మెయన్ ఫీచర్

బీజేపీలో ఎన్నికల జ్వరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో గుర్తింపు పొందిన ప్రతిపక్షం కూడా లేకుండా, దేశంలో మూడొంతుల రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సమయంలో జరుగుతున్న ఎన్నికల పట్ల ఏ పార్టీ కూడా ఖంగారు పడనవసరం లేదు. ఎంతో భరోసాతో ప్రజల ముందుకు వెళ్ళడానికి సిద్ధపడ వలసింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకొంటున్న బీజేపీలో అటువంటి ధీమా కనిపించడం లేదు. 2014లో కనిపించిన భరోసా ఆ పార్టీ నాయకత్వంలో అదృశ్యమైనట్లు స్పష్టం అవుతున్నది.
బీజేపీకి వ్యతిరేకంగా మహాగటబంధన్ ఏర్పరచాలని విఫల ప్రయత్నాలు చేసిన ప్రతిపక్షాలు ఒక విధంగా తలోదారి వలే ఉన్నాయి. ఒక పార్టీ నేతను మరో పార్టీ నేత నమ్మలేని పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం మేలో కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పదవి చేపట్టినప్పుడు వేదికపై కనిపించిన ప్రతిపక్ష ఐక్యత దృశ్యం ఆ తర్వాత మరెక్కడా కనిపించలేదు. బీజేపీకి ఉమ్మడిగా పోటీ ఇస్తామని ప్రగల్భాలు పలికిన ప్రతిపక్ష నేతలు ఎవరికి వారు తమ రాజకీయ మనుగడ చూసుకోవడంలో మునిగిపోయారు. మరో వంక పుల్వామా ఉగ్రదాడి అనంతరం మన వాయుసేన ఉగ్ర శిబిరాలపై జరిపిన మెరుపు దాడులు మొత్తం ప్రపంచాన్ని అచ్చెరువు పొందేలాగా చేసాయి. చరిత్రలో మొదటిసారిగా అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఏకాకిగా నిలబడవలసి వస్తున్నది. రెండు మూడు నెలలుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో సంక్షోభం ప్రస్తుతానికి కొంత తెరమరుగైనట్లు కనిపిస్తున్నది. రైతులకు నగదు బదిలీ పథకం ద్వారా ఎన్నికల ముందు నేరుగా కోట్లాది మంది గ్రామీణులకు నేరుగా నగదు అందించిన ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఎన్నికల కమీషన్ ప్రకటించిన పోలింగ్ షెడ్యూల్ సహితం బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఏడు దశలలో, ఒడిశా, మహారాష్టల్రలో నాలుగు దశలు, కర్ణాటకలో రెండు దశలు ... ఈ విధంగా ప్రధాని విస్తృతంగా ప్రచారం చేపట్టడానికి అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ పెద్దగా సీట్లు గెలిచే అవకాశాలు లేని దక్షిణ, ఈశాన్య, తూర్పు రాష్ట్రాలలో మొదటి మూడు దశలలో ఎన్నికలు పూర్తవుతున్నాయి. కేవలం బీజేపీ తనకు ప్రస్తుతం ఉన్న సీట్లను కాపాడుకోవడానికి పెను సవాళ్లు ఎదుర్కొంటున్న, కొత్తగా పెద్ద సంఖ్యలో సీట్లు పొందాలి అనుకొంటున్న రాష్ట్రాలలోనే పలు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇప్పటికీ ప్రజలలో పలుకుబడి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి సాటి రాగల నేతలేరు. ఆయనంత విస్తృతంగా ప్రచారం చేయగల వారు కూడా లేరు. అయినా ఆ పార్టీలో కొంత బెరుకు కనబడుతున్నది. వివిధ రాష్ట్రాలలో పొత్తులు ఏర్పర్చుకున్న విధానమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు, వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖరరావు వంటి నేతలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి బీజేపీతో పొత్తుకు పోటీ పడ్డారు. కానీ నేడు ఒక్క నేత కూడా అటువంటి ప్రయత్నం చేయడం లేదు. బీజేపీ పొత్తులను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సి.బి.ఐ, ఈ.