ఎడిట్ పేజీ

‘సంక్షేమ మంత్రం’ గట్టెక్కిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల పాపులర్ ఓటు ఎవరికి దక్కుతుంది? గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. ఈ ఎన్నికలు కచ్చితంగా నవ్యాంధ్రప్రదేశ్ దశ, దిశలకు మార్గనిర్దేశనం చేస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగే తొలి ఎన్నికలివి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో పాటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు అనుభవానికి పట్టం కట్టారు. బీజేపీ పొత్తుతో టీడీపీ అప్పుడు వైకాపాకు అడ్డుకట్ట వేసింది. చంద్రబాబు ఆ ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ లేకుండా ఎన్నికలకు వెళ్లినా లేదా వామపక్ష పార్టీలతో కలిసి పోటీచేసినా ఫలితాలు మరోలా ఉండేవి.
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత, హైటెక్ సిటీ వంటి నిర్మాణాలు, అనేక ప్రాజెక్టులను తెస్తారనే నమ్మకంతో ప్రజలు అప్పుడు గెలిపించారు. అప్పుడు బాబుకు మోదీ పాపులారిటీ తోడైంది. జాతీయభావాలు కలిగిన వారు, మధ్యతరగతి వారు చంద్రబాబుకు అండగా నిలిచారు. వైకాపా దాదాపు గెలిచినట్లే గెలిచి ఓటమి చెందింది. వైకాపాకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇద్దామని జనం భావించడం వల్ల ఆ పార్టీ గట్టెక్కలేదు. రాష్ట్ర విభజనతో ప్రజల సెంటిమెంట్‌ను గాయపరిచిన కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పలేదు. గత ఐదేళ్లలో మెజార్టీ ప్రజల మత విశ్వాసాలు, సున్నితమైన సెంటిమెంట్లను వైకాపా బాగా వంటబట్టించుకుని పాత ముద్రను చెరిపేసుకుంది.
నూతన రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో వౌలిక సదుపాయాల కల్పన చంద్రబాబు వల్ల సాధ్యమవుతుందని జనం భావించారు. రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వకపోయినా బాబు గెలిచి ఉండేవారు. అంతకుముందు వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీకి 2014 ఎన్నికల్లో గెలుపు అవసరమైంది. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పార్టీకి రాబోయే ఎన్నికలు జీవన్మరణ సమస్యే. అధికారం కోసం ఉలీళ్లూరుతున్న వైకాపాకు సైతం ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాబు తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు విశే్లషిస్తే మధ్యతరగతి, సంపన్న వర్గాలు ఆయన పాలనను ఆహ్వానించాయి. 2004 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారు.
ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభమైతే, వాటికి బీజం వేసింది చంద్రబాబు. సంక్షేమ పథకాలను ఆమడదూరం పెట్టారు. మంచో చెడో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయింది. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పారిశ్రామిక రంగం ఆకాశానికెత్తేసింది. 2000 సంవత్సరంలో కొత్త మిలీనియం పేరిట దాదాపు వివిధ రంగాల్లో వస్తున్న మార్పులపై చంద్రబాబు వందలాది సెమినార్లను నిర్వహించారు. అయిదు నక్షత్రాల హోటళ్లలో సదస్సులు, ఖరీదైన లంచ్‌లతో అంతా రిచ్‌గా కనపడేది. చంద్రబాబు చుట్టూ ఎప్పుడూ బడా పారిశ్రామికవేత్తలు ఉండేవారు. ఎవరేమన్నా ఈ రోజు హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రణాళికలు చంద్రబాబు హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ అభివృద్ధిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారు. సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రముఖ కనె్సల్టెన్సీ సంస్థ మెకెన్సీని చంద్రబాబు నియమించారు. అప్పట్లో చంద్రబాబు చాలా దూకుడుగా ఉండేవారు. ఉచిత కరెంటు ఇవ్వలేమని కరాఖండీగా చెప్పేశారు. ఆ రోజుల్లో సమాజం ఇంకా ఇప్పుడున్నంత ఆర్థిక స్థోమతను భరించే విధంగా ఉండేదికాదు. చంద్రబాబు 20 ఏళ్ల తర్వాత జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేసేవారు. ఆర్థిక సంస్కరణల ఫలాలను అనుభవించేంకు ప్రజలు సిద్ధంగా లేరు. ఈ లోటును పసిగట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఆయన చుట్టూ ఉండే సంపన్న, పారిశ్రామిక వర్గాలను చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఆ రోజుల్లో వ్యతిరేకం. దీన్ని వైఎస్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకున్నారు. ఉచిత కరెంటుతో పాటు సామాన్యులకు ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ వంటి అనేక పథకాలతో సమాజంలో అన్నివర్గాల పాపులర్ ఓటు 2004, 2009లో కాంగ్రెస్‌కు దక్కింది. 1999లో బీజేపీ పొత్తుతో డివిడెండ్లు రాబట్టి నెగ్గిన చంద్రబాబు, 2004 ఎన్నికల్లో అభివృద్ధి మంత్రంతో జనంలోకి వెళ్లినా ఓటమి చెందడానికి కారణం సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడమే.
