మెయన్ ఫీచర్

జంతువుల పరిరక్షణకూ పౌరస్మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టి పరిణామ క్రమంలో అన్నింటి కన్నా ఉన్నతమైన స్థాయి జీవులదే. భూమిపై 14 మిలియన్ల జీవజాతులు అందుబాటులో ఉన్నా యి. బాక్టీరియాలు కాకుండా 1.8 మిలియన్ల జాతులు ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. వీటిలో వృక్షజాతులు 2.70 లక్షల రకాలు కాగా, జంతుజాతులు 45 వేలు ఉన్నాయి. మరో 9.5 లక్షల కీటకాలు, సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. ‘గ్లోబల్ టాక్సానమీ’ ప్రకారం ప్రతి ఏటా కొత్తగా 10 వేల జాతులను గుర్తించడం జరుగుతోంది. భూగోళంలో ఉన్న కొన్ని జాతుల గురించి మాత్రమే అవగాహన ఉండటం వల్ల మిగిలిన జాతుల ప్రభావాన్ని ఇంకా అంచనా వేయలేకపోతున్నాం. ఆ కారణంగానే పర్యావరణ సమతుల్యతకు, జీవవైవిధ్యానికి చేస్తున్న ప్రయత్నాలు సంపూర్ణంగా సఫలీకృతం కావడం లేదు.
జీవం ఉన్న ప్రాణులన్నీ జీవులే. జీవుల వర్గీకరణ, ఆవాసం, ఆహారం, ఉనికి, అలవాట్లు, స్వరూపం, అవయవ నిర్మాణం, అవి చేసే పనులు, వాటి ప్రభావం, ప్రవర్తన గురించి పట్టించుకోకుండా- మనిషి తనకోసం తాను ఆలోచించడంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఇపుడిపుడే అంతర్జాతీయంగా మరీ ముఖ్యంగా యురోపియన్ యూనియన్ దేశాల్లో వచ్చిన మానవీయ దృక్పథం జంతు పరిరక్షణ, వాటి హక్కులను కాపాడే దిశగా చర్యలు మొదలయ్యాయి. జంతుపరిరక్షణ చట్టాల అమలులో భారత్ ఇంకా అట్టడుగునే ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు ఉన్నట్టే , జంతువులకూ హక్కులున్నాయి. జంతువుల హక్కుల గురించి తెలియక వాటిని క్రూరంగా వధించడం, హింసించడం, బంధించడం జరుగుతోంది. జంతువులను సైతం సహజీవులుగా భావించే భారతీయ సంస్కృతిని మిగిలిన దేశాల వారు అనుసరిస్తుండగా, మన దేశంలో రోజురోజుకూ ఈ సంస్కృతి కనుమరుగవుతోంది. ఒకప్పుడు గోవులు, కోళ్లు, గొర్రెలు, మేకలు ఇలా సామాన్య జంతువులను పెంచుకోవడం వృత్తిగా కొనసాగిన సమాజం, ఇపుడు ఆ వృత్తుల నుండి ఉద్యోగాల వైపు మళ్లడంతో జంతువులతో అనుబంధం అంతరించిపోతోంది.
మాంసం వినియోగంలో భాగంగా జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించకుండా చూడటం, జంతువుల విషయంలో సైబర్ చట్టాలను, బ్రాడ్ కాస్టింగ్ చట్టాలను అర్థం చేసుకోవడం, జంతువధపై ఆంక్షలు, జంతువుల పరిరక్షణకు పౌరస్మృతి మాదిరి జంతు పరిరక్షణ స్మృతిని అమలులోకి తీసుకురావాలనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వస్తోంది. ప్రాథమిక బాధ్యతల్లో భాగంగా భారత రాజ్యాంగానికి బద్ధులమై ఉండటమే కాదు, దేశాన్ని సంరక్షించుకోవడం, అవసరమైనప్పుడు ప్రభుత్వాలకు సేవలు అందించడంతో పాటు విభిన్నమైన సంస్కృతుల సమ్మిళితమైన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, అడువులు , సరస్సులు, వన్యమృగాలతో పాటు జాతీయ పర్యావరణాన్ని సంరక్షించడం, సమస్త జీవుల పట్ల ప్రేమానురాగాలను కలిగి ఉండటం, శాస్ర్తియ దృక్పథాన్ని, మానవతా వాదాన్ని జిజ్ఞాసను, సంస్కరణ వాదాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. సూక్ష్మజీవులు, బాక్టీరియాలు, కొన్ని క్రిమి కీటకాలు మినహా అన్ని రకాల జంతుజీవులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(ఎ)(జీ) పేర్కొంటోంది. వీధి కుక్కలు సహా ఏ జీవినైనా దండించడం, చంపడం ఐపీసీ సెక్షన్ 428, 429 ప్రకారం నిషిద్ధం. ఎవరైనా ఒక వ్యక్తి తుంటరి చేష్టలకు పాల్పడి పదిరూపాయిలు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన జంతువు లేదా జంతువులను చంపినా వాటిపై విషప్రయోగం చేసినా, అంగవైకల్యం కల్పించినా వాటిని నిరుపయోగం చేసినా రెండేళ్ల వరకూ జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. జంతువు తోక, చెవులు వంటివి కోసివేయడం, కన్నులు పొడవడం, కాళ్లను నరకడం మొదలైనవి అంగవైకల్యానికి గురిచేయడంగా గుర్తిస్తారు.