డీ లను పొత్తులకు ప్రభావితం చేసుకోవడానికి ప్రయోగించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదం పట్ల పార్టీ నాయకత్వం వైఖరిని తప్పుబడుతూ బీజేపీలో చేరిన సోనియా గాంధీకి నమ్మకస్తుడిగా పేరొందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ పార్టీ మారడానికి ముందు రోజుననే బీజేపీ మిత్రపక్షాలతో జరుపుకొంటున్న పొత్తులు ఆ పార్టీ బలహీనతలను వెల్లడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు విజయవంతంగా ప్రభుత్వా న్ని నడిపామని చెప్పుకొనే పార్టీ జరుపుకొనే పొత్తులుగా లేవని అంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలలో కుదుర్చుకున్న పొత్తులను చూసినట్లయితే మిత్రపక్షం వత్తిడులకు బీజేపీ నాయకత్వం లొంగక తప్పడం లేదు. నిత్యం బీజేపీ నాయకత్వంపై ప్రతిపక్షాలకన్నా దారుణంగా విమర్శలు గుప్పించే శివసేనతో వారి డిమాండ్లకు తలొగ్గి బీజేపీ సాగిల పడవలసి వచ్చింది. గత ఎన్నికలలోకన్నా ఒక్క సీట్ ఎక్కువ వదలవలసి వచ్చింది. బీహార్‌లో గత ఎన్నికలలో గెలిచిన సీట్లలోకన్నా ఐదు సీట్లు తక్కువగా ఇప్పుడు బీజేపీ పోటీ చేయవలసి వస్తున్నది. జనంలో పలుకుబడి బాగా తగ్గిన నితీష్ కుమార్‌కు తమతో సమానంగా సీట్లు వదలవలసి వస్తున్నది. అస్సాంలో, రెండు నెలల క్రితమే బిజెపి ప్రతిష్టాకరంగా తీసుకున్న పౌరసత్వ బిల్లును మతోన్మాద బిల్లుగా తిరస్కరించి, ప్రభుత్వం నుండి వైదొలిగిన ఏజిపిని బతిమిలాడి పొత్తుకు సిద్ధపడవలసి వచ్చింది. మహారాష్టల్రో 2014లో పోటీ చేసిన సీట్లకన్నా ఒక్క సీటు, గెలుపొందిన సీట్లకన్నా రెండు సీట్లలో మాత్రమే అధికంగా పోటీ చేస్తున్నది. అదే శివసేన అయితే గతంకన్నా మూడు సీట్లు ఎక్కువగా, గతంలో గెలుపొందిన సీట్లలోకన్నా ఐదు సీట్లలో ఎక్కువగా పోటీ చేస్తున్నది. అయితే వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న చర్యగా బీజేపీ నేతలు చెబు తున్నారు. ఒక్కొక్క మిత్రపక్షం బీజేపీని వదిలి వెడుతున్న సమయంలో నాలుగు కీలక రాష్ట్రాలలో ఈ విధంగా పొత్తులు ఏర్పరచుకోవడం ఒక విధంగా ఘన విజయమే అని చెప్పవచ్చు. కాంగ్రెస్ కూడా వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. తమ సొంత బలంతో అధికారంలోకి రాగల అవకాశాలు లేవని తెలుసు. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు పొత్తులకు కాంగ్రెస్‌ను దూరంగా ఉంచాయి. కేవలం మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, కేరళ, కర్ణాటకలలో మాత్రమే పొత్తులు కుదుర్చుకో గలిగింది. ఇటువంటి పరిస్థితులలో చెల్లెలు ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాలలోకి దింపి, ఉత్తరప్రదేశ్‌లో సగం భాగం భారాన్ని ఆమెపై ఉంచడం రాహుల్ గాంధీ తీసుకున్న సాహసోపేత రాజకీయ నిర్ణయం అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ లకు కాంగ్రెస్‌ను దూరంగా చేయడం ద్వారా ప్రతిపక్షాలలో చీలిక తీసుకు వచ్చామని ఒక విధంగా బీజేపీకి నేతలు సంబరపడుతున్నారు. తమ కూటమిలోకి కాంగ్రెస్ ను ఎట్లాగైనా తీసుకోమని శరద్ పవర్ వంటి నేతలు మాయావతిపై వత్తిడి తెస్తున్న సమయంలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె వద్ద కార్యదర్శిగా పనిచేసిన మాజీ ప్రిన్సిపాల్ కార్యదర్శి నెట్ రామ్ ఆస్తులపై ఐటి దాడులు జరగడం, రూ 225 కోట్ల మేరకు అక్రమ ఆస్తులను గుర్తించడంతో పాటు 35 బినామీ కంపెనీలలో భాగస్వామ్య పాత్రలను కనుగొనడం జరిగింది. ఆ మరుసటి రోజుననే కాంగ్రెస్‌తో యుపిలోనే కాదు మరే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌తో ఎటువంటి పొత్తులు ఉండబోవని ఆమె అవసరం లేకపోయినా స్పష్టం కావడం కారణం.