నేడు సంక్షేమ పథకాల పట్ల ప్రజలు విసుగుచెందారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఉచిత పథకాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. అర్హులైన వర్గాలు లేచి పరుగెత్తేందుకు అవసరమైన విధంగా సంక్షేమ పథకాలు ఉండాలి. కాని ఉచిత పథకాల ద్వారా ఓట్లకు గాలం వేసే సంస్కృతి 2004లో ప్రారంభమైంది. మోతుబరి రైతులు, ఉన్నత వర్గాలు, విదేశాల్లో పిల్లలను చదివించే స్థోమత ఉన్న వారు కూడా సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నారు. ఈ రోజు వాతావరణం మారిపోయింది. ప్రతి పౌరుడు వౌలిక సదుపాయాల గురించి ప్రశ్నిస్తున్నాడు. మంచి వైద్యం చేస్తామన్నా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం లేదు. ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించే పాఠశాలలు, మంచి వైద్యం చేసే ఆసుపత్రులు, తమ పొలాలకు సాగునీటిని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించడం అనివార్యం. వీటి జోలికెళితే కరెంటు తీగను ముట్టుకున్నట్లే. ఉచిత విద్యుత్ అసాధ్యమని సంస్కరణలు, అభివృద్ధి ప్రభావంతో ప్రకటించిన చంద్రబాబు పదేళ్ల ప్రతిపక్షనాయకుడిగా అనేక పాఠాలు నేర్చుకుని చివరకు మళ్లీ- ‘ముందు సంక్షేమం.. ఆ తర్వాత అభివృద్ధి’ అనే నినాదాన్ని అందుకున్నారు. అధికారం కోసం ఆరాట పడుతున్న వైకాపా ఇంకా సంక్షేమ మంత్రాన్ని పఠిస్తోంది.
2004లో హైదరాబాద్‌లో పరిస్థితిని 2019లో చంద్రబాబు అమరావతిలో ఎదుర్కొంటున్నారు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఒక్కటే. అప్పుడు బీజేపీతో కలిసి ఆయన ఎన్నికలకు వెళ్లారు. ఈ సారి ఒంటరిపోరుకు సిద్ధమవుతున్నారు. రాజధానికి అవసరమైన 34 వేల ఎకరాల భూమిని సమీకరించారు. వందల కోట్లు ఖర్చుపెట్టి సచివాలయం, హైకోర్టు భవనాలు నిర్మించినా, అవి ‘తాత్కాలికం’ అనడంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రాజధాని నిర్మాణంలో తమను భాగస్వాములను చేయలేదనే ఆక్రోశం గుంటూరు, కృష్ణా జిల్లాయేతర ప్రాంతాల్లో బలంగా ఉంది. ఒక చోట రాజధాని కడితే స్థానికులకే ఫలాలు దక్కుతాయనే విషయం తెలిసినా, సంపదలో తమకు వాటా ఎందుకు ఇవ్వలేదనే ఆగ్రహం ప్రజల్లో ఉంది. అన్ని ప్రాంతాల ప్రజలు రాజధానికి వచ్చి వెళ్లేందుకు, స్థిరపడేందుకు వీలుగా ప్రణాళికలను రూపొందించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. రాజధాని నిర్మాణం తొలిదశలోనే ఉన్నా, ఆ ప్రాంతంలో పేద, మధ్యతరగతి వర్గాలు భూమి కొనుగోలు చేసే స్థితిలో ఉన్నారా?
