ప్రకటించి విడుదలకు ఆదేశించింది. అంటే ఎటువంటి నేరం చేయకుండానే 16 ఏళ్లపాటు జైళ్లలో దారుణమైన పరిస్థితులను వారు అనుభవించ వలసి వచ్చింది. బాలుడిగా జైలుకు వెళ్లిన ఒక వ్యక్తి ఇప్పుడు వయోజనుడిగా బైటకు వచ్చాడు. వారిలో కొందరు దీర్ఘకాల జైలు జీవనం కారణంగా మానసిక సమస్యలకు కూడా గురయ్యారు. వారిని ఇప్పుడు సుప్రీం కోర్టు అమాయకులుగా నిర్ధారించి, అసలు నిందితులను గుర్తించమని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. నాసిక్‌లో 15 ఏళ్ళ బాలికపై అత్యాచారం జరిపి, దోపిడీ చేసి, హత్య చేసిన ఘటనలో ట్రయిల్ కోర్ట్, హై కోర్టు, చివరకు 2009లో సుప్రీం కోర్టు కూడా వారందరికీ మరణ శిక్షను విధించింది. అయితే ముంబయ హైకోర్టు మాత్రం వారిలో ముగ్గురికి మరణశిక్షను రద్దు చేసి, జీవిత ఖైదుగా మార్చింది. చావు కోసం ఎదురు చూస్తూ 16 ఏళ్ళ పాటు అకారణంగా జైళ్లలో గడప వలసి వచ్చింది. వారికి సామాజిక హోదా, అర్థ బలం, అంగ బలం లేకపోవడంతో క్షమాభిక్షకు కూడా అనర్హులుగా మిగిలారు. అసలు నిందితులను తప్పించడం కోసం పోలీసులు వారిని తప్పుడుగా ఈ కేసులో ఇరికించిన్నట్లు ఇప్పుడు సుప్రీం కోర్టు గ్రహించింది. ఏకే సిక్రి, ఎస్. అబ్దుల్ నజీర్, ఏంఆర్ షా లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ప్రత్యేకంగా- బాలుడిగా జైలుకు వెళ్లిన అంకుష్ మారుతి షిండే గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
మారుతి షిండే చాలా సంవత్సరాల పాటు అమానుష పరిస్థితులలో నివసించాడని మానసిక వైద్యుడు డా. ఆషిట్ శేఠ్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలాకాలం పాటు ఏకాంతవాసంలో, చాల అరుదుగా మనుష్యులతో కలిసే అవకాశంతో, చావు ముంచుకు వస్తున్నదనే భయం నీడలో ఉంచారు. చాలా అరుదుగా అన తల్లిని మాత్రమే కలిసేందుకు అనుమతించారు. తోటి ఖైదీలతో కూడా కలవనిచ్చేవారు కాదు. కాబట్టి, నిందితులు అందరినీ తీవ్ర వత్తిడుల మధ్య, ఎప్పుడు చావు ముంచుకు వస్తుందోననే భయంతో ఉంచారని బెంచ్ పేర్కొన్నది. వీరిలో ఒకొక్కరికి రూ. 5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించమని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం హెచ్చరించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిర్దోషుల మానసిక వ్యధకు పోలీసులే కారణం అని స్పష్టం చేసింది.
ఈ నేరం జరిగాక ఒక ప్రత్యక్ష సాక్షి నలుగురు నిందితులను గుర్తించినా వారి గురించి దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదని బెంచ్ మండిపడింది. ఆ నలుగురినీ పట్టుకోవడానికి పోలీ సులు ఎటువంటి ప్రయత్నం చేయలేదని స్పష్టం చేస్తూ, వారిపై మూడు నెలల్లో తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీం ఆదేశించింది. తమకు విధించిన మరణ శిక్షపై సమీక్ష జరపాలని ఆ ఆరుగురు 2009లో సుప్రీంను ఆశ్రయించినప్పుడు, వారి వాదనలను విననే లేదు. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ అక్టోబర్, 2018లో దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ లను విచారించిన కోర్టు ఇప్పుడు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఒక విధంగా భారత దేశంలో ఉన్నత న్యాయస్థానాలు చాలాకాలంగా మరణశిక్ష పట్ల విముఖతను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరణశిక్షను చట్టంలో నుండి తీసివేయాలని లా కమిషన్ సిఫార్స్ చేసింది. గత రెండు దశాబ్దాలలో కేవలం నలుగురు మాత్రమే మన దేశంలో ఉరితీతకు గురయ్యారు. చివరి సారిగా జులై 30, 2015లో- 1993 నాటి ముంబయ ఉగ్రదాడిలో నిందితుడైన ఉగ్రవాది యాకుబ్ మెమొన్‌ను ఉరితీశారు. అంతకు ముందు ఫిబ్రవరి 8, 2008లో 2001 నాటి భారత పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడి కేసులో ముహమ్మద్ ఆఫ్జాల్ ను ఉరితీశారు. నవంబర్ 21, 2012న 2008 నాటి దాడులతో సంబంధం ఉన్న అజ్మర్ అమిర్ ఖాసాద్ ను ఉరితీశారు. వీరంతా ఉగ్రదాడులలో ఉన్నవారు కావడం గమనార్హం. అంతకు ముందు 2004లో 1995లో 14-ఏళ్ళ బాలికపై అత్యాచారం కేసులో ధననంజయ్ చట్టర్జీని ఉరితీయారు.