ఆడజంతువులతో జతకట్టేందుకు ఉపయోగించే దున్న, ఎద్దు వంటి వాటి వృషణాలను నలగ్గొట్టడాన్ని అంగవైకల్యంగానూ నిరుపయోగంగా చేసినట్టు పరిగణిస్తారు. ఒక రకంగా ఇవన్నీ శారీరక గాయాలే, ఈ గాయాలు శాశ్వత స్వభావం కలవై ఉండాలి. మనుషులు తప్ప ప్రాణమున్న జీవులన్నింటినీ జంతుజాలంగానే గుర్తించాలి. న్యాయస్థానం అనుమతితో ఈ సంఘటనల్లో రాజీ పడొచ్చు, అయితే సెక్షన్ 429 ప్రకారం విలువైన జంతువులపై విషప్రయోగం తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ఏనుగు , గుర్రాలు, కంచర గాడదలు, గాడిదలు, గేదెలు, ఆంబోతులు, ఆవులను చంపినా, విషప్రయోగం చేసినా నేరమే. ఐదు సంవత్సరాల వరకూ జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. పెంపుడు జంతువులను నిర్బంధించడం కూడా పీసీఎ చట్టం 1960 సెక్షన్ 11(1)(ఐ) ప్రకారం దండనార్హం. అధీకృత వధ కేంద్రాల్లో మినహాయించి కోళ్లతో పాటు ఏ పశుపక్ష్యాదులను దండించడం, వధించడం ‘జంతువుల వధ నిరోధక చట్టం-2001’ లోని రూల్ నెంబర్-3 ప్రకారం నిషేధం. ‘ఆహార శుచి, శుభ్రత ప్రమాణాల నియంత్రణ చట్టం-2011’ చాప్టర్ -4లోనూ ఎక్కడ బడితే అక్కడ జంతువులను వధించడాన్ని నిషేధించారు. జంతువులను పట్టుకోవడానికి ప్రయత్నించడం కూడా మన దేశంలోని చట్టాల ప్రకారం నేరమే. ఏబీసీ రూల్స్ 2001 ప్రకారం శునకాలను బంధించడం లేదా గుర్తుతెలియని ప్రదేశానికి తరలించడం కూడా నేరమే.