ఎన్నికల అంశాలు సహితం రోజురోజుకు మారి పోతున్నాయి. ఈ విషయంలో బీజేపీలో స్థిరత్వం కనిపించడం లేదు. మూడు ఉత్తరాది రాష్ట్రాలలో ఓటమి తర్వాత రైతాంగంలో అసంతృప్తి కారణం అని గ్రహించి అర్ధాంతరంగా రైతులకు నగదు బదిలీ పథకం చేపట్టారు. అప్పటి వరకు తెరపైకి తీసుకు రాదలచిన రామమందిరం అంశాన్ని తెరవెనుకకు మరల్చారు. ఆ తర్వాత పుల్వామా ఉగ్రదాడి, వాయుసేన ఉగ్రశిబిరాలపై మెరుపు దాడులు రావడంతో దేశ భద్రత అంశంతో ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. గత ఐదేళలుగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన జనధన్, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల గురించి ఇప్పుడు ప్రస్తావనే చేయలేక పోతున్నారు. బీజేపీ అనుకూల టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తున్న పోల్ సర్వేలు గమనిస్తే మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలు ఇస్తున్నట్లయింది. ఉదాహరణకు కాంగ్రెస్ తన సీట్లను ఆశ్చర్యకరంగా పెంచుకొనే అవకాశాలు కనిపించక పోయినా పలు రాష్ట్రాలలో ఆ పార్టీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరుగుతున్నది. కేరళ వంటి రాష్ట్రాలలో పెరుగుతున్న బీజేపీ ఓట్లు కాంగ్రెస్‌కు వరంగా మారనున్నాయి. కేరళలో దాదాపు సి.పి.ఎం.తో సమానంగా ఓట్లు తెచ్చుకోవడం దారా కాంగ్రెస్ కూటమి ఏకపక్షంగా విజయం సాధించే అవకాశాలు నేడు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిన్నమొన్నటి వరకు చంద్రబాబు గ్రాఫ్ పడిపోతున్నదని, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం అని అంచనాలు వేసిన వారే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఓట్లు పెరుగుతూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకొంటే తెలంగాణలో వలే వైసీపీ ఏకపక్షంగా గెలుపొంది ఉండెడిది. ఎందుకనే కాంగ్రెస్ ఓట్లు ఏవీ టీడీపీకి బదిలీ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం, ఓట్ల శాతాన్ని పెంచుకొనే అవకాశాలు కనిపించడం వైసిపి ఓట్లకు భారీ గండి పడే సంకేతాన్ని వెల్లడి చేస్తున్నది.
కర్ణాటకలో సంకీర్ణం అంతర్గత వైరుధ్యాలతో కూలిపోయే అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి పదవి పట్ల అసహనం తో వ్యవహరిస్తున్న బీజేపీ నేత ఎడ్డ్యూరప్ప తామే ఫిరాయింపుదారులను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని కూల్చబోతున్నట్లు తరచూ సంకేతాలు ఇస్తూ అప్రదిష్ఠకు గురయ్యారు. ఇంతలో ఎడ్డ్యూరప్ప మాటలున్న ఆడియోను విడుదల చేయడం ద్వారా ముఖ్యమంత్రి కుమారస్వామి బిజెపి నాయకత్వానికి అనుకోని షాక్ కలిగించారు. పరోక్షంగా సంకీర్ణ ప్రభుత్వం అనేక సంక్షోభాలను అధిగమించి మనుగడ సాగించడానికి ఎడ్డ్యూరప్ప అధికార దాహమే కారణం అని చెప్పవచ్చు. ఎప్పుడో లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలను ప్రారంభించిన బీజేపీ కర్ణాటకలో ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థుల కోసం ఫిరాయింపుదారులపై ఆధారపడటం గమనిస్తే ఆ పార్టీ ఎదుర్కొంటున్న నాయకత్వ సంక్షోభాన్ని వెల్లడి చేస్తున్నది. ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైన ఉన్నది. ఈ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్ర రాజకీయ భవిష్యత్‌నే కాకుండా ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయ స్వరూపాన్ని నిర్ణయించనున్నాయి. జాతీయ రాజకీయ నాయకత్వంపై కన్ను వేసిన మమతా బెనర్జీ మొత్తం 42 సీట్లు గెలుచుకోవడం కోసం పకడ్బందీ వ్యూహం రూపొందిస్తున్నారు. ఆమె కోటను బద్దలు చేయ డం కోసం బీజేపీ దూకుడుగా ఉన్నది. అక్కడ ఆమెను కట్టడి చేయగలిగితే ఒక విధంగా జాతీయ రాజకీయాలలో రాహుల్‌గాంధీకి ప్రతిపక్ష నాయకత్వం అప్పచెప్పినట్లు అవుతుంది. రాహుల్ నాయకత్వాన్ని ఇప్పుడు సవాల్ చేసే ప్రయత్నం చేస్తున్నది ఆమె మాత్రమే కావడం గమనార్హం. మోదీ ప్రజాకర్షణ, దేశ రక్షణకు సంబంధించిన భావోద్వేగాలు వంటి అంశాలపై బీజేపీ నేడు ప్రధానంగా ఆధారపడుతుండగా, ప్రతిపక్షాలు ప్రధాని విశ్వసనీయతనే ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాయి. ఐదేళ్ల మోదీ పాలనకు ప్రజలు తీర్పు ఇస్తారా, లేదా భావోద్వేగ అంశాలకు స్పందిస్తారా అన్నది చూడవలసి ఉంది.

-చలసాని నరేంద్ర 98495 69050