చాలావరకు ఉరిశిక్షలు ప్రజలలో ఉద్రేకాలు కలిగించిన కేసులలో అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. చైనా, ఇరాన్ ఇరాక్, టర్కీ వంటి నిరంకుశ వ్యవస్థలు ఉన్న దేశాలలో పెద్ద ఎత్తున మరణశిక్షల అమలు జరు గుతు న్నాయి. సుమారు 80 శాతం ఉరిశిక్షలు కేవలం ఐదు దేశాలలో అమలు జరుగుతూ ఉండటం గమనార్హం. ఏ నాగరిక సమాజం అయినా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. వారి జీవన భద్రతకు భరోసా కల్పించాలి. కానీ చట్టమే ప్రాణాలను తీసుకోవడం అనాగరికం కాగలదు. సత్యం, అహింస వంటి బోధనలకు ప్రభావితమైన మన దేశంలో అత్యంత అమానుషమైన మరణ శిక్షను ఇంకా అమలు చేస్తుండడం దురదృష్టకరం.
మరణశిక్షను వ్యతిరేకించడమంటే నేరస్థులకు, విద్రోహ చర్యలకు కాపాడే వారికి మద్దతు పలకడంగా చాలామంది అపోహ పడుతున్నారు. విపరీత వాఖ్యానాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులు, దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి అదే సరైన శిక్ష అని కూడా వాదిస్తున్నారు. వారి ఆవేశాలను, ఆవేదనలను అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక మనిషి ప్రాణం తీసే అంశాన్ని స్థిమితంగా అర్థం చేసుకోవలసి ఉంది. మరణశిక్ష తీర్పులతో నేడు జైళ్లలో దశాబ్దాల తరబడి చాలామంది భయం భయంగా జీవితాలను గడుపుతున్నారు. ఆ విధంగా గడపటం కన్నా దారుణమైన శిక్ష మరేమీ ఉండదని పాలకులు గమ నించాలి. అటువంటి నేరస్థులు ఎటువంటి సామాజిక పరిస్థితుల నుండి వస్తున్నారో గమనిస్తే మరణశిక్ష తమను నిర్ధోషులంగా చెప్పుకోలేని నిస్సహాయ ప్రజల జీవితాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నదో అర్థం అవుతుంది.
ఉగ్రవాద సంబంధ కేసులలో మూలాధారమైన వారెవ్వరినీ పట్టుకోలేక పోతున్నాము. అసలు నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నదా? అనే అ నుమానాలు కలుగుతున్నాయి. ఉదాహరణకు ముంబయ ఉగ్రదాడులను తీసుకోండి. స్థానికంగా ఎటువంటి మద్దతు లేకుండా వారు ఆదురాగతానికి పాల్పడి ఉంటారా? మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉండే తాజ్ హోటల్‌లోకి కీలకమైన వ్యక్తుల సహకారం లేకుండా ముష్కరులు ప్రవే శించారా? ఇటువంటి అంశాలను దర్యాప్తులలో ఎందుకు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు? ఎటువంటి ప్రయోజనాల కోసం ఆ విధంగా చేశారు ?
మన పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరితీతకు గురైన అఫ్జల్ విషయంలో సహితం పలు అనుమానాలు ఉన్నాయి. మాజీ తీవ్రవాది అయిన అతను పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ఉన్నాడు. ఉగ్రదాడిలో నేరుగా పాల్గొన్నట్లు చెప్పడం లేదు. కీలక వ్యక్తులను తప్పించడం కోసం అతనిని ఇరికించారనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. మరే శిక్షను పొరపాటుగా విధించినా.. ఆ తరాత అమాయకుడిగా తేలితే విడుదల అవకాశం ఉంటుంది. కానీ, ఉరిశిక్షను వెనక్కి తీసుకోలేము కదా? ఇప్పటికైనా మరణ దండన విధిస్తేనే న్యాయం జరుగుతుందన్న అపోహలను విడనాడి అలాంటి శిక్షలు లేని ప్రపంచంలో భారత్ కూడా చేరేందుకు మనం కృషి చేయాలి.

-చలసాని నరేంద్ర