ఒక సెంటిమెంట్ మాత్రం కనిపిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రప్రజలకు రాజధాని అంటే లేని ఒక మమకారం ఆంధ్రా ప్రజల్లో ఉంది. ఇది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. దీనిని చంద్రబాబు విస్మరించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లి ఎక్కడో ఒక చోట పనిచేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని పొట్టపోసుకునే సంస్కృతిని ఏపీ ప్రజలు కోరుకుంటారు. ఇల్లు గడవడంలేదంటే ఎక్కడికైనా వలసపోయే సంస్కృతి వారిలో ఉంది. కాని అమరావతి ప్రణాళికలో అది మిస్సయింది. ఈ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై ఉంది. సామాన్యుడు కాలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులను అమరావతిలో కల్పించారు. వాస్తవానికి అమరావతి వద్ద కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉపాధికి తగిన అవకాశాలు లేవనేది సత్యం. కాని సామాన్యుడు ఇవేమీ ఆలోచించడు. రాజధాని నిర్మాణంలో దరిద్ర నారాయణులను అక్కున చేర్చుకునే మానవీయ కోణం లేదు. ఏమీ లేకుండా చేసినా, ఎలా ఇస్తామని ప్రశ్నించినా జనం కోపంగానే ఉంటారు.
1983లో తెదేపా వ్యవస్ధాపకుడు ఎన్టీరామారావు చేపట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం సూపర్ హిట్టయింది. ఆ రోజుల్లో మధ్యతరగతి, దిగువ వర్గాల్లో దరిద్రం తాండవిచ్చేది. అందుకే ఎన్టీరామారావుకు పాపులర్ ఓటు దక్కింది. 1989 ఎన్నికలు వచ్చేసరికి ఎన్టీఆర్‌ను అదే జనం ఓడించారు. ఈ రోజు రైతాంగాన్ని ఆకట్టుకోవడానికి రకరకాల తాయిలాలతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. సంక్షోభానికి మూలకారణాలు వెదికి పట్టుకుని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు లేవు. సంక్షేమ పథకాలతోనే ఓట్లు గంపగుత్తగా తమకే పడుతాయనే భ్రమల్లోనుంచి టీడీపీ, వైకాపాలు బయటకు రావాలి. ఈ రోజు ఏపీలోని ప్రతి గ్రామం నుంచి పట్టణం వరకు వౌలిక సదుపాయాల లేమి ఎక్కువగా ఉంది. నాణ్యమైన విద్య, వైద్యం, రోడ్లు ఇతర సదుపాయాలను కల్పించే దిశగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలను రూపొందించాలి. అన్ని నిధులనూ సంక్షేమానికే దోచి పెడితే వౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రశ్నార్థకం. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, వివిధ వర్గాలను అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించేలా రాజకీయ పార్టీలు వ్యూహరచన చేయాలి. ఫీజు రీఎంబర్స్‌మెంట్, పెన్షన్లు వంటివి పేదలకు ఇవ్వడం మంచిదే అయినా, వారి శ్రమను అభివృద్ధికి దోహదపడే విధంగా పథకాలను రచించాలి. గత ఐదేళ్లలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కొత్త అజెండాతో వివిధ పార్టీలు ముందుకు రావాలి. సంక్షేమ పథకాలతో పేదల నోరు నొక్కి, సంపదలో వాటా ఇవ్వని పంథా వల్ల చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు పరాజయం పాలయ్యాయి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097