మున్సిపల్ శాఖలో గుర్తింపు పొందిన విభాగానికి చెందిన వారు మాత్రం శునకాలను పట్టుకుని వాటికి సంతాన నిరోధక చర్యలను చేపట్టేందుకు ఈ సెక్షన్ మినహాయింపునిచ్చింది. జంతువులకు ఆహారం, తాగునీటిని నిరాకరించడం లేదా వాటి నివాసానికి సరైన ప్రదేశాన్ని సూచించకపోవడం, ఏదో ఒక ప్రదేశంలో వాటిని గంటల తరబడి కట్టేయడం, జంతువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా పీసీఏ చట్టం 1960 నిబంధన 11(1)(హెచ్) ప్రకారం నేరమే. కోతులను కలిగి ఉండటం, చిలుకలను కలిగి ఉండటం జంతుపరిరక్షణ చట్టం 1972 సెక్షన్ -9 ప్రకారం నేరం. ఎలుగుబంట్లు,కోతులు,చిరుతలు, రాత్రి పూట మాత్రమే సంచరించే జంతువులను కలిగి ఉండటం, సింహాలను, ఎద్దులను శిక్షణకు వినియోగించడం, వినోదాన్ని పంచేందుకు ఉపయోగించడం పీసీఏ చట్టం 1960 సెక్షన్ 22(2) ప్రకారం నేరం. ఇటీవల తెచ్చిన చట్టం ప్రకారం గోవధ నిషేధానికి సంబంధించి తీవ్రమైన శిక్షలనే చేర్చారు. వధ కేంద్రాల చట్టం-2001 రూల్ 3 ప్రకారం ఇందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా శిక్ష తప్పదు. కోళ్లు, గుర్రాలు, ఎద్దులు వంటి జంతువులతో క్రీడలు, పోటీలు నిర్వహించడం పీసీఎ చట్టం 1960 సెక్షన్ 11(1)(ఎన్) ప్రకారం, సెక్షన్ 11(1)(ఎం) ప్రకారం నేరమే. జంతువులపై సౌందర్య పరీక్షలు, సౌందర్య సాధనాలను వినియోగించడం కూడా డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం-1945 రూల్ 148 సీ, 135-బీ ప్రకారం నేరమే.
జంతు ప్రదర్శనశాలల్లో జంతువులను పరీక్షించడం, తినిపించడం లేదా జంతువులను పంచడం, పట్టుకోవడం వంటి చర్యలను సైతం వన్యమృగాల సంరక్షణ చట్టం-1972 సెక్షన్ 381 ప్రకారం నిషేధమే. పాములు, తేళ్లు వంటి జీవులతో పాటు వన్యమృగాలను, విషజంతువులను పట్టుకోవడానికి లేదా వదిలివేయడానికి ప్రయత్నించడం కూడా వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్ 9 ప్రకారం నేరం. పక్షులను పట్టుకోవడం, గోరింకలు, చిలుకలు, రామచిలుకలను బంధించడం, సొంతంగా పెంచుకోవడం, అమ్మకానికి పెట్టడం డబ్ల్యుఎల్‌పీఏ 1972 సెక్షన్ 9 ప్రకారం దండనార్హం. జంతువులను లేదా పక్షులను ఇబ్బంది కలిగించే రీతిలో రవాణా చేయడం, బ్యాటరీ లైట్ల మధ్య కోళ్లను బంధించడం, చిన్న చిన్న గూళ్లకే పరిమితం చేయడం, మోటారు వాహనాలలో జంతువుల రవాణా నిబంధన సెక్షన్ 11(1)డీ ప్రకారం నేరం. అలాగే పీసీఏ చట్టం 1960 సెక్షన్ 11(1)(ఈ) ప్రకారం కూడా జంతువుల రవాణా నిషేధమే. ఇవన్నీ మనం కళ్ల ముందు చూస్తున్నా, అనునిత్యం మన అనుభవంలో ఉన్నా అదేమీ నేరం కాదనే తత్వానికి అలవాటు పడిపోయాం. జంతువుల హక్కులు, వాటి పరిరక్షణ చట్టాలు నిజానికి అడవులు- పర్యావరణ చట్టాల్లో అనుబంధంగా ఉండిపోయాయి. అటవీ చట్టం-1865, నవీకరణ అటవీ చట్టం -1878ని మరికొన్ని సవరణలతో 1890లో పటిష్టం చేశారు. భారత అటవీ చట్టం -1927లో వచ్చింది. అటవుల పరిరక్షణ చట్టం 1980లో వచ్చింది. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం -1972లో రూపొందించారు. ఇంతకు మించి జంతువుల పరిరక్షణకు భారత ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు లేకపోవడం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయ పరుస్తున్నాయి. ఇకనైనా భారత ప్రభుత్వం జంతు పరిరక్షణకో ప్రత్యేక శిక్షాస్మృతిని రూపొందించి అన్ని చట్టాల్లో ఉన్న స్మృతులను ఒకే చోటుకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నిపుణుల అభిప్రాయం. జంతువులు వేరు, మనం వేరు అనే భావన పోనంత కాలం, జంతువులకూ ఆస్తులు ఉంటాయని (లివింగ్ ప్రాపర్టీ) ఉండాలనే స్పృహ రానంతకాలం వాటిపట్ల మన దృష్టికోణం మారదేమో..!

-బీవీ ప్రసాద్ 98499 98090